Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 2



                                  నూట ఇరువది అయిదవ సూక్తము
      ఋషి - అంభృణపుత్రివాక్కు - దేవత - సర్వగత పరమాత్మ ఛందస్సు -
                                            జగతి, త్రిష్టుప్


        ఋషిక ' వాక్కు' తాదాత్మ్యమున తననే పర్వముగ స్తుతించుచున్నది.
   
    1. నేను వసువులతోను, రుద్రులతోను సంచరించుచుందును. నేను ఆదిత్యులు, దేవతలు వెంట ఉందును. మిత్రావరుణులు నా యందు ఉన్నారు. నేను ఇంద్రాగ్ని  అశ్వినులకు ఆధారము అగుచున్నాను.

    2. సోమము శిలలచే పిండబడి సిద్ధమగును. దానిని నేను అనుభవించుచున్నాను. నేను త్వష్ట, పూష భగుని ధరించుచున్నాను. యజమాని యజ్ఞ సామాగ్రి  సమకూర్చును. సోమరసము సమర్పించును. దేవతలను సంతుష్టులను చేయును. ఆ యజమానికి నేనే ధనమును ఇచ్చుచున్నాను.

    3. నేను రాజ్యమునకు అధ్వీశ్వరిని. ధనప్రదాత్రిని. నేనే జ్ఞానవతిని. నేనే యజ్ఞ పదార్థము లందు శ్రేష్ఠమను. దేవతలు నన్ను నానా స్థావరములందు నియమించినారు. నా ఆశ్రయ స్థానము విశాలము. నేను సమస్త ప్రాణులందు ఆవేశించి ఉన్నాను.

    4. ఎవడు ప్రాణము కలిగి  వినుచున్నాడో -  చూచుచున్నాడో - తినుచున్నాడో వాటిని నా సాయముననే చేయుచున్నాడు. నన్ను నమ్మనివాడు క్షీణించుచున్నాడు.

    విజ్ఞులారా! వినండి - నేను చెప్పినదే శ్రేయస్కరము.

    5. దేవతలు, మానవులు ఎవని శరణు వేడుచున్నారో అతనికి నేనే  ఉపదేశించుచున్నాను. నేను అనుకున్న వానిని బలశాలిని, స్తోతను, ఋషిని, విద్వాంసుని చేయుచున్నాను.

    6. ఇంద్రుడు స్తోత్ర ద్రోహి శత్రువును వధించ ఉద్యమించును. అప్పుడు నేనే అతని ధనస్సును విస్తరింప చేస్తాను. మానవుని కొరకు నేనే సమరం  సాగిస్తాను. నేను ద్యావా పృథ్వులందు వ్యాపించి ఉన్నాను.

    7. నేను పితను. నేనే ఆకాశమును సృష్టించినాను. ఆకాశము శీర్షము అగుచున్నది. సాగర జలము నా స్థానము అగుచున్నది. అచటి నుండియే నేను సమస్త లోకములను విస్తారం చేస్తాను. నా దేహము సమున్నతము. నేను ద్యులోకమును తాకగలను.

    8. నేను భువనములను నిర్మిస్తాను. వాయువు వలె వ్యాపిస్తాను. నా మహిమ మహత్తమము. నేను ద్యావా పృథ్వులను అతిక్రమించినాను.

    ఇది మహిళ దర్శించిన సూక్తము. ఆమె ఆత్మ విశ్వాసము అనంతము. తానే ఈశ్వరిని అంటున్నది. ఇది అహం బ్రహ్మస్మి అగుచున్నది. విశ్వమును తనలో చూస్తున్నది. తానే విశ్వము అంటున్నది. ఇది పరమమగు అద్వైత దశ!

                                  నూట ఇరువది ఆరవ సూక్తము
                 ఋషి - శిలూషపుత్ర కుల్మలబర్హి - దేవత - విశ్వేదేవతలు
                                  ఛందస్సు - బృహతి - 8 త్రిష్టుప్

    1. ఆర్యమ! మిత్రావరుణులు ఎవనిని శత్రువు నుండి రక్షింతురో అట్టి వానిని ఎటువంటి అశుభములుగాని పాపములుగాని ఆక్రమించజాలవు.

    2. మిత్ర, వరుణ, ఆర్యమలారా! మానవులను పాపముల నుండి. శత్రువుల నుండి రక్షించవలసినదని ప్రార్థించుచున్నాము.

    3. మిత్ర, వరుణ, ఆర్యములు నిశ్చయముగ మమ్ము రక్షించగలరు.

    వరుణాది దేవతలారా! మమ్ము దాటించండి. శత్రువు నుండి రక్షించండి.

    4. వరుణ, మిత్ర, ఆర్యములారా! మీరు లోక రక్షకులు. నేతృత్వమున నేర్పరులు. మీ వలన  మేము రక్షణ పొంది, మీ వద్ద  చక్కగ సుఖింతుము గాక.

    5. ఆదిత్య, వరుణ, మిత్ర ఆర్యములు మమ్ము  శత్రువుల బారినుండి రక్షించెదరు గాక. శత్రు విముక్తులమగు మేము కళ్యాణ ప్రాప్తి  కొరకు ఉగ్రమూర్తి  రుద్రుని, మరుద్గణ ములను, ఇంద్రుని, అగ్నిని, ఆహ్వానించుచున్నాము.

    6. వరుణ, మిత్ర ఆర్యములు మార్గదర్శిత్వమున నిపుణులు. వారు పాపములను, పార ద్రోలుదురు. వీరు నరులకు ప్రభువులు. వారు మమ్ము సమస్త పాపముల నుండి, శత్రువుల నుంచి రక్షించెదరు గాత.

    7. వరుణ, మిత్ర, ఆర్యములు మమ్ము రక్షించి సుఖములు కలిగింతురుగాక. ఆదిత్యులు మేము కోరునట్టి సుఖములను మరింతగా ప్రసాదింతురుగాక. వారు మమ్ము శత్రుహస్తము నుండి రక్షింతురుగాత.

    8. శుభ్ర వర్ణగోవు పాదమును కట్టిపెట్టినపుడు యజ్ఞ భాగధేయులగు వసువులు దానిని బంధ విముక్తణు చేసినారు. అట్లే మమ్ము పాపబంధ విముక్తులను చేయండి.

    అగ్నీ! మాకు పరమాయువును ప్రసాదించుము.

                                నూట ఇరువది ఏడవ సూక్తము
          ఋషి - భరద్వాజ పుత్రి రాత్రి - దేవత - రాత్రి ఛందస్సు - గాయత్రి

    1. రాత్రి వస్తున్నది. సర్వత్ర వ్యాపించినది. ఆమె  నక్షత్రములతో శోభలు సంతరించు కున్నది.

    2. రాత్రిదేవి విశాల. ఆమె ఉచ్చ, నీచములను కప్పివేసినది. కాంతి వస్తుంది. తిమిరమును బాధిస్తుంది.

    3. రాత్రి వచ్చింది. ఉషను సోదరివలె  కౌగిలించుకుంది. ఉషస్సు తిమిరాన్ని దూరము చేసినది.

    4. పక్షి కొమ్మ మీదికి చేరుతుంది. ఆమె వచ్చినంత మనం నిద్రింతుము. అట్టి రాత్రి దేవి మాకు శుభములు కలిగించునుగాత.

    5. గ్రామము లన్నియు, నిస్తబ్ధములు. పాదచారులు, పక్షులు, వేగవంత శ్యేనము నిస్తబ్ధములై నిద్రించుచున్నవి.

    6. రాత్రీ ! తోడేళ్లను, దూరము చేయుము. చోరులను తొలగించుము. మాకు విశేష శుభం కరివి అగును.

    7. నలుపు చీకటి కనపడుతున్నది. నన్ను సహితము కమ్మినది. పణములను వలె ఉష చీకట్లను తొలగించునుగాత.
 
    8. ఆకాశ కన్య రాత్రీ! వెళ్లిపోవుచున్నావా? గోవునకు వెల ఈ సూక్తమును నీకు అర్పించు చున్నాను. స్వీకరించుము.
   
                              నూట ఇరువది ఎనిమిదవ సూక్తము
                ఋషి - ఆంగిరస విహవ్యసుడు - దేవతలు - విశ్వేదేవతలు
                                   ఛందస్సు - త్రిష్టుప్ - 9 జగతి

    1. అగ్నీ! యుద్ధ సమయమున నా యందు తేజస్సు ఉదయించునుగాత. నిన్ను ప్రజ్వలితుని చేసి మేము మా దేహములను పుష్టివంతము చేసికొందుము. నా ముందు నలుదిశలు అవనతములు అగునుగాక. నిన్ను స్వామిగా చేసికొని మేము శత్రువులను జయింతుముగాత.

    2. ఇంద్రాది దేవతలు, మరుదణములు, విష్ణువు, అగ్నియు యుద్ధమున మా పక్షమున నిలుతురుగాక. ఆకాశమంతట విశాల భువనములు మా  పక్షము వహించునుగాత.  నేను కోరినంత వాయువు అనుకూలమున  వీచి నన్ను పావనము చేయును గావుత.

    3. నా యజ్ఞము నందు దేవతలు సంతుష్టులు అగుదురుగాక. నాకు ధనము ప్రసాదింతురు గాత. వారి ఆశీర్వాదములు లభించును గావుత. నేను దేవతలను ఆహ్వానింతునుగాత. ప్రాచీనకాలమున దేవతలకు హవిస్సులు అర్పించినవారు అనుకూలురు అగుదురుగాక, నా దేహమునకు ఉపద్రవములు కలుగకుండ నాకు సంతానము కలుగును గావుత.

    4. నా యజ్ఞ ద్రవ్యములు నా కొరకును, దేవతల కొరకును అర్పితములు అగునుగాక. నా మనోరథము సిద్ధించునుగాత.నేను పాపలిప్తుని కాకుందునుగాక. సమస్త దేవతలు మమ్ము ఆ రీతిగ దీవింతురు గాక.

    5. ఆరుగురు దేవేరులు, ద్యౌ, పృథివి, పగలు, రాత్రి, జలము ,ఓషధులు మాకు లక్ష్మీవృద్ధి కలిగింతురుగాత.

    దేవతలారా! ఇచట శౌర్య ప్రదర్శన చేయండి మాకు. మా సంతతికి అమంగళము కలుగ కుండునుగాత.

    సోమరాజా! శత్రువు  చేత మేము  నష్టపడరాదు.

    6. అగ్నీ! శత్రువు రధమును నిష్పలము చేయుము. దుర్దర్షుడవగుము. మమ్ము సకల! రీతుల రక్షింపుము. శత్రువుల ఆశలు అడియాసలై మరిలిపోవుదురుగాక. శత్రువు తెలివి గలవాడయిన అతని తెలివి నష్టపడునుగాత.

    8. ఇంద్రుడు విస్తృత తేజస్సునకు అధికారి. మహానుడు. సర్వప్రథమ ఆహ్వాత. వివిధ స్థానములందు ఉండువాడు. అతడు ఈ  యజ్ఞము నందు మమ్ము  సుఖవంతులను చేయునుగాత.

    హరితవర్ష అశ్వస్వామి ఇంద్రా! మాకు సుఖములను, సంతానమును కలిగించుము. మాకు అనిష్టము, ప్రతికూలము జరుగకుండునుగాత.

    9. మా శత్రువులు దూరము అగుదురుగాక. ఇంద్రాగ్నుల సాయమున శత్రువులను జయింతుముగాత. వసుగణ, రుద్రగణ, ఆదిత్య గణములు నన్ను  సర్వశ్రేష్ఠ మేధావిని, అప్రతిహతుని, అధిరాజును చేయుదురు గావుత.
   
                            నూట ఇరువది తొమ్మిదవ సూక్తము
                  ఋషి - ప్రజాపతి - దేవత- పరమాత్మ ఛందస్సు -త్రిష్టుప్

    1. అప్పుడు - ప్రళయమప్పుడు అసత్తు లేదు. సత్తు అనునది లేదు. భూమిలేదు. ఆకాశం లేదు. ఆకాశమందలి సప్తలోకములు లేవు. బ్రహ్మాండము ఎచట? దేని స్థానము ఏది? దుర్గమ, గభీర జలము ఉండెనా?

    2. అపుడు మృత్యువు లేదు. అమరత్వము లేదు. రాత్రింబవళ్ల భేదము లేదు. వాయు శూన్య ఆత్మావలంబన శ్వాస ప్రశ్వాసయుక్త ఒకే బ్రహ్మము ఉండెను. అతడు వినా అన్యము లేదు.

    3. సృష్టికి పూర్వము అంధకారము అంధకారమే అలముకొని ఉండెను. అంతయు అజాతము సర్వము జలమయము. అపుడు తపః ప్రభావమున ఏకమ్ ఒక్కటి కలిగినది.

    4. తొలుత మనసున కోరిక పుట్టినది. అందునుంచి బీజము అవతరించినది. విద్వాంసులు మేధస్సును తరచి అదృశ్యము నుంచి దృశ్య పదార్థపు ఉత్పత్తి స్థానమును నిరూపించినారు.

    5. బీజ రూపమున మానవుడు పుట్టినాడు. మహిమలు ఆవిర్భవించినవి. వారి కార్య కలాపముల ఉభయ పార్శ్వములు విస్తరిల్లినవి. అన్నము దిగువన భోక్తపైన నిలిచినారు.

    6. ప్రకృతి తత్వమును ఎవడు ఎరుంగును? దానిని ఎవడు వర్ణించగలడు? ఏమి కారణమున సృష్టి జరిగినది? దేవతలు సృష్టి నిమిత్తమయినా, తరువాతనే అవతరించినారు. సృష్టి ఎచట మొదలైనది ఎవడు ఎరుగగలడు?

    7. విభిన్నమగు ఈ సృష్టి ఎచటి నుంచి జరిగినది? ఏమి కారణమున సృష్టి జరిగినది? ఈ సృష్టి చేసిన దెవడు? చేయనిదెవడు? వీనిని పరంధామము నందున్న వారు ఎరుంగుదురు. వారికి సహితము తెలియునో? తెలియదో?

    అది అంత అనిశ్చితము. అనిశ్చితమే! నిశ్చితమెట్లగును? అనిశ్చితముగనే ఉండును. ఇది సత్యము.

                                నూట ముప్పదవ సూక్తము
ఋషి - ప్రజాపతి పుత్ర యఙ్ఞి - దేవత - ప్రజాపతి ఛందస్సు -త్రిష్టుప్  - 1 జగతి

    1. యజ్ఞము నలువైపుల సూత్ర  విస్తారము కలది. దానిని వస్త్రమువలె నేయబడును. దేవతలకు బహు హవిస్సులు సమర్పించుటచేత యజ్ఞము విస్తరిల్లుము. యజ్ఞమునకు పితరులు వచ్చినారు. వారు ఇదిపడుగు - ఇది పేక అనుచు వస్త్రమును నేయుచున్నారు.

    2. వస్త్రపు పొడవును ఒకరు, వెడల్పును ఒకరు పరచుచున్నారు. ఇది స్వర్గము వరకు సాగుచున్నది. తేజః పుంజ దేవతలెల్లరు యజ్ఞ గృహమున ఆసీనులు  అయినారు. ఈ కార్యమునకు  సామగానము స్వరము అగుచున్నది.

    3. దేవతలు ప్రజాపతి యజ్ఞము చేసినారు. అప్పుడు  యజ్ఞపు సీమ ఏమై ఉండెను? పత్రిమలేవి? సంకల్పము ఎయ్యది? ఘృతము ఏది అయి ఉండెను? యజ్ఞ పరిధులు ఏవి ? ఛందమేమి? ఉక్థమేమి?

    4. అగ్నిని గాయత్రి - సవితను ఉష్ఠిక్కు - సోమమును అనుష్టు - బృహస్పతి వాక్యమును బృహతి ఛందస్సులు ఆశ్రయించినవి.

    5. మిత్రావరుణులను విరాట్టు - ఇంద్ర, సోములను త్రిష్టుప్ అన్యదేవతలను జగతి ఛందములు ఆశ్రయించినవి. ఆ  రీతిగా ఋషులు, మనుష్యులు యజ్ఞము చేసినారు.

    6. ప్రాచీనకాలమున యజ్ఞము అవతరించినది. అపుడు ఋషులు, మనుష్యులు ఉక్త నియమమును అనుసరించి అనుష్ఠించినారు. ప్రాచీన కాలమున యజ్ఞానిష్ఠానము చేసిన వారిని నేను మనోనేత్రమున దర్శించుచున్నట్లు అనిపించుచున్నది.

    7.సప్త దివ్యఋషులు స్తోత్రములను , ఛందములను సంకలనము చేసినారు. దానిని అనుసరించియే మరల మరల యజ్ఞానష్ఠానములు చేసినారు. ఫలితములను స్థిరపరచి నారు. సారథి గుర్రపు కళ్లెము పట్టినట్లు విద్వాంసులగు ఋషులు సంప్రదాయ ప్రకారము యజ్ఞములు చేసినారు.

                            నూట ముప్పది ఒకటవ సూక్తము
              ఋషి  - క్షీవతపుత్రుడు సుకీర్తి -దేవత - ఇంద్రాశ్వినులు
                              ఛందస్సు - త్రిష్టుప్ - 4 అనుష్టుప్

    1. శత్రువిజేత ఇంద్రా! ముందు - వెనుక, ఉత్తర -దక్షిణములందున్న సమస్త శత్రువులను దూరము చేయుము.

    శూర ఇంద్రా! నీ  మంచి చక్కని సుఖములు అందుకుని మేము ఆనందింతుముగాక.

    2. పొలము నందలి పంటను కోసినట్లు ఇంద్రా! యజ్ఞమునందు 'నమః' అనని వారి  యొక్కయు, పుణ్య కార్యములు చేయని వారి యొక్కయు భోజనములను వెంటనే తెంపి వేయుము.

    3. ఒకే ఇరుసు మీద బండి నిలువ జాలదు. అతనికి యుద్ధములందు అన్నము కలుగదు. గో, అశ్వ అన్నాదులు ఆశించు వారు  స్వప్రయత్న సహితముగ ఇంద్రుని సఖ్యత కొరకు ఆరాటపడుదురు.

    4. అశ్వినీద్వయమా! మీరు కళ్యాణమూర్తులు. ఇంద్రుడు 'నముచి' తో యుద్ధము చేసినపుడు - మీరు  ఉభయులు కలసి - సోమము సేవించి - ఇంద్ర కార్యమున అతనిని కాపాడినారు.

    5. అశ్విద్వాయమా! తల్లిదండ్రులు బిడ్డలను రక్షింతురు. అట్లే మీరు సోమము సేవించి, మీ శక్తి సామర్ధ్యములతో ఇంద్రుని రక్షించినారు.

    ఇంద్రా! అపుడు నీ వద్ద  సరస్వతి ఉండెను.

    6. ఇంద్రుడు ఉత్తమ  రక్షకుడు. ధనికుడు. స్వరజ్ఞుడు. అతడు మమ్ము రక్షించి, సుఖములు ప్రసాదించునుగాత. శత్రువును తొలగించి అభయమొసంగునుగాత. మేము మహాశక్తి మంతులము అగుదుముగాక.

    7. ఇంద్రుడు యజ్ఞభాగస్వామి. ఉత్తమరక్షకుడు. ధనికుడు. మేము అతని ప్రసన్నతా ప్రాప్తులము అగుడుము గాక. అతడు మా విషయమున సంతుష్టుడు అగునుగాత. ఇంద్రుడు మా దగ్గరి, దూరపు శత్రువును చూపు అందనంత దూరమునాకు తరుమునుగాత.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.