Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam
యక్ష ప్రశ్నలు
పాండవులు కామ్యక వనమును విడిచినారు. ద్వైత వనమునకు చేరినారు. అచట ఉండగా ఒకనాడు ఒక బాపడు వచ్చినాడు. "ధర్మరాజా! చెట్టునకు తగిలించిన నా అరణిని ఒక మగ లేడి కొమ్మునకు తగిలించుకొని పోయినది. దానిని తరిమి నా అరణిని తెచ్చి ఇవ్వవలసినది" అన్నాడు.
ధర్మరాజు బాపని మాటలు విన్నాడు. తమ్ములను తానును ధనుర్బాణములు ధరించి లేడి కొఱకు ఉరికినారు. అన్నివైపుల గాలించినారు. ఎన్నో బాణములు వేసినారు. లేడి కనిపించలేదు. దానికి బాణము తాకలేదు. ప్రయత్నము ఫలించనందుకు పాండవులు బాధపడినారు. వారు అలసి ఒక చెట్టు క్రింద కూర్చున్నారు.
"తమ్ముడా! నకులుడా! అందరము దప్పిగలిగి ఉన్నాము. చెట్టు ఎక్కి చుట్టుపట్ల జలము ఎచటనయిన ఉన్నదేమో చూడుము" అన్నాడు. నకులుడు చెట్టు ఎక్కి చూచినాడు. దూర ప్రదేశమున జలము ఉన్నదని చెప్పినాడు. "నీవు నీరు త్రాగి మాకు నీరు తెమ్ము" అని ధర్మరాజు నకులుని పంపినాడు.
నకులుడు సాగిపోయినాడు. నీటి చెఱువు కనిపించినది. అక్కడికి వెళ్లినాడు. నీరు త్రాగుటకు ప్రయత్నించినాడు. "ఈ తటాకము నాది. నేను అడుగు ప్రశ్నలకు ముందు సమాధానము చెప్పుము. ఆ తరువాత నీరు త్రాగుము" అని ఒక అశరీరవాణి పలికినది. నకులుడు ఆమాటలను లక్ష్యపెట్టలేదు. నీరు త్రాగినాడు. వెంటనే ప్రాణములు విడిచి నేల కూలినాడు.
నకులుడు ఎంత సేపటికి తిరిగిరాలేదు. అప్పుడు ధర్మరాజు సహదేవుని పంపినాడు. సహదేవునకు కూడ నకులునికి వలెనే అశరీరవాణి వినిపించినది. సహదేవుడు ఆమాటలను లక్ష్యపెట్టలేదు. నీరు త్రాగినాడు. వెంటనే ప్రాణములు విడిచి నేల కూలినాడు.
సహదేవుడు రాలేదు. అర్జునుడు వెళ్లినాడు. అతడు అశరీరవాణిని లక్ష్యపెట్టలేదు. నీరు త్రాగినాడు. ప్రాణములు విడిచి నేలకూలినాడు.
అర్జునుడు ఎంతసేపటికి రాలేదు. ధర్మరాజు భీముని పంపినాడు. భీముడు తటాకమునకు చేరినాడు. అతనికి అశరీరవాణి వాక్కులు వినిపించినవి. అతడు లక్ష్యపెట్టలేదు. నీరు త్రాగినాడు. ప్రాణములు విడిచి నేల కూలినాడు.
భీముడు కూడ చాలాసేపటి వరకు రాలేదు. అప్పుడు ధర్మరాజు బయలుదేరినాడు. దుర్గమమయిన అడవిలో నుండి పయనించి తటాకము వద్దకు చేరినాడు. అక్కడ నేలకూలియున్న నలుగురు తమ్ములను చూచినాడు. అతని గుండెలో అగ్నిపర్వతములు ప్రేలినవి. కన్నీరు మున్నీరుగా ఏడ్చినాడు. మనస్తాపమున మనజాలక పోయినాడు. కొంతసేపటికి ధైర్యము తెచ్చుకున్నాడు.
"దైవమా! ఇతరులు వచ్చిన గుర్తులు లేవు. యుద్ధము జరిగిన జాడలు కనిపించవు. వీరి దేహములందు ఒక్క గాయమయినను లేదు. ఇది దుర్యోధనుని దుర్మార్గము కాదుకదా! ఈ తటాకమునందలి జలము విషమయమని తోచుటలేదు. వీరి ముఖములందును, అరచేతులందును, పాదములందును కాంతి తగ్గియుండలేదు. అంతయు వింతగా ఉన్నది. అడవులకు వచ్చి నలుగురు మడసినారు. నేను ఒక్కడను కుంతికి ఎట్లు ముఖము చూపను? భీష్మ ద్రోణాదులను ఎట్లు చూతును?" అని పలు విధముల దుఃఖించిన ధర్మరాజునకు దాహము మిక్కుటము అయినది. అతడు నీరు త్రాగుటకు తటాకము వద్దకు వెళ్లినాడు.
"మహారాజా! ఈ తటాకము నాది. నీ తమ్ములు నలుగురు నా మాటలు లక్ష్యపెట్టలేదు. నీరు త్రాగినారు. ప్రాణములు విడిచినారు. నీవు నీరు త్రాగరాదని హెచ్చరించుచున్నాను. నీవు ముందు నా ప్రశ్నలకు సమాధానము చెప్పుము. తదుపరి కావలసినంత నీరు త్రాగుము" అశరీరవాణి పలికినది.
"ఓ భూతమా! నీవు కొంగ రూపమును ధరించి ఉన్న రుద్రుడవో, వాయుదేవుడవో, అగ్నిదేవుడవో తెలియకున్నది. అజేయులయిన నా తమ్ములను పడగొట్టినావు. నీవు ఎవరవో నిజాము చెప్పుము" ధర్మరాజు అడిగినాడు.
"ధర్మరాజా! నేను యక్షుడను" అని నిజరూపము ధరించిన యక్షుడు "రాజా! నీవు యోచన గలవాడవు. బుద్ధిమంతుడవు. నా ప్రశ్నలకు ఉత్తరము చెప్పము" అని అడిగినాడు.
"మహాత్మా! యక్షా! నీ చిత్తమునకు సరిపడినట్లు చెప్పుట మా వంటివారికి సాధ్యముకాదు. అయినను నాకు తెలిసినంత వరకు ఉత్తరములు చెప్పెదను. ప్రశ్నలు అడుగుము" అన్నాడు ధర్మరాజు.
యక్షుడు అడిగినాడు. ధర్మరాజు చెప్పినాడు:-
1. సూర్యుని నడుపునది ఏది? సూర్యుని చుట్టు తిరుగువారు ఎవరు? సూర్యుని అస్తమింప చేయునది ఏది? సూర్యుడు దేని ఆధారమున నిలిచి ఉన్నాడు.
సూర్యుని నడుపునది బ్రహ్మము. చుట్టు తిరుగువారు దేవతలు. అస్తమింప చేయునది ధర్మము. సత్యమను ఆధారమున నిలిచి ఉన్నాడు.
2. మానవుడు దేనివలన శ్రోత్రియుడు అగును? దేనివలన మహత్తును పొందును? దేని సహాయము పొందును? దేని వలన బుద్ధిమంతుడగును?
మానవుడు శ్రౌతమున శ్రోత్రియుడు అగును. తపము వలన మహత్తును పొందును. ధైర్యము అతనికి సహాయముగా నిలచును. పెద్దలను సేవించుట వలన బుద్దిమంతుడు అగును.
3. బ్రాహ్మణులకు దేవత్వము ఏది? వారికి సాదుబావము ఎటు కలుగును? అసాధుభావము ఎట్లు కలుగును? మనుష్య భావము ఎట్లు కలుగును?
బ్రాహ్మణులకు వేదాధ్యయనమున దేవత్వము కలుగును. తపస్సు వలన సాధుభావము కలుగును. తపము లేనపుడు అసాధుభావము కలుగును. మృత్యు భయము కలిగియున్న బ్రాహ్మణునకు మనుష్య భావము కలుగును.





