Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 2
8. నా మహిమ స్వర్గమును, విశాల, పృథ్విని లంఘిస్తుంది. 'కువిత్సోమస్యాపామితి.'
9. నా శక్తి ఎంతటిదనిన, తలచుకొనిన, ఈ ధరిత్రిని లేపి ఒకచోటు నుంచి మరొక చోటునకు మర్చగలను. 'కువిత్సో మస్యాపామితి.'
10. నేను ఈ పృథ్విని దహించగలను. ఏ చోటునైనను ధ్వంసము చేయగలను. 'కువిత్సోమస్యాపామితి'.
11. నా యొక్క ఒక పార్శ్వము ఆకాశమందున్నది. మరొక భాగము పృథ్వి మీద ఉన్నది. 'కువిత్సోమస్యాపామితి'.
12. నేను మహిమను మించిన మహిమాన్వితుడను. 'కువిత్సోమస్యాపామితి.'
13. నేను స్తుతించబడుచున్నాను. నేను దేవతలకు హవ్యము చేరవేయుదును. స్వయమున హవ్యము గ్రహించి సాగిపోతాను. 'కువిత్సోమస్యాపామితి.'
నూట ఇరువదవ సూక్తము
ఋషి - అథర్వణపుత్ర బృహద్ధివుడు, దేవత - ఇంద్రుడు , ఛందస్సు త్రిష్టుప్
1. ఎవని నుండి జ్యోతిర్మయ సూర్యుడు ఆవిర్భవించినాడో అతడు సర్వశ్రేష్ఠుడు. అతనికి ముందు ఏదీయు లేకుండెను. అతడు జన్మించగనే శత్రు వినాశము చేసినాడు. దేవత లందరు అతనిని అభినందింతురు.
2. ఇంద్రుడు అత్యంత తేజోవంతుడు. విశిష్ట బలశాలి. అతడు దస్యుల గుండెలందు బుగులు పుట్టించును. ఇంద్రా! నీవు సోమము సేవింతువు. దాని ఆనందమున సకల ప్రాణులకు సుఖములు ప్రసాదింతువు. వారిని సంస్కరింతువు. అపుడు వారు నిన్ను స్తుతింతురు.
3. యజమాని దేవతలను సంతృప్తులను చేయును. తనికి వివాహము జరిగినపుడు, సంతానము కలిగినపుడు ఇంద్రునకు సంబంధించిన యుజ్ఞ కార్యములు పూర్తి చేయును. ఇంద్రా ! ఏది సుస్వాదు అగుచున్నదో - అందు అధిక సుస్వాద పదార్థమును చేర్చుము. ఈ అద్భుత మధువునందు మరింత అద్భుత మధువును చేర్చుము.
4. ఇంద్రా! నీవు సోమపానము చేయుదువు. మత్తుడవు అగుదువు. ధనమును జయింతువు. అపుడు జనులు సహితము సోమపానము చేయదురు. ఉన్మత్తులు అగుదురు. అజేయ ఇంద్రా ! స్థిర తేజమును దర్శింప చేయుము. దుస్సాహస రాక్షసుల నిన్ను పరాజితుని చేయకుందురుగాత.
5. ఇంద్రదేవా ! నీవు సాయపడుము. మేము యుద్ధభూమికేగుము. శత్రుంజయులము అగుదుము. స్తుతులతో నీ అస్త్ర - శస్త్రములను ఉత్సాహ పరుస్తాము. మంత్రములతో నీ తేజస్సును తీక్షము చేయుదుము.
6. ఇంద్రుడు స్తుత్యుడు, బహురూపి, విలక్షణ దీప్తియుక్తుడు. అనుపమ ప్రభువు. ఎంతో ఆత్మీయుడు. అట్టివానిని స్తుతించుచున్నాను. ఇంద్రుడు స్వశక్తిచే వృత్రుని, నముచి, కవయ మున్నగు ఏడుగురు దానవులను ధ్వంసము చేసినాడు. అనేక మంది అసురులను హతమార్చినాడు.
7. ఇంద్రా! నీవు ఏ ఇంట హవ్యము అందుకొని తృప్తి చెందుచున్నావో, 'ఆ ఇంట దివ్య పార్థివ' దానములను చేర్చుచున్నావు. ఎపుడు సమస్త భూత స్రష్టులను ద్యావాపృథ్వులు చంచలములు అగుచున్నవో అపుడు నీవు దానికి స్థిరత్వము కలిగించుచున్నావు. ఆ సమయమున నీవు బహుకార్య నిర్వాహకుడవు కావలసి ఉండును.
8. ఋషి శ్రేష్ఠుడును, స్వర్గాభిలాషియగు 'బృహద్ధివుడు', ఇంద్రునకు తన స్తుతులు వినిపించినాడు. భూమి మీది నిర్మల నదుల జలము ప్రవహించుచుండునుగాత.
9. అతర్వపుత్రుడు, బుద్ధిశాలి 'బృహద్ధివుడు', ఇంద్రునకు తన స్తుతులు వినిపించినాడు. భూమి మీది నిర్మల నదుల జలము ప్రవహించుచుండునుగాత.
అన్నము జనులకు సుబుద్ధి కలిగించునుగాత.
బృహద్ధివుడు లోక కళ్యాణము కోరినాడు. తన కొరకు ఏదియు ఆశించలేదు.
నూట ఇరువది ఒకటవ సూక్తము
ఋషి - ప్రజాపతి పుత్ర హిరణ్యగర్భుడు - దేవత - ప్రజాపతి ఛందస్సు - త్రష్టుప్
1. తొలుత హిరణ్యగర్భుడు మాత్రము ఉండెను. తదుపరి ప్రాణులు అవతరించినవి. వానికి అతడు ఒక్కడే స్వామి అయినాడు. అతడు ద్యావాపృథుల నిలిపినాడు. 'కస్మైదేవాయ హవిషా విధేయ', అట్టి ఏ దేవతకు హవిస్సు అర్పింతుము?
2. ఎవడు ఆత్మను ఇచ్చినాడు. బలమును ఇచ్చినాడు. ఎవని ఆదేశమును సమస్త దేవతలు పాటింతురు. ఎవని ఛాయ అమృతమో, ఎవని వశమున మృత్యువు మసలునో అట్టి ;కస్మైదేవాయ హవిషా విధేమ'.
3. ఎవడు తన మహిమ వలన ప్రాణులకు. అనిమిషులకు అద్వితీయ ప్రభువో - ఎవడు ద్విపద, చతుష్పాదులకు స్వామియో అట్టి 'కస్మైదేవాయ హవిషా విధేమ.'
4. ఎవని మహిమ వలన హిమచ్చన్న నగములు ఏర్పడినవో - ఎవని సృష్టి సాగర సమేత ధరిత్రి అగుచున్నదో ఎవని భుజములు దిశలు అగుచున్నవో అట్టి 'కస్మైదేవాయ హవిషా విధేమ',
5. ఎవడు ఉన్నత ఆకాశమును, విశాల పృథ్విని తమ తమ స్థానములందు స్థిరపరచినాడో - ఎవడు స్వర్గమును ఆదిత్యుని నిలిపిఉంచినాడో - ఎవడు అంతరిక్షముణ జలము ఏర్పరచినాడో అట్టి 'కస్మైదేవాయ హవిషా విధేమ',
6. ఎవని వలన ధ్యావాపృథ్వులు శబ్దాయమానములై, స్తంభితములై, ఉల్లసితములు అయినవో ఎవనిని దీప్తిశాలి ద్యావా పృథ్వులు మహిమాన్వితునిగ భావించినవో - ఎవని ఆదేశమున సూర్యుడు ఉదయించి ప్రకాశించునో అట్టి 'కస్మైదేవాయ హవిషా విధేమ.'
7. భువనములను 'జలము ఆచ్ఛాదించి ఉండెను. జలము గర్భము దాల్చి అగ్ని, ఆకాశాదు లను సృష్టించెను.' అపుడు దేవతలకు ఒక్కడే ప్రాణాత్మకుడైనట్టి 'కస్మైదేవాయ హవిషా విధేమ'.
8. జలము స్వబలమున అగ్నిని సృష్టించినపుడు ఎవడు అట్టి సమస్త జలముల నలు దిశలను వీక్షించినాడో, ఎవడు సమస్త దేవతలకు ఒక్కడే ప్రాణాత్మకుడు అగుచున్నాడో అట్టి 'కస్మైదేవాయ హవిషా విధేయ.'
9. ఎవడు పృథివికి 'ఆ'కాశమునకు జన్మదాతయో -ఎవని శక్తి సత్యమగునో - ఎవడు ఆనందవర్థక విశాలజలమును కలిగించినాడో - ఎవడు మమ్ము బాధించుచున్నాడో అట్టి 'కస్మైదేవాయ హవిషా విధేమ.'
10. ప్రజాపతి ! ఈ సమస్త ఉత్పన్నములను నీవు వినా అన్యుడు అధీనమున ఉంచుకొన జాలడు. ఏది కోరి మేము నీ హవనము చేయుదుమో అది మాకు లభించునుగాత. మేము ధనపతులము అగుదుము గాక.
నూట ఇరువది రెండవ సూక్తము
ఋషి - వసిష్ఠపుత్ర చిత్ర మహనుడు దేవత -
అగ్ని ఛందస్సు 1,5 త్రిష్టుప్ 6,8, జగతి
1. అగ్ని తేజము సూర్యసమము - విచిత్రము. అతడు రమణీయ, సుఖకర, ప్రేమపాత్ర, అతిథి వంటివాడు. అట్టి అగ్నిని మేము స్తుతిస్తున్నాము. అగ్ని దుగ్ధములిచ్చును. భువనము లను పోషించును. బాధలు దూరము చేయును. అతడు గోవులను, బలమును, ప్రసాదించును. అగ్ని హోతయు, గృహపతియు అగుచున్నాడు.
2. అగ్నీ! నీవు సంతృప్తుడవు ఆగుము. నా స్తుతులందు ఆసక్తుడవు అగుము. నీవు కుశల కార్యశాలివి. తెలియవలసినది అంతయు తెలిసినవాడవు. ఘృతాహుతి అందుకొనుము. స్తోతలను సామగానము చేయమనుము. నీ కార్యములు గాంచియే దేవతలు తమ తమ పనులకు ఉఅపక్రమింతురు.
3. అగ్నీ! నీవు అమరుడవు. సర్వత్ర గామివి. ఉత్తమ కార్యకర్తయగు దాతకు దానము చేయుము. పూజలు గ్రహించుము. సమిధలచే ఎవడు నిన్ను వర్ధిల్లచేయునో, అట్టి వానికి ఉత్తమ సంపద, సంతానము ప్రసాదించుము.
4. అగ్ని సప్తాశ్వముల స్వామి. యజమాని యజ్ఞసామగ్రి సహితా, అగ్నిని స్తుతించును. అగ్ని యజ్ఞకేతనము - విశిష్ఠ పురోహితుడు. అగ్ని ఘృతాహుతులు లందుకొనును. అభీష్టములు ఆలకించుము. నెరవేర్చుము. అగ్ని దాతలకు ఉత్తమ బలము ప్రసాదించును.
5. అగ్నీ! నీవు సర్వశ్రేష్ఠుడవు. దూతలందు అగ్రగణ్యుడవు. అమరత్వము కోరి నిన్ను ఆహ్వానింతురు. నీవు ఆనందప్రదాతవు. దాతల గృహములందు మరుత్తులు నిన్ను అలంకరించుచున్నారు. భార్గవులు నిన్ను స్తుతిస్తారు. నీ ఉజ్వలత వర్ధిల్ల చేస్తారు.
6. అగ్నీ! నీ కార్యములు అద్భుతములు. యజమాని యజ్ఞానుష్ఠానమున నిమగ్నుడు అగును. అతనికి యజ్ఞఫలముగ యజ్ఞరూపిణియు, దుగ్ధదాయినియు, విశ్వపాలికయునగు గోమము ప్రసాదించుము. నీవు ఘృతాహుతులో అందుకుంటావు. ముల్లోకములను ప్రకాశ వంతము చేయుదువు. నీవు యజ్ఞ గృహమున సర్వత్ర వర్తింతువు. నీవు సర్వత్రగామివి. సుకృతి ఆవరణము నీలో దర్శనము ఇచ్చును.
7. ఉష ఉదయిస్తుంది. యజమానులు నిన్ను దూతగా భావిస్తారు. యజ్ఞము చేయుదురు. అగ్నీ! దేవతలు సహితము నీకు ఘృతము అర్పింతురు. ప్రదీప్తుని చేయుదురు. వర్థిల్లచేతురు.
8. అగ్నీ! వసిష్ఠ పుత్రులు యజ్ఞమున అనుష్టానము ప్రారంభించి, అన్న యుక్తునిచేసి ఆహ్వానించుచున్నారు. యజమానుల ఇళ్లలో మరింత ధనము ఉంచుము. మీరు మాకు శుభములు కలిగించండి పాలించండి.
నూట ఇరువది మూడవ సూక్తము
ఋషి - భార్గవ వేనుడు - దేవత - వేనుడు. ఛందస్సు, త్రిష్టుప్
1. వేనుడు దేవత. అతడు జ్యోతి పరివేష్ఠితుడు. ఆకాశమున జలనిర్మాత. ఆకాశ మధ్యమున సూర్య కిరణ సంతానమగు జలము ఉన్నది. వేనుడు దానిని నేల మీద కురిపించును. సూర్యునితో జలము కలియును. అపుడు యజమానులు వేనుని బాలకుని వలె ముద్దుమాటలతో సంతృప్తుని చేయుదురు.
2. వేనుడు అంతరిక్ష జలమాలకు ప్రేరణ కలిగించును. ఆకాశమున ఉజ్వలమూర్తియైన వేనుని వెన్న కాన్పించును. జలముల ఉన్నత స్థానమగు ఆకాశమును వేనుడు దీప్తిమంతము చేయుదు. అతని పారిషదులు - అన్నింటి ఉత్పత్తి స్థానమగు - ఆకసమును ప్రతిధ్వనింప చేసినారు.
3. వేనునితో బాటు జలము నభమున నిలుచును. విద్యుత్తవత్సము. ఆకాశము మాత. తన సహవాసి వేనునితో విద్యుత్తు నర్జించ సాగినది. జలమునకు ఉత్పత్తి స్థానము ఆకాశము. అది ధ్వనించి వేనుని వర్థిల్ల చేసినది.
4. స్తోతలు బుద్ధి కుశలురు. వారు మహిష గర్జన వంటి - వేనుని ధ్వని విన్నారు. వారు వేనుని రూపపు కల్పన చేసినారు. వారు వేనుని పూజించినారు. నది వంటి నిరంతర జలము పొందినారు. వేనుడు గంధర్వుడు. జలములకు ప్రభువు.
5. విద్యుత్తు అప్సరస. వేనుడు ఆమె ప్రేమికుడు. విద్యుత్తు వేనుని చూచినది. చిరు నవ్వినది. అతడు ఆమెను కౌగిలించుకున్నాడు. ప్రేమికుడు వేనుడు ప్రేయసి విద్యుత్తు. రతి కోర్కెను తీర్చినాడు, బంగారు. రంగు మబ్బులందు శయనించినాడు.
6. వేనుడా! నీవు స్వర్గమున ఎగురు పక్షి వంటివాడవు. నీ రెండు రెక్కలు బంగారు మయములు. లోకమును శాసించు వరుణునకు నీవు దూతవు. నీవు లోకములను పోషించు పక్షి సముడవు. అందరు. నిన్ను దర్శింతురు. మనసున నిలుపుకొందురు.
7. అతడు గంధర్వుడు, స్వర్గపు ఉన్నత ప్రదేశమున ఉన్నత భావములతో వసించును. అతడు నలుదిశల చిత్రవిచిత్ర అస్త్ర, శస్త్రములు ధరించి ఉండును. అతడు తన సుందర రూపమును దాచిపెట్టినాడు. అంతర్హితుడై జలవర్షము కలిగించును.
8. వేనుడు జలమూర్తి. అతనిది గద్దకన్ను. ఆకాశమున ఉండి సర్వసాక్షి అగును. అతడు శుభ్రవర్ష ప్రదీప్తుడు. అతడు మూడవ లోకమగు ఆకసమున నిలిచి ఎల్లరు కోరునట్టి జలమును సృష్టించుచున్నాడు.
నూట ఇరువది నాలుగవ సూక్తము
ఋషి - అగ్ని దేవత - అగ్న్యాదులు ఛందస్సు - 7. జగతి - మిగిలినవి త్రిష్టుప్
1. అగ్ని ఈ యజ్ఞమునకు ఋత్విగాది పంచవ్యక్తులను నియమించు అధ్యక్షుడు. మా యజ్ఞము సవన త్రయమగును. వాటిని సప్తహోతలు అనుష్ఠింతురు.
అగ్నీ! ఈ యజ్ఞమునకు విచ్చేయుము. మాకు దూతవు ఆగుము. నేతవు ఆగుము!
అగ్ని అనుచున్నాడు:-
2. దేవతలు నన్ను ప్రార్థించుచున్నారు. అందువలన నేను దీప్తిహీన, అవ్యక్త దశ నుంచి దీప్తివంత దశకు చేరుకున్నాను. నేను నలుదిశలు వీక్షించి అమరత్వము పొందినాను. యజ్ఞము నిరాటంకముగ పూర్తి అయినంత అదృశ్యుడను అవుతాను. యజ్ఞమును విడుతును. అరణి యందు ప్రవేశింతును.
3. పృథివి, ఆకాశమార్గము, ఆవలి సూర్యుని వార్షిక గమనమును, అనుసరించి, ఆ యా ఋతువు లందలి యజ్ఞానుష్ఠానము చేయుదును. బలిదేవతలు పితృరూపులు అగుచున్నారు. వారి సుఖమునకు స్తుతులు చేయుదును. యజ్ఞపు అయోగ్య, అపవిత్ర స్థానము నుండి యజ్ఞపు పవిత్ర, ఉపయుక్త స్థానములకు చేరుదును.
4. ఈ యజ్ఞమునందు నేను అనేక వత్సరములు గడిపినాను. ఇచటనే ఇంద్రుని యజించినాను. పితృరూప అరణినుండి ఆవిర్భవించినాను. నా దర్శనము కాకున్న సోమ, వరుణాదులకు పతనము కలుగును. దేశము అల్లకల్లోలమగును. అపుడు నేను అవతరింతును. రక్షింతును.
5. నేను వెడలినంత అసురులు బలహీనులు అగుదురు. వరుణరాజా! నన్ను ప్రార్థించుము. నా రాజ్యమున సత్యము నుంచి అసత్యమును విడదీయుము. దానికి అధిపతివి అగుము.
6. సోమమా ! ఇటు చూడుము - ఇది స్వర్గము - అత్యంత రమణీయము. దీని ప్రకాశము చూడుము. ఇది విశాల ఆకాశము. ఇచట నీవు వెలువడుము.
వృత్రవధ జరుగునుగాత.
సోమమా! నీవు హోమ ద్రవ్యమవు. అన్యహోమ ద్రవ్యములచే నిన్ను పూజింతుము.
7. మిత్ర దేవత క్రాంతిదర్శి. అతడు తన తేజస్సుతో ద్యులోకమును తేజోవంతము చేసినాడు. వరుణరాజు ఆకాశజలమును వర్షింపచేసినాడు. ఆ జలము నదులై లోక కళ్యాణ కారకములగుచున్నది. నదులు - వరుణపత్నులవలె - శుభ్రవరుణ కాంతిని వహించుచున్నవి.
8. జలదేవతలందరు వరుణుని సర్వశ్రేష్ఠ తేజోసంపన్నులు అగుదురు. వరుణనివలెనే వారును హవిస్సులు అందుకుందురు. ఆనందింతురు. భార్యవద్దకు వలే వరుణుడు వారలను చేరును. ప్రజకు భయము కలిగినపుడు రాజును ఆశ్రయింతురు. జల దేవతలకు భయము కలిగినపుడు వరుణుని ఆశ్రయింతురు - వృత్రుని నుంచి ముక్తి పొందుదురు.
9. సమస్త జల దేవతల భయభీతులగునపుడు వారికి సాయపడి వారి హితముకోరు వానిని ఇంద్రుడని, సూర్యుడని అనుచున్నారు. వారు స్తుత్యులు - జలదేవతల వెంట సాగువారు అగుచున్నారు. విద్వాంసులు అతనిని ఇంద్రుని పేర స్థిరపరచినారు.





