Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam



    ఆ తరువాత ఒకనాడు ఇంద్రుడు బ్రాహ్మణ వేషము ధరించి కర్ణుని దగ్గరికి వచ్చినాడు. అప్పటికి మధ్యాహ్నమయినది. కర్ణుడు సూర్యదేవుని ఉపాసించుచున్నాడు. అనేకమంది బ్రాహ్మణులు అచట కూడి ఉన్నారు. కర్ణుడు లేదనకుండ అడిగినది దానము చేయుచున్నాడు.
    కర్ణుడు విప్రవేషమున ఉన్న ఇంద్రుని చూచినాడు. నమస్కరించినాడు. ఆదరించినాడు అన్నాడు:-
    "విప్రోత్తమా! నేను సూర్యుని ఉపాసించు సమయమున వచ్చినావు. నీకు ఏమికావలెనో కోరుకొనుము. కన్యకలు కావలెనా? సామగ్రులు కావలెనా? గ్రామములు, బంగారము, రత్నములు, గోవులు ఏది కావలసినను ఇవ్వగలను. ఏమికావలెనో కోరుకొనుము".
    "కర్ణా!" విప్రుడు అన్నాడు. "నీవు చెప్పిన వస్తువులు ఏవియు నాకు అక్కరలేదు. నాకు నీ సహజ కవచకుండలములు కావలసి ఉన్నది. వానిని నాకు ఇవ్వవలసినది".
    "మహాత్మా! నీవు విచిత్రమయిన దానము అడిగినావు. కవచకుండలములు నాకు సహజముగా వచ్చినవి. అవి లేకున్న శత్రువుల వలన నాకు అపాయము కలుగును. దానిని నీకు ఇవ్వజాలను. మరేదయిన కోరుకొనుము. ఎంత దుస్సాధ్యమయినదయినను తెచ్చి ఇత్తును" అన్నాడు కర్ణుడు. మరొక దానము గ్రహించుటకు అంగీకరించలేదు బాపడు. అప్పుడు కర్ణుడు అన్నాడు:-
    "మహాత్మా! నిన్ను నేను ఎరుగుదును. నీవు ముల్లోకములను రక్షించే ఇంద్రుడవు. నేను ఎంత ప్రార్థించినను నీవు వినుట లేదు. నాకు అపాయకరమయిన దానము కోరుచున్నావు. నీకు నా సహజ కవచకుండలములను ఇత్తును. నీవు నాకు నీవద్దనున్న దివ్యశక్తి ఆయుధమును ఇవ్వవలెను".
    "కర్ణా!" ఇంద్రుడు అన్నాడు. "నీవు దానకర్ణుడవు. అనితరమయిన దానము చేయుచున్నావు. అందుకు బదులుగా నాశక్తి ఆయుధమును నీకు ఇత్తును. శక్తి ఆయుధమును ఆపత్కాలమందు నీ శత్రువుమీద ప్రయోగింపవలెను. ఇతర కాలమందు ప్రయోగించిన నీకు అపాయము కలుగును. అంతేకాక నీకు అసాధ్యుడయిన ఒక్క శత్రువును మాత్రమే చంపి అది మరల నా చేతికి వచ్చును".
    "దేవేంద్రా! నాకు ఒకే ఒక్క శత్రువు ఉన్నాడు. వానిని చంపిన నా జీవితాశయము నెరవేరును" అన్నాడు కర్ణుడు.
    "కర్ణా! నీ శత్రువు ఎవరో నాకు తెలియును. మహాపరాక్రమ శాలి అయిన అర్జునుని గెలుచుట అసాధ్యము. అందునను విష్ణుదేవుడయిన శ్రీకృష్ణుడు సాయముగా ఉండగా అర్జునుని గెలుచుట అసంభవము" అన్నాడు ఇంద్రుడు.
    "మహాత్మా! యుద్ధమందుగాని వీరుడు ఎవడో తెలియదు. అది అటుండనిమ్ము. నీకు నా సహజ కవచకుండలములు ఇచ్చిన నాదేహము వికార రూపము పొందును. అందును గురించి ఆలోచించుము".
    "కర్ణా! సహజ కవచకుండలములు ఇచ్చినను నీదేహము సూర్యుని కాంతివలె ప్రకాశించును ఇదిగో నా అమోఘ దివ్యశక్తి ఆయుధము తీసుకొనుము" అని ఆయుధమును కర్ణునకు ఇచ్చినాడు ఇంద్రుడు.
    కర్ణుడు శక్తి ఆయుధము తీసుకున్నాడు. తన చెవులయందుండు కుండలములను తీసి ఇచ్చినాడు. నిర్వికార చిత్తుడయి వాడియయిన కత్తులతో తన దేహమందలి చర్మమును వొలిచి ఇంద్రునకు తన సహజ కవచమును ఇచ్చినాడు".
    "కర్ణుడు చేసిన ఈ మహాత్కార్యమును చూచినారు దేవతలు. కర్ణుని మీద పూలవాన కురిపించినారు. దేవ దుందుభులు మ్రోగించినారు.
    ఇంద్రుడు కర్ణుని కవచకుండలములు గ్రహించినాడు. కర్ణునకు మారు రూపము కలిగించినాడు. పరమ సంతోషమున స్వర్గమునకు వెళ్లినాడు.
    ఇంద్రుడు కర్ణుని కవచకుండలములు గ్రహించిన వృత్తాంతము వనమునందున్న పాండవులకు తెలిసినది. వారు ఎంతో సంతోషించినారు. ఆనందభరితులు అయినారు.
    ఇంద్రుడు కర్ణుని కవచకుండలములు గ్రహించిన వృత్తాంతము హస్తినలో ఉన్న దుర్యోధనాదులకు తెలిసినది. వారు ఎంతో దుఃఖించినారు. వారికి మహత్తరమయిన మనస్తాపము కలిగినది.

                                                                                     ఆలోచనామృతము

    1. ఇది తండ్రుల రాజకీయము. పాండవులు అరణ్య అజ్ఞాత వాసములను విజయవంతముగా పూర్తిచేయగలరని ఇప్పటికి స్పష్టమైనట్లు కనిపించుచున్నది. ఆ తరువాత భారత యుద్ధము జరుగనున్నదని కూడ తెల్లమయినది. రానున్న యుద్ధమున తన కొడుకును రక్షించవలెనని సూర్యుని ఆవేదన. తన కొడుకును రక్షించవలెనని ఇంద్రుని ఆవేదన.
    2. దేవతలకు యుక్తులేగాని శక్తులు ఉన్నట్లు కనిపించదు. విజయము మానవప్రయత్నమువలననే కలుగ వలసి ఉన్నది.
    3. ఇది కర్ణుని వ్యక్తిత్వమును తెలియజేయు ఉదంతము. కర్ణుడు తన ఆజన్మ వ్రతములను తెలియ చేసినాడు. ఆవ్రతములకు అతను ఎంతవరకు నిలబడగలిగినాడో పరిశీలింతము:-
    i) శత్రువులను హతమార్తును లేదా హతమారుదును అన్నాడు. గంధర్వులతో జరిగిన యుద్ధమున యుద్ధరంగము నుండి తప్పుకున్నాడు. గంధర్వులు దుర్యోధనుని పట్టుకున్నారు. అతనిని విడిపించుటకు కర్ణుడు చేసిన ప్రయత్నము కనిపించదు.
    ii) బ్రాహ్మణుడు ఏది యాచించినను తప్పక ఇచ్చెదను అన్నాడు. ఇంద్రుని అంతటివాడు బ్రాహ్మణ వేషమున వచ్చినాడు. అతడు అడిగినది కర్ణుడు ఇవ్వలేదు. అందును గురించి బేరము సాగించినాడు. ఇంద్రుడు శక్తిని ఇచ్చిన తాను కవచకుండలములు ఇత్తును అన్నాడు. అట్లే ఇచ్చినాడు. ఒకదాని బదులు మరొకటి ఇచ్చునది దానము కాదు. వ్యాపారము. కవచము, శక్తి ఆయుధము వీనిలో ఏది శక్తిమంతమయినదో మనకు తెలియదు. కవచము కర్ణుని రక్షించును. శక్తి అర్జునుని వధించును అర్జునుని వధించిన చాలును. ఆ నిశ్చయమునకు వచ్చి కవచమును వదులుకున్నాడు.
    కర్ణుడు దానము చేయలేదు. అతడు వినిమయ పద్ధతిన వ్యాపారము చేసినాడు.
    4. భాగవతము నందలి బలిచక్రవర్తి కథను పోలి ఉన్నది ఈ వృత్తాంతము. వామనుడు అడిగినది ఇచ్చెదనన్నాడు బలి. వచ్చినవాడు వామనుడు. బలికే ప్రమాదము కలిగించనున్నాడు. అని చెప్పినాడు ఆచార్యుడు శుక్రుడు. బలి ఆచార్యుని మాట వినలేదు. తనకు అపాయము కోరితెచ్చుకున్నాడు. దానము ఇచ్చినాడు.
        కమలనాభు నెఱిగి కాలంబు దేశంబు
        నెఱిగి శుక్రుమాటలెఱిగి నాశ
        మెఱిగి పాత్రమనుచు నిచ్చె దానము బలి
        మహివదాన్యుడొకడు మరియు గలడె?
    బలి దానము చేసినాడు. కర్ణుడు వ్యాపారము చేసినాడు. కథలో సామ్యమున్నది. వ్యక్తిత్వములలో ఏమాత్రము సామ్యములేదు.
    5. ఒడలు బలి ఇచ్చినాడు కర్ణుడు. దీనిని చూడ తన శరీరము కోసి డేగకు పెట్టి పావురమును రక్షించిన శిబి చక్రవర్తి వృత్తాంతము గుర్తుకు వచ్చును. కాని శిబికి స్వార్థము లేదు. పావురమును రక్షించుటే అతని ధ్యేయము.
    కర్ణునకు స్వార్థమున్నది. అందునుమించి అర్జునుని విషయమున ద్వేషము ఉన్నది.
    బలి, శిబులకు కర్ణునకు దాన వ్రతమున ఎందునను పోలిక కనిపించదు.
    6. చర్మము ఒలిచి ఇచ్చుట, కర్ణునకు మరొక రూపము వచ్చుటను చూడగా నేటి "ప్లాస్టిక్ సర్జరీ" గుర్తుకు వచ్చుచున్నది. ఇందుగురించి వైద్య శాస్త్రజ్ఞులు పరిశీలించవలసి ఉన్నది.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.