Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 2
విద్వాంసులు అగ్ని మున్నగు వాని మూలములను తెలియుదురు. వారు గోప్య వ్రతములందు ఉందురు.
అగ్ని, సూర్యుడు, వాయువు మూడు నిరృతులు.
3. యజ్ఞ వేది యువతి. దానికి నాలుగు కోణములు. ఆమె యొక్క ఘృతరూపము సుందరము స్నిగ్ధము. ఆమె ఉత్తమమగు యజ్ఞసామగ్రి వస్త్రము ధరించును. యజమాని పురోహితుడు అను రెండు పక్షులు దాని మీద కూర్చుండును. అచట దేవతలకు యజ్ఞభాగము లభించుచున్నది.
4.ఒక పక్షి - ప్రాణము - సముద్రము - బ్రహ్మాండమున ఉన్నది. పరిపక్వ జ్ఞానమున నేను దానిని చూచినాను. దగ్గరనున్న తల్లి - వాక్కు - దానిని ఆస్వాదించుచున్నది. మాత సహితము ఆస్వాదించుచున్నది.
5. పక్షి ఒక్కటయే. కాని క్రాంతదర్శి విద్వాంసులు దానిని అనేకముగా కల్పించుచున్నారు. వారు యజ్ఞములందు బహువిధ ఛందస్సులను ఉచ్చరించుచున్నారు. పన్నెండు సోమ పాత్రలను స్థాపించుచున్నారు.
6. విద్వాంసులు నలుబది సోమ పాత్రలను స్థాపింతురు. లేదా నలుబది ఛందస్సులు ఉచ్చరింతురు. వారు పన్నెండు సోమ కలశముల స్థాపింతురు లేదా పన్నెండు ఛందములను ఉచ్చరింతురు. అట్లు వారు మనసా అనుష్ఠానము చేయుదురు. ఋక్సామములతో యజ్ఞ రథమును నడిపింతురు.
7. ఈ యజ్ఞమునకు పదునాలుగు మహిమలు కలవు. ఏడుగురు హోతలు మంత్రములచే యజ్ఞము నిర్వహింతురు. ఏ యజ్ఞమార్గమున నిలిచి దేవతలు సోమపానము చేయుదురు?
అట్టి విశ్వవ్యాపి యజ్ఞమార్గమును వర్ణించగలవాడు ఎవడు?
8. పదిహేను వేల ఉక్థమంత్రములు ఉన్నవి. ద్యావాపృథ్వులవలె ఉక్థములు బృహత్తులు. స్తోత్ర మహిమ వేల విధములది. స్తోత్రములు అపరిమితములు. అట్లే వాక్యములకు పరిమితి లేదు.
9. సకల ఛందస్సుల మాట తెలిసినవాడు ఎవడు? మూల వాక్యమును గ్రహించినవాడు ఎవడు? ఏడుగురు పురోహితుల మీద ఎనిమిదవవాడు కాగల మొనగాడు ఎవడు? ఇంద్రుని హరితవర్ణ అశ్వమును కన్నవాడు ఎవడు? విన్నవాడు ఎవడు?
10. కొన్ని అశ్వములు నేల చివరి వరకు సంచరించును. కొన్ని రథములకు కట్టబడి ఉండును. సారథి రథము మీద ఉండును. అప్పుడు గుర్రపు శ్రమ నివారించుటకు తగిన ఆహారము ఇవ్వబడును.
నూట పదిహేనవ సూక్తము.
ఋషి - వృష్టివ్యపుత్ర ఉపస్తుతుడు. దేవత - అగ్ని ఛందస్సు1,7
జగతి 8 త్రిష్టుప్, 9 శక్వతి
1. ఇతడు అగ్ని బాలకుడు. అతనిది ఎంతటి అద్భుత ప్రభావము ! పాలకు అతడు తల్లి వద్దకు చేరడు అతనికి చనుబాలు లేవు! అయినను అతడు ఆవిర్భవించినాడు. బాలకుడైన ఇతడు జన్మతోనే దూతయైనాడు. దూత కార్యము నిర్వహించినాడు.
2. అగ్ని బహుకార్య కారకుడు. దాత. అతనివే ఆహ్వానించుచున్నాము. అగ్నిని జ్యోతిరూప దంతములు. అవి బలవంతులను భక్షించును. అగ్ని జుహువు అను పాత్రలో ఇంద్రునకు యజ్ఞభాగమే అందించును. బలిష్ఠ వృషభము గడ్డిమేసిన రీతి అగ్ని యజ్ఞ భాగమును భక్షించును.
3. పక్షివలె అగ్ని వృక్షమును ఆశ్రయించును. అగ్ని ప్రదీప అన్నప్రదాత. అగ్ని ధ్వనించుచు అడవులును కాల్చుము. జలము ధరించును. నోటితో హవ్యమును దహించును. అతడు అవలోకించి మహానుడు అయినాడు. అతని కార్యము మహత్తము. అతడు తన మారమును ఎర్రబరచును.
స్తోతలారా! అట్టే అగ్నిని స్తుతించండి.
4. అగ్నీ! నీవు అజరుడవు. నీవు మంట పెట్టునపుడు వాయువు నిన్ను చుట్టిముట్టి ఉండు. యజ్ఞాగ్నిని పురోహితులు చుట్టిముట్టి ఉందురు. అప్పుడు నీవు మూడు మూర్తులు దాల్తువు. బలము ప్రదర్శింతువు. పచార్లు చేయుదువు. పురోహితులు - యోద్ధులవలె కోలాహలము చేయుదురు.
5. అగ్ని అన్నింటికన్న ధ్వని చేయువాడు. అగ్నీ! స్తోతలు చేయు శబ్దమునకు నీవు మిత్రుడవు. అగ్ని ప్రభువు. సమీప శత్రు వినాశ కారకుడవు. అతడు స్తోతలు, విద్వాంసుల రక్షకుడు.
అగ్ని విద్వాంసులగు మాకు ఆశ్రయదాత అగుచున్నాడు.
6. అగ్నీ ! నీ తండ్రి శోభస్కరుడు. నీ వంటి అన్నవంతుడు మరొకడు లేడు. నీవు బలశాలివి. సర్వశ్రేష్ఠుడవు. ఆపదలందు ధనుర్ధారివై రక్షింతువు.
జ్ఞానియగు అగ్నికి ఉత్సాహ పూర్వకముగ యజ్ఞ సామాగ్రి అర్పించండి. స్తుతించుటకు సిద్దముకండి.
7. జ్ఞానులు, కార్యశూరులగు నరులు అగ్నిని స్తుతింతురు. అగ్నిని సంపద బల పుత్రునిగా భావింతురు. యజ్ఞము చేయువారివలె - అగ్ని అనుగ్రహపాత్రులు సుఖింతురు. జ్యోతిర్మయ - గ్రహ, నక్షత్రాదులవలె తేజోవంతులు అగుదురు. శత్రువులను పరాజితులను చేయుదురు.
8. బలపుత్ర శక్తిశాలి అగ్నీ! నేను ఉపస్తుతుడను వర్షకమగు నా స్తోత్రము నిన్ను స్తుతించుచున్నది. మేము నిన్ను స్తుతిస్తున్నాము. మాకు దీర్ఘయువును, సంతానమును ప్రసాదించుము.
9. వృష్టి హవ్య పుత్రులు ఉపస్థితుడు మున్నగువారు నిన్ను స్తుతించుచున్నాము. మమ్ము, స్తోతలను, విద్వాంసులను రక్షింపుము. మేము, వారు నిన్ను వషట్కార మంత్రముతో, "నమో నమః, వాక్యముతోను స్తుతించుచున్నాము.
నూట పదహారవ సూక్తము
ఋషి - స్థూలపుత్ర అగ్నియుతుడు. దేవత - ఛందస్సు - త్రిష్టుప్
1. ఇంద్రా ! నీవు బలశాలురందు అగ్రగణ్యుడవు. మరింత బలమునకు, వృత్ర వధకు సోమము సేవింపుము. అన్నము, బలము కొరకు నిన్ను ఆహ్వానింతురు. మధు తుల్య సోమపానము చేయుము. తృప్తిచెందుము. వర్షము కురిపించుము.
2. ఇది సోమము. ఇది భాగ్యము. సోమము క్షరితమగుచున్నది. దానిని సారముగ భావింపుము. సేవింపుము. మనమున ఆనందించుము. సౌభాగ్యము, ధనము ప్రసాదించుటకు విచ్చేయుము.
3. ఇంద్రా! స్వరపు సోమము నీకు మత్తు కలిగించునుగాక. పృథివి మీద - నరుల మధ్యన ఉన్న సోమము నీకు మత్తు కలిగించును గాక. నీవు ధనము ప్రసాదించునట్టి సోమము నీకు మత్తు కలిగించునుగాత. శత్రువధ చేయించు సోమము నీకు మాదక మగును గాత.
4. ఇంద్రుడు ఈ లోకమున, ఆ లోకమున స్థిరుడు - సర్వత్రగామి - వృష్టిదాత సోమ రూప ఆహార పదార్థములను నలువైపుల పరచినాము. ఇంద్రుడు ఆశ్వద్వయముతో అచటికి చేరునుగాత.
శత్రుఘాతక ఇంద్రా! మధుతుల్య సోమము గోచర్మ పాత్ర నిండి ఉన్నది. వృషము వలె బలమును ప్రదర్శించుము. యజ్ఞ శత్రువులను పరిమార్చుము.
5. ఇంద్రదేవా ! తీక్ష్ణ అస్త్రములతో రాక్షసులను నేల కూల్చుము. నీ రూపము భయంకరము. నీకు ఉత్సాహము, బలము పెంపొందించు సోమము మేము అందిస్తున్నాము. శత్రువు ముందునకు అత్తాహసముగ వెళ్లుము. శత్రు మధ్యమునకు చేరుము. శత్రువును నరికివేయుము.
6. ప్రభు ఇంద్రా ! అన్నమును విస్తరింప చేయుము. శత్రువు మీద నీ బలమును, ధనుస్సును వ్యాపింప చేయుము. మాకు అనుకూలించుము - సాగుము. శత్రువు చేత పరాజితుడవు కాకుము. స్వంత బలమున దేహమును పెంచుము.
7. ధనిక ఇంద్రా! ఈ యజ్ఞ సామాగ్రిని నీకు అర్పించుచున్నాము. కోపపడక దానిని స్వీకరించుము. ఇదిగో ఇది సోమము. ఇది భాగ్యము. ఇవన్నియు నిన్ను చేరును. తినుము. త్రాగుము.
8. ఇంద్రా! యజ్ఞ సామగ్రి సాంతము నిన్ను చేరును. వండినవి ఉన్నవి! సోమము ఉన్నది రెండింటిని సేవింపుము. అన్నము చేతపట్టి నిన్ను భోజనమునకు పిలుచుచున్నాము. యజమానుల అభిష్టములు తీర్చుము.
9. ఇంద్రాగ్నులకు సురచిత స్తుతులు అర్పించుచున్నారు. నదిలోనికి నావను చేర్చినట్లు నేను స్తుతులను అర్చనకు చేర్చుచున్నాడు.
ఇంద్రాగ్నులకు పురోహితలవలె - దేవతలు పరిచర్యలు చేయుచున్నారు. వారు మేము శత్రు నాశము చేయుటకు మాకు ధనము ప్రసాదింతురుగాత.
నూట పదిహేడవ సూక్తము
ఋషి - ఆంగిరసభిక్షు దేవత - అన్న ధనదానము ఛందస్సు - జగతి - త్రిష్టుప్
1. దేవతలు ఆకలిని సృష్టించినారు. అది ప్రాణ నాశకము. అన్నము తిన్నంత మాత్రమున ప్రాణమునకు మృత్యు విముక్తి కలుగదు. దానము ప్రాణమును రక్షించును. అయినను దాత ధనమునకు లోటురాదు. ఆదాతను ఎవడును సుఖపెట్ట జాలడు.
2. ఒకడు అన్నార్తుడు అగును. ఆకలితో భిక్ష అడుగుటకు వచ్చును. యాచించును. అప్పుడు అన్నవంతుడు కఠిన హృదయుడవును. ఆకలిగొన్న వానిముందే అన్నము తినును. అతనికి సుఖములు వెతికినను దొరకవు.
3. అన్నము కోరి ఒక దుర్భలుడు అన్నము అడిగినపుడు అన్నదానము చేయువాడు దాత అగుచున్నాడు. అతనికి సంపూర్ణ యజ్ఞఫలము లభించుచున్నది. అతనికి శత్రువులందే మిత్రులు కలుగుచున్నారు.
4. తన సఖుడు వస్తాడు. మిత్రుడు అయ్యువాడు అన్నదానము చేయడు. అట్టివాడు మిత్రుడు అనదగిన వాడు కాడు. అతనిని విడిచిపోవుట ఉత్తమము. అట్టివాని కొంప కాదు. ఆ వచ్చినవాడు మరొక ధనిక దాతను చేరుట మంచిది.
5. యాచకునకు ధనదానము చేయుట తప్పనిసరి. దాత మార్గములు విశాలములు అగును. రథచక్రము ఒకపరి పైకి, ఒకపరి క్రిందకు తిరుగును. అట్లే ధనము ఒకపుడు ఒకని వద్ద మరొకపుడు ఇంకొకని వద్ద ఉండును. దానికి స్థిరత్వము లేదు.
6. ఎవడు ఉదారుడుకాడో వాని బోజనము వృధ యగుచున్నది. అతని భోజనము అతనికి మృత్యువు అగుచున్నది. దేవతలకు అర్చించకు, మిత్రునకు ఇవ్వక తానీ మాత్రము తినువాడు పాపమునే తింటున్నాడు.
7. వ్యవసాయమున నాగలి అన్నము అందించుచున్నాది. హలము తన దారిన వస్తుంది - పోతుంది- అన్నము కలిగిస్తుంది. విద్వాంసుడు మూర్ఖుని కన్న శ్రేషుడు. దాత అదాత పైవాడు అగుచున్నాడు.
8. ఒక అంశపు సంపదవాడు రెండు అంశముల సంపద వానిని - రెండు అంశముల వాడు మూడంశముల సంపదవానిని - మూడంశముల వాడు నాలుగు అంశముల సంపద వానిని యాచించును. ఇది నిచ్చెన పద్ధతి. అల్ప ధనము వాడు అధిక ధనము వానిని కీర్తించును.
9. మన రెండు చేతులు ఒక తీరుని, కాని రెండు సమాన బలము కలవి కావు. ఒకే తల్లికి పుట్టిన రెండు గోవులు సమానముగ పాలు ఇవ్వవు. కవలలు శక్తియుక్తులు భిన్నముగా ఉండును. ఒకే వంశపు వారయినను ఇద్దరు వ్యక్తులు సమాన దాతలు కాలేరు. ఆకలిగొన్న వాని ముందు విస్తరేసి అన్నము పెట్టండి. అతడు తినుటను చూస్తుండండి. ఆకలి తీరి అతడు త్రేన్చినప్పటి మీ ఆనందానికి వెలకకట్టజాలరు. ఏదైనను ఇచ్చుటలో ఉన్న ఆనందము పుచ్చుకొనుటలో ఉండదు.
నూట పద్దెనిమిదవ సూక్తము
ఋషి - అహమీయగోత్ర - ఉరుక్షయుడు. దేవత - రక్షోహాఅగ్ని ఛందస్సు - గాయత్రి
1. పవిత్ర వ్రతవంత అగ్నీ! మానవుల మధ్య గల నీ స్థానము నందు నీవు ప్రదీప్తుడవు అగుము. శత్రువును వధించుము.
2. నీ కొరకు స్రువము ఎత్తబడినది.ఉత్తమ ఆహుతి ఇవ్వబడినది. నీకు ఉత్తమ ఘృతము నందు రుచి కలుగును గాత.
3. అగ్నిని ఆహ్వానించినాము. అతడు వాక్య స్తుత్యుడు. ప్రదీప్తుడు అగువాడు. అందరు దేవతల కన్న మున్నుస్రువముతో అగ్నిని ఘృత యుక్తుని చేయబడును.
4. అగ్నికి ఆహుతి ఇవ్వబడినది. అతని దేహము ఘృతమయము అయినది. అతడు దీప్తిమంతుడు, సమృద్ధ ప్రకాశకుడు అయినాడు. అతడు ఘృతాక్తుడు అయినాడు.
5. అగ్నీ ! నీవు దేవతలకు హవిని అందించువాడవు. స్తుతించినంత ప్రజ్వలితుడవు అగువాడవు. మానవులు నిన్ను ఆహ్వానించుచున్నారు.
6. మర్త్య మానవులారా! అగ్ని అమరుడు, దుర్ధర్షడు, గృహస్వామి. అతనిని ఘృతముతో అర్చించండి.
7. అగ్నీ! నీవు ప్రచండ తేజస్వివి అగుము, రాక్షసులను దహించుము. రక్షకుడవగుము. దీప్తిని దాల్చుము.
8. అగ్నీ! నీ స్వభావ సిద్ధ తేజమున రాక్షసినులను దహించుము. స్వస్థానము లందు నిలుపుము. ప్రదీప్తుడవగుము.
9. అగ్నీ! మానవులందు నీవు సర్వశ్రేష్ఠ యజ్ఞకర్తవు, నీ నివాస స్థానము అద్భుతము. నీవు హవ్యవాహనుడవు.
నూట పందొమ్మిదవ సూక్తము
ఋషి లవరూప ఇంద్రుడు దేవత = అవరూప ఇంద్రుడు - ఛందస్సు - గాయత్రి
ఇంద్రుడు లవరూపము దాల్చినాడు. సోమపానము చేయుచు ఋషులకు దర్శనము ఇచ్చినాడు. ఇంద్రుడు తనను గురించి చెప్పుకొనుచున్నాడు.
1. నేను గోవులను, ఆశ్వాదులను దానము చేయు సంకల్పము గలవాడను. నేను అనేక మారులు సోమము సేవించినాను. "కువిత్సోమస్యాపామితి.'
2. వాయువు వృక్షమును వడకిస్తుంది. పైకి లేపుతుంది. అట్లే సోమరసము నన్ను పైకి లేపినది. 'కువిత్సోమస్యాపామితి.'
3. వడి గల గుర్రము రథమును పైకి లేపి ఉంచును. అట్లే నేను సోమపానము చేసినాను. సోమము నన్ను పైకి లేపి ఉంచినది. 'కువిత్సోమస్యాపామితి.'
4. గోవు 'అంబా' అని దూడ వైపు పరుగు తీస్తుంది. అట్లే స్తుతులు నా వైపు పరుగులు పెట్టును. 'కువిత్సోమస్యాపామితి.'
5.త్వష్ట రథమునకు ముఖ్యమగు సారధి స్థానం నిర్మిస్తాడు. అట్లే నేను స్తోతల మనమున స్తుతిని ఉదయింప జేయుదును. 'కువిత్సోమస్యాపామితి.'
6. పంచ జనులు నా దృష్టికి దూరము కాజాలరు. 'కువిత్సోమస్యాపామితి.'
7. ద్యావా పృథ్వులు రెండును నా ఒక్క పార్శ్వమునకు సమానములు కాకున్నవి, కువిత్సోమస్తాపామితి'.





