Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam
6. సావిత్రికి సత్యవంతుని స్థితి తెలియును. అతనికి రాజ్యములేదు. అడవులలో ఉన్నాడు. అంతేకాదు పెండ్లి అయిన ఏడాదికి అతడు చావనున్నాడు. అయినను ఆమె సత్యవంతునే వరించినది.
ప్రేమ పవిత్రమయినది. అది పరిణామమును లెక్కించు గణితము కాదు. ప్రేమ మానసికము. భౌతికములను అది లెక్కించదు. "నీవు లేని స్వర్గమయినను నాకు రుచించదు" అంటుంది సీత రామునితో. సీత రాముని సాహచర్యము కోరుకున్నది. కష్టములను వరించినది. పెండ్లి సమయమున సీతకు రానున్న కష్టములు తెలియవు. అవి వచ్చినపుడు వానిని ఎదిరించినది. సావిత్రి అట్లుకాదు. రానున్నది ఎరిగి సత్యవంతుని పెండ్లాడినది. సావిత్రిది సత్యమయిన ప్రేమ. ప్రేమ కొఱకు ఆమె అన్నింటిని త్యాగము చేసినది.
7. మనసును మించు శక్తి మహిలో లేదు. కాని అందరికి ఆ శక్తి తెలియదు. ఆ చిన్న మనసులో అనేక అణ్వస్త్రముల శక్తి ఉన్నది. సాధన మీదగాని ఆశక్తి ఉపయోగమునకురాదు. సావిత్రి మానసిక శక్తిని సాధించినది. సావిత్రి వలచినవానితో జీవించినది. ఒకే ఊపిరిగా రెండు దేహములుగా వారు జీవించినారు. సత్యవంతుడు చావరాదని సావిత్రి సంకల్పము. ఆమెది స్థిర సంకల్పము. సంకల్పమున జయించరానిది లేదు.
యముడు సంకేతము మాత్రమే. సావిత్రి తన సంకల్ప బలమున మృత్యువును జయించినది. సావిత్రి సత్యవంతుని సాధించుకున్నది.
సావిత్రి సంకల్ప బలమునకు యముడు సహితము ఓడినాడు! సావిత్రి సంకల్ప బలముననే ఉభయ కుటుంబములకు ఉపకారము చేసినది. సత్యవంతుడు చేసినదేమియులేదు. అతడు భర్త మాత్రమే!
8. ద్రౌపదిని సావిత్రితో పోల్చినాడు మార్కండేయుడు. ఆ పోలికలు పరిశీలింతము.
i) సావిత్రి ప్రేమించి పెండ్లి చేసుకున్నది. ద్రౌపదిని స్వయంవరమున ఒకడు గెలిచినాడు. అయిదుగురిని కట్టుకొనవలసి వచ్చినది. కట్టుకున్నది. చరిత్రలో మరొక స్త్రీకి సాధ్యము కాని రీతిగా, అరమరికలు లేక అయిదుగురితో కాపురము చేసినది. అయిదుగురికి బిడ్డలను కన్నది.
ii) సావిత్రి భర్త సత్యవంతునకు వ్యక్తిత్వము ఉన్నట్లు కనిపించదు. పాండవులు అట్లుకాదు పౌరుష ధనులు.
iii) సావిత్రి భర్త వలన అవమానముల పాలుకాలేదు. ద్రౌపది భర్తల మూలమున నిండు సభలో అవమానముల పాలయినది.
iv) సావిత్రి యముని వలన వరములు సాధించి భర్తకు రాజ్యమును ఇప్పించినది. ద్రౌపది నిండు సభలో అవమానమును సహించినది. ధర్మమును గురించి చర్చించి కౌరవ సభను సాంతము చిత్తుచేసినది. ధర్మరాజు జూదమున ఓడిన రాజ్యమును తిరిగి ఇప్పించినది.
v) సావిత్రికి సంతానము లేదు. ద్రౌపదికి అయిదుగురు కొడుకులున్నారు. వారిని వదిలి ఆమె అడవులకు వచ్చినది. పుత్రులను వదలి ఉన్న తల్లి మానసిక వ్యధ తల్లికే తెలియవలెను.
vi) సావిత్రి స్వతంత్రురాలయి సాధించినది. ద్రౌపది భర్తలను ప్రోత్సహించి వారితో కార్యములు సాధించినది.
vii) ద్రౌపదికి ఉన్న క్షమాశక్తి గొప్పది. ఆమె సైంధవుని క్షమించి విడిచినది.
కర్ణుని దానము
పాండవులు వనవాసము చేయుచున్నారు. పన్నెండవ సంవత్సరము ముగియవచ్చినది. ఒకనాడు సూర్య భగవానుడు బ్రాహ్మణ రూపము ధరించి, కర్ణుని వద్దకు వచ్చినాడు. "కర్ణా! నీవు బ్రాహ్మణులందు ప్రీతి కలిగి ఉందువు. దానము ఇచ్చుటలో నీకు సాటివచ్చువారు లేరు. ఈవిషయము తెలిసి ఇంద్రుడు నిన్ను మోసము చేయదలచినాడు. ఇంద్రుడు పాండవ పక్షపాతి. వారికి మేలు చేయదలచినాడు. అతడు బ్రాహ్మణ వేషమున నీ దగ్గరికి రానున్నాడు. వచ్చి నీ కవచకుండలములు దానముగా అడగనున్నాడు. 'నీకు ఉన్న సహజ కవచకుండలములు అమృతమయములు. అవి నీకు ఉన్న ఎడల ముల్లోకములందును నీకు మృత్యువు ఉండదు. వానిని నీవు ఇంద్రునకు ఇచ్చిన యుద్ధమున అర్జునుడు నిన్ను గెలువగలడు. కావున నామాట వినుము. ఇంద్రునకు కవచకుండలములు ఇవ్వకుము. నీ హితవు కోరి చెప్పుచున్నాను".
"మహాత్మా! నీవు విప్రవేషమున వచ్చిన దేవతవుగాని సామాన్యుడివిగా కనిపించుటలేదు. నీవు ఎవరవు? ఎందుకు నా వద్దకు వచ్చినావు?" అని అడిగినాడు కర్ణుడు.
"కర్ణా!" సూర్యుడు అన్నాడు. "నేను సూర్యుడను. నీవు నాకు అత్యంత భక్తుడవు. అంతేకాక మన ఇద్దరికి సంబంధించిన ఒక దేవరహస్యము ఉన్నది. అది తరువాత వెల్లడి కాగలదు. ప్రస్తుతము నీ మేలుకోరి వచ్చినాను. నేను చెప్పినట్లు చేయుము. కవచ కుండలములు ఇవ్వకుము".
"భగవాన్! సూర్యదేవా! సమస్కారములు. నీవు నా మీద దయదలచినావు. నా వద్దకు వచ్చినావు. నాకు హితవు చెప్పినావు కృతజ్ఞతలు.
"మహానుభావా! నేను కొన్ని ఆజన్మ వ్రతములు పట్టినాను. బ్రాహ్మణుడు వచ్చి ఏది యాచించినను తప్పక ఇచ్చెదను. శత్రువులను హతమార్తును, లేదా వారిచే హతమారుదును. శరణువేడినవాడు శత్రువయినను రక్షింతును. స్త్రీలను, బాలురును, బ్రాహ్మణులను, రోగ పీడితులను కాపాడుదును.
"స్వామీ! ఇంద్రుడు వచ్చి నన్ను దానము అడుగుట నా భాగ్యము" ఇంద్రుని అంతటివాడు యాచించుటకు వచ్చిన కాదనగలనా? కాదనవచ్చునా? అతడు కవచకుండలములు అడిగిన సంతోషముగా ఇత్తును. నా ప్రాణములే అడిగినను సంకోచించక ఇత్తును. కాదనలేను. అందు విషయమున మీ ఉపదేశము వినలేను. మన్నించవలెను" అన్నాడు సవినయముగా కర్ణుడు. కొద్దిసేపు మౌనము వహించినాడు. మరల అన్నాడు "సూర్యదేవా! నేను అర్జునుని గెలువలేనని నీవు తలచవద్దు. నాకు పరశురామ, ద్రోణాచార్యులు ఇచ్చిన అస్త్రములు ఉన్నవి. నాలో సాహసము ఉన్నది. ప్రతాపము ఉన్నది. నేను అర్జునుని హతమార్చుట తథ్యము. అది సత్యము. కావున కవచకుండలములు దానము చేయుటకు అనుమతిని ఇమ్ము".
"కర్ణా! నీవు గొప్పవాడవు. నీ దాతృత్వ గుణమునకు నేను గర్వించుచున్నాను. నీవు మహావీరుని వలె మాట్లాడినావు. అది కర్ణునకు మాత్రమే చెల్లును. నీ నిశ్చయమును నేను మాన్పలేను. కాని ఒక్కమాట చెప్పెదను వినుము.
"ఇంద్రుని వద్ద ఒక శక్తి ఆయుధము ఉన్నది. అది అనంతమయిన శక్తి గలది. నీవు ఇంద్రుని వినయ పూర్వకముగా అడిగి ముందు ఆ శక్తి ఆయుధము తీసుకొనుము. తరువాత నీ కవచకుండలములను ఇంద్రునకు ఇమ్ము" అని చెప్పి సూర్యదేవుడు అంతర్ధానుడు అయినాడు.





