Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 2


 

   9. ఏక పతిత్వ, ఏకపత్నీత్వములు దంపతులు, సంతాన, కుటుంబం, సమాజాల సంక్షేమములు అని ఆనాడు వివరించిందాన్ని ఈ నాటి సమాజం ఇంకా గుర్తించ జాలకున్నది! అవివాహిత బాల్యమాతల సంఖ్య అమెరికాలో పెరిగిపోతున్నది. ఇది అశుభ సూచకం!

    10. ఎడబాటులో బృహస్పతి, జుహువులు నిగ్రహం పాటించారు. తపస్సు చేశారు. దేవతల రాయబారం పునస్సమాగమం జరిగిన తీరు వివాహాన్ని తలపిస్తున్నది! దేవతలంతా భోజనాలు చేసివెళ్లారు! వివాహబంధం వాగర్థముల వంటి పార్వతీ పరమేశ్వరుల  వంటిది. అనన్యా రాఘవేణాహం వంటి సీతారాముల వంటిది. అదియే సమాజానికి శ్రీరామరక్ష.

    11. ఈ సూక్తం ఏడు మంత్రాలది. వివాహం ఏడు అడుగుల బంధం. ఏడేడు జన్మల బంధం. అంటే ఒక దంపతుల గుణగణాలు - (Gens) - ఏడు తరాల వరకూ కొనసాగుతాయి.

                             నూట పదవ సూక్తము
    ఋషి - భార్గవ  జమదగ్ని దేవత - అగ్నులు -ఛందస్సు- త్రిష్టుప్

    1. జ్ఞాని అగ్నీ! నీవు మానవ గృహములందు సమిధలతో చేరుము. నీ దేవతను, అన్య దేవతలను అర్చించుము. నీ  మిత్రుడు నిన్ను పూజిస్తాడు. నీవు బుద్ధి కుశలుడవు. క్రియా కౌశల్యము గల దూతవు. నీవు దేవతలను తెలిసి తోడ్కొనిరమ్ము.

    2. తనూన పాత అగ్నీ! యజ్ఞమార్గమును మధు మిశ్రితము చేయుము. నీ సుందర జిహ్వతో దానిని ఆస్వాదించుము. సద్భావములతో స్తోత్రమును, యజ్ఞమును సమృద్ధము చేయుము. మా యజ్ఞమును దేవభోగ్యము చేయుము.

    3. ఆగ్నీ ! నీవు దేవతల ఆహ్వాతవు. ప్రార్థనీయుడవు. వందనీయుడవు.  వసువుల సహితముగ విచ్చేయుము.

    మహాపురుషా! నీవు దేవతల ఆహ్వతవు. ప్రార్థనీయుడవు. వందనీయుడవు. వసువుల సహితముగా విచ్చేయుము.

    మహాపురుషా! నీవు దేవతల హోతవు. నీకు ప్రేరణ కలిగించుచున్నాము. నీతో సమానముగ యజ్ఞము చేయగలాడు లేడు. సమస్త దేవతల కొరకు యజ్ఞము చేయుము.

    4. పూర్వాహ్ణమున  కుశలను పూర్వముఖముగా పరచి  వేదిని ఆచ్చాదించబడును. వానిని  మరింత  అందముగ విస్తరించబడును. దానిమీద అదితియు, ఇతర దేవతలును ఆసీనులు అగుదురు.

    5. స్త్రీలు చక్కగ అలంకరించుకొని భర్తను చేరి తమను ప్రకటించుకుందురు. అట్లే ఆలంకృత ద్వారముల అధిష్ఠాన దేవేరులు తొలగుదురు గాత. ద్వార దేవేరులారా! దేవతలు సులభముగ దాటగలుగునట్లు తెరవండి.

    6. ఉషాదేవియు -రాత్రి దేవియు జనులకు నిద్రా సుఖము కలిగింతురుగాక. వారికి యజ్ఞాభాగ అధికారము కలదు. వారు కలసి  యజ్ఞ స్థానమున ఆసీనలు అగుదురుగాక. వారు దివ్యలోక దాసిని స్త్రీల వంటి అత్యంత గుణవతులు, శోభాయుక్తలు, ఉజ్వల శ్రీసమేతలు.

    7. అగ్ని ఆదిత్యులు ఉభయులు ఉత్తమ వాక్యముల స్తోత్రములు రచింతురు. మానవులు చేయు అనుష్ఠాన కార్యమును నిర్మింతురు, వారు పురోహితులను వారి వారి విధులకు ప్రేరణ కలిగింతురు, వారు క్రియా కుశలురు! తూర్పు దిక్కున వెలుగొందుచు ఉదయిస్తున్నారు.

    8. భారతీదేవి మా యజ్ఞమునకు శీఘ్రముగ విచ్చేయునుగాత. ఇళాదేవి ఈ యజ్ఞమును తలచుకొని మానినివలె విచ్చేయునుగాత. వారితో కలిసిన సరస్వతి సహితలగు ముగ్గురు దేవేరులు విచ్చేసి సుఖాసనముల మీద ఆసీనలు అగుదురుగాత.

    9. ద్యావా పృథ్వుల మాతా - పితృ స్వరూపులు. హోతా! ఏ దేవత  ఈ ఉభయులను కల్పించి సమస్త ప్రాణిజాలపు సృష్టికి కారకుడు అయినాడు అట్టి త్వష్టను పూజించండి. మీ వద్ద అన్నము కలదు. మీరు విద్వాంసులు నాకు సమముగ యజ్ఞము చేయగలవాడు లేడు.

    10. యూప్తస్తంభమా! నీవు సమయానుసారముగ దేవతలకు అన్నము, ఇతర హోమ ద్రవ్యములు అర్పించుము వనస్పతి, శమిత , అగ్నిదేవతలు, ఘ‌ృత, మధుయుక్త, హోమ ద్రవ్యములను ఆస్వదింతురుగాత.

    11. జన్మతోనే అగ్ని యజ్ఞ నిర్మాత అయినాడు. దేవతలకు అగ్రగామి దూత అయినాడు. అగ్ని స్వరూప హోతలు మంత్రములు చదువుదురుగాక. యజ్ఞోపయోగ దేవవాక్యము ఉచ్చరించబడునుగాక. స్వాహాతో సమర్పించిన వానిని దేవతలు ఆరగింతురుగాత.
   
                               నూట పదకొండవ సూక్తము
    ఋషి - వైరూప అష్టాదంష్ట్రుడు - దేవత - ఇంద్రుడు - ఛందస్సు త్రిష్టుప్

    1. స్తోతలారా! మీ జ్ఞానము ఎట్లెట్లు స్తోత్ర పాఠము చేయండి. సత్కర్మానుష్ఠానము చేయండి. ఇంద్రుని ఆహ్వానించండి. ఇంద్రుడు వీరుడు. తనను స్తుతించిన స్తోతలను అనుగ్రహించును.

    2. ఇంద్రుడు జలములకు ఆధారమగు అంతరిక్షమునకు ప్రభువు అగుచున్నాడు. చిన్నతనపు గోవు  కన్నా చూడ  ఆవులన్నింటిలో కలిసిపోవును. అట్లే  ఇంద్రుడు సర్వవ్యాపి అగుచున్నాడు. విలక్షణ ధ్వనులతో ఇంద్రుడు వెడలును. అతడు బృహత్ జలరాశికి అధిపతి అగుచున్నాడు.

    3. ఈ స్తోత్ర శ్రవణము ఇంద్రుడు మాత్రమే చేయగలడు. అతడు జయశీలుడు. సూర్యునకు మార్గము ఏర్పరచినాడు. నిశ్చలుడగు ఇంద్రుడు జలములను ఆవిష్కరించినాడు. అతడు గోశక్తికి అధికారి. స్వర్గమునకు ప్రభువు. అతడు చిరంతనుడు. అప్రతి పక్షుడు.

    4. అంగిర వంశీయులు స్తుతులు కల్పించు సమయమున ఇంద్రుడు విశాల మేఘములను  కురిపించినాడు. అతడు అనంత జలమును కల్పించినాడు. సత్యరూప ద్యులోకపు జలములకు అధిపతి అయినాడు.

    5. ఇంద్రుడు ద్యావాపృథ్వులు సమానులు. ఇంద్రుడు ఆ రెండింటి అంతటివాడు. అతనికి సమస్త సోమ యజ్ఞముల సమాచారములు తెలియును. అతడు తాపము తగ్గించును. సూర్యునిచే ఆకాశమును ప్రజ్వలింపచేసినాడు. పోషించుటలో అతడు మొనగాడు. అతడు స్తంభముల మీద ఆకాశమును నిలిపినాడు అనిపించును.

    6. ఇంద్రా! నీవు వృత్రఘ్నుడవు - వజ్రముతో వృత్రుని వధించినవాడవు. వృత్రుడు ఎదుగుచున్నపుడు దుర్గదుడవగు నీవు  వజ్రముచే వాని మాయలను పటాపంచలు చేసినావు. ఆ తరువాత నీవు మహాబలశాలివి అయినావు.

    7. ఉషో దేవేరులు సూర్యునిలో కలసినపుడు సూర్యకిరణములు బహువరములతో శోభిల్లినవి. తదుపరి ఆకాశమున చుక్కలు పొడిచినంత బాటసారి సూర్యుని వెలుంగు జాడ కానలేకపోయినాడు.

    8. ఇంద్రుని ఆదేశము విన్నది. జలము ప్రవహింపసాగినది. అది బహుదూరము సాగినది.

    ఆ జలపు అగ్రభాగమెచట?

    దాని మస్తకము ఎచట?

    జలమా? నీ మధ్యస్థానమేది? చరమ స్థానమెయ్యది?

    9. ఇంద్రదేవా! ఎపుడు వృత్రాసురుడు జలమును గ్రసించుచుండెనో, అపుడు నీవు జలములకు విముక్తి కలిగించినావు. అప్పుడే జలము వేగముగ ప్రవహించినది.

    ఇంద్రుడు ఎపుడు జలములకు విముక్తి కలిగించినాడో అపుడు జలము స్థిరముగ నిలువలేక పోయినది.

    10. సమస్త జలములు కామాతురవలె ఉరుకుల పెట్టినవి. కలసి సముద్రమునకు సాగినవి.

    శత్రుపురధ్వంసి, శత్రుజర్జరకర్త ఇంద్రుడు సర్వదా సమస్త జలములకు ప్రభువు అగుచున్నాడు. పృథివి మీద గల  సమస్త యజ్ఞసామాగ్రి, స్తుతులు ఇంద్రుని చేరునుగాత.

                                నూట పన్నెండవ సూక్తము
    ఋషి - విరూపగోత్ర - ప్రభేదనుడు. దేవత - ఇంద్రుడు. ఛందస్సు -త్రిష్టుప్

    1. ఇంద్రా! సోమము సమర్పించినాము. వలసినంత సేవింపుము. ప్రాతః కాలసోమము నీకు ప్రథమ యోగ్యము అగును. నీవు వీరుడవు. శత్రువధకు ఉత్సుకుడవగము. మేము మంత్రములతో నీ వీరత్వమును ప్రశంసింతుము.

    2. ఇంద్రా! నీ రథము మనోవేగమును మించినది. ఆ రథము పైననే సోమపానమునకు విచ్చేయుము. నీవు ఆనందముగ విహరించు హరియను అశ్వములు వేగముగ పరుగులు తీయునుగాత.

    3. ఇంద్రా! హరితవర్ణ తేజముతోను - సూర్యుని మించిన నానావిధ కాంతులతోను శోభిల్లుము. మేము బంధుత్వముగ నిన్ను ఆహ్వానించుచున్నాము. మాతో కలసి కూర్చుండి. సోమపానము చేయుము. ప్రమత్తుడవగుము.

    4. ఇంద్రా! సోమము  సేవించి ఉన్మత్తుడవు అయినప్పటి నీ మహిమను ద్యావా, పృథ్వులు భరింపజాలవు. నీకు స్నేహపాత్రమగు అశ్వములను కట్టుము. యజ్ఞ సామాగ్రి గల యజమాని ఇంటికి విచ్చేయుము.

    5. ఇంద్రా! ఎవడు సమర్పించిన సోమమును నిత్యము సేవించి, బలము చూపి, శత్రువధ చేసినాడో ఆ యజమానిని నీ ఇచ్చవచ్చిన స్తోత్రములతో నీకు ప్రేరణ కలిగించుచున్నాడు. నీ మనోరంజనమునకు సోమము సమర్పించుచున్నాడు.

    6. శతక్రతు ఇంద్రా ! నీకు ఈ పానపాత్ర అవశ్యము లభించును. దీనితో త్రాగుము. దేవతలు కోరునట్టి మధుతుల్యము - మాదకమగు సోమముతో ఈ చషకమును పూరించినాము.

    7. ఇంద్రా ! అన్నము, సోమము సిద్ధముచేసి అనేకులు అనేక స్థానములందు, నిన్ను ఆహ్వానించుచున్నారు. నీకు అర్పించిన సోమము, అన్ని సోమములకన్న - మధురము అగును గాత. అందుననే నీకు రుచి కలుగును గాత.

    8. ఇంద్రా! పూర్వకాలమున - అందరి కన్న ముందు - నీవు శౌర్యము ప్రదర్శించినావు. దానిని నేను స్తుతించుచున్నాను. జలము కొరకు నీవు మేఘమును బ్రద్దలు చేసినావు. స్తోత కొరకు గోవును సులభలభ్యము చేసినావు.

    9. ఇంద్రా ! నీవు బహుజన అధిపతివి. క్రియా కుశల వ్యక్తులందు బుద్ధిమంతులందు నిన్ను శిష్యునిగ భావింతురు. దూరమునగాని, దాపునగాని నీవు లేని అర్చన ఉండదు.

    ధనిక ఇంద్రా! మా స్తుతులను విస్తృతము, సుందరము చేయుము.

    10. ధనిక ఇంద్రా ! మేము నీ యాచకులము. మమ్ము తేజస్వులను చేయుము.

    ధనాధిపతివియు - మిత్రుడవు అగు ఇంద్రా ! మమ్ము నీ బంధువులనుగ భావింపుము.

    యుద్ధకర్త ఇంద్రా ! నీ శక్తియే యదార్థము ధన ప్రాప్తికి లేశమాత్రము అవకాశము ఉండదు. అచట సహితము మమ్ము ధన భాగస్వాములను చేయుము.

                                   నూట పదమూడవ సూక్తము
        ఋషి - శతప్రభేదన విరూపుడు - దేవత - ఇంద్రుడు - ఛందస్సు - త్రిష్టుప్

    1. అన్యదేవతలు, ద్యావా పృథ్వులు మనస్పూర్తిగా ఇంద్రుని బలమును రక్షింతురుగాక. ఇంద్రుడు వీరత్వమును సాధించుచు తన మహిమలకు చేరుకున్నాడు. అతడు సోమపానముచేసి అనేక కార్యములు సాధించినాడు. వర్దిష్ణుడు అయినాడు.

    2. విష్ణువు ఇంద్రునకు మధుర సోమలతనంపినాడు. అట్లు చేసి అతడు ఇంద్రుని మహిమను ఉత్సాహపూర్వకముగ ఘోషించినాడు. ఇంద్రుడు ధనికుడు. అతడు అన్య దేవతలతో కూడినాడు. వృత్రుని వధించినాడు. సర్వశ్రేష్ఠుడు అయినాడు.

    3. ఇంద్రా ! నీవు ఉగ్రతేజివి. నీవు స్తుతులు ఆశించినావు. అస్త శస్త్రములు ధరించినావు. దుర్ధర్ష వృత్రునిచే యుద్ధము చేయదలచినావు. వెడలినావు. అపుడు సమస్త మరుత్తులు నీ మహిమను పెంచినవి. మరుత్తులు సహితము వర్ధిల్లినారు.

    4. ఇంద్రుడు పుట్టుకతోనే శత్రుదమనుడు అయినాడు. అతడు సంగ్రామము కోరినాడు. తన పౌరుషమును పెంచినాడు. ధ్యానించినాడు. వృత్రుని ఛేదించినాడు. మానవులకు విముక్తి కలిగించినాడు. ఉత్తమ కార్యము సాధించినాడు. విశాల ద్యులోకమును పైన నిలిపినాడు.

    5. విశాల, విశాల సేనల మీద ఇంద్రుడు ఆకస్మాత్తుగ దునికినాడు. అతడు తన విశిష్ఠ మహిమలుచే ద్యావా పృథ్వులను వశపరచుకున్నాడు. వజ్రము దాత వరుణునకు,  మిత్రునకు సుఖకారకము అయినది. అట్టి లోహమయ వజ్రమును ఇంద్రుడు దుర్ధర్ష రూపమున అందుకున్నాడు.

    6. ఇంద్రుడు వివిధ ధ్వనులు చేసినాడు. శత్రు వధ సాగించినాడు. అతని బల పరాక్రమములు ప్రకటించదలచినది. జలము వెడలినది.

    వృత్రుడు చీకట్లు చుట్టుకున్నాడు. జలమును పట్టి ఉంచినాడు. అయినను ఇంద్రుడు  విజృంభించినాడు. బలశాలియై వృత్రుని నరకినాడు.

    7. ఇంద్ర, వృత్రులు యుద్ధమున దూకినారు. తొలుత తమ తమ పరాక్రమములు ప్రదర్శించినారు. మహాక్రోధులు అయినారు. యుద్ధము చేసినారు. ఇంద్రుడు వృత్రుని వధించినాడు. చీకట్లు చెదరిపోయినవి. ఇంద్రుని మహిమ అంతటిది. శూరవీరులందు అతనిది అగ్రనామమం.

    8. సోమరసము, స్తోత్రముల ద్వారా దేవతలు ఇంద్రుని వర్ధిల్లచేసినారు. ఇంద్రుడు దుర్ధర్ష వృత్రుని వధించినాడు. అపుడు జనులకు అన్నము లభించినది. అగ్ని తన జ్వాలా శిఖచే పదార్ధములను భక్షించును. అట్లే  జనులు దంతములతో అన్నమును నమిలినారు.

    9. స్తోతలారా! ఇంద్రుడు అనేక మిత్ర కార్యములు సాధించినాడు. అతనిని ప్రశంసిం చండి. మంచి వాక్యములు తగిన ఛందస్సుతో రచించండి.

    ఇంద్రుడు మనసుతో దభీతిరాజు ప్రార్థన విన్నాడు. ధుని, చమురి అను అసురులను వధించినాడు.

    10. ఇంద్రా! నేను నీ కొరకు స్తుతులు రచించినాను. అపుడు విశేష ధనమును - ఉత్తమోత్తమ అశ్వములను కోరినాను. వానిని నాకు ప్రసాదించుము.

        నేను పాపములను దాటుదును గాక.
        శుభములు కలుగుదును గాత.

    మేము కల్పించిన స్తోత్రములను, ఇంద్రా! ధ్యానముగా వినుము. మాకు ధనములు ప్రసాదించుము.

                                 నూట పదునాలుగవ సూక్తము
ఋషి - నైరూపసద్మి, దేవత - విశ్వేదేవతలు, ఛందస్సు 4 జగతి మిగిలినవి త్రిష్టుప్

    1. అగ్ని, సూర్యులు దేవతలు,  వారు ప్రదీప్తులు. వారు నలుదిశల వ్యాపించినారు. త్రిభువన వ్యాపకులు అయినారు. మాతంశ్వకు వారి ప్రసన్నత ప్రాప్తించినది.

    ఎపుడు దేవతలు సామమంత్రములను, సూర్యుని కనుగొన్నారో అప్పుడే వారు త్రిభువన పోషణకు ఆకాశమందలి జలమును ఆవిష్కరించినారు.

        మాతంశ్వ అంతరిక్షమున ఉన్న వాయు దేవతఁ

    2. యాజ్ఞికులు యజ్ఞములందు మూడు  నిరృతులను ఉపాసింతురు. తదనంతరము యశస్వి అగ్ని పరిచయము దేవతలకు కలిగింతురు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.