Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam



    "మహాత్మా! ఇంతకుముందు నాభర్త ఆయువు దక్క మరేదయిన వరము కోరమన్నావు. ఇప్పుడు అట్లు అనలేదు, కావున నా భర్తయగు సత్యవంతుడు జీవించునట్లు వరము ప్రసాదింపుము" సావిత్రి కోరినది.
    "సావిత్రీ!" యముడు ప్రసన్నుడయి "నీవు కోరిన వరము ఇచ్చినాను. నీ భర్తయగు సత్యవంతుని తీసుకొనుము ఇక మీదట సత్యవంతుడు నాలుగువందల సంవత్సరములు జీవించును. అతనికి నూరుగురు పుత్రులు కలుగుదురు. మహాకీర్తివంతుడు కాగలడు" అని సత్యవంతుని ప్రాణములను వదిలి యముడు అంతర్ధానుడు అయినాడు.
    సావిత్రి వెనుకకు మరలి వచ్చినది. పూర్వమువలె సత్యవంతుని తల తన తొడమీద పెట్టుకొని కూర్చున్నది. కొంత సేపటికి సత్యవంతుడు చేతనము కలవాడయి లేచినాడు. సావిత్రిని చూచినాడు. అన్నాడు:-
    "సావిత్రీ! నేను చాలాసేపు నిద్రించినట్లున్నాను. నీవు నన్ను లేపలేదు. ఎవ్వడో ఒక బలవంతుడు వచ్చినాడు. నన్ను బలహీనుని చేసినాడు. నన్ను వెలుపలికి తీసిపట్టుకున్నాడు. నాకు భయము కలిగించినాడు. ఇది కల మాత్రముకాదు. ఆ పురుషుడు ఎవ్వడో నాకు తెలియజేయుము".
    "ప్రాణనాథా! ఆవిషయములన్నియు రేపు చెప్పుదును. ఇప్పుడు చీకటిపడుచున్నది. అక్కడ అత్తమామలు మనను కానక దుఃఖింతురు. మనము త్వరగా ఆశ్రమమునకు వెళ్లవలెను" అని సత్యవంతుని తీసుకొని ఆశ్రమమునకు బయలుదేరినది సావిత్రి. అక్కడ ఆశ్రమమున ద్యుమత్సేనునకు నేత్ర దృష్టి వచ్చినది. అది చూచి అక్కడి మునులందరు ఆశ్చర్యపడినారు. ద్యుమత్సేనుడు మాత్రము పుత్రుని గాంచక దుఃఖించినాడు. ఇంతలో సావిత్రీ సత్యవంతులు ఆశ్రమమునకు చేరినారు. వారిని చూచినారు ద్యుమత్సేన సంపతులు. పరమానందము పొందినారు.
    "నాయనా! సత్యవంతా! అడవికి వెళ్లి ఎన్నడును ఇంత ఆలస్యముగా వచ్చినవాడవుకావు. నేడు ఇంత ఆలస్యము అగుటకు కారణమేమి?" అని అడిగినాడు ద్యుమత్సేనుడు.
    "తండ్రీ!" సత్యవంతుడు చెప్పినాడు. "అడవిలో చెట్టును కొట్టుచుండ నిర్వీర్యుడనయి సావిత్రి తొడమీద తల ఉంచి నిద్రపోయినాను. ఇప్పుడే మెలకువ వచ్చినది. లేచి వచ్చినాను. ఈమధ్య జరిగినది సావిత్రికి తెలియును. ఆమె వివరించవలెను".
    ద్యుమత్సేన దంపతులు, సత్యవంతుడు, ఆశ్రమమునందలి మునులు ఆమె చెప్పు విషయమును వినుటకు ఆసక్తి గల వారయినారు.
    నారదుడు అశ్వపతి వద్దకు వచ్చుట నుంచి సత్యవంతుని తీసుకొని ఆశ్రమమునకు వచ్చునంత వరకు జరిగిన కథ సాంతము పూస గుచ్చినట్లు సావిత్రి వివరించినది.
    "అమ్మా! సావిత్రీ! నా వంశము ఆపదయను సముద్రమున మునగనుండగా తెప్పవలె దానిని ఉద్ధరించినావు. నీ పుణ్య చరిత్రము పొగడదగినది" అని సావిత్రి తల మూర్కొని ఆనంద బాష్పములు రాల్చినాడు ద్యుమత్సేనుడు. మునిజనులు సావిత్రిని శ్లాఘించినారు. దీవించినారు. వెళ్లినారు.
    కొన్ని దినములు గడచినవి. మద్ర దేశము నుండి చతురంగ సేనలతో మంత్రులు వచ్చినారు. "మహారాజా! నీ రాజ్యమును అపహరించిన శత్రురాజులు తమ భృత్యులతో విరోధము వలన బంధుమిత్రుల సహితముగా చచ్చినారు. సకల జనులు సర్వసమ్మితితో నీకు రాజ్యాభిషేకము చేయుటకు నిశ్చయించి వచ్చి ఉన్నారు. మీరు రాజ్యమునకు బయలుదేరవలసినది" అని విన్నవించినారు.
    ద్యుమత్సేనుడు మంత్రుల మాటలు విన్నాడు. సావిత్రి సాధించిన వరము తలచుకున్నాడు. సంతోషించినాడు. ఆశ్రమవాసుల అనుమతి పొందినాడు. సత్యవంతుని సహితముగా ఏనుగును ఎక్కినాడు. మాళవి, సావిత్రి పల్లకిని ఎక్కినారు. చతురంగ బలముతో వారు మద్ర దేశపు రాజధాని చేరినారు. అక్కడ గొప్ప ఉత్సవము జరిగినది. ద్యుమత్సేనుడు సత్యవంతునకు యౌవరాజ్య పట్టాభిషేకము చేసినాడు.
    సావిత్రీ సత్యవంతులు ఆనందముగా కాలము గడపినారు.
    సావిత్రి కథ చెప్పిన మార్కండేయుడు "ధర్మరాజా! సావిత్రి వలెనే ద్రౌపదియు పరమ పతివ్రత. ద్రౌపది తన పాతివ్రత్య మహిమ వలన మీ వంశమును ఉద్ధరించును" అని చెప్పి తన ఆశ్రమమునకు వెళ్లినాడు.

                                                            ఆలోచనామృతము

    1. భారత కాలమునుండి నేటికి మానవుడు సాంకేతికముగా చాలా, చాలా సాధించినాడు. మానవునకు భద్రత ఏర్పడినది. భౌతికములయిన ఇబ్బందులు చాలా వరకు దూరమయినవి. అయినను జీవితము కష్టసుఖముల మిశ్రమము అను సత్యమును అధిగమించలేక పోయినాడు. ఇది నాడు ఎట్లున్నదో, నేడు అట్లే ఉన్నది.
    లోకమున శాశ్వతము అయినది ఏదియులేదు. మారుచుండుట ప్రకృతి స్వభావము. కష్టముగాని సుఖముగానై, ఎంతటి వారికి అయినను ఎల్లకాలము నిలువవు. కాని కష్టములు కలిగినపుడు అవి ఎల్లకాలము ఉండుననియు, సుఖములు కలిగినపుడు అవి కలకాలము ఉండును అని మానవుడు భ్రమ చెందుచుండును. కష్టములు తనకే వచ్చినవని, ఇట్టి ఇక్కట్లు మరొకరికి రాలేదని అనుకొనుట తనకే వచ్చినవని, ఇట్టి ఇక్కట్లు మరొకరికి రాలేదని అనుకొనుట మానవ స్వభావము. ధర్మరాజు మానవ మాత్రుడు. అతనికి అటువంటి అభిప్రాయమే వచ్చినది.
    2. కష్టములు మంచివారికి, ధర్మపరులకు, నీతిమంతులకే వచ్చును. దానికి కారణము ఏమిటో తెలియదు. ధర్మరాజునకు ఇందు విషయమున సందేహము ఏర్పడినది. అతను తన వద్దకు వచ్చిన మహాత్ములనందరిని అడిగినాడు. ఎవరును సంతృప్తికరమయిన సమాధానము చెప్పలేకపోయినారు.
    3. మానవుడు కష్టములందున్నపుడు సత్పురుషుల సహవాసము లభించుట గొప్ప అదృష్టము. వారి మంచి మాటల వలన కష్టమును ఎదుర్కొను ధైర్యము లభించును. కష్టములను ఎవరును తొలగించలేరు. కష్టములను ఎదిరించు ధైర్యము కలిగించగలరు. మార్కండేయాదుల సహవాసము కలుగుట ధర్మరాజు అదృష్టము. మార్కండేయుడు శ్రీరామచంద్రుని కథ చెప్పి ధర్మరాజువలె కష్టపడిన వారు ఉన్నారని, శ్రీరామునకు విజయము లభించినట్లే ధర్మరాజును విజయము వరించునని చెప్పినాడు. సావిత్రి కథ చెప్పి ద్రౌపది వలన సహితము విజయము లభించవచ్చునని వివరించినాడు.
    మనిషి ఆశాజీవి. అతనిలో ఆశను కల్పించుట గొప్ప విషయము. మార్కండేయుడు ఆ పని చేసినాడు.
    4. సావిత్రి కథలో పరిశీలించవలసిన విషయములు ఉన్నవి. దమయంతి సావిత్రుల కథలు ప్రేమ కథలు. రెండు కథలును సుఖాంతములయినవి. ప్రేమ కథలు కష్టముల కథలు. ప్రేమ త్యాగమును కోరును. రెంటిలోను త్యాగము కనిపించును. రెండు కథలలోను స్త్రీకి ప్రాధాన్యత ఉన్నది. పురుషుడు నామమాత్రుడు. స్త్రీ తన శక్తి సామర్థ్యములతో పరిస్థితులను ఎదిరించినది. పురుషునకు విజయము సాధించి పెట్టినది. స్త్రీ శక్తి స్వరూపిణి. శక్తి సాంతము ఆమెకు ఉన్నట్లున్నది. పురుషుడు అశక్తుడు. ఆమె నీడన జీవించుచున్నాడు. అయినను విఱ్ఱవీగుచున్నాడు.
    5. సవిత్రిది ప్రేమగాధ మాత్రమే కాదు. త్యాగ గాధ, వీర గాధ. సావిత్రి కొఱకు తండ్రి వరుని వెదకలేదు. సావిత్రి వరించిన వానికి ఇచ్చి వివాహము చేసినాడు. ఇది వివాహ వ్యవస్థ చరిత్రలో ఒక ముందడుగు. కన్నెవలచిన వానికి పిల్లనిచ్చుట ఇంత ఆధునిక సమాజమున కూడ అరుదుగా జరుగుచున్నది.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.