Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 2
సమర రాయబారము
నూట ఎనిమిదవ సూక్తము
ఋషి - పణులు, సరమ, దేవత, పరమ, పణులు, ఛందస్సు, త్రిష్టుప్
బృహస్పతి గోవులను బలాసుర భటులకు పణులు దొంగిలించినారు. గుహలో దాచినారు. ఇంద్రుడు ఆడకుక్క సరమను గోవులను వెతుకుటకు పంపినాడు. సరమ గుహకు చేరి దూత కార్యం నిర్వర్తించినది. ఈ సూక్తము పరమ -పణుల సంభాషణ.
ఇది దౌత్య కార్యము. సరమ సంకేతము మాత్రము. దౌత్య విషయమున సాంకేతికముగ అంతర్జాతీయ న్యాయము. దానిని అనుసరించు జాతులు సూత్రప్రాయముగా దర్శనము ఇచ్చును.
పణులు:-
1. సరమా! నీవు ఏ కార్యము కొరకు ఇచటికి వచ్చినావు? ఇది బహుదూర మార్గము. ఈ మార్గమున వచ్చునపుడు వెనుకకు చూచిన రాజాలరు. మా వద్ద ఏమంత ఉన్నదని నీవు ఇంత దూరము వచ్చినావు? ఎన్ని రాత్రులు నడిచినావు? నదిని ఎట్లు దాటినావు?
వచ్చినది పరజాతిది. ఏదో సంగ్రహించుటకే వచ్చినది. అది పణులకు తెలియును. అయినను దూతిగా వచ్చినది. సౌమ్యముగ పలకరించుచున్నారు.
సరమ:-
2. పణులారా! నేను ఇంద్రుని దూతిని. మీరు గోధనమును కూర్చి ఉంచినారు. దానిని కొనిపోవుట నా అభిమతము. ఇది నేను నది దాట వచ్చిన క్రమము.
తాను ఎవరి దూతి - తన కార్యమేమి? తన శక్తి ఎంత వెల్లడించినది. దాటరాని నదిని దాటినానని. వివరించినది.
3. పణులు :-
పరమా! నీవు ఎవరి దూతవై ఇంత దూరము వచ్చినవో ఆ ఇంద్రుడు ఎంతటివాడు? అతని పరాక్రమము ఎంతటిది? అతని సేన తీరేమీ?
ఇంద్రుడు వచ్చునుగాక. అతడు మాకు మిత్రుడు అగును. అతడు మా గోవులను గ్రహించునుగాత. గోపతిర్నోభవతి - మాకు గోసంరక్షకుడు అగును గాక.
ఇది యుద్ధము నివారించు ప్రతిపాదన ! కాని చురక ఉన్నది. వారు గోవులను ఇస్తారు. ఇంద్రుడు వారి గోవులను రక్షించవలె. వారి అధీనుడు కావలె!
4. సరమ :-
నేను ఎవరి దూతినై ఇంతదూరము వచ్చినానో ఆ ఇంద్రుడు అపరాజితుడు. అతనిని ఎంతటివారును ఓడించజాలరు. అతడు అందరిని ఓడించగలవాడు. గహన, గభీర, నదులు సహితము అతని గతిని నిరోధించజాలవు.
పణులారా! ఇంద్రుడు మిమ్ము హతమార్చగలడు.
పణులు :-
5. సరమా! సుందరివి. నీవు స్వర్గపు శేషసీమ నుండి వచ్చినావు. కావున గోవులలో నీవు కోరిన వానిని నీకు ఇచ్చెదము. యుద్ధము లేక గోవులను ఎవడు ఇచ్చును? మా వద్దను అనేక తీక్ష్ణఆయుధములు ఉన్నవి.
శాంతి కొరకు సంధికి సిద్ధపడినాడు. ఇంద్రుడు తమ అధీనుడు కానక్కర లేదు. కొన్ని గోవులను ఇస్తాము అని తమ వద్ద ఉన్న ఆయుధములను గురించి హెచ్చరించినారు. డిప్పోనుసేని పరిశీలించండి.
పరమ :-
6. మీ మాటలు సేనా యోగ్యములు కావు. మీ దేహములందు పాపము నిండి ఉన్నది. ఇంద్రుని శరములు మిమ్ము హత మార్చగలవు. ఇచటికి వచ్చు మార్గములను దేవతలు ఆక్రమించగలరు. అంతేకాదు. బృహస్పతి మిమ్ము బాధలు పెట్టగలడు. మీరు గోవులను వప్పగించకున్న ఆపదలు ముంచివేయును.
వ్యూహము గమనించండి. దేవతలు తొలుత మార్గాలు మూస్తారు. ఇదే ఇప్పటికిని యుద్ధ వ్యూహము ! తదుపరి పణులను హతమారుస్తారు. కాబట్టి గోవులను వప్పగించండి. ప్రాణాలు రక్షించుకొనండి.
సీతను వప్పగించు లంకను రక్షించుకొనుము. అని హనుమ రావణుని హెచ్చరించినాడు.
7. మా సంపదలను పర్వతములు రక్షించుచున్నవి. గోవులు, అశ్వములు, అన్యధనములచే నిండి ఉన్నవి. పణులు రక్షాదక్షులు. వారు తమ సంపదలను రక్షించుకొనగల సమర్థులు. గోవులు అంబారావములు నిండిన మా తావులకు సరమా! నీవు వ్యర్థముగ వచ్చినావు?
పరికించండి. ఇది వేదము. ఒక్క పరుష వాక్యము లేదు 'మధువదిష్యే' - తీయగ మాటలాడుదుము.
సరమ :-
8. అంగిరస, అయాస్య ఋషులు - నవశ్వ గణము సోమ పాన ప్రమత్తులై ఇచ్చటికి వచ్చిపడెదరు. ఈ గోవులణు అన్నింటిని తోలుకొని పోవుదురు. అప్పుడు ఇప్పటి దర్పోక్తులు పనికిరావు.
పణులు :-
9. సరమా! దేవతలు మాకు దడిచినారు. నిన్ను పంపినారు. నిన్ను మేము మా సోదరిగ భావించుచున్నాము. ఇక నీవు తిరిగి వెళ్లకుము. సుందరీ! నీకు గోధవపు భాగము ఇవ్వగలము.
సోదరికి ఆస్తిలో హక్కు ఉన్నది. ఇది వేదపు మాట! సరమ
10. నాకు అన్నల, చెల్లెళ్ల, కథలు అర్థము కావు. ఇంద్రుడు పరాక్రమ వంతులగు అంగిరో వంశీయులు సమస్త రక్షణలతో నన్నంపినారు. గోవుల కొరకు పంపినారు. వారి ఆశ్రయమున నేను వచ్చినాను. కావున పణులారా! దూరదేశములకు పారిపోండి.
11. పణులారా! బహుదూరమునకు పారిపొండి. ఇచట గోవులు కష్టపడుచున్నవి. ధర్మమును ఆశ్రయించి గోవులు ఈ పర్వతములు దాటి మరలును గాత. బృహస్పతి -సొమము - సోమభిషవ శిలలు - ఋషులు - విద్వాంసులు గోవులను దాచిన ఈ నెలవును తెలిసికొన్నారు.
నూట తొమ్మిదవ సూక్తము
ఋషిక - జుహుర్నామ బ్రహ్మవాదిని - దేవత - విశ్వేదేవతలు
ఛందస్సు - త్రిష్టుప్ - 6-7 అనుష్టుప్
1. బృహస్పతి భార్య జుహు, ఆమెను బృహస్పతి త్యజించినాడు. అందువలన అతనికి బ్రహ్మ పాపము అంటుకున్నది. అప్పుడు సూర్యుడు, శీఘ్రగామి వాయువు, ప్రజ్వలిత అగ్ని, సుఖకర సోముడు, జలదేవత వరుణుడు, సత్యస్వరూప ప్రజవతి, అన్య దేవతలు ప్రాయశ్చిత్తము చేయించినారు.
2. సాహసించిన సోమరాజు తొలుత పవిత్ర చరిత్ర స్త్రీని బృహస్పతికి ఇచ్చినాడు. మిత్రా వరుణులు దానిని ఆమోదించినారు. హోమ నిష్పాద అగ్ని ఆమెను చేయి పట్టుకొని తెచ్చినాడు.
3. ఈమె విధి ప్రకారము పత్ని అయినది. ఈ పత్నిని దేహముతో తాకవలెను. అని అందరు అన్నారు.
ఆమెను వెదుకుటకు వెళ్లిన దూత విషయమున ఆమె అనాసక్త అయినది. బలశాలి రాజు రాజ్యము సురక్షితము అయినట్లు. ఈమె శీలము సురక్షితముగ ఉన్నది.
4. తాపసులగు సప్తర్షులు ప్రాచీన దేవతలు ఈ పత్ని విషయము చెప్పినారు.
ఈమె అత్యంత పవిత్రశీల. ఈమెను బృహస్పతి, వివాహ మాడినాడు. తపస్సు, సచ్చీలము నికృష్ణ పదార్థమును సహితము ఉత్తమ స్థానమునకు చేర్చును.
5. భార్య లేనపుడు బృహస్పతి బ్రహ్మచర్యను అవలంబించినాడు. అతడు సకల దేవతలతో మమైక్యమైనాడు. వారిలో భాగము అయినాడు. ఎట్లు అతడు మొదట భార్యను సోమునిచేత అందుకున్నాడో అట్లే మరల జుహునామక పత్నిని గ్రహించినాడు.
6. దేవతలు, మానవులు మరల బృహస్పతికి అతని భార్యను వప్పగించినారు. రాజులు సహితము శపథ యుక్తముగ శుద్ధ చరిత్ర పత్నిని వప్పగించినారు.
7. పవిత్రశీల పత్నిని మరల తెచ్చి బృహస్పతిని పాపరహితుని చేసినాడు. అప్పుడు వారు భూమి మీది సర్వశ్రేష్ఠ భోజనము చేసినారు. సంతోషముగా ప్రస్థానము సాగించినారు.
ఆలోచనామృతము.
1. మానవ సమాజం టెక్కు, హైటెక్కు, ఇంటర్నెట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీల మీద బొత్తిగా ఆధారపడలేదు. ఇది కేవలం వర్తక, వ్యాపార, వాణిజ్య అభివృద్ధికి ఉపకరిస్తాయి. ఈ టెక్నాలజీ మనిషిని మారాను కాదు మరలో భాగాన్ని - 'పార్ట్ ఆఫ్ మిషనరీని; చేశాయి. మనిషి ఏ మరలో ఏ భాగమో సహితం ఆలోచించ నివ్వకుండా ప్రచారమైకం (పబ్లిసిటీ ఎనెపిస్తియా)లో ముంచింది. జీవితంలో విశ్రాంతి ఎరుగక టెన్షన్లతో మత్తుమందులను ఆత్మహత్యలను ఆశ్రయిస్తున్నాడు. అమెరికాలో అభివృద్ధి రేటుకన్న ఆత్మహత్యల రేటు అధికంగా ఉంది.
మనిషి ఈ మాయాజాలంలో చిక్కుకున్నాడు. బయటపడలేడు. చావాల్సిందే!
2. మనిషి పుట్టి లక్షల సంవత్సరాలు ప్రకృతి వడిలో శాంతంగా విశ్రాంతంగా జీవించాడు. మరపుట్టి పూర్తిగా రెండు వందల సంవత్సరాలు కాలేదు. అది మనిషిని వ్యాపార వస్తువును చేసింది. అప్పుడే విసుగు పుట్టించింది. అతడు విముక్తి కోసం నానా అగచాట్లు పడుతున్నాడు.
3. ఈ వ్యవస్థ కలకాలం కొనసాగడానికి వీల్లేదు. ఎంచేతంటే ఇది మనిషిని, మనసును, ప్రకృతినీ ధ్వంసం చేస్తున్నది!
రామాయణపు లంకలో సరిగ్గా నేటి పరిస్థితే కనిపిస్తుంది?
హిరణ్యాక్ష్య హిరణ్యకశిపులు భూమిని చుట్టి చంకనపెట్టుకునే ప్రయత్నం చేశారు!
భస్మాసురుడు అమరత్వం సాధించాలని బూడిద అయినాడు!
సైన్సుకు పరాకాష్ట అయిన ఆకాశంలో త్రిపురాలను - మూడు నగరాలను నిర్మించారు!
ఇవన్నీ ప్రకృతి విరుద్దములు ప్రకృతి విరుద్ధం అయింది ఏదీ కలకాలం నిలువదు. నశించాలి. ఇది ప్రకృతి శాసనం! పరమాత్మ శాసనం!
4. ఇది ఇయ్యది - నేటిది పిశాచ నాగరకత దీనికి మనసులేదు - మానవతలేదు.
ఇది పిశాచ నాగరకత. దీనికి మారణాయుధాలు కొమ్ములు. నెత్తిన భూగోళం, చేతుల్లో రక్కసి ధనం! రక్కసి అధికారం!
దీని కళ్ళకు గంతలు. దిక్కు ఎరుగదు - దిస ఎరుగదు. ఉరుకుతున్నది. పరుగులు పెట్తున్నది. వేగం, వేగం, యమవేగం, కన్నుకానదు. మన్ను కానదు, మిన్ను కానదు.
అది కూలక తప్పదు, బొక్కబోరలపడుతుంది. అది సత్యం, అది తధ్యం, అది వాస్తవం. కూలక తప్పదు.
ఆ కూలిన మనిషి వెన్ను తట్టవలసింది. చేయూత నివ్వవలసింది. లేపవలసింది. మానవతామృతం చిలకవలసింది. భారతతాత్వికతయే!
అందుకు భారత యువత సన్నద్ధం కావాలి. అందుకే నా కృషి - ప్రయత్నం తపస్సు!
అది ఫలించిన్నాడు నేను ఎక్కడ ఉన్నా ఆనంద బాష్పం రాలుస్తాను.
5. సమాజం శాసనాల మీదగాని, ప్రభుత్వం మీదగాని ఆధారపడిలేదు. సమాజం మానవ సంబందాల మీద ఆధారపడి ఉంది. మానవ సంబంధాలు కేవలం ఆర్థిక సంబంధాల మీద ఆధారపడిలేవు. మానవ సంబంధాలు స్వచ్చందములు. ప్రేమాభిమానాల మీద ఆధారపడినవి.
తల్లిదండ్రులు బిడ్డలను ప్రేమించడం - వారి కోసం అన్ని త్యాగాలకు సిద్దం కావడం ఇందుకు నిదర్శనం.
అయితే ధనస్వామ్య సమాజంలో ప్రేమలు, అభిమానాలు, ఆత్మీయతలు, అనురాగాలు, అనుబంధాలు ధనానికి ఊడిగం చేస్తున్నాయి. ఈ విలువలు తగ్గుతున్న మాట వాస్తవం కాని ఇంకా పూర్తిగా అంతరించలేదు!
6. సమాజం దాంపత్యం -సెక్సు -మీద ఆస్తి మీదా నిలుస్తూన్నది. ఆదిమానవుని నుంచి ఇదే స్థితి.
ఆదిమ దశలో సెక్సు, ఆస్తి, విషయంలో నరుడు పశువుకన్న భిన్నుడుకాడు. ఆ రెంటి విషయంలో బలం కలవాడే అధిపతి!
నాటి నుంచి సామాజిక సేతలు - ఋషులు, మునులు, కవులు బలహీనుని రక్షించడానికి నిరంతరం ప్రయత్నించారు. వారు అధికారం బలం మీద కాక ధార్మిక బలంతో నరునిలో నైతిక స్థాయిని పెంచడానికి నిరంతరం కృషి చేశారు. వారు చాలా వరకు సఫలీకృతులు అయినారు.
సెక్సు విషయంలో ఎంతటి నీచులైనా తల్లితో తోబుట్టువులతో సంగమం ఆశించడు!
ఇది మానవజాతి చరిత్రలో మహత్తర విజయం! చరిత్ర సాంతం పరపీడా పరాయణత్వం కాదు!
ఆస్తి విషయంలోనూ సుమారు అంతట విజయం సాగించారు.
మాగృధః కస్యస్విద్దనం - మరొకరి ధనాన్ని ఆశించకు.
సమాజంలో నూటికి తొంభయతొమ్మిది మంది పై ఉపనిషత్తు శాసనాన్ని ఆచరిస్తున్నారు!
అన్యుల ఆస్తిని ఆశించి ఆక్రమించే ఒక శాతం జనమే పాలిస్తున్నారు! కోర్టుల్లో ఉన్న సివిల్ కేసులు ఒక శాతం కూడా ఉండవు!
7. మానవ సంబంధాల్లో అత్యవసరం అయిందీ అతి ప్రధానం అయిందీ భార్యా భర్తల సంబంధం! అది ఉత్పత్తికి, సమాజం నిరంతరంగాసాగే సంతానానికి, కుటుంబం నిలవడానికీ పెరగడానికీ ఉపకరిస్తుంది. భార్యా భర్తలది పవిత్ర బంధం! ఇతర వ్యవస్థల్లో వివాహం కాంట్రాక్టు మాత్రమే! భారత సంప్రదాయ వివాహ బంధం పవిత్రం. అది మరణంతో కూడ తెగిపోదు ! ఏడేడు జన్మలు కొనసాగుతుంది.
8. ఈ సూక్తం వివాహ బంధాన్ని వివరించింది. వేదం శాస్త్రయోని. ఇందులో రామాయణ మూలాలు కనిపిస్తాయి.
i బృహస్పతి, తన భార్య జుహును త్యజించాడు. సీతను, రావణుడు అపహరించాడు.
ii జుహు ఎచట ఉందో తెలియదు. దూతను పంపారు. ఆమె అనాసక్త అవుతుంది. హనుమంతుడు దూత అవుతాడు.
iii. జుహు సచ్చీలం గలది. అని దేవతలు చెపుతారు. సీతా విషయంలో అగ్నిదేవుడు సాక్ష్యం చెపుతాడు.
iv. ఇక్కడ మరొక విశేషం ఉంది. బృహస్పతి సహితం అంత కాలం బ్రహ్మచారిగ ఉన్నాడని దేవతలు నిరూపిస్తారు. రాముని విషయంలో అది జరుగదు.
v. పునర్దాయాం బ్రహ్మజయాం కృత్వా దైవైర్ని కల్బిషమ్, దేవతలు భార్యను కూర్చి బృహస్పతిని పాప విముక్తుని చేశారు అన్నాడు. అంటే భార్యను విడువడం పాపకృత్యం అయింది. రామునికి ఇది వర్తించలేదు.





