Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam



    అశ్వపతి సావిత్రిని తీసుకొని బంధుజన పురోహితుల సహితముగా ద్యుమత్సేనుడు ఉన్న అడవికి వెళ్లినాడు. ద్యుమత్సేనునకు తాను వచ్చిన పని వివరించినాడు.
    "మహారాజా!" ద్యుమత్సేనుడు అన్నాడు. "మా రాజ్యము పోయినది. నేను గుడ్డివాడను. అడవులందు ఉన్నాము. నీ కూతురు సుకుమారి. మాతో కష్టములు పడలేదు".
    అది విని అశ్వపతి "ద్యుమత్సేన మహారాజా! కలిమిలేములు రెండును కలకాలము ఉండునవి కావు.
    పండితుడగువాడు దుఃఖములను పట్టించుకొనరాదు. సావిత్రి ధైర్యవంతురాలు. ఈమె మీకు సేవలు చేయగలదు. నా ప్రార్థన ఫలింపచేయుము" అని వేడుకున్నాడు.
    ద్యుమత్సేనుడు అంగీకరించినాడు.
    సావిత్రీ సత్యవంతుల వివాహము జరిగినది.
    అశ్వపతి పరివార సహితముగా తన రాజ్యమునకు వెళ్లిపోయినాడు.
    సావిత్రి నార చీరలు కట్టి భర్తకు, అత్తమామలకు సేవచేయసాగినది. అత్తమామలు ఆమె సేవలకు ఎంతో సంతసించినారు. భర్త ఎనలేని అనురాగము కనబరచినాడు.
    సావిత్రికి నారదుడు చెప్పిన మాట గుర్తున్నది. ఆమె పెండ్లినాటి నుండి సంవత్సరము లెక్కింప సాగినది. సంవత్సరమునకు మరి నాలుగు రోజులు మాత్రము మిగిలినవి. ఆనాటినుండి ఉపవాస వ్రతము పూనినది. నిర్ణీత దినము వచ్చినది. సత్యవంతుడు సమిధలకు, దర్భలకు వనమునకు పయనమయినాడు. సావిత్రియు అతని వెంట వెళ్లుటకు నిశ్చయించి భర్తను ఒప్పించినది. అత్తమామల అనుమతి పొందినది. ఉభయులు వనమునకు బయలుదేరినారు.
    సావిత్రీ సత్యవంతులు వనమున సాగుచున్నారు. వనము మనోహరముగా ఉన్నది. అక్కడక్కడ కొలనులు ఉన్నవి. కొలనులందు తామరలున్నవి. తామరలందు రాజహంసలు విహరించుచున్నవి. వృక్షములకు తీవలు చుట్టుకొన్నవి. చెట్లకు తీవలకు పూలు విరగబూసినవి. తుమ్మెదలు వానిపై వ్రాలి రొద చేయుచున్నవి. చెట్లపై చిలుక గుంపులు కోలాహలము చేయుచున్నవి. కోకిలలు గొంతులు ఎత్తి పాడుచున్నవి. సత్యవంతుడు సావిత్రికి అడవుల అందములు చూపుచూ సాగినాడు. ఒక బుట్ట నిండుగా మధుర ఫలములను కోసి నింపినాడు.
    సత్యవంతుడు గొడ్డలి అందుకున్నాడు. సమిధలకై చెట్టును కొట్టసాగినాడు. ఆ విధముగా కొట్టుచు అలసినాడు. శ్రమచెంది కూలబడినాడు. అతనికి అలిపిరి వచ్చినది. "సావిత్రీ! నా దేహము నా వశమున లేకున్నది. నా మనసు భ్రమించుచున్నది. తలమీద సమ్మెటలు పెట్టినట్లు పోట్లు పొడుచుచున్నది. ఇక నేను కూర్చుండలేను. శ్రమతీరువరకు నీ తొడమీద తల ఉంచి నిద్రించెదను" అన్నాడు.
    సావిత్రి తను తొడను దిండుగా చేసి సత్యవంతుని తల తొడయందు ఉంచుకొన్నది. సత్యవంతుని తల ఒత్తసాగినది. క్రమముగా సత్యవంతుని శరీరము చల్లబడినది. ఊపిరి ఆడలేదు. సత్యవంతుడు మరణించినాడు.
    అప్పుడు యమధర్మరాజు వచ్చినాడు. అతడు భయంకరముగా ఉన్నాడు. సావిత్రి అతనిని చూచినది. "నీవు ఎవరవు? ఇక్కడికి ఎందుకు వచ్చినావు?" అని అడిగినది.
    "సాధ్వీ" యముడు అన్నాడు. "నీవు పతివ్రతవు. అందువలన నన్ను చూడగలిగినావు. ఇతరులు నన్ను చూడలేరు. నేను యముడను. సత్యవంతుని ఆయువు ముగిసినది. సత్యవంతుడు పుణ్యాత్ముడు. అందువలన నా భటులను పంపక నేనే వచ్చినాను" అని సత్యవంతుని శరీరము నుండి జీవాత్మను తీసుకొని దక్షిణ దిక్కునకు సాగినాడు.
    సావిత్రి యముని అనుసరించసాగినది. ఎంతవారించినను మానలేదు.
    "సావిత్రీ! ఇక నిలిచిపొమ్ము. ఇక్కడి నుంచి మార్గము దుర్గమము, నీవు రాలేవు. ఆగుము" అన్నాడు యముడు.
    "యమధర్మరాజా!" సావిత్రి పలికినది. "భర్త వెళ్లిన మార్గమున భార్య వెళ్లవలసి ఉన్నది. సకల మార్గములకు ధర్మమార్గము ముఖ్యము. ధర్మమునకు సజ్జనులు ఆధార భూతులు. సజ్జనుల దర్శనము వ్యర్థము కారాదు. నీవు సజ్జన శిఖామణివి. నీదర్శనము వృధా కారాదు. ఫలితము దక్కవలసి ఉన్నది".
    "సావిత్రీ! నీ ప్రజ్ఞా వాక్యములకు మెచ్చినాను. నీభర్త ఆయువు దక్క మరేదయిన వరము కోరుము ఇచ్చెదను" వాగ్దానము చేసినాడు యముడు.
    "మహాత్మా! మా మామగారు అంధులు. వారికి నేత్ర దృష్టి ప్రసాదించవలసినది" సావిత్రి కోరినది. యముడు ద్యుమత్సేనునకు నేత్ర దృష్టి ప్రసాదించినాడు.
    సావిత్రి యముని అనుసరించ సాగినది. ఎంత వారించినను మానలేదు.
    "సావిత్రీ! ఇక నిలిచిపొమ్ము. ఇక్కడి నుంచి మార్గము దుర్గమము. నీవు రాలేవు. ఆగుము" అన్నాడు యముడు.
    "యమధర్మరాజా!" సావిత్రి పలికినది. "నీవు ఎరుగని ధర్మములేదు. సర్వ ప్రాణులందు నీవు సమబుద్ధి కలిగి ఉన్నావు. నీవు సమవర్తివి. అట్టి నీవు దీనులకు వరములు ఇచ్చునపుడు కొరత లేకుండునట్లు కోరిన వరములు ఇచ్చి తృప్తి కలిగించవలెను". "సావిత్రీ! నీ ప్రజ్ఞా వాక్యములకు మెచ్చినాను. నీ భర్త ఆయువు దక్క మరేదయిన వరము కోరుము ఇచ్చెదము" వాగ్దానము చేసినాడు యముడు.
    "మహాత్మా! మా మామగారి రాజ్యమును శత్రువులు హరించినారు. వారి రాజ్యము వారికి వచ్చునట్లు అనుగ్రహింపుము" సావిత్రి కోరినది.
    యముడు ద్యుమత్సేనునకు పోయిన రాజ్యము ప్రసాదించినాడు.
    "సావిత్రి యముని అనుసరించ సాగినది. ఎంత వారించినను మానలేదు". "సావిత్రీ! ఇక నిలిచిపొమ్ము. ఇక్కడి నుండి మార్గము దుర్గమము. నీవు రాలేవు ఆగుము" అన్నాడు యముడు.
    "యమధర్మరాజా!" సావిత్రి పలికినది. "ధర్మబుద్ధి గలవారు తాము తలపెట్టిన ధర్మకార్యమును విడువరు. ధర్మవంతుల మనములందు మోహతాపాదులు జనించవు. నీవు ధర్మాధ్యక్షుడవు. నీకు తెలియని ధర్మములేదు. నా భర్త వెనుక నేను రాక తప్పదు".
    "సావిత్రీ! నీ ప్రజ్ఞా వాక్యములకు మెచ్చినాను. నీభర్త ఆయువు దక్క మరేదయిన వరము కోరుము ఇచ్చెదను" వాగ్దానము చేసినాడు యముడు.
    "మహాత్మా! నా తండ్రికి పుత్ర సంతానము లేదు. అతనికి నూరుగురు కొడుకులు కలుగునట్లు అనుగ్రహింపుము" సావిత్రి కోరినది.
    అశ్వపతికి నూరుగురు కొడుకులు కలుగునట్లు వరము ప్రసాదించినాడు యముడు.
    సావిత్రి యముని అనుసరించి సాగినది. ఎంత వారించినను మానలేదు. "సావిత్రీ! ఇక నిలిచిపొమ్ము. ఇక్కడి నుంచి మార్గము దుర్గమము. నీవు రాలేవు. ఆగుము" అన్నాడు యముడు.
    "యమధర్మరాజా!" సావిత్రి పలికినది. "ఏడుమాటలు మాట్లాడిన బంధువులు" అగుదురని పెద్దలు చెప్పుదురు. నేను నీతో చాలాసేపటినుంచి మాట్లాడుచున్నాను. కావున నేను నీకు చుట్టమును అయినాననుటలో సందేహము లేదు. మీవంటి పెద్దలు బంధుజనులు అయిన తరువాత నా కోరిక తప్పక ఫలించునని నా మనసు చెప్పుచున్నది". "సావిత్రీ! నీ ప్రజ్ఞా వాక్యములకు మెచ్చినాను. నీకు ఇష్టమగు వరమును ఇచ్చెదను కోరుకొనుము" వాగ్దానము చేసినాడు యముడు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.