Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 2
6. ఇంద్రుడు మేఘములను విదీరము చేయువాడు. గోవులను సాధించువాడు. అతనిచేత వజ్రము ఉన్నది. అతడు తన తేజమున శత్రుసేనను ఓడించును పరిమార్చును.
వీరులారా ! ఇంద్రుని ముందుంచుకొని మీ ప్రతాపము ప్రదర్శించండి. ఇంద్రునికి అనుకూలముగ బలమును చూపండి.
7. ఇంద్రుడు శతక్రతువు. వీరుడు. మేఘములవైపు సాగువాడు, అతడు నిర్దయబలశాలి. అతడు స్థానభ్రష్టుడు అగువాడుకాడు. శత్రుసేనా విజేత. అతనితో యుద్ధము చేయగలవాడు లేడు. ఇంద్రుడు మా సేనను రక్షించుగాత.
8. ఇంద్రుడు సర్వసేనాని. బృహస్పతి సేనకు కుడిప్రక్క నిలుచును. సోమము అతని ముందు సాగును. శత్రు భయంకరులగు మరుత్తులు, దేవసేనకు అగ్రమున సాగుదురు గాత.
9. ఇంద్రుడు జలవర్షకుడు. వరుణరాజు, ఆదిత్య గణములు, మరుద్గణముల శక్తి భయానకము.
మహానుభావులగు దేవతలు భువనములను వడకించి విజయులు అయినపుడు కల్లోలము చెలరేగినది.
10. ఇంద్రా! అస్త్ర, శస్త్రములు అందించుము. మా సేనల మనుషులను ఉత్సాహ పరచుము. అశ్వబలము వర్ధిల్లునుగాక. రథ నిర్ఘోషధ్వని ఉద్భవించునుగాత.
11. పతాకము ఎగిరినపుడు ఇంద్రుడు మా ప్రక్కన నిలుచును. మా శరములు విజయములు అగును గాత. మా వీరులు అగ్నులు అగుదురుగాక.
దేవతలారా! యుద్ధములందు మమ్ము రక్షించండి.
12. పావదేవతా ! మమ్ము విడువుము. శత్రువును పట్టుము. వారి మనసులను ప్రలోభ పరచుము; వారి దేహములందు నిలువుము. దుఃఖమున హరి హృదయములను తపింప చేయుము. శత్రువులు చీకటి రాత్రులందు కలిసిపోవుదురుగాత.
13. జనులారా! పదండి ముందుకు, విజయులు కండి, ఇంద్రుడు మీకు సుఖములు కలిగించునుగాత. మీరు ఎంత దుర్ధరులో మీ బాహువులు అంత భయంకరములు అగునుగాక.
నూట నాలుగవ సూక్తము
ఋషి వైశ్వామిత్కృష్టకుడు, దేవత, ఇంద్రుడు, ఛందస్సు, త్రిష్టుప్
1. పురుహూత ఇంద్రా! నీ కొరకు సోమము అభిషుతమై సిద్ధముగ ఉన్నది. ఉభయ అశ్వముల మీద త్వరగా విచ్చేయుము. ప్రధాన స్తోత పాఠములు చేయుచు ఈ సోమమును అందించినారు. సోమపానము చేయుము.
2. హర్యశ్వ ఇంద్రా! యజమానులు సోమమును ప్రస్తరమున సిద్ధము చేసినారు. జలమున శుద్ధి చేసినారు. ఆ సోమమును సేవించుము. కడుపు నింపుము. నీ కొరకు శిలలు సిద్దము చేసిన సోమముతో మత్తుడవు ఆగుము. స్తుతులు గ్రహించుము.
3. హర్యశ్వ ఇంద్రా! నీవు వర్ణకుడవు. సోమము అభిషుతమై ఉన్నది. నీవు యజ్ఞమునకు వచ్చుటను తెలిసి సోమము అర్పించెదము.
ఇంద్రా! ఉత్తమ స్తోత్రములను అందుకొనుము. ఆమోదించుము. వివిధ కార్యములు చేయుము. నీకు బహు స్తుతులు కలుగునుగాత.
4. క్షమతా శీల ఇంద్రా ! ఉశిజ వంశీయులకు యజ్ఞములు చేయుట తెలియును. వినను ఆశ్రయించినవారు. నీ ప్రభావమున అన్న లాభము కలిగినవారు. సంతానము పొందిన యజమానుల ఇంట ఉన్నవారు ఆనందమయులై నిన్ను స్తుతించుచున్నారు.
5. సూర్యశ్య ఇంద్రా! నీ స్తుతులు సుందరములు. నీ సంపద ఆశ్చర్యకరము. నీ ప్రకాశము అత్యంతము. నీవు ధనాదులు అందించినవారు ఆత్మరక్ష చేసుకున్నారు. అన్యులను రక్షించుచున్నారు.
6. హర్యశ్వ ఇంద్రా! అభిషుత సోమపానము కొరకు అశ్వద్వయము మీద యజ్ఞములకు చేరుదువు. నీవు శక్తిశాలివి. యజ్ఞములు నిన్నే చేరుచున్నవి. నీవు యజ్ఞజ్ఞాతవు. దానములు చేయువాడవు.
7. ఎవరి వద్ద అనంత అన్నము ఉన్నదో - ఎవడు శత్రుంజయుడో, ఎవడు సోమ ప్రసన్నడో, ఎవనిని కీర్తించిన ఆనందము కలుగునో, ఎవనిని ఎవండును వ్యతిరేకించజాలడో, అట్టి వానిని స్తుతించుచున్నారు. స్తోతల ప్రణామములు అతనిని చేరుచున్నవి.
8. ఇంద్రా! రమణీయములు, వేగవంతములగు గంగమున్నగు ఏడు నదుల ద్వారా శత్రువురములను ముంచినావు. సాగరమును పెంచినావు. నరుల, దేవతల ఉపకారమునకు తొంబది తొమ్మిది నదులకు మార్గములు ఏర్పరచినావు.
9. ఇంద్రదేవా! నీవు జలద్వారములను తెరచినావు. జలమును తెచ్చుటకు ఒక్కడవే వెళ్లినావు. ఇంద్రా! నీవు వృత్రుని వధించి చేసిన మహత్కార్యము వలన సమస్త లోకములను పోషించినట్లు అయినది.
10. ఇంద్రుడు మహావీరుడు. కార్యకుశలుడు. అతనిని స్తుతించినపుడు ఆనందము కలుగును. ఉత్తమ స్తుతులు అతనిని చేరును. పూజించును. అతడు వృత్రుని వధించినాడు. లోకములను ఏర్పరచినాడు. శక్తిశాలి శత్రువును పరాభవించినాడు. శత్రుసేనకు ప్రతి కూలముగ సాగినాడు.
11. బలశాలి, ధనశాలి ఇంద్రుని ఆహ్వానించండి. యుద్దములందు అన్నము అందించు నపుడు ఇంద్రుడి అధ్యక్షత వహించును. స్వపక్ష రక్షణకు ఇంద్రుడు ఉగ్రరూపము దాల్చును. శత్రువులను వధించును. వృత్రులను నాశనము చేయును. ధనమును జయించును.
నూట అయిదవ సూక్తము
ఋషి - కుత్సపుత్ర సుమిత్రుడు దేవత - ఇంద్రుడు - ఛందస్సు1,
గాయత్రి 11 త్రిష్టుప్ మిగిలినవి ఉష్ణిక్
1. ఇంద్రా! నీవు స్తోత్రాభిలాషివి. స్తుతులు సిద్ధముగ ఉన్నవి. సోమము అభిషుతమై ఉన్నది. వర్షము కలిగించుము. మా క్షేత్రముల ప్రణాళిని జలపూర్ణము చేయుము.
2. ఇంద్రుని అశ్వములు సుశిక్షితములు. అవి అనేక కార్యములు సాధించునవి. అవి శుభ్రములు. కౌశినులు. వాటి ప్రభువగు ఇంద్రుడు దానములు చేయుటకు వచ్చునుగాత.
3. శోభస్కరముగ ఇంద్రుడు అశ్వములను కట్టినపుడు సమస్త పాపములు దూరమైనవి. మానవులు సుఖించినారు.
4. ఇంద్రుడు మానవుల పూజలు అందుకున్నాడు. సమస్త సంపదలను కూర్చినాడు. బహుకార్య సాధన, శబ్దాదుమాన అశ్వములను ఇంద్రుడు నడిపించును.
5. హర్యశ్వములు జూలు గలవి. సుందరములు. ఇంద్రుడు వానిపై ఎక్కినాడు. పుష్టి కొరకు స్వారి చేసినాడు. దవడలు ఆడించుచు అన్నము అడిగినాడు.
6. ఇంద్రుని శక్తి అత్యంత సుందరము. అతడు శోభాయమానుడు. అతడు మరుత్తులతో కలిసి యజమానితో సాధువాదము చేయును. అతడు అంతరిక్షమున ఉండును. ఋభువులు తమ కార్యకుశలతచే రథాదులు సిద్ధము చేసినారు. అట్లే ఇంద్రుడు తన శౌర్యమున అనేక వీరకృత్యములు చేసినాడు.
7. ఇంద్రుడు దంస్యులను వధించుటకు వజ్రము ధరించినాడు. అతడి గడ్డము, మీసములు - అతని అశ్వములు హరితములు. అతని హనువులు సుందరములు. అతడు ఆకాశమంతట విశాలుడు.
8. ఇంద్రా! మా సమస్త పాపములను నష్టపరచును. ఋక్కులు ప్రభావమున ఋక్ శూన్యులను వధించగలుగుదుము గాత. ఏ యజ్ఞము, స్తుతి, సహితము కాకున్నదో అది నిన్ను ప్రతిపాదించకున్నది.
9. ఋత్విజులు యజ్ఞభారము వహింతురు. కార్యారంభము గావింతురు. అప్పుడు ఇంద్రుడు యజమానితో ఒకే పడవపై దాటించునుగాత.
10. పాడియావు. నీకు మంగళ ప్రద అగునుగాక. నీవు సేవించు మధుపాత్ర నిర్మలము, శుభప్రదము అగునుగాత.
11. ఇంద్రా! దస్యువధ సమయమున నీవు కుత్సపుత్రుని రక్షించినావు. బలశాలివగు నీ కొరకు సుమిత్రుడు వందస్తుతులు రచించినాడు. దుర్మిత్రుడు కూడ స్తుతించినాడు.
నూట ఆరవ సూక్తము
ఋషి - కశ్యప పుత్ర భూతాంశుడు. దేవత - అశ్వినులు -
ఛందస్సు - త్రిష్టుప్
1.అశ్వినీద్వయమా! మీరు ఆహుతులు అభిలషించుచున్నారు. వస్త్రకారుడు వస్త్రమును పెంచిన రీతి మీరు మా స్తోత్రములను విస్తరింప చేస్తారు. మీరు కలిసి విచ్చేయుదురని ఈ యజమాని మిమ్ము స్తుతించుచున్నాడు. సూర్యచంద్రులవలె ఖాద్య పదార్థములను అవలోకించుచున్నారు.
2. రెండు ఎద్దులు పచ్చిక బయలున సంచరించును. అట్లే మీరు యజ్ఞము, దానము చేయువాని వద్దకు చేరుకుందురు. రథమునకు కట్టిన రెండు అశ్వములు పదార్ధములను తెచ్చును. అట్లే మీరు ధనదానము చేయుటకు స్తోతల వద్దకు వచ్చెదరు. దూతవలె మీరు జనులందు యశస్వులు కండి. గేదెలు నీటి పట్టునుండి కదలవు. మీరు సోమపానము నుండి కదలకండి.
3. పక్షుల రెండు రెక్కలవలె మీరు కలిసి ఉన్నారు. రెండు మహా పశువుల రీతి మీరు ఈ యజ్ఞమునకు వచ్చి యున్నారు. యజ్ఞ కర్తయగు అగ్నివలె మీరు దీవించుచున్నారు. సర్వత్ర విహరించు పురోహిత ద్వయమువలె మీరు అనేక స్థలములందు దేవతార్చన చేయుచున్నారు.
4. మాతా, పితలు బిడ్డ విషయమున ఆసక్తులు అయినట్ల మీరు మా విషయమున ఆసక్తులుకండి. మీరు సూర్య, అగ్నులవలె దీప్తిశాలురు - రాజువలె శీఘ్రకర్ములు. ధనికుని వలె ఉపకారపరులు అగుదురు గాత. సూర్య కిరణములవలె దృష్టి కలిగించుచు జనులకు సుఖశాంతులు ప్రసాదించండి. సుఖించు మనిషివలె మీరు ఈ యజ్ఞమునకు విచ్చేయండి.
5. చక్కని నడకల వృషభద్వయమువలె మీరు పుష్టివంతులు, రూపవంతులు అగుచున్నారు. మిత్రావరణుల వలె యథార్ధదర్శులు, వదాన్యులు, దుఃఖ ఉపశమనులు, స్తుతి ప్రాప్యులు అగుచున్నారు. అశ్వద్వయము వలె తిని, త్రాగి బలిష్టులు అయినారు. మీరు ప్రకాశమాయ ఆకసమున ఉందురు. గొర్రెల వలె ఇష్టము వచ్చినట్లు తిని సుద్రుడ అంగ ప్రత్యంగముల వారలు అయినారు.
6. గజమును కొట్టుటకు, నిలుపుటకు అంకుశము ఉన్నది. మీరు జనులను నిలుపు చున్నారు. పోషించుచున్నారు. అంతము చేయుచున్నారు. హంతవలె మీరు శత్రు హననులు అగుచున్నారు. అందువలననే మీరు శత్రు విదారకులు, యజమాన పోషకులు అనబడుచున్నారు. మీరు నీట పుట్టినంత నిర్మలులు. బలశాలురు. విజయులు. పరిణామ శీలమగు నా దేహమునకు యౌవనము ప్రసాదించండి.
7. తీవ్ర బల అశ్వినులారా! పొడుగు పాదముల వాడు అన్యుని నీరు దాటించగలడు. అట్లే పరిణామ శీలమగు నా దేహమును ఆపదల నుండి దాటించి ఆశించిన చోటునకు నడిపించండి. ఋభువులతో సమముగ ఉత్తమ రథమును పొందినారు. మీ వేగవంత రథము వాయువులె ఎగిరి శత్రు ధనమును తెచ్చినది.
8. వీరునివలె ఉదరమున ఘృతము పోయండి. మీరు ధనరక్షకులు. అశ్వసహితులైన శత్రు సంహారకులు. మీరు పక్షివలె సుందరులు - సర్వత్రగాములు. అనుకున్నంతనే అలంకృతులై స్తోత్రముల కొరకు యజ్ఞములకు విచ్చేయుదురు.
9. పొడుగు కాళ్ల వానికి లోతునీరు దాటునపుడు ఆశ్రయము, లభించినట్లు మాకు ఆశ్రయము కలిగించండి. మీరు - శ్రోత్రద్వయమువలె -స్తుతులను శ్రద్ధగ విందురు. రెండు యజ్ఞంగముల వలె మీరు ఈ విచిత్ర యజ్ఞమునకు విచ్చేయండి.
10. రెండు తేనెటీగలు తేనెపట్టులో తేనె చేర్చినట్లు మీరు గోస్తనములందు మధుతుల్య దుగ్ధములను కలిగించండి. శ్రమజీవి శ్రమించి చెమట కార్చినట్లు మీరును స్వేదవంతులె జలము కూర్చండి. దుర్భల గోవు పచ్చిక బయట సంచరించి ఆహారము పొందిన రీతి మీరు యజ్ఞములకు విచ్చేసి ఆహారము పొందుచున్నారు.
11. మేము స్తోత్రములను విస్తరిస్తున్నాము. ఆహార వితరణ చేయుచున్నాము. కావున మీరు ఉభయులు ఒకే రథమున ఈ యజ్ఞమునకు విచ్చేయండి. గోస్తనములందు రుచికర ఆహారము వంటి పాలు ఉన్నవి. భూతాంశర్షి ఈ స్తోత్రము రచించి అశ్వినుల మనోరథమును తీర్చినాడు.
నూట ఏడవ సూక్తము
ఋషి- ప్రజాపతిసుత దక్షిణ దేవత - ఋత్విక్కులకు అర్పించు దక్షిణ-
ఛందస్సు- త్రిష్టుప్ - 4 జగతి
1. యజమానుల యజ్ఞ నిర్వహణకు గాను సూర్య రూప ఇంద్రుని అనంత తేజము వెడలినది. ప్రాణులన్నియు చీకటి నుండి బయట పడినది. పితరులు ప్రసాదించిన జ్యోతి ప్రత్యక్షమైనది, దక్షిణలు ఇచ్చు ప్రశస్త పద్ధతి ఆవిర్భవించినది.
2. దక్షిణలు ఇచ్చువారు స్వర్గపు ఉన్నత ఆసనమున ఆసీనులు అగుదురు. స్వర్ణదాతలు అమరులు అగుదురు. వస్త్రదాతలు సోమమును చేరుదురు,అందరు దీర్ఘాయువులు అగుదురు.
3. దక్షిణలు ఇచ్చుట వలన పుణ్యకర్మలు పూర్ణములు అగుచున్నవి. ఇది దేవతార్చనలో భాగము అగుచున్నది. ఆచరణ దుష్టమైనపుడు దేవతలు కార్యమును సఫలము కానీయరు. దక్షిణలు పవిత్రముగా ఇచ్చువారి నిందలకు భీతిల్లువారి కార్యములు సఫలములు అగుచున్నవి.
4. వాయువు నూర్లదారులు వీచును. అందు వలన ఆకాశము, సూర్యుడు, నరులు వాయువునకు హవి సమర్ధించుచున్నారు. దేవతలకు తృప్తి కలిగించి దానములు చేయు వారి మనోరధములను దక్షిణలు తీర్చుచున్నవి. ఈ దక్షిణలు తీసుకొనుటకు సప్త పురోహితులకు అధికారము గలదు.
5. దాతను అందరికన్న ముందు ఆహ్వానింతురు. వారు గ్రామాధ్యక్షులగుదురు. అగ్ర భాగమున సాగుదురు. అందరి కన్నముందు దక్షిణ ఇచ్చువానిని నేను అందరి రాజుగ భావింతును.
6. ఎవరు సర్వ ప్రథమ దక్షిణలు ఇచ్చి పురోహితులకు తృప్తి కలిగింతురో వారు ఋషి, బ్రహ్మ అనబడుచున్నారు. వారినే యజ్ఞాధ్యక్షులు, సామగాత స్తోత అనుచున్నారు. వారు అగ్నియొక్క మూడు రూపములను తెలియుచున్నారు.
7. అశ్వములు, గోవులు, మనోహరి స్వర్ణమ దక్షిణలు అగుచున్నవి. మన ఆత్మ స్వరూప అన్నము సహితము దక్షిణ అగుచున్నది. విద్వాంసుడు దక్షిణను దేహ రక్షణ కవచముగ భావించును.
8. దాతకు మృత్యువు లేదు. అతడు దేవత అగును. అతనిని దరిద్రము. బాధలు, దుఃఖములు, వ్యథలు చేరవు. ఈ భూమి మీద, ఆ స్వర్గమున ఉన్న వారలందరు వారికి దక్షిణలు ఇచ్చెదరు. వ్యథలు చేరవు. ఈ భూమి మీద, ఆ స్వర్గమున ఉన్న వారలందరు వారికి దక్షిణలు ఇచ్చెదరు.
9. దాతలు పాడియావును ముందే పొందుదురు. అందకత్తె యగు నవవధువు లభించును. సుర లభించును. దాతలే అజేయ శత్రువును జయింతురు.
10. దాతకు అలంకరించిన జననాశ్వము ఇవ్వబడును. వారి కొరకు సుందరి వేచి ఉండును. పుష్కరిణి వంటి నిర్మలము ఆలయము వంటి మనోహర గృహము సిద్దమై ఉండును.
11. అశ్వదాతకు సుందర వాహనము లభించును. అతని కొరకు అలంకృత రథము, సిద్ధముగ ఉండును. యుద్ధములందు దేవతలు దాతలను రక్షింతురు. యుద్దములందు దాతలకు విజయము కలుగుచున్నది.





