Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam
ఆలోచనామృతము
1. ధనమదాంధులు, ధనహీనులపై జరుపు దౌర్జన్యములకు ఘోషయాత్ర, సైంధవ గర్వభంగము ఉదాహరణలు. మదాంధత చేత దుర్యోధనుడు, కామాంధత చేత సైంధవుడు పాండవులను అవమానించ దలచినారు. ఆ ఇరువురకు పాండవులు చేసిన అపకారము లేశమాత్రము లేదు, మనము అపకారము చేయలేదు కాబట్టి ఇతరులు మనకు అపకారము చేయరు అనుకొనుట సరికాదు. ఈలోకమున కొందఱు ఇతరులకు అపకారము చేయుటకే పుట్టుదురు. వారి విషయమున జాగ్రత్తపడుట ఎంతయిన అవసరము.
2. సంపద మాత్రము బలముకాదు. అన్నింటికన్న ధర్మ బలము బలమైనది. దానిని మించిన బలము లేదు. రామాయణమున ఒంటరి అయిన శ్రీరాముని మీదకు ఖరదూషణత్రి శిరాదులు ముప్పదివేల మంది దండెత్తి వచ్చినారు. 'ఏకోరామః ధర్మాత్మా' ముప్పదివేల మందిని ఓడించినాడు. ధర్మాత్ముడయిన శ్రీరాముడు గెలిచినాడు అన్నాడు వాల్మీకి.
పాండవులది శ్రీరామునకువలె ధర్మబలము. వారు ధర్మబలమున దుర్యోధనుని, సైంధవుని ఓడించి, అవమానించి పంపినారు.
3. సైంధవ గర్వభంగపు కథ సరిగా రామాయణమునందలి సీతాపహరణ కథవలె ఉన్నది. అక్కడ సీత ఒంటరి, ఇక్కడ ద్రౌపది ఒంటరి. అక్కడ రావణుడు వచ్చినాడు, ఇక్కడ సైంధవుడు వచ్చినాడు. అక్కడ సీత, ఇక్కడ ద్రౌపది తమ భర్తల పరాక్రమమును గురించి వివరించినారు. అక్కడ రావణుడు సీతను, ఇక్కడ సైంధవుడు ద్రౌపదిని ఎత్తుకొని పోయినారు. అక్కడ జటాయువు, ఇక్కడ ధౌమ్యుడు అడ్డుపడ దలచినారు. అక్కడ రామలక్ష్మణులు తిరిగివచ్చి చూచిన ఆశ్రమము రిక్తముగా ఉన్నది, ఇచట పాండవులు తిరిగివచ్చి చూచిన ఆశ్రమము రిక్తముగా ఉన్నది.
4. ఇది రామాయణ కథను అనుసరించి చెప్పినట్లు స్పష్టమగుచున్నది. కాని ఇది రామాయణ కథవలె పటిష్ఠముగా లేదు.
i) అక్కడ సీతారామలక్ష్మణులు తప్ప ఆశ్రమమున మరెవ్వరు లేరు. ఇక్కడ బ్రాహ్మణులు, మునులు అనేకమంది పాండవుల వెంట ఉన్నట్లు చెప్పబడినది.
ii) రామలక్ష్మణులు సీతను ఒంటరిగా విడిచి వెళ్లుటకు ఒక కారణమున్నది. ఇక్కడ ద్రౌపదిని ఒంటరిగా వదలి అయిదుగురు అడవులకు వెళ్లుటకు కారణము కనిపించదు.
iii) రావణునివలె సైంధవుడు ఒంటరిగా రాలేదు. చతురంగ బలములతో వచ్చినాడు. అయినను కామ్యక వనమందలి మునులు, ఋషులు ఆమెను కాపాడలేక పోయినారు.
iv) ధౌమ్యుడు జటాయువు వంటివాడు కాదు, పాండవులు అతనికి ద్రౌపదిని అప్పగించి వెళ్లినారు. అయినను సైంధవుని ఎత్తుకొని పోవువరకు ఆ పరిసరముల కనిపించడు.
5. రామాయణము వంటి కథ చెప్పుటకు ప్రయత్నము జరిగినది. ఆ తరువాత మార్కండేయుడు రాముని కథ చెప్పుటకు ఇది పూర్వరంగముగా కనిపించుచున్నది.
6. ధర్మరాజు సైంధవుని ప్రాణముతో వదలినాడు. అంతమాత్రమున సైంధవుని పగ అణగలేదు. అది పెరిగినది. పగవానిని ప్రాణములతో వదిలి తనకే ముప్పుతెచ్చుకున్న ఉదాహరణలు భారత చరిత్రలో కోకొల్లలు. గజనీ, గోరీలను మనవారు క్షమించి వదిలినారు. పరిణామముగా భారత దేశమున పరాయి పాలన ప్రాప్తించినది. క్షమించుట మన సంస్కృతివలె కనిపించుచున్నది. మనది భారత సంస్కృతి, ఇది ధర్మరాజు సంస్కృతి.
7. రాజులకు స్త్రీల విషయమున వావి వరసలు లేవన్నాడు సైంధవుడు. ఇదేమాట ఇంద్రలోకమున ఊర్వశి అర్జునునితో అన్నది. సైంధవుడు చెప్పినది సింధుదేశపు ఆచారము కావచ్చును. ఏ రాజ్యపు ఆచారము అయినను ఇది పైశాచికము. రాచరిక బలముముందు ఆడది లొంగవలెననుట అమానుషము, రాక్షసము.
సావిత్రి కథ
"మహాత్మా! భర్తయందలి భక్తి విశేషముచేత సర్వలోకములను జయించి శుభములను పొందిన పతివ్రత చరిత్రమును వినగోరెదను. అట్టి పతివ్రతామతల్లి చరిత్రను తెలుపువలెను" అని మార్కండేయ మహర్షిని ధర్మరాజు అడిగినాడు.
మార్కండేయుడు సావిత్రి చరిత్రమును చెప్పినాడు.
పూర్వము ఆశ్వపతి అను రాజు మద్ర దేశమును పాలించినాడు. అతడు పుత్ర సంతానము కొఱకు పదునెనిమిది సంవత్సరములు సావిత్రీదేవిని ఉపాసించినాడు. సావిత్రీదేవి ప్రత్యక్షమయి అశ్వపతికి ఒక పుత్రికను ప్రసాదించినది. తనకు పుత్రుడు కావలెనని అశ్వపతి పట్టుపట్టినాడు. "నీకు కలుగనున్న పుత్రిక కారణముగా మరొక విధమున నీకు నూరుగురు పుత్రులు కలుగుదురు" అని చెప్పి అంతర్థానమయినది.
అశ్వపతి భార్య మాళవతికి ఒక కూతురు కలిగినది. ఆమెకు సావిత్రి అని నామకరణము చేసినారు. సావిత్రి బాల్యము గడిచి యౌవనమున ప్రవేశించినది. ఆమె సాళ్వ దేశపు రాజయిన ద్యుమత్సేనుని పుత్రుడు సత్యవంతుని వరించినది.
అశ్వపతి సావిత్రి కొఱకు వరుని అన్వేషించసాగినాడు. ఒకనాడు నారదుడు అక్కడికి వచ్చినాడు. సావిత్రికి కావలసిన వరుని ప్రస్తావన వచ్చినది. అశ్వపతి సావిత్రిని పిలిపించినాడు. ఆమె వచ్చినది. "అమ్మా! నీకు తగిన వరుని నీవు నిశ్చయించుకొనుము. నీవు వరించిన వానికి ఇచ్చి సంతోషముగా వివాహము చేతును" అన్నాడు. సావిత్రి సిగ్గుతో తలవంచుకున్నది. తుదకు అన్నది "తండ్రీ! నేను సత్యవంతుని వరించినాను. అతడు సాళ్వదేశపు రాజగు ద్యుమత్సేనుని పుత్రుడు".
అశ్వపతి సత్యవంతుని గురించి వివరించవలసినదని నారదుని అడిగినాడు. నారదుడు చెప్పినాడు:- "మహారాజా! సత్యము చెప్పుట వలన అతనికి సత్యవంతుడు అను పేరు వచ్చినది. అతని పేరు చిత్రాశ్వుడు. రూప గుణశీలములందు ఉత్తముడు. కాని అతనికి ఒక కీడు కలదు. వివాహము అయినది మొదలు ఒక సంవత్సరమునకు అతను మరణించును. అతని తండ్రి ద్యుమత్సేనుని రాజ్యమును శత్రువులు హరించినారు. అతడు అంధుడయి అడవులందు ఉన్నాడు".
నారదుని మాటలు విని అశ్వపతి బాధపడినాడు. "అమ్మా! నారదునకు దేవ రహస్యములు తెలియును. అతని మాట తప్పదు. ఆయుష్యములేని సత్యవంతుని చేసుకొని ఏమి సుఖింతువు? మరొక వరుని వెదకి కొనుము" అన్నాడు.
"తండ్రీ! మనసు, మాట, దేహము మూడింటిలో మనసు ప్రధానమయినది. కావున మనసున వరించిన భర్తను విడువరాదు. సత్యవంతుడు ఎటువంటివాడయినను అతనినే వరింతును కాని మరొకరిని పెళ్లాడను" అని తన దృఢ నిశ్చయమును సావిత్రి వెల్లడించినది.
అశ్వపతి నారదుని చూచినాడు. "రాజా! నారదుడు వివరించినాడు సావిత్రి మహా గుణవంతురాలు. ఈమె నిశ్చయము మాన్పుట మనకు శక్యముకాదు. అనుమానము మానుము. ఈమెను సత్యవంతునకు ఇచ్చి పెండ్లి చేయుము. సావిత్రి పుణ్యాధిక్యత వలన సత్యవంతుడు దీర్ఘాయుష్మంతుడు కావచ్చును". ఆ మాటలు చెప్పి నారదుడు వెళ్లిపోయినాడు.





