Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 2
3.ఇంద్రునిది సుందరగతి. ఆ నడకతోనే అతడు యుద్ధభూమికి చేరును. అతడు దిగ్విజయముగ శతద్వార సహ్త్రు పురం నుంచి ధనము తెచ్చును. ఇంద్రియ పరాయణులగు దురాత్ములను - తన తేజస్సున పరాజితులను చేయును.
4. ఇంద్రుడు మేఘముల వైపు సాగును. మేఘములందు సంచరించును. భూమి మీద బహుజలమును వర్షించును. ఆ జలము చిన్న చిన్న పాయలై, అవి ఏకమై వేగముగ ప్రవహించును. ఆ ప్రవాహమునకు పాదములు లేవు - రథము లేదు.
5. అర్ధించకనే ఇంద్రుడు కోరికలు తీర్చును. అతడు ప్రకాంఢుడు. దుర్నామము అతనిని చేరదు. అతడు రుద్ర పుత్ర మరుత్తుల యుక్తముగ విచ్చేయునుగాత.
నేను నమ్రుడను. నా తలిదండ్రుల బాధలు తీరినవి. ఏలనన నేను శత్రు ధనమును హరించినాను. శత్రువును ఏడిపించినాను.
6. ఇంద్ర దేవుడు కల్లోలఘు లేపు వారిని శాసించినాడు. అతడు మూడు కపాలములు ఆరునేత్రములు గల విశ్వరూపుని హతమార్చినాడు. ఇంద్రుని తేజమున త్రితుడు ఇనుము వంటి గోళ్లతో వరాహమును చీల్చినాడు.
7. ఇంద్రుని భక్తులను శత్రువు యుద్ధమునకు పిలిచినచో ఇంద్రుడు దర్పమున తన దేహము పెంచి వారికి శత్రువును వధించగల ఉత్తమ ఆయుధములను ప్రసాదించును. ఇంద్రుడు నరులకు సర్వోత్తమ నేత యగుచున్నాడు. దస్యుల వధ సమయమున అతడు అనేక శత్రు పురములను ధ్వంసము చేసినాడు.
8. ఇంద్రుడు మేఘపుంజమువలె తృణమయ ధరిత్రి మీద జలము వర్షించుచున్నాడు. అతడు మా నివాసములకు దారి చూపినాడు. అతడు తన సర్వాంగముల నుండి సోమము రాల్చుము. అతడు శ్యేనము వంటి లోహ సదృశత తీక్ష్ణదేహుడు. అతడు దస్యులను వధించువాడు.
9. ఇంద్రుడు తన పరాక్రమ శత్రువులను తన తీక్ష ఆయుధములతో పారద్రోలును. అతడు కుత్యుని స్తోత్రము విన్నాడు. శుషుడు అను అసురుని ఛేదించినాడు. స్తోత, కవి యగు ఉశన విరోధులను వశపరచుకున్నాడు. ఉశనాదులకు దానములు చేసినాడు.
10. మరుత్తులు మానవహితము కోరువారు. ఇంద్రుడు వారితో ధనమంపినాడు. ఇంద్రుడు వరుణుని వంటి తేజోవంతుడు. అందగాడు. బలశాలి. అతని రూపము మనోహరము. అతనిని ఎల్లరు సర్వ రక్షకునిగ భావింతురు. అతడు చతుష్పాద శత్రువును హతమార్చినాడు.
11. ఉశిజపుత్రుడు ఋజిశ్వుడు ఇంద్రుని స్తుతించి పిప్రుని గోష్ఠమును చెదరగొట్టినాడు. ఋజిశ్వుడు సోమము అర్పించి యజ్ఞము చేయగా ఇంద్రుడు శత్రు పురములను ధ్వంసము చేసినాడు.
12. నేను నమ్రుడను. ఇంద్రునకు మరింత హవి సమర్పించ సంకల్పించినాను. కాలినడకన చెరినాను.
ఇంద్రా దేవా! నాకు శుభములు కలిగించుము. అన్నము, బలము, ఉత్తమ గృహాది సమస్తము ప్రసాదించుము.
నూరవ సూక్తము
ఋషి - వందన పుత్ర దువస్యుడు దేవత - విశ్వే దేవతలు
ఛందస్సు - జగతి - 12 త్రిష్టుప్
1. ధనిక ఇంద్రా! నీతో సమానబల శత్రుసేనను సంహరించుము. స్తోత్రమును స్వీకరించుము. సోమము సేవించుము. మమ్ము రక్షింపుము. మా కొరకు ధనమును వర్ధిల్ల చేయుము. అన్యదేవ సహితుడై సవితమా యజ్ఞమును రక్షించునుగాత. మేము సర్వాతీత అదితిని అర్చించుచున్నాము - "సర్వతాతి మదితిం వృణీమహే".
2. వాయువులు యుద్దసన్నద్దులు అయినారు. ఋతు అనుకూల యజ్ఞభాగము వారికి అర్ధించండి. పరిశుద్ధ సోమము సేవించండి. వారు కదలునపుడు శిబ్దింతురు. వారు శుద్ధ దుగ్ధపానమున నిమగ్నులై ఉన్నారు. సర్వతాతి మదితిం వృణీమహే!
3. మా శుభములు ఆశించువాడును, యజమానియగు వానికి సవితాదేవత అన్నము కలిగించునుగాక. ఆ పరిపక్వ అన్నముతో అతడు దేవతలను అర్చించునుగాత. సర్వతాతి మదితిం వృణీమహే!
4. ఇంద్రుడు మా విషయమున నిత్యము ప్రసన్నుడు అగును గాక. మా యజ్ఞ్య సోమరాజు ఉపస్థతుడు అగునుగాత. బంధుమిత్రుల కోరికల ప్రకారము సర్వకార్యములు పరిపూర్ణములు అగునుగాత. "సర్వతాతి మదితిం వృణీమహే"
5. ఇంద్రుడు తన శక్తిచే మా యజ్ఞములను రక్షించును. బృహస్పతి పరమాయువు కలిగించును. యజ్ఞము సూగతి, మతి, రక్షణ, సుఖము అగుచున్నవి. "సర్వతాతి మదితం వృణీమహే".
6. దేవతలకు ఇంద్రుడే బలమగుచున్నాడు. గృహస్థ అగ్ని దేవతలను స్తుతించును . యజ్ఞము చేయును. కార్యములు నిర్వహించును. వారు యజ్ఞములపుడు పూజ్యులగుదురు. రమణీయులగుదురు. ఆత్మీయులు అగుదురు. "సర్వ తాతి మదితం వృణీమహే".
7. వసువులారా! మీ వెనుక మేము ఎట్టి ప్రధాన అపరాధము చేయలేదు. మీ ముందు సహితము దేవతలకు కోపము తెప్పించునట్టి ఎట్టి అకార్యము చేయలేదు. దేవతలారా! మమ్ము నిరాశపరచకండి." "సర్వతాతి మదితం వృణీమహే".
8. ఎచట మధుసను సోమరసము అర్పించబడునో - ఎచట అభిషవ ప్రస్తరము స్తుతించ బడునో అచటి వ్యాధులను సవితా దేవత తొలగించుచున్నాడు. పర్వతములు అనర్థమును దూరము చేయుచున్నవి. "సర్వతాతి మదితం వృణీమహే".
9. వసువులారా! సోమము సిద్దము చేయు ప్రస్తరమునకు ఉన్నతి కలుగును గాక. అప్పటి వరకు మీరు శత్రువులను దూరము చేయండి. సవిత రక్షకుడు. అతనిని సుత్తించవలె. "సర్వతాతి మదితం వృణీమహే".
10. గోవులారా! మీరు పచ్చిక బయళ్లలో సంచరించండి. బలము కలగండి. యజ్ఞములందు మీరు పాత్ర నిండుగ పాలు ఇస్తున్నారు. మీ పాలు సోమరస సమములు. "సర్వతాతి మదితం వృణీమహే".
11. ఇంద్రుడు యజ్ఞమును పూర్తి చేయించును. సర్వులను జరాముక్తులను చేయును. అతడు యువకులను, సోమ యజ్ఞ కర్తను రక్షించును. ఉత్తమ స్తోతకు అనుకూలుడనును. "సర్వతాతి మదితం వృణీమహే".
12. ఇంద్రదేవా! నీ కాంతులు ఆశ్చర్యకరములు. అవి ప్రకాశ పూర్ణములు, వానిని అర్చించ వలెను. నీ దుర్దర్షకార్యములు స్తోతల కోరికలు తీర్చును. అందుకే ద్యువస్యుడు త్రాటితో గోవు ఆగ్రభామును సులభముగ గుంజుచున్నాడు.
నూట ఒకటవ సూక్తము
ఋషి - సోమ పృత్రబుధుడు - దేవత - విశ్వేదేవతలు
ఛందస్సు 9, 11 జగతి, 4,6, గాయత్రి, 5, బృహతి మిగిలినవి త్రిష్టుప్
1. మిత్రులగు ఋత్విక్కులారా ! ఏకమనస్కులై జాగృతులు కండి. అనేకులు ఏకస్థాన వాసులై అగ్నిని ప్రజ్వలితుని చేయండి. నన్ను రక్షించమని రధిక్రుని, ఉషస్సును, అగ్నిని, ఇంద్రుని ఆహ్వానించుచున్నారు.
2. మిత్రులారా! బలకరసుతులు చేయండి. సేద్యమును విస్తరించండి. నాగలివంటిదగు దరిచేర్చు నావను సిద్దము చేయండి. నాగటి కర్రును పదును చేయండి. ఉత్తమ యజ్ఞమును అనుష్ఠించండి.
3. ఋత్విక్కులారా! నాగలి సిద్ధము చేయండి. కాడివి కట్టండి. ఈ కనిపించు క్షేత్రమున గింజలు నాటండి. మా స్తుతుల వలన అన్నము సమృద్ధమగునుగాత. ధాన్యపు కంకులు పండి రాలును గాక.
4. నాగలితో దున్నుచున్నారు. కాడిని వేరు చేయుచున్నారు. మేధావులు మధుర స్తుతి గానము చేయుచున్నారు.
5. పశువుల కొరకు నీటిపట్టు ఏర్పరచండి. పగ్గములను సిద్దపరచుకొండి. అక్షయమగు నీటి వనరును ఏర్పరచి పారుదల చేయండి.
6. పశువులకు నీటిపట్టు ఏర్పడినది. పగ్గములు నీటిలో నానుచున్నవి. అక్షయమగు నీటి వనరు ఏర్పడినది. దీనితో నీటిని పారించండి.
7. గుర్రములను లేక ఎద్దులను సిద్ధము చేయండి. పొలములోని ధాన్యము కూర్చండి. ధాన్యమును మెల్లగ బండికి ఎక్కించండి.
పశువుల కొరకు ఏర్పరచిన నీటితొట్టి ద్రోణమగుచున్నది. దానికి రాత్రి చక్రము ఏర్పరచనైనది. నరులు నీరు త్రాగు బావి వంటి దానిని ఆ నీటితో నింపండి.
8. గోష్ఠమును సిద్ధపరచండి. అదియే మనుషులు త్రాగు నీటిగ ఉపయోగపడును. దాని దరులు గట్టి పరచండి. ఇనుప బొక్కెనను సిద్ధముచేసి, చేద త్రాటిని గట్టి పరచండి. నీరు వలికిపోకుండ చూడండి.
9. దేవతలారా! ఋత్విక్కులారా! మేము మీ ధ్యానము కోరుచున్నాము. మమ్ము రక్షించండి. మీ ధ్యానము యజ్ఞోపయోగమగును. అదియే మీకు యజ్ఞభాగము ఇచ్చును.
10. చెక్కపాత్రలో ఉంచిన హరిత వర్ణ సోమమును తడపండి. రాతి పాత్రను సిద్దపరచండి. పది అంగుళులతో పాత్రను అందుకోండి. పశువును రథమునకు దానిని ఎక్కించండి.
11. రథపు రెండు ఇరుసులు ధ్వనులు చేయుచు రథమును లాగు పశువులు - ఇద్దరు యువతులతో సరసమాడిన రీతి సాగును. బండిని కర్ర ఆధారముగా నిలిపి ఉంచండి. అది పడరాదు.
12. కర్మధ్యక్షులారా! ఇంద్రుడు సుఖప్రదాత. అతనికి సుఖకర సోమము సమర్పించండి. అతనిని అర్దించండి. ఇంద్రుడు అదితి పుత్రుడు. మీకు బాధల భయము ఉన్నది. కావున రక్షణలకు ఇంద్రుని పిలువండి. అతడు సోమపానము చేయునుగాత.
నూట రెండవ సూక్తము
ఋషి- ముద్గలుడు, దేవత - ఇంద్రుడు, ఛందస్సు 1-3 బృహతి - మిగిలినవి త్రిష్టుప్
1. ముద్గలా! యుద్దమున నీ రథము నిస్సహాయము అయినపుడు దుర్దర్ష ఇంద్రుడు నీకు సాయపడునుగాత.
ఇంద్రా ! ఇది ప్రసిద్ధ యుద్ధము. ధనార్జన సమయమున మమ్ము రక్షింపుము.
2. ముద్గల పత్ని ముద్గలిని రథము అధిరోహించినది. వేయి గోవులను గెలిచినది. అప్పుడు ఆమె వస్త్రమును వాయువు రెపరెపలాడించినది. గోవులను జయించినపుడు ముద్గలిని రథిక అయినది. ఇంద్రసేన వంటి ముద్గలిని శత్రువుల నుండి గోవులను విడిపించినది.
ఒకనారి యుద్దము చేయుటను జయించుటను వేదము ప్రస్తుతించుచున్నది.
3. అరిష్ట దాయకులు, దాడికి సిద్దమైన శత్రువు మీదకు వజ్రము విసరుము. ఆర్యులైనను దస్యులైనను శత్రువును దారుణమున వధించుము.
4. అది వృషభము. మహానందమున నీరు త్రావినది. కొమ్ములతో మట్టిని చిమ్ముచు శత్రువు మీదకు దండెత్తుచున్నది. దాని అండకోశము పోడవైనది. అది ఆహారము కోరి, కొమ్ములకు పదనుపెట్టి వేగముగ వచ్చుచున్నది.
5. మనుష్యులు వృషభమును చేరినారు. దానిని గర్జింపచేసినారు. యుద్దమధ్యమున మూత్రింపచేసినారు. అందు వలన ముద్గలుడు ఆహారపటుత్వము గల వందలవేల గోవులను జయించినాడు.
6. శత్రుహింసకు వృషభమును సిద్ధము చేసినారు. దాని పగ్గము పట్టిన సారధి ముద్గలిని గర్జించినది. వృషభము రథమునకు కట్టిసాగినది. ముద్గలిని రథము తోలినది. దాని వెంట సేనలు పరుగులు తీసినవి.
7. ముద్గలుడు విద్వాంసుడు. అతడు రథమును కట్టిపెట్టినాడు. అతి సాహసముగ వృషభమును రథమునకు కట్టినాడు. వృషభము అతి వేగముగ పరుగులు పెట్టినది. ఇంద్రుడు గోపతియగు వృషభమును రక్షించినాడు.
8.ముద్గలుడు చర్మపు త్రాళ్లతో రథమును కట్టినాడు. కొరడా ఏర్పరచినాడు. వృషభము అటునిటు నడిపించినాడు. అనేకానేక గోవులను ఇంటికి చేర్చినాడు. అనేకుల ధనమును ఉద్దరించినాడు.
9. యుద్ధక్షేత్రమునకాడిపడి ఉన్నది. అది ఆ వృషభము వెంట ఉండినది. ఆ విధముగ ముద్గలుడు వేల ఆవులను గెలిచినాడు.
10. దూరమునగాని, దగ్గరగాని ఎవడైన ఇట్టిది వినియున్నాడా? రథమునకు కట్టబడినదే రథము మీద నిలిచి నడుపుచున్నది! దానికి గడ్డి నీరు అక్కరలేదు. అయినను రథమును లాగును, స్వామికి విజయము కలిగించును.
11. భర్త విడిచిన భార్యవలె ముద్గలిని తన శక్తిని ప్రదర్శించి భర్త ధనమును గుంజుకున్నది. ఆమె మేఘము వర్షించినట్లు శరములు వర్షించినది. అట్టి సారధి వలన మాకు జయము కలుగునుగాత, అన్నాదులు లభించునుగాత.
12. ఇంద్రా! నీవు సకల లోకములకు నేత్రరూపమవు. కన్నులు గలవారికి కూడ నీవే నేత్రమవు. రెండు అశ్వములను ఒకే త్రాటితో కట్టి నడిపింతువు. ధనము కలిగింతువు.
నూట మూడవ సూక్తము
ఋషి - ఇంద్రపుత్ర అస్రతిరథుడు, దేవతలు, బృహస్పతి, ఇంద్రుడు,
ఛందస్సు, త్రిష్టుప్, 13 అనుష్టుప్
1. ఇంద్రుడు సర్వవ్యాపి. పొగరుబోతు ఆబోతు వంటి భయంకరుడు. శత్రుహంత, మానవులను చలింపచేయువాడు. వడకించువాడు. శత్రువును ఏడిపించును. అతడు నలువైపుల దృష్టి సారించువాడు. మహా, విశాల సేనను ఓడించినవాడు.
2. యోద్ధలగు మానవులారా! ఇంద్రుని సాయమున విజయలు కండి. శత్రువును ఓడించండి. ఇంద్రుడు నలువైపుల దృష్టి ఉంచువాడు. పగవారిని ఏడిపించువాడు. అతడు యుద్ధవిజేత.ఎంతటివాడును వారిని కదిలించజాలడు. అతని చేత శరము ఉన్నది. దుర్ధక్షుడు అతడు దుగ్ధర్షుడు వర్షము కలిగించువాడు.
3. ఇంద్రుని వెంట బాణ తూణీరముల వారు ఉందురు. అతడు అందరను వశరపచు కొనును. యుద్ధములందు అతడు నిరాట శత్రువుతో సమరము జరుపును. అతని ముందునకు వెళ్లిన వారిని జయిఅమ్చును. అతడు నిరాట శత్రువుతో సమరము జరుపును. అతని ముందునకు వెళ్లిన వారిని జయించును. అతడు సోమపాయి. అతని భుజబలము విలక్షణము. అతని ధనువు భయంకరము. ఆ ధనుస్సు నుండియే బాణము విడిచి అతడు శత్రువును రాల్చును.
4. బృహస్పతీ! రక్కిసులను వధించును. శత్రువును బాధించుము. రథముతో విచ్చేయుము. శత్రుసేనను ధ్వంసము చేయుము. శత్రుయోధులను పడగొట్టుము. విజయుడ వగుము. మా రథములను రక్షింపుము.
5. ఇంద్రా! నీవు శత్రుబలజ్ఞాతవు, అనంతకాల ప్రాచీనుడవు. ఉత్కృష్ట వీరుడవు. తేజస్వివి, వేగవంతుడవు. భయంకరుడవు. విపక్ష విజయవి. వీరులకు, ప్రాణులకు అభిముఖముగ సాగువాడవు! నీవు శక్తికి పుత్రరూపుడవు. గోవులను జయించుటకు జయశీల రథమును అధిరోహింపుము.





