Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam



    పాండవులు అయిదుగురు డేగలవలె సైంధవ సైన్యములోనికి చొచ్చుకొని పోయినారు. పాండవుల విజృంభణను ఎదిరించి సైంధవ సైనికులు పోరాడినారు. కాని పాండవ ప్రతాపాగ్నిముందు నిలువలేక పోయినారు. చచ్చి కూలినారు. యుద్ధభూమి సాంతము పీనుగుల పెంట అయినది. నరకబడిన తలలు, మొండెములు, కాళ్లు చేతులు రాసులుగా పడినవి. విరిగిన రథములు టెక్కెములు, కత్తులు, బాణములు చెల్లాచెదరయి పడినవి. రక్తము నదులుగా ప్రవహించినది. యుద్ధ భూమి సాంతము బురద అయినది.
    పాండవుల ప్రతాపాగ్నికి సైంధవ సైన్యము సాంతము కాలి, బూడిద అయి కూలినది. సైంధవుడు అది చూచినాడు. ద్రౌపదిని రథము నుంచి కిందికి దించినాడు. రథమును తోలుకొని పారిపోయినాడు.
    అది చూచిన ధౌమ్యుడు ద్రౌపది వద్దకు వచ్చినాడు. ధర్మరాజు, పాండవులు అక్కడికి చేరినారు. ధర్మరాజును చూచి భీముడు అన్నాడు:-
    "అన్నా! నీవు నకుల సహదేవులను, ధౌమ్యుని, ద్రౌపదిని వెంట పెట్టుకొని ఆశ్రమమునకు వెళ్లుము. నేను అర్జునుడు సైంధవుని తరుముకొని వెళ్లి, వాడు పాతాళమున దూరినను, ఆకాశమున దాగినను. వానిని వధించి వత్తుము".
    "భీమా!" ధర్మరాజు అన్నాడు. "సైంధవుడు మన చెల్లెలగు దుస్సలకు భర్త, వానిని చంపిన గాంధారికి తీరని దుఃఖము కలుగును. కావున సైంధవుని చంపరాదు".
    "భీమార్జునులారా!" ద్రౌపది గర్జించినది. "సైంధవుడు నీచుడు, దుష్టుడు, క్రూరుడు, పాపాత్ముడు, వాని విషయమున మీరు దయదలచరాదు. వానిని చంపి నాకు సంతోషము సమకూర్చవలెను".
    ధర్మరాజు, నకుల సహదేవులు, ధౌమ్యుడు, ద్రౌపది ఆశ్రమమునకు వెళ్లినారు. భీమార్జునులు రథములపై సైంధవుని వెన్నాడినారు. త్వరలోనే సైంధవుని రథము కనిపించినది. అర్జునుడు బాణములు వేసి సైంధవుని రథము కనిపించినది. అర్జునుడు బాణములు వేసి సైంధవుని రథపు గుఱ్ఱములను చంపినాడు. సైంధవుడు రథము దిగి పారిపోసాగినాడు. అప్పుడు సైంధవుని ముఖమున రక్తపుబొట్టులేదు. ముఖము తెల్లబారినది. ఒళ్లంత చెమటలు కారినవి. పెద్ద పెద్ద నిట్టూర్పులు విడిచినాడు.
    భీమార్జునులు రథములను నిలిపినారు. దుమికి సైంధవుని వైపునకు ఉరికినారు. సైంధవుడు వారిని చూచినాడు. పొదలో దూరినాడు. దాగినాడు. భీముడు అది చూచినాడు. రోషమున పెదవులు కొఱుకుచు, భీముడు పొదలో దూరి సైంధవుని జుట్టుపట్టుకొని బయటికి ఈడ్చి తెచ్చినాడు. భీముని పట్టు విడిపించుకొనుటకు సైంధవుడు పెనుగులాడినాడు. భీముడు సైంధవుని ఈడ్చి నేలమీద పడవేసినాడు. మెడతొక్కిపట్టినాడు. ముఖము మీద పిడికిటిచేత పొడిచినాడు. ఆ పోటునకు సైంధవుని ముక్కులోనుంచి సొడ సొడ నెత్తురు కారినది. సైంధవుని ఒడలంత పిండిచేసి పైకెత్తి గిరగిర తిప్పి సైంధవుని నేలమీద పడవేసినాడు. ఆ దెబ్బలకు సైంధవుడు స్పృహతప్పి పడిపోయినాడు.
    అర్జునుడు సైంధవుని స్థితి చూచినాడు. భీముని పరాక్రమము పరికించినాడు. "అన్నా! చాలును, సైంధవుడు స్పృహతప్పినాడు. ధర్మరాజు చెప్పిన మాట వినుము. సైంధవుని ప్రాణములతో విడువుము" అన్నాడు.
    "అర్జునా! ధర్మరాజు సర్వదా కరుణ కలిగి ఉండునేగాని కార్యము ఎరుగడు. నీవును అతనివలె పనికిమాలిన వానివి అయితివి. దుర్మార్గుడు సైంధవుని ఎట్లువదలవచ్చును" అని కత్తివంటి ఒక బాణము తీసుకొని  సైంధవుని నెత్తిగొరిగినాడు. నలుగురు చూచి నవ్వునట్లు నెత్తిమీద అయిదు పిలకలు వదలినాడు.
    "ఓరీ! సైంధవుడా" భీముడు అన్నాడు. "నీవు బ్రతుకదలచిన ఎడల ఈ దినము మొదలు సకల సభలయందును పాండవదాసుడనని చెప్పుకొనుము. అట్లుకాకున్న ప్రాణముతీతును" అని అరచినాడు.
    సైంధవుడు భీముని చూచినాడు. తన పాలిట యమునివలె కనిపించినాడు. సైంధవుడు గడగడలాడినాడు. పాండవదాసుడనని చెప్పుకొనుటకు సమ్మతించినాడు. చెప్పినాడు. చెంపలు వేసుకున్నాడు.
    పిరికి సైంధవుని చూచి భీమార్జునులు వికటముగా నవ్వినారు. పెడరెక్కలు విరిచి కట్టినారు. ఆశ్రమమునకు తీసుకొని వెళ్లినారు. ధర్మరాజు కాళ్లముందు పడవేసి
    "వీడె పాండవ దాసుండనిన నతండట్లేని విడువుండనియె బాం చాలియు జయద్రధ్రుంజూచి నవ్వుచు నిప్పాపాత్ముండు భవదీయ దాసుండయ్యెం గావున వీనిం బోవిడువుండని విడిపించె నాసైంధవుడును ధర్మరాజునకు దత్సభాగతులైన మునులకు మ్రొక్కిన నజాత శత్రుండిట్లనియె:-
        ఎట్టి కష్టుడైన నిట్టిపాపము సేయ
        నెత్తికొనునె ధరిణి నీవు దక్క
        నరుగుమింక నేమి యందుము నిన్ను నిం
        ద్రియ విలోలు నల్పు ధృతివిహీను
    ఇంక నెవ్వారికి నిట్టి కొఱగాములు సేయక బుద్ధిమంతుండవయి యుండు మనిన నతండు లజ్జావనత వదనుండగుచు నచ్చోటువాసి".
    సైంధవుడు గంగా ద్వారమునకు వెళ్లినాడు. శివుని గూర్చి ఘోరమయిన తపస్సు చేసినాడు. శివుడు ప్రత్యక్షము అయినాడు. పాండవులు అయిదుగురిని యుద్ధమున ఓడించునట్లు వరము ప్రసాదించవలసినదని కోరినాడు. "పాండవులను ఓడించుట దేవేంద్రాదులకయినను సాధ్యపడదు. అర్జునుని తప్ప మిగిలిన నలుగురు పాండవులను ఒకనాటి యుద్ధమున నీవు గెలువగలవు" అని శివుడు వరమును ప్రసాదించినాడు. ఆ వరమును అందుకొని సైంధవుడు తన దేశమునకు చేరుకున్నాడు.
    పాండవులు కామ్యక వనమున ఉండగా మార్కండేయ మహర్షి వారి దగ్గరికి వచ్చినాడు. పాండవులు ఆ మహర్షికి స్వాగతము పలికి అతనిని సత్కరించినారు. అప్పుడు ధర్మరాజు మార్కండేయుని అడిగినాడు:-
    "మహాత్మా! సైంధవుడు ద్రౌపదిని అపహరించుకొని పోయినాడు. అతనిని అవమానపరచి ద్రౌపదిని విడిపించుటకు నానా కష్టములు పడినాము. మీదయవలన ధైర్యమును, ధర్మబుద్ధిని కలిగి ఉన్నాము. అట్టి మాకు రాజభోగములు నశించినవి. వనవాసము ప్రాప్తించినది. దైవము వలన కలిగిన దుఃఖమును తప్పించుకొనుట సాధ్యముకాదని తలచెదను. ఏకాలమందయినను ద్రౌపదివలె కష్టపడిన స్త్రీయు, నావలె ఇడుముల పాలయిన రాజును కలరేమో చెప్పుడు".    
    "ధర్మరాజా!" మార్కండేయుడు శలవిచ్చినాడు. "పూర్వము రఘురాముడు అడవులలో అనేక దుఃఖములు అనుభవించినాడు. సీతను రావణుడు ఎత్తుకొని పోయి లంకకు చేర్చినాడు. అప్పుడు శ్రీరాముడు వానరుల సాయమున సముద్రమునకు వారధి కట్టినాడు. వారధి మీద సముద్రము దాటి లంకకు చేరినాడు. శ్రీరాముడు రావణుని వధించినాడు. సీతను విడిపించినాడు. అయోధ్యకు వెళ్లి పట్టము కట్టుకొని రాజ్యము ఏలినాడు. ద్రౌపది వలె సీత, నీవలె శ్రీరాముడు వనవాస దుఃఖములను అనుభవించినారు. తుదకు విజయము సాధించినారు. కావున దుఃఖించకుము. నీకును విజయము ప్రాప్తించనున్నది".




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.