Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 2



                                      తొంబది ఆరవ సూక్తము
            ఋషి - అంగిరస వరుదు లేదా ఇంద్రపుత్రుడు సర్వహరి దేవత -
                     హర్యశ్వములు ఛందస్సు - జగతి 12, 13 త్రిష్టుప్

    1. ఇంద్రా! ఈ మహాయజ్ఞమున నీ అశ్వద్వయమును నేను స్తుతించినాను. నీవు శత్రుహింసకుడవు మంచి మత్తులోనికి జారుమని ప్రార్థించు చున్నాను. హరితవర్ణ అశ్వముల్పి విచ్చేయుము. ఘృతము వంటి మంచి జలమును కురిపించుము. నీవు ఎంతో శుభ్రమైనవాడవు. నా స్తోత్రములు నీ వద్దకు చేరవలెను.

    2. స్తోతలారా ! మీరు ఇంద్రుని యజ్ఞమునకు పిలిచినారు. ఇంద్రుని అశ్వద్వయమును యజ్ఞ గృహమునకు తెచ్చినారు. అశ్వములతో కూడ ఇంద్రుని బలవీర్యములను స్తుతించండి. గోవులు పాలిచ్చి జనులను సంతృప్తులను చేయును కదా! అట్లే ఇంద్రునకు హరితవర్ణ సోమరసమిచ్చి సంతృప్తుని చేయండి.

    3. ఇంద్రుని వజ్రము లోహ నిర్మితము. హరిత వర్ణము - సుందరము. అది రెండు చేతులందు పట్టునది. శత్రునాశకము. ఇంద్రుడు ధనికుడు. చక్కని దవడలవాడు. కోపము కలిగి బాణము వదలి శత్రువుని సంహరించును. హరిత వర్ణ సోమరసమున ఇంద్రుని అభిషిక్తుని చేయనైనది.

    4. వజ్రము ఆకాశమున సూర్యుని వలె వెలుగుచున్నది. తన వేగమున సకలదిశలందు వ్యాపించినది. ఇంద్రుడు చక్కగా లోహమయ వజ్రమున వత్రుని వధించినాడు. అపారదీప్తిని ఆర్జించినాడు.

    5. హరిత కేశ ఇంద్రా! పూర్వపు యజమానులు నిన్ను స్తుతించిరి. సర్వప్రకారములగు నీ అన్నములు ప్రశంసనీయములు నిరుపమములు ఉజ్వలములు.

    6. స్తుత్యుడు, వజ్రధరుడగు ఇంద్రుడు సోమరసపానపు ఆనందడోలికలందు తేలియాడు నపుడు సుందరములగు అతని అశ్వములు రథమునకు జతయై కొనిపోవును. ఇంద్రుని కొరకు అనేక పర్యాయములుసోమము అభిషవింపబడును.

    7. ఇంద్రుడు చలించనివాడు. అతని కొరకు వలసినంత సోమము ఉంచబడినది. ఈ సోమమే ఇంద్రుని అశ్వములను యజ్ఞమువైపు వేగముగా నడిపించును. హరిత అశ్వములు యుద్ధములకు తీసికొను వెళ్లు రథమే ఈ సోమయజ్ఞమునకు చేరినది.

    8. ఇంద్రుని గడ్డము, మీసములు, ఉజ్వలములు. అవి ఇనుమువలె గట్టివి. వాటికి సోమము అందును. అవి సోమపానము చేసి బలిసిపోవును. వాటి సంపద యజ్ఞమే అగును. అశ్వములు వానిని యజ్ఞములకు తెచ్చును. అవి గుర్రపుజంటనెక్కి సకల దుర్గతలను దూరము చేయును.

    9. ఇంద్రుని అశ్వములు ఉజ్వలమై యజ్ఞమున స్రువము వంటివి అయినవి. అవి తినుటకు గాను వాటి దవడలను కదిలించును. చమసమందున్న కమనీయ సోమరసపానము చేసినవి. తమదేహములను పెంచుకున్నవి.

    10. సుందర ఇంద్రుని నివాసము ద్యావాపృథ్వులగును. అతడు రథమునెక్కును. గుర్రపువంటి మహావేగమున సాగును. యుద్ధములకు పోవును. ఎంతో గొప్పస్తుతులు అతనిని ప్రశంసించును. ఇంద్రా! నీవు స్వయంశక్తిచే విశేష అన్నము లిచ్చువాడవు.

    11. ఇంద్రా ! నీవు మహిమాన్వితుడవు. ద్యావా పృథ్వులకు వ్యాప్తి కలిగించినావు. నిత్యము నూతన స్తవములను అందుకొందువు. బలశాలివి. జలగ్రహణ కర్త సూర్యుడు. అతని వద్దకు గోవులను చేర్చుము.

    12. ఇంద్రా ! రథమునకు అశ్వములను పూన్చుము. మానవ యజ్ఞములకు తరలుము. నీ కొరకు మధుర సోమరసము సిద్ధమై యున్నది. సేవింపుము. సోమము పది అంగుళుల పని వలన సిద్ధము అయినది. అది యజ్ఞ ఉపకరణము అయినది. యుద్ధ సమయములందు అట్టి సోమపానమునకు పూనుకొనుము.

    13. అశ్వవంత ఇంద్రా ! ఉదయ సవనమున సోమము అర్పించబడినది. నీవు దానిని సేవించినావు. ఇది మధ్యాహ్న సవన సోమము. నీకు మాత్రమే అందించబడినది. దానిని ఆస్వాదించుము. వర్షకారి ఇంద్రా ! సోమముతో ఉదరము తడుపుకొనుము.

                                  తొంబది ఏడవ సూక్తము
                                           ఓషధీ సూక్తము
          ఋషి - అథర్వపుత్రభిషక్కు దేవత - ఓషధి ఛందస్సు - అనుష్టుప్

    1. పూర్వము మూడు యుగముల క్రితము ప్రాచీన దేవతలు ఓషధులు సృష్టించినారు. అవి పింగళ వర్ణపువి. నూట ఏడు స్థానాలలో లభించునవి. అట్లని నేను ఎరుంగుదును.

    2. మాతృరూప ఓషధులారా ! మీ రూపములు అసంఖ్యాకములు. మీ నిలయములు అపరిమితములు. మీరు నూర్ల కర్మముల వారలా ! నన్ను ఆరోగ్యవంతుని చేయండి "మే అనడం కురుత".   

    3. ఓషధులారా! మీరు పుష్పవంతులు - ఫలవంతులు. రోగుల విషయమున సంతుష్టులు కండి. అశ్వములు జయించిన రీతి వ్యాధులను జయించండి. నరులను వ్యాధులు దాటించు వారలు మీరు.

    4. దీప్తిశాలి ఓషధులారా ! మీరు మాతృ స్వరూపులు. వైద్యునకు గోవులు, అశ్వములు, వస్త్రములు నన్ను సహితము సమర్పించుటకు సిద్ధముగ ఉన్నాను. అట్లని మీ ముందు ప్రతిన చేయుచున్నాను.

    వైద్యుడు ప్రాణము రక్షించుచున్నాడు. అతనికి ఎంత ఇచ్చినను తక్కువే. శరీర మాద్యంఖలు ధర్మ సాధనం. ధర్మం సాధించడానికి తొలుత కావలసింది శరీరం కదా !

    5. ఓషధులారా ! అశ్వత్థము, పలాశము మీ నివాస స్థానములు అగుచున్నవి. మీరు రోగిని అనుగ్రహించిన మీకు గోవులను అర్పించుట ధర్మము. మీరు కృతజ్ఞతా యోగ్యులు.

    వేదము అశ్వత్థమునకు పలాశమునకు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చినది. అశ్వత్థము రావి. పలాశము మోదుగు. ఓషధులందు వీటి ప్రాముఖ్యతను గుర్తించవలసి ఉన్నది. అశ్వత్థ స్సర్వ వృక్షాణాం అన్నది గీత. బుద్ధ భగవానుని జ్ఞానోదయము అశ్వత్థచ్చాయలోనే జరిగినది.

    యజుర్వేదపు తొలి మంత్రము పలాశమును గురించినదే. నేను మోదుగు పూలు, అను నవల వ్రాసినాను.

    నేటికీ యజ్ఞయాగాదులు అశ్వత్థ, ఫలాశ సమిధలే !

    6. రాజులు సమితియందు సమావేశమగుదురు. ఓషధులు వైద్యుని వద్ద కూడును. ఓషధులు తెలిసిన వానిని విద్వాంసుడు అంటారు. అతడు వ్యాధిపాశకుడు అగుచున్నాడు.

    7. ఆరోగ్యము కలిగించుటకు నాకు అశ్వవతి - సోమవతి - ఊర్జయంతి, ఉదోజసాది ఓషధులు తెలియును.

    8. కొట్టము నుండి గోవులు బయట పడును. రోగీ ! అట్లే ఓషధులు నీ నుండి వ్యాధులను బయటికి తోలును. ఈ ఓషధులు నీకు ఆరోగ్య ధనము కలిగించును.

    9. ఓషధులారా ! మీ తల్లి ఇష్కృతి - ఆరోగ్యకారి. మీరు వ్యాధులను దూరము చేయువారు. దేహ బాధను మీరు బయటికి గెంటుదురు. మీరు రోగిని నిరోగిని చేయుదురు.

    10. దొంగ గోష్ఠమును దాటినట్లు - విశ్వవ్యాపి, సర్వజ్ఞ ఓషధులు వ్యాధులను దాటును. దేహమందున్న బాధను ఓషధులు దూరము చేయును.

    11. బలశాలి, మధ్యస్థబలశాలి సర్వజనులను లోబరుచుకుంటాడు. అట్లే ఓషధులు రోగి అంగ, ప్రత్యంగ గ్రంధి గ్రంధులలో సంచరించును. వ్యాధులను లోబరచుకొనును. సమస్త అవయవముల నుండి వ్యాధిని పారద్రోలును.

    12. వ్యాధి అన్ని అవయవాలను వదలి పోవలెనన్నది వేద విధానము. ఈనాటి వైద్యము వేరు వేరు అవయవాలకు జరుగుతున్నది. ఇది సంపూర్ణ చికిత్స కాకున్నది. అశాస్త్రీయము వరక్తము అగుచున్నది.

    13. నీల కంఠ, శ్యేన పక్షులు ఎగిరినట్లు - గాలి వేగమున వీచినట్లు, తొండ పరిగెత్తినట్లు రోగమా ! నీవు వేగముగ దూరము కమ్ము.

    14. ఓషధులారా! మీరు ఒకరు రెంటికి, మూడింటకి చేరండి. అట్లు విశ్వమందలి ఓషధులన్నియు ఏకమై నా ప్రార్థనను ఆలకింతురుగాత.

    15. ఫలసహిత, ఫలరహిత, పుష్పసహిత, పుష్పరహిత, ఓషధులను బృహస్పతి సృజించునుగాత - మమ్ము పాపముల నుండి రక్షించునుగాత.

    16. ఓషధులు శపథ పాశముల నుండి వరుణ పాశముల నుండి యమపాశముల నుండి దేవపాశముల నుండి మమ్ము రక్షించుగాక.

    17. ఓషధులు స్వర్గము నుండి దిగి వచ్చును. అన్నవి :- మేము అనుగ్రహించిన ప్రాణికి అనిష్టము కలుగకుండును గాత.

    18. ఏ ఓషధులకు రాజు చంద్రుడు అగుచున్నాడో - ఏ ఓషధులు పరిమిత ఉపకారులో - ఓషధీ ! వానితో నీవే శ్రేష్ఠుడవు. నీవు కోరికలను ఫలింప చేయగలవు. మనసునకు సుఖము ప్రసాదించగలవు.

    19. ఏ ఓషధులకు రాజు చంద్రుడు అగుచున్నాడో ఏవి భూమండలమున అనేక చోట్ల లభించునో వేనిని బృహస్పతి ఉత్పత్తి చేసినాడో అవి రోగికి శక్తిని ప్రసాదించునుగాత.

    20. ఓషధులారా ! మిమ్ము నేను త్రవ్వితీయుచున్నాను. నాకు నష్టము కలిగించకండి. ఎవని కొరకు త్రవ్వుచున్నానో అతనికి నష్టము కలిగించకండి. మా ద్విపద చతుష్పద సంపదలు రోగ రహితములు అగునుగాక.

    లాభము కలుగకున్నను నష్టము కలిగించని ఓషధులు కావలెను. నేటి మందులు - ఒక్కొక్కసారి వ్యాధి కన్న బాధించుచున్నవి. వికటించి ప్రాణములు తీయుచున్నవి ! ఏలనన ఆంగ్ల వైద్యమునకు మూలములు తెలియకున్నవి!

    ప్రస్తుతము ఓషధులకు - హెర్బల్స్ కు ప్రాముఖ్యత పెరుగుచున్నది.

    సంప్రదాయ భారతీయ జీవన విధానమున ఆహార, విహారాదులందు ఓషధులు అలముకొని ఉన్నది.

    21. నా యొక్క ఈ స్తోత్రమును వినుచున్నవియు - దూరమున ఉండి వినలేకున్నవియు నగు ఓషధులు ఏకమై ఈ ఓషధికి శక్తిని ప్రసాదించునుగాత.

    22. ఓషధులు సోమరాజుతో ముచ్చటించి అంటున్నవి :-

    రాజా ! ఎవనికి స్తోత చికిత్స చేయుచున్నాడో వానినే మేము రక్షించుచున్నాము.

    23. ఓషధీ ! నీవు శ్రేష్టమవు. సమస్త వృక్షములు నీ కన్న హీనములు.

    మాకు హాని తలపెట్టువాడు నా వద్దకు చేరకుండును గాత.

    జ్వరాద్యుపథాపేన సంజాతే అనేన సూక్తేన మార్జయేత్. జ్వరము మున్నగు తాపములు కలిగినప్పుడు ఈ సూక్తమున తుడుచునది అని శాయణుడు.

                                 తొంబది ఎనిమిదవ సూక్తము
             ఋషి - ఋషిషేన పుత్ర దేవాపి దేవత - బృహస్పతి మిత్రాది
                           సకల దేవతలు - ఛందస్సు - త్రిష్టుప్

    1. బృహస్పతీ! నీవు నా కొరకని ప్రత్యేక దేవత వద్దకు వెళ్లుము. నీవే వరుణుడవు. మిత్రుడవు. ఆదిత్యుడవు. వసువుల సహిత ఇంద్రుడవు అగుచున్నావు. నీవు శంతనుని కొరకు మేఘము నుండి జలవర్షము కలిగించుము.

    2. దేవాపీ ! ఒక జ్ఞానియు, వేగవంతుడగు దేవత నీ దూతగ నా వద్దకు వచ్చునుగాత. బృహస్పతి మాకు అభిముఖుడై వచ్చునుగాత. మా నాలుక మీద నీ కొరకు పవిత్ర స్తోత్రము నడయాడుచున్నది.

    3. బృహస్పతీ ! మా నోట ఒక శుభ్రస్తోత్రము పలికించుము. అది అస్పష్టము కారాదు. స్ఫూర్తిదాయకము కావలెను. దాని వలన మేము శంతనునకు వర్షము కలిగించ గలుగవలెను. మధుమంతరసము ఆకసము నుండి రాలునుగాత.

    4. మధుమంతరసము మమ్ము చేరునుగాత. ఇంద్రుడు అనంత ధనము రథము మీద తెచ్చును గాక.

    దేవాపి మా యజ్ఞ కార్యము నిర్వహించును గాత. సకాలమున దేవతలను పూజించును గాక. హోమ ద్రవ్యములు అర్పించి దేవతలను సంతుష్టులను చేయునుగాత.

    5. ఋషిషేన పుత్రుడు దేవాపి ఉత్తమ స్తుతులు రచించి, హవనము చేయుటకు ఆసీనుడు అగునుగాత. అపుడు అతడు ఉపరి సముద్రమగు ఆకాశము నుండి దిగువ నున్న భూసముద్రమునకు వర్షము తెచ్చునుగాత.

        ఆకాశము సముద్రమే భూమి సముద్రమే అని అందము అల్లినాడు !

    6. దేవతలు అంతరిక్షమున జలసముద్రమును మూసిపెట్టినారు. ఋషిషేన పుత్రుడు దేవాపి ఆ జలమును కదిలించినాడు. అప్పుడు స్వచ్చ ధరిత్రి మీద శుభ్రజలము ప్రవహించినది.

    7. శంతనుని పురోహితుడుదేవాపి. అతడు హోమము చేయుటకు ఉద్యుక్తుడు అయినాడు. జలోత్పాదక దేవి స్తోత్రము నిరూపించినాడు. అందుకు బృహస్పతి సంతుష్ఠుడు అయినాడు. దేవాపి మనమున స్తోత్రమును ఉదయింప చేసినాడు.

    8. అగ్నీ ! ఋషిషేణం పుత్ర దేవాపి ఋషి కమనీయుడై నిన్ను ప్రజ్వలితుని చేసినాడు. నీవు దేవతల సాయమున జలవర్ష మేఘమును ప్రజ్వలింప చేయుము.

    9. అగ్నీ ! పూర్వ ఋషులు స్తుతి సహితులుగ నీవద్దకు వచ్చినారు. నిన్ను ఎందరో ఆహ్వానింతురు. యజమానులు యజ్ఞములు చేయుచు స్తుతులతో నీవద్దకు చేరుచున్నారు. శంతనుడు రథ సహితముగ వేల పదార్థములు దక్షిణలుగ ఇచ్చినాడు. రోహిత నామక అశ్వసహిత అగ్నీ ! విచ్చేయుము.

    10. అగ్నీ ! రథముల సహితములుగ తొంబది తొమ్మిదివేల పదార్థములు నీకు ఆహుతిగ అర్పించబడినవి. వానితో నీ దేహమును పెంచుము. మా కొరకు ద్యులోకము నుండి వర్షము తెమ్ము.

    11. అగ్నీ ! తొంబది తొమ్మిదివేల ఆహుతుల నుండి ఇంద్రునకు భాగమును ఇమ్ము. నీవు దేవమార్గములు ఎరింగినవాడవు. సమయము చూచి శంతనుని దేవతల మధ్యమున నిలుపుము.

    12. అగ్నీ ! శత్రు దురములను కూల్చుము. వ్యాధులను, రాక్షసులను దూరము చేయుము. భూలోకమునకు అంతరిక్షము నుండి అనంత జలరాశిని తెమ్ము.

                             తొంబది తొమ్మిదవ సూక్తము
        ఋషి - వైఖానసవము, బందేవత ఇంద్రుడు - ఛందస్సు త్రిష్టుప్

    1. ఇంద్రా ! నీవు మమ్ము తెలియుచున్నావు. సంపద ప్రసాదించుచున్నావు. ఆ సంపద వర్థిల్లునది. మమ్ము వర్థిల్లచేయునది. ప్రశంసనీయమైనది.

    ఇంద్రుని శక్తి పెరుగుటకు మేము ఏమి చేయగలము ! అతని కొరకు వృత్రహింసకు వజ్రాయుధము సిద్ధమై ఉన్నది. ఇంద్రుడు వృష్టి కారకుడు.

    2. ఇంద్రుడు విద్యుదాయుధం ధరించి యజ్ఞములకు విచ్చేయును. అతడు బలప్రయోగము చేయును. అధికారమును దాసగతము చేసికొనును. అతడు మరుత్తులతో కలిసి శత్రువులను పరాజితులను చేయును. అతడు ఆదిత్యులకు సప్తమ భ్రాత అగుచున్నాడు. ఇంద్రుని కాదని జరుగు కార్యము ఉండదు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.