Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam



                                             సైంధవ గర్వభంగము

    ఒకనాడు ధర్మరాజు నిద్రించి ఉన్నాడు. అతనికి కల వచ్చినది. కలలో వన్య మృగములు కనిపించినవి. అవి కన్నీరు కార్చుచు "ధర్మరాజా! మేము ద్వైత వనమున సంచరించు మృగములము. మీరు ప్రతినిత్యము మా జాతులను చంపుచున్నారు. అందువలన మా జాతులు నష్టపడి నశించుచున్నవి. కావున మీరు మరొక వనమునకు వెళ్లి మమ్ము రక్షింపుడు" అని ప్రార్థించినవి. ధర్మరాజు స్వప్నమందే వన్య మృగములకు అభయము ఇచ్చినాడు.
    తెల్లవారినది స్వప్న వృత్తాంతమును ధర్మరాజు తన తమ్ములకు చెప్పినాడు. వారందరును ఆలోచించినారు. ద్వైత వనమును విడుచుటకును, కామ్యక వనమునకు వెళ్లుటకును నిశ్చయించినారు. వారందరు బయలుదేరి కామ్యక వనము చేరినారు. తృణబిందుని ఆశ్రమము వద్ద నివశించినారు.
    కామ్యక వనమున అనేక మృగములు ఉండినవి. పాండవులు కామ్యకమున విహరించుచు, వేటాడుచు కాలము గడిపినారు. ఆ విధముగా పాండవుల వనవాసపు పదకొండవ సంవత్సరము గడచినది. ఆ విధముగా గడచుచుండగా ఒకనాడు:-
    పాండవులు ద్రౌపదిని ఆశ్రమమునందు ఉంచినారు. ధౌమ్యుని ద్రౌపదికి రక్షణగా ఉంచినారు. పాండవులు అయిదుగురును మృగములను వేటాడు నిమిత్తము వనములోనికి వెళ్లినారు.
    సింధు, సౌవీర దేశములకు ప్రభువు సైంధవుడు. అతడు సాల్వుని కూతురును వివాహమాడుటకు మిత్ర, సామంత సహితుడయి, చతురంగ బలముతో సాగినాడు. అతడు కామ్యక వనము నుండి సాగినాడు. ఆవిధముగా సాగుచున్న సైన్యమును చూచుటకు ద్రౌపది ద్వారము వద్దకు వచ్చినది. చూడసాగినది.
    సైంధవుడు ఏనుగుమీద ఉండి ద్రౌపదిని చూచినాడు. మెరుపుచేత మేఘము ప్రకాశించినట్లు ద్రౌపది అందమునకు వనము సాంతము ప్రకాశించినది. ద్రౌపదిని చూచిన సైంధవునకు మన్మథ వికారము కలిగినది. అతడు కామాంధుడు అయినాడు. తన మిత్రుడు కోటికాస్యుని పంపినాడు. అతనివలన ఆమె పాండవుల భార్య పాంచాలి అని తెలుసుకున్నాడు. అయినను కామాంధమున ద్రౌపదిని అపహరించదలచినాడు. పరిచారకులను వెంట పెట్టుకొని, సింహపు గుహలోనికి జొచ్చిన జింకవలె పాండవుల ఆశ్రమమున దూరినాడు.
    ద్రౌపది సైంధవుని చూచినది. కుశల మడిగినది. అర్ఘ్యపాద్యములు ఇచ్చినది. ఆసనము చూపి కూర్చోమన్నది. "నా భర్తలు పాండవులు వేటకు వెళ్లినారు. వారు వచ్చు పర్యంతము విశ్రమింపుము. వారి ఆతిథ్యము స్వీకరించి పరిజనులతో సాగిపొమ్ము" అన్నది ద్రౌపది. ఆమెది నిర్మల మనస్సు.
    కల్మష మనస్కుడు, కామాంధుడు సైంధవుడు "ద్రౌపదీ! చాలు నీ పరిచర్యలు. నీయందు నా మనసు లగ్నమయినది. మన్మధుని బాధ తాళజాలకున్నాను. లెమ్ము. నాతోరమ్ము. రథము నెక్కుము. దరిద్రులు పాండవుల వద్ద ఏమున్నది? నేను సింధు సౌవీర దేశముల ప్రభువును. నాకు రాణివికమ్ము నన్నే నీవేలుకొమ్ము".
    ద్రౌపది వాని మాటలు విన్నది. ఆమెలో కోపము పొంగినది. అయినను అణచుకున్నది. పాండవుల రాకకు అటు ఇటు చూచినది. వారి జాడ కనిపించలేదు. అప్పుడు అన్నది.
    "సైంధవుడా! పాపపు మాటలు మాట్లాడుచున్నావు. నీవు కౌరవుల చెల్లెలు దుస్సలకు భర్తవు. అందువలన నీవు నాకు సహోదరుడవు. న్యాయ ధర్మయుక్తమయిన కులమున పుట్టినావు. కాని ధర్మమును ఎరుగక మాట్లాడుచున్నావు".
    "ద్రౌపదీ! నీకు రాజ ధర్మములు తెలియవు" సైంధవుడు ధర్మమును ఉపదేశించినాడు. "రాజులు స్త్రీల విషయమున వావి వరుసలు విచారింపరు. తమ ఇష్ట ప్రకారము స్త్రీలతో రమింతురు. లోకమందలి అందమయిన స్త్రీలందరు రాజుల సొత్తు అగుదురు. స్త్రీలు ప్రత్యేకముగా ఒకరి సొత్తను నియమము లేదుగదా".
    సైంధవుని మాటలు విన్న ద్రౌపది ఖిన్నురాలు అయినది. మెత్తని మాటల వలన ప్రయోజనము లేదని గ్రహించినది. గట్టిగా మాట్లాడినది.
    "నీచుడా! సైంధవుడా! నిన్ను నీవు ఎరుగకున్నావు. పాండవుల ప్రతాపము ఎరుగ లేకున్నావు. వారు నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి, నీ మాంసమును కాకులకు గ్రద్దలకు వేతురు. నీకు నామీద కామము కలిగినది. నీ ఆయుష్కాలము ముగిసినది".
    "పాంచాలీ! పలుకులు పలుకకు. పాండవుల పేరు చెప్పి భయపెట్టుచున్నావా? నేను భీరుడను కాదు. వీరుడను. సౌవీర కులమున పుట్టినవాడను. బింకపు మాటలు మానుము. మామాట వినుము. రథము ఎక్కుదువో, ఏనుగును ఎక్కుదువో కోరుకొనుము" అని మిడిసిపడినాడు సైంధవుడు.
    "దుష్టుడా! సైంధవుడా! నేనెవరినో గుర్తించక గర్వించుచున్నావు. నేను పాండవుల భార్యను. ధృష్టద్యుమ్నుని సోదరిని. శ్రీకృష్ణుడు నాకు దైవము. నన్ను దిక్కులేని దానను అనుకొనుచున్నావు. శ్రీకృష్ణుడు యాదవ సైన్యముతో వచ్చి నీ పీచమడచును. కాబట్టి నీతప్పు గ్రహించుము. దుష్టచింతన మానుము" అని ఉరిమినది ద్రౌపది.
    కామాంధుడు సైంధవునకు ద్రౌపది చెప్పిన హితవు చెవికి ఎక్కలేదు. అతడు ద్రౌపది కొంగుపట్టి లాగినాడు. ద్రౌపది మండిపడింది. ఆమె సైంధవుని నెట్టినది. పెనుగాలికి చెట్టు కూలినట్లు పడిపోయినాడు సైంధవుడు. కిందపడిన సైంధవుడు లేచినాడు. ద్రౌపదిని ఎత్తుకొని రథము మీద ఉంచినాడు. ద్రౌపది ధౌమ్యుని గురించి అరచినది. కేకలు పెట్టినది. ధౌమ్యుడు వచ్చువరకు సైంధవుని రథము సాగినది.
    "సైంధవా! పాండవులు నీ ప్రాణమానవులకు అపాయము కలిగింతురు. ద్రౌపదిని విడువుము" అని అరుచుచు ధౌమ్యుడు రథము వెంట పరిగెత్తినాడు.
    అడవికి వేటకు వెళ్లిన పాండవులు వేట ముగించుకొని ఒక చోటకి చేరినారు. అప్పుడు ధర్మరాజునకు దుర్నిమిత్తములు గోచరించినవి. "ద్రౌపదిని ఒంటరిగా ఆశ్రమమందు ఉంచి వచ్చినాము. దుర్యోధనాదులు క్రూరులు. సమయము కనిపెట్టి కీడు చేయుదురు. కావున మనము త్వరగా ఆశ్రమమునకు వెళ్లవలెను" అన్నాడు. అది విన్న పాండవులు శీఘ్రముగా రథములు తోలుకొని ఆశ్రమమునకు వచ్చినారు.
    పాండవులకు ఆశ్రమము రిక్తముగా కనిపించినది. ధాత్రిక అనుపరిచారికవలన జరిగిన వృత్తాంతము తెలుసుకున్నారు. వారిలో క్రోధము, ఆవేశము పొంగినవి. సర్పరాజముల వలె బుసలు కొట్టినారు. యుద్ధమునకు సన్నద్ధులయి వాయువేగ, మనో వేగములతో రథములను తోలినారు. వారికి మహా దుఃఖ పరవశుడయి పరిగెత్తుచున్న ధౌమ్యుడు కనిపించినాడు. పాండవులు ధౌమ్యుని చూచినారు. దుఃఖించక మెల్లగా రావలసినదని చెప్పినారు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.