Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 2
ప్రేమప్రయోజనము కోరదు అనుబంధము కోరును. ప్రేమ ఇచ్చుటయే ఎరుగును! అడుగుటెరుగదు!! ప్రేమ, త్యాగము రెండు కవలలు. ఒకటిలేనిది రెండవది మనజాలదు.
సీతారాములది ప్రేమ. నలదమయంతులది ప్రేమ. శకుంతలా దుష్యంతులది ప్రేమ, లైలామజ్నూలది ప్రేమ. మిత్రులైన దామను పిధియనులది, దుర్యోధన కర్ణులది ప్రేమ. భారతీయ తత్వమున ప్రేమయే వేదము. వేదన జీవము నివేదన ఆవేదన ఆరాధన.
ఒక పక్షి వలపు విలాపమునకు స్పందించి అమర రామాయణ మహాకావ్యమును రచించినాడు వాల్మీకి మహర్షి. ప్రేమగాధలకు ఒక కొత్త నిర్వచన మిచ్చిన కాళిదాసు రచించిన "విక్రమోర్వశీయ," మహా కావ్యమునకు ఈ సూక్తమునందలి ఊర్వశీ విక్రముల కథప్రేరణ.
2. ఎంతో చక్కని, తీయని, మాయని కథ చెప్పినాడు విచిత్రమేమనిన దీనిని ఎవరో దర్శించలేదు. స్వయముగా ద్రష్టలయినారు. దేవతలయినారు. ఇది ఆత్మకథవంటిది. వారినోట వెలు వడినది. వారి సంభాషణమే కథయైనది మనసును పిండినది. "దురాపవా, వాత ఇహహమస్మి" నేను నీకు అందను గాలివంటిదానను, ఇవి ఊర్వశిమాటలు ! ఈమె అలగిపోయినదా? భర్తను తిట్టినదా? శపించినదా? "తేకేతమాయం రాజామేవీర తన్వస్తదాసీత్." నీ ఇంట అడుగుపెట్టినాను. నీవే నావీరుడవు, రాజువైనావు ఈ దేహమేమీదైనది. మరి ఎడబాటు ఎందులకు? విడిచిపోనేల? "రణాయవర్ధయన్దస్యుహత్యాయదేవాః"
దేవతలు నిన్ను యుద్ధమునకు దస్యుహత్యకుగాను వర్థిల్ల చేసినారు. ఊర్వశి పురూరవునకు అతని కర్తవ్యమును ఎరుక పరిచినది. నేను వచ్చినప్పటినుంచి నా కొంగు పట్టుకొని కూర్చున్నావు. రాచకార్యములు మరచినావు. వాటిని నిర్వర్తించుము. అని శ్రీకృష్ణుడు అర్జునునకు వలె బోధించినది! ఎడబాటును ఇరువురు సహించజాలరు. ప్రేమ ఊర్వశిని త్యాగమునకు పురికొల్పినది! భర్తను కర్తవ్యపరాయణుని చేయుటకు స్వచ్చందముగ విరహమును కోరుచున్నది. ఆమె మనసున వలపుగూడు కట్టుకున్నది. సూదులు గ్రుచ్చుచున్నది. అయినను ఆమె భరించినది! ఇది ప్రేమ యగును!! ఇది త్యాగమగును!!! పురూరవునిది మరొక వేదన! యువతీ యువకులు పరస్పర గాఢ ప్రేమ బిడ్డలు కలుగునంతవరకే!! తదుపరి ఉభయుల కంటిపాపలూ పాపలే!!! పురూరవుని విరహము ప్రేయసి వరకు పరిమితముకాదు. ఆమె వద్ద తన బిడ్డున్నాడు! ఇతని విరహము రెండింతలు!! ఊర్వశి మరొక త్యాగమునకు సిద్ధమైనది! బిడ్డను ప్రియునకు ఇచ్చుటకు సిద్ధపడినది. ఈమె త్యాగము రెండింతలు!! ప్రియుని, కన్న బిడ్డను వదులుకున్నది! ఆమె వేదన అక్షరములకు అందనిది మనసున్నవారిని విడువనిది వ్యధలు నిండిన ఆమె కనులు నన్ను కదిలించుచున్నవి! ప్రేమ, త్యాగము స్త్రీకి మాత్రమే సాధ్యమగును! అట్లుండ ఊర్వశి "వవైస్త్రెణాని సఖ్యాపన్తి" స్త్రీ ప్రేమ స్థిరముకాదు, అనుట పురూరవుని మరలించుటకు మాత్రమే. ఇందు సత్యము ఇసుమంతయులేదు.
3. భార్యాభర్తల ప్రేమ వృక్షము వంటిది. అది తొలుత చెట్టు మొదలు వంటిది. అది వారికే ప్రయోజనము. పిల్లలు కలిగినంత కొమ్మలు వేసికాయలు కాయుట వంటిది. తమ కన్న పిల్లలకే ప్రయోజనకరము. అది మరింత పెద్దదైన గృహస్థాశ్రమున అతిధి అభ్యాగతులను సేవించుట వలన సమాజమునకు ఉపయోగపడును.
ప్రేమ నిరంతరము, ప్రియురాలి మీద పెట్టుకున్న పురూరవుడు తన ధర్మమును విస్మరించినాడు. అందువలన సమాజమునకు అపకారము జరిగినది. సామాజిక ధర్మము ప్రణయధర్మమును మించినదని చెప్పుట ఇందలి పరమార్ధము కావచ్చును.
4. ఇందలి సుమధుర కథ తెలిసి ఉండవచ్చును అయినను వివరింతును. మానవుడగు పురూరవుడు అప్సరల వెంట పడినాడు. ఊర్వశిమాత్రము అతనికి అందినది తనకు సంతానము కలిగెనా వదలిపోదునని ఊర్వశి షరతు పెట్టినది. వయసు ఉరుకులు పెట్టగా అందుకు వప్పుకున్నాడు. వేడి చల్లారగా సంతాన వాంఛ కలిగినది. ఊర్వశి సంతానవతి అయినది. పురూరవుని వదలి పోయినది. పురూరవునకు ఊర్వశియు, తన బిడ్డయు కావలెను అది అతని వ్యధ! మానవునకు తాను అనుకున్నవి అన్నియు అందవు! ఇది పచ్చివాస్తవ జీవిత నగ్న సత్యము.
5. మానవులు అప్సరలు వేరు వేరు జాతుల వలె ఉన్నవి. వారికి దాంపత్యము కుదిరినను కుటుంబము ఏర్పడినట్లు కనిపించదు. విశ్వామిత్రునకు మేనక వలన శకుంతల కలిగినది. మేనక బిడ్డను వదిలి వెళ్లిపోయినది. శంతనునకు గంగ వలన దేవవ్రతభీష్ముడు కలిగినాడు. ఆమె భీష్ముని వదిలి వెళ్లిపోయినది గంగ మానవస్త్రీ కాదు దేవత. పెళ్లికాకుండ కలిగిన సంతానమును పోషించు బాధ్యత తండ్రిమీద ఉన్నట్లున్నది. "నివృతస్వ హృదయం తప్యతమే" అన్న పురూరవుని ఆక్రందన నా మనసును వీడకున్నది.
తొంబది ఆరవ సూక్తము
ఋషి - అంగిరస వరుడు లేదా ఇంద్రపుత్రుడు సర్వహరి దేవత -
హర్యశ్వములు ఛందస్సు - జగతి 12, 13 త్రిష్టుప్.
1. ఇంద్రా! ఈ మహాయజ్ఞమున నీ అశ్వద్వయమును నేను స్తుతించినాను. నీవు శత్రుహింసకుడవు మంచి మత్తులోనికి జారుమని ప్రార్థించు చున్నాను. హరితవర్ణ అశ్వములపై విచ్చేయుము. ఘృతము వంటి మంచి జలమును కురిపించుము. నీవు ఎంతో శుభ్రమైనవాడవు నా స్తోత్రములు నీ వద్దకు చేరవలెను.
2. స్తోతలారా! మీరు ఇంద్రుని యజ్ఞమునకు పిలిచినారు. ఇంద్రుని అశ్వద్వయమును యజ్ఞ గృహమునకు తెచ్చినారు. అశ్వములతో కూడ ఇంద్రుని బలవీర్యములను స్తుతించండి. గోవులు పాలిచ్చి జనులను సంతృప్తులను చేయును కదా! అట్లే ఇంద్రునకు హరితవర్ణ సోమరసమిచ్చి సంతృప్తుని చేయండి.
3. ఇంద్రుని వజ్రము లోహ నిర్మితము. హరిత వర్ణము- సుందరము. అది రెండు చేతులందు పట్టునది. శత్రునాశకము. ఇంద్రుడు ధనికుడు చక్కని దవడలవాడు. కోపము కలిగి బాణము వదిలి శత్రువును సంహరించును. హరిత వర్ణ సోమరసమున ఇంద్రుని అభిషిక్తుని చేయనైనది.
4. వజ్రము ఆకాశమున సూర్యుని వలె వెలుగుచున్నది తన వేగమున సకలదిశలందు వ్యాపించినది. ఇంద్రుడు చక్కగా లోహమయ వజ్రమున వృత్రుని వధించినాడు. అపారదీప్తిని ఆర్జించినాడు.
5. హరిత కేశ ఇంద్రా! పూర్వపు యజమానులు నిన్ను స్తుతింఛి సర్వప్రకారములగు నీ అన్నములు ప్రశంసనీయములు నిరుపమములు ఉజ్వలములు.
6. స్తుత్యుడు, వజ్రధరుడగు ఇంద్రుడు సోమరసపానపు ఆనందడోలికలందు తేలియాడునపుడు సుందరములగు అతని అశ్వములు రథమునకు జతయై కొనిపోవును. ఇంద్రుని కొరకు అనేక పర్యాయములు సోమము అభిషవింపబడును.
7. ఇంద్రుడు చలించనివాడు. అతని కొరకు వలసినంత సోమము ఉంచబడినది. ఈ సోమమే ఇంద్రుని అశ్వములను యజ్ఞమువైపు వేగముగా నడిపించును. హరిత అశ్వములు యుద్ధములకు తీసికొను వెళ్లు రథమే ఈ సోమయజ్ఞమునకు చేరినది.
8. ఇంద్రుని గడ్డము, మీసములు, ఉజ్వలములు. అవి ఇనుమువలె గట్టివి. వాటికి సోమము అందును. అవి సోమపానము చేసి బలిసిపోవును. వాటి సంపద యజ్ఞమే అగును. అశ్వములు వానిని యజ్ఞములకు తెచ్చును. అవి గుర్రపుజంటనెక్కి సకల దుర్గతులను దూరము చేయును.
9. ఇంద్రుని అశములు ఉజ్వలమై యజ్ఞమున స్రువము వంటివి అయినవి. అవి తినుటకుగాను వాటి దవడలను కదిలించును. చమసమందున్న కమనీయ సోమరస పానము చేసినవి. తమదేహములను పెంచుకున్నవి.
10. సుందర ఇంద్రుని నివాసము ద్యావాపృథ్వులగును. అతడు రథము నేక్కును. గుర్రపువంటి మహావేగమున సాగును. యుద్ధములకు పోవును. ఎంతో గొప్పస్తుతులు అతనిని ప్రశంసించును. ఇంద్రా! నీవు స్వయంశక్తిచే విశేష అన్నము లిచ్చువాడవు.
సర్వే భద్రాణి పశ్యంతు.





