Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam


   
    సూర్యోదయమయినది. కర్ణుడు దుర్యోధనుని వద్దకు వచ్చినాడు. "మహారాజా! చచ్చి ఎవరిని సాధింతువు? చచ్చి శత్రువులను గెలువజాలవు కదా! చచ్చుట వలన శుభములు కలుగజాలవుకదా! చచ్చెదనన్న మాట మెచ్చదగినది కాదు. ప్రాణములున్న సకలము పొందవచ్చును. నీవు అర్జునుని చూచి భయపడుచున్నట్లున్నావు. రానున్న యుద్ధమున అర్జునుని నేను సంహరించగలనని ఆయుధముపట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను. లెమ్ము, ప్రాయోపవేశము మానుము" అని దుర్యోధనుని దుర్భాసనము నుండి లేపినాడు.
    దుర్యోధనుడు రాక్షసుల మాటలను, కర్ణుని ప్రతిజ్ఞను తలచుకున్నాడు. అతనిలో ఆశలు మొలకెత్తినవి. ప్రాయోపవేశము మానినాడు. హస్తినకు ప్రయాణము అగుటకు మంత్రులను ఆజ్ఞాపించినాడు. దుర్యోధనుడు హస్తిన చేరినాడు. రాజసూయము చేయవలెనని తలపెట్టినాడు. పాండవులను జయించనిదే రాజాసూయము చేయరాదని పురోహితులు చెప్పినారు. అందువలన వారు దుర్యోధనునితో వైష్ణవ యజ్ఞము చేయించినారు. దుర్యోధనుడు మహా వైభవముగా యజ్ఞము నిర్వహించినాడు.

                                                      ఆలోచనామృతము
    
    1. ఇది ఘోషయాత్ర. "ఘోష" అనిన ఆవుల మంద. ఆవుల మందలను చూచుటకు వెళ్లిన యాత్ర. ఘోష అంటే ఉరుము అని కూడా అర్థము. దుర్యోధనుడు పాండవుల మీద ఉరుముటకు వెళ్లిన యాత్ర. సామాన్యమయిన అర్థమున ఘోష అనిన బాధలు పడుట అని కూడ అర్థము. దుర్యోధనుడు బాధలు పడుటకు చేసిన యాత్ర.
    2. ఇది అకారణ వైరము. అతని పూర్వము వైరములు పాండవుల రాజ్యము హరించుటకు. అది జరిగిపోయినది. పాండవులు సుఖులుగా లేరు, శుష్కించినారని వార్తవచ్చినది. వారిని ఇంకా బాధించవలెననునది అతని మనస్తత్వము. ఇది రాక్షస లక్షణము. ఇది అప్పుడప్పుడు అందరిలోను కలుగుచుండును. అది ఎదుటివారికి కాదు మనకే ప్రమాదకారి అని హెచ్చరించుచున్నాడు వ్యాసుడు.
    నిష్కారణముగా ఇతరులను బాధించరాదు. అది బాధించిన వారికే ముప్పుగా పరిణమించును.
    3. తాను సుఖముగా ఉండుట కన్న శత్రువులను దుఃఖింప చేయుటలో అధిక సుఖమున్నదనునది కర్ణుని నీతి. ఇది రాక్షసత్వము. ఇది దుర్నీతి. ఇందువలన తాను సుఖముగా ఉండలేడు. ఇతరులను బాధలపాలు చేసి తాను సుఖింతుననుకొనుట మూర్ఖ లక్షణము. అట్టి మూర్ఖునకు ఏగతి పట్టునో ఎరుకపరచినాడు వ్యాసుడు.
    "చెరపకురా చెడేవు" అని మనకు ఒక సామెత ఉన్నది. దుర్యోధనుడు చెరపబోయినాడు. చెడినాడు.
    4. దుఃఖములు రెండు విధములు. శారీరకమయినది. మానసికము అయినది. పాండవులకు శారీరకము అయిన దుఃఖము కలిగినది. వారికి మానసిక దుఃఖము లేదు. వారికి మానసిక దుఃఖము కలుగ చేయవలెనని దుర్యోధనుని ఆరాటము. తన సర్వ సంపదలను చూపి వారు మానసికముగా క్రుంగునట్లు చేయవలెనని అతని దుష్టచింతన. దుష్టచింతనమునకు సత్పరిణామము ఉండదు.
    5. అనుమతి కొఱకు ఆలమందలను వాడుకున్నాడు దుర్యోధనుడు. పాండవులను రెచ్చగొట్టుటకు సరస్సు పక్కన స్థావరము ఏర్పరచదలచినాడు. అది గంధర్వులది అని తెలిసినపుడు వారిని ఓడించ తలచినాడు. అటుల చేసి అతడు సాధించవలసినది ఒకటి ఉన్నది.
    అర్జునుడు శివుని ఓడించి పాశుపతము ఆర్జించినాడు. తాను అంతకు తక్కువకానని నిరూపించ దలచినాడు.
    "తోటిది తొడ కోసికొన తాను మెడ కోసుకున్నది" అను సామెత వలె నున్నది.
    ఇది నిరర్ధక ప్రయత్నము. నిరర్ధక ప్రయత్నములు ఫలింపవు.
    6. "కావలసిన కార్యము గంధర్వులు తీర్చినారు" అనునది సామెత. భీముడు అదే మాట అన్నాడు. దుర్యోధనాదులను రక్షించ పనిలేదు అన్నాడు.
    ధర్మరాజు అందుకు అంగీకరించినాడు కాడు. రాజ్యమును తాను ఆర్జించవలె. ఇతరుల దయా ధర్మముల మీద ఆదారపడరాదు. ఇది అతని సిద్ధాంతము. ఇంతకుముందు ఒకసారి ఘటోత్కచుడు, మరొకసారి శ్రీకృష్ణుడు కౌరవులను వధించి రాజ్యము ధర్మరాజునకు ఇత్తుము అన్నారు. ధర్మరాజు ఒప్పుకొనలేదు. ఇప్పుడును అట్టి స్థితియే.
    ఇది రామాయణమునందలి సుందరకాండ వృత్తాంతమునకు పోలి ఉన్నది. హనుమంతుడు సీతను రాముని వద్దకు చేర్చుటకు సిద్ధపడును. సీత అందుకు అంగీకరింపదు. రాముడే రావలె. రావణుని వధించవలె. తనను విడిపించవలె అనును.
    పౌరుషము కలవారు పరులమీద ఆధారపడరు.
    7. ధర్మరాజు దుర్యోధనుని విడిపించి గొప్ప గొప్ప లక్ష్యములను సాధించినాడు.
    i) దుర్యోధనుడు నీచుడు - పాండవులు ఉదాత్తులు - ఉదారులు అని నిరూపించినాడు.
    ii) దుర్యోధనుడు బలహీనుడు - పాండవులు బలసంపన్నులు అని నిరూపించినాడు.
    iii) పాండవులకు మనోదుఃఖము కలిగించుటకు వచ్చిన దుర్యోధనుని అవమానమునకు గురిచేసి అనంత మనస్తాపము కలుగ చేసినాడు.
    iv) పాండవుల బలపరాక్రములు ఎంతటివో దుర్యోధనునకు ఎరుకపరచినాడు.
    8. గంధర్వులకు పట్టుబడి, పాండవులచే విడిపించబడుటకన్న దుర్యోధనునకు అవమానమేమున్నది? తల నరికినట్లయినది. తనువు చాలించ దలచినాడు. ప్రాయోపవేశమునకు పూనుకున్నాడు.
    రాక్షసులు అతనికి ధైర్యము చెప్పినారు, అతనికి కావలసినది పాండవులు నశించుట, తను ఏకచ్చత్రాధి పత్యముగా రాజ్యమేలుట. ఈ రెండును జరుగగలవని రాక్షసులు చెప్పినారు.
    రాక్షసులుకారు అతనిలో ఉన్న రాక్షస ప్రవృత్తి చెప్పినది. ఇది మాట మాత్రమే. అయినను దుర్యోధనునకు ధైర్యము తెచ్చినది.
    దుర్యోధనుడు చావుకు సిద్ధము అయినది పాండవులు గెలుతురేమోనని తాను గెలుతునని నిశ్చయించుకున్నాడు. ప్రాయోపవేశము విరమించినాడు. ఆశ దుర్యోధనుడు జీవించుటకు కారణము అయినది.
    9. జరిగిన అవమానమును కప్పిపుచ్చి తన ఘనతను చాటుకొనుటకు దుర్యోధనుడు యజ్ఞము చేసినాడు. యజ్ఞముచేసి తన పూర్వ ప్రతిష్ఠను పునరుద్ధరించుకొనుట అతని లక్ష్యము.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.