Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 2



    11. ఇంద్రా! నీవు మా వద్దకు రాదలచినపుడు - నిన్ను స్తుతించు వారు ఎక్కడ ఉన్నను వారిని యజ్ఞసమయమున రక్షింపుము. ధనదా! నిన్ను స్తుతించువారిని గుర్తింపుము.

    12. ఈ నాస్తోత్రము విస్తృతము. ఇది దీప్తివంతమై సూర్యుని వద్ద కేగును. మానవుల సిరులు పెంచును. వడ్రంగి గుఱ్ఱము గుంజు రథము చేసినట్లు నేను దీనిని రచించినాను.

    13. మేము ఎవరిని ధనము అర్ధింతుమో వారిని గూర్చి ఎంతో మంచి స్తుతులను తేపతేప పారాయణము చేయుదుము. యుద్ధమున సేనలు మరల మరల అగ్రసరులైనట్లు ఈ స్తోత్రము సహితము ముందునకు సాగును.

    14. దేవతలందరు అయిదువందల రథములకు గుఱ్ఱములు కట్టి యజ్ఞములకు వెళ్లుదురు. అట్లేనేను దుశ్శీమ, పృథువాక్, వేన, బలిరామాది ధనపతి రాజులవద్దకు వెళ్లినాను. వారి ముందు ప్రశంసా స్తోత్రములు చదివినాను.

    15. ఈ రాజులను 'తాన్వా' 'పార్ధ్య' 'మాయవ' ఆది ఋషులు డెబ్బది ఏడు అశ్వములను త్వరత్వరగ అడిగినారు.

                                 తొంబది నాలుగవ సూక్తము
        ఋషి - కద్రపుత్ర సర్పార్బుదుడు. దేవత - అభిషవశిలలు. ఛందస్సు - 5
                                 7, 14 త్రిష్టుప్ - మిగిలినవి జగతి.

    1. ఆదరణీయ, దృఢప్రస్తరమా! ఇంద్రుని కొరకు సోమాభిషవ శబ్దము చేయుము. మేము యజమానులము. మిమ్ము స్తుతింతుము. ఋత్విక్కులారా! స్తుతించండి సోమవంతులారా! సోమముతో తృప్తులుకండి.

    2. ఈ శిలలు వందల, వేలమందివలె ధ్వనులు చేయును. ఇవి సోమ సంసర్గమున హరిత వర్ణములగును. దేవతలను ఆహ్వానించును. శుభకర్మలగు ఈ శిలలు యజ్ఞమునందు దేవతలను ఆహ్వానించు అగ్నికన్న ముందే హవిని అందుకొనును.

    3. ఎరుపు కొమ్మలుతిను శోభన భోజనవంత వృషభములవలె ఈ శిలలు శబ్దము చేయును. మాంసము తిను వారు మాంసము ఉడికినంత ఆనంద ధ్వని చేయుదురు ఆ శిలలు అట్టి ధ్వనులు చేయును.

    4. మదకరము, అభిషవింపబడు సోమము నుండి ఈ శిలలు ఇంద్రుని పిలుచుచు గొప్పధ్వని చేయును. అవి తమ నోట సోమమును అందుకొనును. అవి అభిషవ కార్యమందుండి శబ్దము చేయుచు పృథ్విని నింపును. భగినీ స్వరూప అంగుళులతో కలిసి నాట్యము చేయును.

    5. ప్రస్తరముల శబ్దము విన్నంత ఆకాశమున పక్షుల శబ్దము అనిపించును. ఇవి మృగములందు గమన 'సార' 'కృష్ణసార' మృగముల వలె నాట్యము చేయును. నిష్ఠీడిత సామరసమును క్రిందికి వలికించి నపుడు సూర్యుడు శ్వేతవర్ణ జలమును పీల్చుచున్నట్లుండును.

    6. బలిష్ట అశ్వములు రథమును లాగును. తమ దేహములను పెంచుకొనును. అట్లే ఈ ప్రస్తరములు ఆయతములై సోమరసము కురిపించును. ఇవి సోమమును పీల్చునపుడు శ్వాస సహితముగ ధ్వని చేయును. గుర్రమునుండివలె వీటినోట వెలువడు మాటను నేను వినుచున్నాను.

    7. ఈ ప్రస్తరములు అవినాశ్యములు వాని గుణములను కీర్తించండి. సోమాభిషవ సమయమున పదిఅంగుళులు వాటిని పట్టినపుడు ప్రస్తరస్వరూప అశ్వమునకు పది కళ్లెముల వలె కనిపించును.

    8. పది అంగుళులు ఈ ప్రస్తరమునకు కవ్వపు త్రాళ్లవంటివై త్వరత్వరగా పనిచేయును. ఇవి చేసిన సోమరసము హరిత వర్ణమై వచ్చుచున్నది. సోమఖండములు మెదిగి, అన్నరూపము ధరించి అమృతరసము వెలువరించును. సోమము యొక్క తొలిభాగమును ప్రస్తరములే అందుకొనును.

    9. ఈ శిలలు సోమపానము చేయును. ఇంద్రుని అశ్వముల జంటను చుంబించును. అందునుండి వెడలిన రసము గోచర్మము మీదకు పోవును. ఈ శిలలు సోమము నుండి మధుర రసము తీయును. ఇంద్రుడు దానిని పానము చేసి బలసి, పెరుగును. ఆబోతువలె బలము ప్రకటించును.

    10. ప్రస్తరములారా! నిరాశచెందవద్దు సోమఖండము మాకు రసము అందించును. మీరు ఏ యజ్ఞమున ఉందురో వారు సదా అన్నవంతులు, భోజనవంతులు అగుదురు. ధనికులవలె ఉజ్వల తేజోవంతులగుదురు.

    11. మీకు అలసటలేదు ఇతరులకు అలసట కలిగింతురు మీకు శ్రమ శిథిలత, జర, రోగము, తృష్ణ, స్పృహ ఉండవు.

    12. మీ పూర్వజులు పర్వతములు అవి యుగయుగములనుండి స్థిరములు పూర్ణాభిలాషులు. ఏ పరిస్థితులందును తమ స్థానము వదలవు. అవి అజరములు పచ్చని చెట్లుగలవి పక్షుల కలకలా రావములచే ద్యావాపృథ్వులను నింపును.

    13. రథము నడుపువారు రథము నడుపుచు కేకలు వేసినట్లు ఈ శిలలు సోమరసము చేయుచు చప్పుడు చేయును. నాట్లు వేయువారి వలె ఇవి సోమమును వెల్లడి చేయును. ఇవి తింటవి కాని నష్టపరచవు.

    14. ఆటలాడు పిల్లడు తల్లిని పట్టుకొని అరచినట్లు సోమాభిషమైనంత ఈ శిలలు అరచును. సోమరసమును అభిషవించిన శిలలను స్తుతించండి. ప్రస్తరములారా ! మీరు రండి తిరగండి.

    (శ్రీమదాంధ్ర ఋగ్వేద సంహిత పదవ మండలము ఎనిమిదవ అష్టకమున నాలుగవ అధ్యాయము సమాప్తము.) 

            ఓం వతామివన్తిమాయినో నధీరావ్రతా దేవానాం ప్రథమాధ్రవాణి
            నరోదపీ అద్రుహా దేద్యా భిర్న పర్వతావి నమేత స్ధివాంసః

               అయిదవ అధ్యాయము             తొంబది అయిదవ సూక్తము
   ఋషి - పురూరవుడు ఊర్వశి. దేవత - ఊర్వశీ పురూరవులు. ఛందస్సు - త్రిష్టుప్.

            ఓం హయేజామే మనపాతిష్ఠఘోరేవ బాంసిమిశ్రాకృణవావ వహైను
            ననౌ మన్త్ర అమదితా సపతేమయస్కరన్పరత రేచనాహక్    

    1. పురూరవుని మాట :-

    అయే! నిష్ఠుర పత్నీ! అనురాగము మనసున నింపుము. నిలువుము. ఇప్పుడే మనము ఊసులాడు కుందము. మనము ఊసులాడకున్న ముందు మనకు సుఖముండదు.

    2. ఊర్వశి మాట :-

    వట్టి ఊసులాటతో ఏమగును? తొలిసంజవలె నేను నీ నుండి బయటపడినాను. పురూరవా! ఇంటికి మరలుము నేను గాలివంటి దానను అందను.

    3. పురూరవుని మాట :-

    ఊర్వశీ! నీ వివాహము భరింపరాకున్నది తూణీరము నుండి బాణము వెడలదు. జయశ్రీనాకు దక్కదు. యుద్ధమునకు పోజాలను. అపరిమిత గోవులను తేజాలను. రాజ కార్యములందు బలములేదు. కాంతి కోల్పోయిన నా సైనికులు యుద్ధమందు సింహనాదము మరచినారు.

    4. ఊర్వశిమాట :-

    సఖీఉషా! ఊర్వశి మాకు భోజనాదులు సమకూర్చును. వెంటనే దగ్గరనున్న పతిశయన గృహము చేరును. భర్తతో రాత్రింబవళ్ళు సుఖములందు తేలియాడుదును.

    5. పురూరవా! రోజుకు మూడు సార్లు నన్ను పురుషదండమున కొట్టినావు. నాకు సవతుల పోరు లేదు. నన్నే నీవు ఎంతో తృప్తిచెందించినావు. నేను నీ ఇంట అడుగిడినాను. అంతే నీవు నాకు వీరుడవైనావు రాజువైనావు నా సకల సుఖముల నిర్ణేత వయినావు.

    6. పురూరవుని మాట :-

    'సుజూర్షి' 'శ్రోణి' 'సుమ్న' 'ఆపి' 'హృదేచక్షు' 'గ్రంధిని' 'చరణ్యు' మున్నగు అప్సరసలు - నీవు వచ్చిన తరువాత అలంకరించుకొని నా వద్దకు రాలేదు. కొట్టమునకు చేరు ఆవులవలె అరచును. కాని నా ఇంట అడుగు పెట్టలేదు.

    7. ఊర్వశి మాట :-

    పురూరవుడు పుట్టినపుడు దేవపత్నులు చూచుటకు వచ్చినారు. స్వశక్తిచే ప్రవహించు నదులు అతనిని పెంచినవి. పురూరవా! నిన్ను యుద్ధమునకు పంపుటకు దస్యులను వధించుటకు దేవతలు నిన్ను పెంచి పెద్ద చేసినారు.

    8. పురూరవుని మాట :-

    పురూరవుడు మానవుడుగా అప్సరసలవైపు సాగినాడు అప్పుడు వారు తమరూపము విడిచినారు. మాయమైనారు. వారు బెదరని లేడివలె ఉరికినారు. రథమునకు కట్టిన గుర్రమువలె పరిగెత్తినారు.

    9. పురూరవుడు మానవుడుగా దేవలోకవాసినులు అప్సరసలతో ముచ్చటలాడ దలచినాడు. వారిని తాక దలచినాడు అప్పుడు వారు లుప్తులైనారు. వారి తనువులు చూపలేదు ఆటలాడు గుర్రముల వలె పారిపోయినారు.

    10. అపుడు ఆకసమునుండి ఒక మెరుపుతీగ వచ్చినది. ఆమె ఊర్వశి. మెరుపు వంటి సొగసున వచ్చినది. నా కోరికలన్నింటిని తీర్చినది. ఆమె గర్భము నుండి మనవ ఔరసుడు, సుందర పుత్రుడు జన్మించినాడు. ఊర్వశి వాడిని దీర్ఘాయువును చేయవలెను. "ఊర్వశీ తిరత దీర్ఘమాయుః" 

    11. ఊర్వశీ మాట:-

    పురూరవా! నా గర్భమున వీర్యము విడిచినావు. భూమండలమును రక్షించుటకు ఒకపుత్రుని కన్నావు ఇది జరిగిన నేనుండనని నీకు అనేక మారులు చెప్పినాను. పరిణామము నాకు తెలియును. నీవు వినలేదు. ఇప్పుడు భూమిని పాలించు పని వదిలి వృధామాటలకు ఏలదిగుదువు?

    12. పురూరవుని పలుకు :-

    నీ కొడుకు నన్ను చేరునా? చేరిన ఏడవకుండునా? కన్నీరు రాల్చకుండునా? పరస్పర ప్రేమసంపన్న స్త్రీపురుషులను ఎవడు విడదీయ దలచినాడు? "అధయదగ్నిః శ్వశురేషుదీదయత్" మామ ఇంట కదా నీవు తేజోరూప గర్భమును ప్రదీప్తము చేసినావు?

    13. ఊర్వశి పలుకు :-

    నీ మాటలకు ప్రత్యుత్తరము వినుము. కొడుకు నీవద్ద ఉండి కన్నీరురాల్చడు. ఏడవడు. నేను వాని శుభములు కోరుదును. నీ కొడుకును నీ వద్దకు పంపుదును. "అస్మే పరేవ్యస్తః నహిమూరమాపః" మూర్ఖా! ఇంటికి తిరిగి పొమ్ము నన్ను అందుకొన జాలవు.

    14. పురూరవుని పలుకు :-

    నిన్ను ప్రేమించు పతి ఈ రోజు పడిపోయినాడు మరల లేవడు. వాడు దూరతీరములకు వెళ్లిపోయినాడు వాడు దుర్గతిచే చచ్చునుగాథ వానిని తోడేలు మున్నగునవి మ్రింగునుగాత.

    15. ఊర్వశిమాట :-

    పురూరవీ! నీవు కోరుకొనకుము. పడిపోకుము. తోడేళ్లుమున్నగునవి నిన్ను తినరాదు. స్త్రీల ప్రేమ నిలుచునదికాదు. స్త్రీ హృదయము వృకహృదయము వంటిది. "నవై స్త్రీణాని సఖ్యావి సన్తి సాలావృకాణాం హృదయాస్యేతా"

    16. నేను నానారూపములుగ మానవులందు తిరిగినాను. నేను మనుష్యులందు నాలుగేళ్లు రాత్రి వాసము చేసినాను - ఆకలి తీర్చుకున్నాను తిరిగినాను.

    17. పురూరవుని మాట :-

    ఊర్వశి అంతరిక్షమును పూరించునది. జలములను చేయునది ఆమెను వసిష్ఠుడు వాసములందు శిష్ఠుడగు పురూరవుడు వశపరచు కున్నాడు. శుభకర్మముల పురూరవుడు నీ వద్ద ఉండునుగాత. నా హృదయము జ్వలించుచున్నది ఊర్వశీరమ్ము తిరిగిరమ్ము "వర్తస్వ".

    18. ఊర్వశి వాక్కు:-

    ఇళాపుత్ర పురూరవా! ఈ సకల దేవతలు నీతో అనుచున్నారు కదా:- నీవు మృత్యుంజయుడవగుదువు. హవినిచ్చి దేవతలను పూజింతురు. స్వర్గమునకు చేరి సుఖసంతోషములు అనుభవింతువు.

    ఆలోచనామృతము:-

    ఇది ప్రేమామృతము. ఒక మంచి-చక్కని ప్రేమ కథ !

    పేరు ఎప్పుడు వచ్చెనో తెలియదు. కాని ప్రేమ సృష్టితో పుట్టినది.

    ప్రేమకు కామము అనే ఒక పెడర్ధమును పాశ్చాత్యులు కల్పించినారు. వారన్నదే నిత్య సత్యమని నమ్ముట భారతజాతి నవనాగరకతను చేసినారు అంగ్రేజులు మనము అంగ్రేజులను తరిమినామని చంకలు గ్రుద్దుకొనుట ఒక భ్రమ. నాడు అంగ్రేజులు రాజకీయముగా మాత్రమే పెత్తనము చేసినారు! నేడు అంగ్రేజీని స్వచ్చందముగా నెత్తికి ఎక్కించుకున్నాము!!

    ప్రేమ యువతీయువకులు మధ్యనుండు లైంగిక సంబంధము అని అంగ్రేజులు చెప్పినారు. అదియేమనకు వేదమైనది! దూడతల్లిని చూచి ఛంగుఛంగున చేరునదేమి? దూడను చూచి చన్నులు చేసి తల్లిపాలిచ్చునదేమి? సూర్యునకు కమలములకు, చంద్రునకు కలువల కున్న సంబంధమేమి? తల్లి పిట్ట పిల్ల పిట్టకు గూటిలోనికి తెచ్చి ఆహారమునందించు దానినేమందురు? విషజంతువులు సహితము తమపిల్లల కొరకు ప్రాణములిచ్చు దానిని ఏమందురు?

    ప్రేమకు శారీరక అవసరములతో అంతగా సంబంధములేదు. ప్రేమ మానసికము దానికి లాభనష్టముల బేరీజులతో పనిలేదు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.