Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam



    చిత్రసేనుడు ధర్మరాజు మాటల ప్రకారము దుర్యోధనాదులను విడిచినాడు. పాండవుల అనుమతి పొందినాడు. స్వర్గమునకు వెళ్లినాడు. ఇంద్రునకు జరిగిన వృత్తాంతము నివేదించినాడు.
    ధర్మరాజు దుర్యోధనుని చూచి "ఇక నీవు ఇటువంటి సాహస కార్యములకు దిగకుము. దుర్జనుడు సాహస కార్యములకు దిగి నశించును. గంధర్వులచే పట్టుబడినందులకు మనసున దుఃఖింపకుము. బంధుజన సహితుడవయి హస్తినకు వెళ్లుము" అన్నాడు.
    తలవంచుకొని దుర్యోధనుడు వెళ్లిపోయినాడు.
    ధౌమ్యాదులు, మునులు ధర్మరాజు ధార్మిక బుద్ధికి సంతసించినారు. స్తుతించినారు.
    తలవంచుకొని బయలుదేరిన దుర్యోధనుడు హస్తినకు బయలుదేరినాడు. అతనికి జరిగిన విషయములు మనసున మసల సాగినవి, కలిగిన అవమానము శల్యమయి గుండెలో గుచ్చుకొనసాగినది. తాను ఓడినాడు. గంధర్వులకు పట్టుబడినాడు. అర్జునుడు తనను విడిపించినాడు. ఇదే అతని గుండెలో మెలగ సాగినది. మండసాగినది. దుర్యోధనుడు కృంగినాడు. కృశించినాడు హస్తినకు చేరుటకు ముఖము లేకపోయినది.
    దుర్యోధనుడు మార్గమధ్యమున ఆగినాడు. పట కుటీరము నిర్మించుకున్నాడు. ప్రాయోపవేశము చేతును అన్నాడు. ప్రాణములు విడుతును అన్నాడు. అందుకు సిద్ధము అయినాడు. కౌరవ పరివారమున కలకలము బయలుదేరినది. అందరును దుర్యోధనుని చుట్టూ చేరినారు. అనేక విధములుగా అతనిని వారించుటకు ప్రయత్నించినారు.
    "నేను ఇంట అవమానము పొంది జీవింపజాలము" దుర్యోధనుడు చెప్పినాడు. "మీరందరు దుశ్శాసనుని వెంట పెట్టుకొని హస్తినకు వెళ్లుడు. ఇంతవరకు మిత్రులకు సంతోషము. శత్రువులకు దుఃఖము కలిగించి జీవించినాను. అటువంటి నేను ఇప్పుడు గంధర్వులచేత పట్టుబడి శిరస్సున తన్నబడితిని. అట్లయి సిగ్గుమాలి నా బంధుజనుల వద్దకు ఏమని పోగలను? కురు వృద్ధులయిన భీష్మ, బాహ్లీకులకు ఏమని ముఖము చూపింతును? ఆచార్యులగు ద్రోణ, కృపాచార్యుల ముందు ప్రాణములతో ఎట్లు నిలుతును? దుర్మార్గునకు విద్యాధన సంపదలు కలిగిన అణగియుండవలెను. అట్లుండక గర్వపడి చెడుమార్గమున ప్రవర్తించిన తుదకు చెడిపోవును. ఒక శత్రువు నన్ను పట్టుకున్నాడు. మరొక శత్రువు కృపకలిగి నన్ను విడిపించినాడు. అందువలన మానహీనుడనయి బతుకలేను. ప్రాయోపవేశము చేసి ప్రాణములు త్యజింతును. ఇది నిక్కము. నా నిశ్చయము నుండి నన్ను ఎవరును తప్పించలేరు" అని దుర్యోధనుడు తన స్థిర నిశ్చయమును ప్రకటించినాడు.
    దుర్యోధనుని మాటలు విని కౌరవ పరివారము సాంతము ఏడ్చినది. అప్పుడు కర్ణుడు దుర్యోధనునితో అన్నాడు:-
    "మహారాజా! నీ నిర్ణయము విని మేమందరము దుఃఖించుచున్నాము మా దుఃఖమును చూచి శత్రువులు సంతోషింతురు. మా దుఃఖమును పోగొట్టుము. జరిగిన దానిని నీవు అవమానముగా తలచ పనిలేదు ఏలననగా పాండవులు నీకు కింకరులు. రాజ్యము నందలి జనులు రాజునకు బంటులగుదురు. రాజునకు కష్టము కలిగినపుడు జనులు తమ పౌరుషమును చూపి రాజును రక్షింపవలెను. పాండవులు నీ రాజ్యమున ఉన్నారు. పైగా జూదమాడి, ఓడి నీకు కింకరులు అయినారు. కావున నీ కార్యమును తీర్చుట వారి బాధ్యత అయి ఉన్నది. అందువలన నీవు దుఃఖింప పనిలేదు. ప్రాయోపవేశము మానుము. పట్టణమునకు కదులుము".
    కర్ణుని మాటలు విన్నాడు. కాని దుర్యోధనుడు తన నిశ్చయమును మార్చుకొనలేదు. అప్పుడు శకుని అతనికి మంచి మాటలు చెప్పినాడు:-
    "మహారాజా! జూదమాడి సకల రాజ్యమును నీకు సంపాదించి పెట్టినాను. దానిని అనుభవించలేక చచ్చెదను అనుచున్నావు. అందువలన నీవు వెఱ్ఱివాడవు, పెద్దలను సేవింపలేదని స్పష్టమయినది. కోపతాపములు కలిగినపుడు పండితుడు అగువాడు వానిని తక్షణమే విడువవలెను. కార్యజ్ఞుడు కావలెను.
    "దుర్యోధనా! నీవు కార్యజ్ఞుడవు ఆగుము. పాండవులు గంధర్వులను జయించినారు. నిన్ను విడిపించినారు. నీకు ఉపకారము చేసినారు. వారికి నీవు ప్రత్యుపకారము చేయుట ధర్మము. నీవు పాండవులందు ప్రీతిగలవాడవు అగుము. విచారము మానుము. పాండవులను పిలిపించుము. పాండవుల పితృధనమైన రాజ్యమును పాండవులకు ఇమ్ము. అటుల చేసిన నీకు మహాకీర్తి కలుగును. సకల పుణ్యములు కలుగును. మీరును, పాండవులును ఏకముగా రాజ్యమును పాలించుడు".
    శకుని మాటలు విన్నాడు. కాని దుర్యోధనుడు తన నిశ్చయమును మార్చుకొనలేదు.
    అప్పటికి సాయంత్రమయినది. దుర్యోధనుడు స్నానము చేసినాడు. శుచియై నారబట్టలు కట్టినాడు. సంధ్యా కార్యములను నిర్వర్తించినాడు. దుర్భాసనమున కూర్చున్నాడు. పంచేంద్రియ కర్మ వ్యవహారమును విడిచినాడు. సమాధి దశను పొందినాడు. దుర్యోధనుని మనస్సు నిశ్చలమైన దీప శిఖవలె చలనములేక నిశ్చలమయి ఉండినది.
    దుర్యోధనుడు ప్రాయోపవేశము చేయుచున్న విషయము పాతాళమున రాక్షసులకు తెలిసినది. దుర్యోధనుడు చనిపోయిన తమ పక్షము క్షీణించును అని వారు విచారించినారు. ఆలోచించి ఒక హోమము చేసినారు. హోమము నుండి కృత్తి అను ఒక శక్తి పుట్టినది. రాక్షసుల ఆజ్ఞ చొప్పున కృత్తి భూలోకమునకు వెళ్లినది. దుర్యోధనుని తీసుకొనివచ్చినది.
    పాతాళమునకు వచ్చిన దుర్యోధనుని రాక్షసులు కౌగిలించుకున్నారు. స్వాగతము పలికినారు. ఆసీనుని చేసినారు. దుర్యోధనునకు హితబోధ చేసినారు:-
    "మహారాజా! నీవు యుద్ధ శూరుడవు. ప్రాయోపవేశము చేసి దేహము విడుచుట తగదు. ఆత్మహత్య వలన లోకనింద, నీచత్వము, పాపము కలుగును. కావున ధర్మార్థ కీర్తి భోగములను నశింప చేయు మనో దుఃఖమును విడువుము. శివుని వరము వలన నీవు మాకు ప్రభువయి జన్మించినావు. నీకు సాయముగా భగదత్తాది అనేకమంది దైత్యులు భూలోకమున పుట్టినారు. వారందరు నీ పక్షము వహింతురు.
    రానున్న యుద్ధమున భీష్మ, ద్రోణాదులకు సహితము రాక్షసాంశ వచ్చును. వారు పుత్ర, మిత్ర, సహోదర, శిష్య, గురు, బాల, వృద్ధజన భేదములను తలచక యుద్ధము చేసి పాండవులను చంపుదురు. పాండవులు నీచేత నశింతురు. నీవు అర్జునుని చూచి భయపడుచున్నట్లున్నావు. శ్రీకృష్ణార్జునులు కర్ణునిచేత చత్తురు. రాక్షసాంశమున పుట్టిన అనేక లక్షల సంశప్తులకు అర్జునుడు చిక్కుపడి నశించును. ఈభూమండల మంతయు నీ ఆజ్ఞకు లోబడును. నీవు మహాశక్తిమంతుడవగు చక్రవర్తివి కానున్నావు. మాయందు అనుగ్రహము కలిగి ఉండుము. మా అందరకు నీవు ప్రభువువు. నీవు దుఃఖించుట వలన మాకు దుఃఖము కలుగుచున్నది. భయము కలుగుచున్నది. కావున నీవు దుఃఖము వదులుము. ఇతర తలంపులను వీడుము. హస్తినకు వెళ్లి ఎప్పటివలె ఉండుము. నీకు జయము కలుగును.
    దుర్యోధనుడు రాక్షసుల మాటలు విన్నాడు. సంతోషించినాడు. కృత్తి మరల దుర్యోధనుని భూలోకమునకు తెచ్చి వదలినది. అప్పటికి తెల్లవారినది. రాత్రి జరిగినదంతయు స్వప్నము వంటి అనుభవముగల వాడయి దుర్యోధనుడు మిక్కిలి సంతోషించినాడు. జరిగినదంతయు మనస్సునందే ఉంచుకున్నాడు. ఇతరులకు చెప్పలేదు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.