Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 2
ఆలోచనామృతము
1. ఈ సూక్తము ప్రఖ్యాత "పురుషసూక్తము".
ఇది అద్వైతమును ప్రతిపాదించుటకు ప్రయత్నించిన సూక్తము ఒకడే ఆధారముగ సమస్తము నిలిచి ఉన్నదని చెప్పిన సూక్తము.
2. "సహస్ర శబ్దస్య ఉపలక్షణత్వాదననైః" అనియణా చార్యులు, వేయి అనంత శబ్దమునకు సంకేతము కావున అవ్యక్త, విరాట పురుషుని తలలు మున్నగునవి అనంతములని అర్థము. కావున స్త్రీపురుషభేద రహితముగా ఎందరు వ్యక్తులున్నారో అందరును ఆమహాపురుషునిలో భాగమే అగుదురు. ఇంత జన సముదాయ స్వరూపుడే విరాటపురుషుడు! ఆ అవ్యక్త పురుషుడు సమాజము కూడ కావచ్చునని నా అభిప్రాయము. సమాజము విరాటము అవ్యక్తము విశాలము అత్యతిష్ఠద్దశాంగుళం. సర్వవ్యాపి బ్రహ్మాండమున కన్న రెండు చేతులు లేక ఒక జానెడు పెద్దది! ఈ సమాజము నుండియే సకలము ఏర్పడినవి.
3. మానస యజ్ఞమును గురించి చెప్పబడినది. ఇది కర్మరూప యజ్ఞముకాదు. జ్ఞానరూప యజ్ఞము. ఇందును గురించి ఉపనిషత్తు లందు ఎంతో వివరముగా చెప్పబడినది. ఇది అవయవములందు ఆధిక్యత మనసుకున్నదని గుర్తించిన యజ్ఞము. మనసు - ఆలోచనలు నుండియే సమస్తము ఉత్పన్న మైనదను ఒక ఉన్నత భావన కావచ్చును.
4. ఇచ్చట నాలుగు వర్ణములు మాత్రము చెప్ప బడినవి. పంచజనులు అనుపదము ఇదివరకు వచ్చినది. దానిని నాలుగు వర్ణులు + నిషాదుడు అని శాయణాచార్యులు వ్యాఖ్యానించినారు.
(శ్రీమదాంధ్ర వచన ఋగ్వేద సంహిత ఎనిమిదవ అష్టకము పదవ మండలమున ఏడవ అనువాకము సమాప్తము.)
ఎనిమిదవ అనువాకము తొంబది ఒకటవ సూక్తము
ఋషి - వీతహవ్యపుత్ర అరుణుడు. దేవత - అగ్ని ఛందస్సు - జగతి - చివరిది త్రిష్టుప్.
1. అగ్నీ! అప్రమత్తులగు స్తోతలు నిన్ను స్తుతింతురు. దాన గుణముగల అగ్ని ఉత్తరవేదిపై ఆసీనుడగును. అన్నలాభమునకు గాను సకల హవికి లోనగును. అగ్ని వరణీయుడు వ్యాపకుడు. దీప్తిమంతుడు. శుభములు కలిగించు మిత్రుడు అతడు మిత్రులను కోరును. చక్కగా జ్వలించును.
2. అగ్ని శుభంకరుడు అతిథి అతడు యజమానుల గృహములందుండును. అరణ్యములందుండును. ప్రజాహితైషి అతడు విడిచిన వాడుండడు. అతడు సకల ప్రజల గృహములందు ఉండును.
3. అగ్నీ ! నీవు బలవంతులకు బలవంతుడవు తక్కువలో తక్కువ కర్మచేసి మేధావివి అయినావు. సర్వజ్ఞుడవు సంపదల స్థాపకుడవు త్వమేకః నీవు ఒక్కడవే ద్యావాపృథ్వులు వర్థిల్ల చేసిన ధనములకు స్వామివి.
4. యజ్ఞ వేదికమీద సమయమునకు ఘృతయుక్త నివాస స్థానము ఏర్పరచబడును. అగ్నీ! నీవు దానిని దీప్తించుము. ఆసీనుడవగుము. నీ జ్వాలలు సూర్యకిరణములవలె నిర్మలములై దర్శనమిచ్చును.
5. నీ కిరణములు విచిత్రములు. అవి జలవర్షక మేఘము నుండి వెడలును. ప్రభాతపు రాకను సూచించు వెలుగు వలె కనిపించును. అప్పుడు నీవు బంధవిముక్తుడవు అగుదువు. అరణ్యములను, కర్రలను వెదకెదవు. ఇవన్నియు నీనోటిముందరి అన్నము అగును.
6. కాలానుగుణముగ ఓషధులు అగ్నిని గర్భమున దాల్చును. తల్లివంటి నీరు వాటికి జన్మనిచ్చును. అడవులందలి తీవలు గర్భవతులగును. అట్లేవానికి జన్మనిచ్చును.
7. అగ్నీ! నీవు గాలికి కదిలెదవు. సంచరించెదవు. అందమగు చెట్లయందు వసింతువు. నీవు దహించుటకు సిద్ధము అయినప్పుడు - రథారూఢ యోధులవలె నీ జ్వాలలు ప్రబలములు, అక్షయములయి, శాఖారూపముదాల్చి, బలమును ప్రదర్శింతువు.
8. అగ్ని జనులను మేధావులను చేయును. యజ్ఞమునకు సిద్ధిని ప్రసాదించును. హోమనిష్పాదకుడగును. ఎంతో విశాలుడగును. జ్ఞానియగును. హవి కొంచెమిచ్చినను, ఎక్కువ ఇచ్చినను దానిని అగ్నిమాత్రమే స్వీకరించవలసి ఉండును. ఇతరులుకాదు - "నాన్యంత్పత్"
9. అగ్నీ ! యజమానులు యజ్ఞమున నిన్ను అభిలషింతురు హోతగా నిన్నే వరింతురు. అప్పుడు దైవభక్తి మానవులు కుశలు విరిచెదరు. హవిని తెచ్చెదరు. నీకు ఇచ్చెదరు.
10. అగ్నీ ! నీవే హోత, హోతకార్యము నిర్వర్తించవలసి ఉండును. యజ్ఞకర్తవు నీవే ప్రశాస్త అధ్వర్యు బ్రహ్మకార్యము నిర్వర్తించువాడవు "అసిగృహపతిశ్చ నోదమే" నాకు గృహపతినికూడ నీవే యగుదువు.
11. అగ్నీ! నీవు అమరుడవని తెలిసికొని సమిధలు, హవి సమర్పించువానికి నీవు హోతవగుదువు. అతని కొరకు నీవు దేవదూతవగుదువు. దేవతలను ఆహ్వానింతువు. యజ్ఞానుష్ఠానము చేయుదువు. అధ్వర్యుకార్యము నిర్వర్తింతువు.
12. ఈ సమస్త ధ్యానములు, వేదవాక్యము, స్తోత్రములు అగ్నికే అర్పితములు. అర్ధాభిషగల ఈ సమస్త స్తుతులు జ్ఞాని అగ్నియందే మిళితములగును. సంపదల వృద్ధిచే అగ్ని స్తోత్రముల వృద్ధికి సంతుష్టుడగును.
13. స్తోత్రాభిలాషియగు ప్రాచీన అగ్ని కొరకు నేను ఎంతో క్రొత్త సుందర స్తోత్రములు వచింతును. అగ్ని వినవలెను. ప్రణయ పరవశ యువతీ మంచి బట్టలు కట్టి భర్త హృదయమునందు ప్రవేశించినట్లు - నేను అగ్ని హృదయ మధ్య స్థానమునకు చేరుకొందును.
14. అశ్వమేధమన అగ్నికి అశ్వములు, బలిష్టవృషభములు, పిరికి మేకలు ఆహుతిగ ఇవ్వబడును. అగ్ని జలము త్రాగువాడు అతని మీద సోమము ఉండును. అతడు యజ్ఞానుష్ఠాత. అట్టి అగ్ని కొరకు మనసుతో శుభంకర స్తుతులు రచింతును.
15. స్రుక్కునందు ఘృతము, చమసమునందు సోమము నిలిపినట్లే అగ్నీ! నీ సుఖమునందు హవి, పురోడాశాదుల హవనము జరుగును. నీకు నాకు అన్నము, ధనము, మంచి పుత్ర పౌత్రులు గల యశస్సు ప్రదానము చేయుము.
తొంబది రెండవ సూక్తము
ఋషి - మనుపుత్ర శౌర్యతుడు. దేవత - అనేకులు. ఛందస్సు - జగతి
1. అగ్ని యజ్ఞనేత మానవులస్వామి. హోత రాత్రికి అతిధి వివిధదీప్త ధనవంతుడు దేవతలారా! అగ్నిని సేవించండి. ఎండు కర్రలను కాల్చువాడు పచ్చి కర్రలందు వంకర నడక కలవాడు కోరికలు తీర్చువాడు యజ్ఞమునకు పతాకస్వరూపుడు యజనీయుడగు అగ్ని ఆకాశమున శయనించును.
2. అగ్ని రక్షకుడు ధర్మధారి దేవతలు, మానవులు అగ్నిని యజ్ఞసాధకుని చేసినారు. అగ్ని మహాపురోహితుడు శుభములిచ్చువాయు పుత్రుడు ఉషస్సులు - సూర్యునివలె అతనిని చుంబించును.
3. అగ్ని స్తుత్యుడు మార్గదర్శకుడు. మేము అగ్ని కొరకు హవనము చేయుదుము. అగ్ని దానిని ఆరగించవలెను. అగ్ని శిఖలు ప్రజ్వలములై దీప్తివంతములైనపుడు దేవతలవైపు విసరును.
4. విశాల ద్యులోకము, విస్తీర్ణవచనము, వ్యాప్త అంతరిక్షము, స్తుత్య, ఆసీమ పృథ్వి అగ్నికి నమస్కరించును. ఇంద్ర, మిత్ర, వరుణ, భగ, సవిత మున్నగు బలశాలురగు దేవతలు ప్రత్యక్షమగుదురు.
5. మరుత్తులు వేగశీలురు. వారి సాయమున నదులు ప్రవహించును. ఎల్లలులేని భూమిని కప్పివేయును. ఇంద్రుడు సంచారి అతడు సర్వత్రసంచరించును. మరుత్తుల సాయమున ఆకసమున గర్జించును. వడిగా లోకమున వానకురిపించును.
6. మరుత్తులు తమపని ప్రారంభించినపుడు లోకమును ఆకర్షింతురు. వారు ఆకాశమున శ్యేనమునకు, మేఘమునకు ఆశ్రయులగుదురు. వరుణ, మిత్ర, ఆర్యమ, ఇంద్రులు ఆశ్వారూఢ మరుత్తులకూడి ఈ సకలము వీక్షింతురు.
7. స్తోతలు ఇంద్రుని నుండి రక్షణ, సూర్యుని నుండి దృష్టి, వర్షక ఇంద్రుని నుండి పౌరుషము పొందుదురు. ఉత్కృష్టముగ ఇంద్రుని పూజించిన స్తోతకు - యజ్ఞకాలమును ఇంద్రుని వజ్రము సహాయకారి అగును.
8. ఇంద్రునకు సూర్యుడు భయపడును. భయపడి తన గుర్రములను నడిపించును. నడిపించి మార్గము నందున్న వారల నందరిని సంతోషపరచును. ఇంద్రుడు అంతటివాడు. అతనికి భయపడని వాడెవడు? ఇంద్రుడు భయంకరుడు జలవర్షకుడు అతడు ఆకాశమున గర్జించును. శత్రుంజయమగు వజ్రధ్వని అతని భయముననే నిత్యము వెలువడును.
9. రుద్రుడు కర్మకుశలుడు అతనికి నమస్కరించండి స్తుతులు అర్పించండి. అతడు శత్రువుల వినాశముచేయును. అశ్వారూఢులు, ఉత్సాహులగు మరుత్తుల సహాయము అందుకొనును. ఆకాశము నుండి జలము వర్షించును. శుభంకరుడగును. తనకీర్తిని విస్తరింప చేయును.
10. బృహస్పతియు, సోమాభిలాషులగు ఇతర దేవతలు ప్రజాసంఘముల కొరకు అన్నసంచయనము చేసినారు. అధర్వృషి అందరికన్న ముందు యజ్ఞము చేసినాడు. దేవతలను సంతుష్టులను చేసినాడు. దేవతలు, భృగువంశీయులు బలము కనబరచి ఆ యజ్ఞమునకు వెళ్లినారు. యజ్ఞమున తెలుసుకున్నారు.
11. నరాశంసనామక యజ్ఞమున నలుగురు ఆగ్నులు స్థాపించ బడినారు. ఆ యజ్ఞమునందు బహువర్షక ద్యావాపృథ్వులు, యముడు, అదితి, ధనదత్వష్ట, ఋభుజనులు, రుద్రపత్ని, మరుత్తులు, విష్ణువు స్తోత్రము అందుకున్నారు.
12. మేము అభిలాషులము. పెద్ద పెద్ద స్తోత్రములు చేయుదుము. ఆకాశమందున్న "అహిర్భధ్వ్నడు" యజ్ఞ సమయమున వానిని వినవలెను. ఆకాశమున తిరుగు సూర్య, ఇంద్రులారా! మీరు ఆకాశముననే ఉండండి అంతః కరుణమున ఈ స్తుతులు వినండి.
13. పూష సకల దేవతల హితము కోరువాడు జల వంశమున పుట్టినవాడు. అతడు మా పశువులు మున్నగువానిని రక్షించవలెను. ధనము కొరకు ఆత్మస్వరూప వాయువును స్తుతించండి. అశ్వినులారా! మిమ్ము పిలుచుట వలన శుభములు కలుగును. దారిన పోవుచు ఈ స్తోత్రము వినండి.
14. సకల ప్రజకు అభయమిచ్చు స్వామిని తన కీర్తినితాను ఆర్జించుకున్న వానిని మేము స్తుతింతుము. దేవ పత్నుల సహితముగ హవి అదితి, రేయిభర్త చంద్రుని మేము స్తుతింతుము. వారందరు మానవులను అనుగ్రహించ వలెను.
15. జ్యేష్ఠ అంగిర ఋషి ఈ యజ్ఞమున స్తుతించినాడు ప్రస్తరము లేచినది. సోమమును అందించినది బుద్ధిశాలి ఇంద్రుడు సోమము త్రావినాడు. బలిసినాడు అతని అస్త్రము ఉత్తమ జలవర్ణము కలిగించ సాగినది.
తొంబది మూడవ సూక్తము
ఋషి - పృథపుత్ర తాన్వి. దేవత - వివేదేవతలు. ఛందస్సు - వేరు వేరు.
1. ద్యావాపృథ్వులారా! మీరు ఎంతో ఎంతో విస్తరించండి. విశాలతములై స్త్రీవలె మా ఇంట ప్రవేశించండి ఈ రక్షణలు ఈ కార్యములచే మమ్ము రక్షించండి.
2. సకల యజ్ఞములందు దేవతలను సేవించువాడును. శాస్త్రముల శ్రోతయు, సుఖకరహవి అందించి దేవతలను సేవించువానిని దేవతలు అనుగ్రహింతురు.
3. దేవతలు అందరకు ప్రభువులు వారి దానము గొప్పది వారు సర్వప్రకార బలవంతులు. వారు అన్ని యజ్ఞములందును భాగములు అందుకొందురు.
4. రుద్రాపుత్రులను స్తుతించిన మానవులకు సుఖములు కలుగును. ఆర్యమ, మిత్ర, సర్వజ్ఞ వరుణ పూష, భగుడు స్తుతించదగినవారు. పుష్టికర్తలు.
5. అహిర్భుధ్న్య జలములతో ఏకత్రుడై కూర్చున్నపుడు సూర్యచంద్రులు ఒకచోట చేరి రాత్రింబవళ్లు జలముతో ధనమును వర్షింతురు.
6. శుభములకు స్వాములగు అశ్వినులు, మిత్రుడు, వరుణుడు తమ తేజములచే మమ్ము రక్షించవలెను. వీరి రక్షలుగల యజమానికి ధనము లభించును. మరుభూమి వంటి దుర్గతిని దాటిపోవును "ఈషతే ధన్వేవదురతే"
7. రుద్రపుత్ర మరుత్తులను, అశ్వినులను, సమస్త దేవతలను, రథారూఢపూషను, ఋభువులను, అన్నవంతమగు సర్వత్రగామి ఇంద్రుని, సర్వజ్ఞులగు ఋభుక్షణులు మున్నగు వారిని స్తుతించుచున్నాము. వారు మాకు సుఖములు అందించవలెను.
8. ఇంద్రుడు మహామహుండు అతడు యజ్ఞములవలన ప్రభాయుక్తుడగును. ఇంద్రుడు వేగవంత రథమును సిద్ధము చేసినపుడు యజ్ఞకర్త ఎంతో సంతోషించును. ఇంద్రుని సోమపానము అసాధారణ మగును. ఇంద్రుని కొరకు యజ్ఞములు జరుగును. ఇంద్రుడు నరులకు అసాధ్యుడు.
9. ప్రోత్సాహక దేవతలారా! మమ్ము ఉజ్వలులను చేయండి. నీవు ధనికులగు యజమానుల ఋత్విక్కులచే స్తుతించబడుదురు. ఇంద్రుడు మాకు బలస్వరూపుడు. అతడు మానవుల యజ్ఞమునకు రాదలచినాడు. తన రథమునకు వాయువునే జత చేసినట్లు అతివేగముగ విచ్చేసినాడు.
10. ద్యావాపృథ్వులారా! మీరు మా పుత్రాదులకు విశేష అన్నము ప్రసాదించండి. అది జనులకు సరిపోవునంతది, బలము నిచ్చునది, ధనలాభము కలిగించునది, విపత్తులనుండి రక్షించునది కావలెను.





