Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam



    కర్ణాదులు సైన్యములను తీసుకొని సాగినారు. గంధర్వులు చెప్పు మాటలు సహితము వినలేదు. వారిమీద శస్త్రాస్త్రములు ప్రయోగించినారు. గంధర్వులు ఉరికి చిత్రసేనునకు విన్నవించినారు. "కౌరవులను పట్టుడు కొట్టుడు చంపుడు" అని గంధర్వసేనను పంపినాడు.
    గంధర్వ సేనలు నేల ఈనినట్లు దిగినవి. అనేక అస్త్రములు ప్రయోగించినారు. గంధర్వుల ధాటికి తట్టుకొనలేక ఒక్క కర్ణుడు తప్ప మిగిలినవారు పారిపోయినారు. దుర్యోధనునితో చెప్పినారు. దుర్యోధనుడు మరింత సేనతో వచ్చి కర్ణునకు సాయము చేసినాడు. కౌరవ సైన్యములు గంధర్వులను ఊచకోత కోసినవి. గంధర్వులు ఉరికి చిత్రసేనునకు చెప్పినారు.
    చిత్రసేనుడు యుద్ధరంగమునకు ఉరికి వచ్చినాడు. చిత్రసేనుడు మాయాయుద్ధ విశారదుడు. అతడు మాయామయములగు అస్త్రములను ప్రయోగించినాడు. అతడు వాయువును బంధించినాడు. చీకట్లు క్రమ్మ చేసినాడు. అతని అస్త్రములకు ఏనుగులు కూలినవి. రథములు విరిగినవి. గుఱ్ఱములు రాలినవి. భటులు నశించినారు. గంధర్వులు కర్ణుని రథమును చుట్టుముట్టినారు అతని సారథిని చంపినారు. గుఱ్ఱములను కూల్చినారు రథమును పడగొట్టినారు. ధనుస్సును విరిచినారు. అది చూచి కర్ణుడు యుద్ధరంగమునుంచి తొలగిపోయినాడు.
    దుర్యోధనుడు తొలగిపోలేదు. నిలిచి పోరాడ సాగినాడు. చిత్రసేనుడు అది చూచినాడు. దుర్యోధనుని రథమును కూల్చినాడు. దుర్యోధనుడు విరథియై, విజితుడయి, అవమాన భారమున నిలిచినాడు. చిత్రసేనుడు దుర్యోధనుని మీదికి దూకినాడు. అతని జుట్టు పట్టుకొని క్రింద పడవేసినాడు. రెండు రెక్కలు వెనకకు విరిచి కట్టి, సింహనాదము చేసినాడు.
    గంధర్వులను అవమానపరచుటకు వచ్చిన దుర్యోధనుడు తానే అవమానముల పాలయి మానహీనుడయి నిలిచినాడు.
    తక్కిన గంధర్వులు వెదికి, వెదికి దుర్యోధనుని తమ్ములను, భార్యలను, కొడుకులను, మంత్రులను పట్టుకొని బంధించి తెచ్చి గంధర్వరాజునకు అప్పగించినారు.
    గంధర్వులకు పట్టుపడగా మిగిలిన పురజనులు, మంత్రులు పారిపోయి ధర్మరాజును శరణుజొచ్చి విన్నవించినారు:- "ధర్మరాజా! గంధర్వులు దుర్యోధనుని ఓడించి బంధించినారు. అతని తమ్ములను భార్యలను కట్లుకట్టి తీసుకొని పోవుచున్నారు. వారందరు నీకు తమ్ములు అగుదురు. నీవు దయతలచవలెను. గంధర్వులను జయించి నీతమ్ములను రక్షించవలెను".
    వారి మాటలు విన్నాడు భీముడు, సంతృప్తిగా నవ్వినాడు. అన్నాడు:-
    "అన్నా! ధర్మజా! మన కార్యము సులభముగా నెరవేరినది. అడవులలో మనము కష్టములు అనుభవించుచున్నాము. అది చూచి మనను ఎగతాళి చేయుటకు దుర్యోధనుడు సపరివారముగా వచ్చినాడు. తగిన ఫలితము అనుభవించినాడు. కానున్న కార్యమును గంధర్వులు తీర్చినారు. కావున దుర్యోధనుని విషయమున నీవు కరుణించరాదు".
    భీముని మాటలు విన్న ధర్మరాజు ధర్మముగా పలికినాడు:-
    "తమ్ముడా! భీముడా! నీవు కఠినముగా మాట్లాడరాదు. ఒకే వంశము వారికి ఆస్తి నిమిత్తము, ధన నిమిత్తము, ఒక్కొక్కసారి విరోధములు కలుగుచుండును. అంతమాత్రమున బంధములు తెగిపోవు. వారు బంధువులు కాకపోరు. దాయాదులు తమలో తాము ఎట్లున్నను చెల్లును. పరులవలన హాని జరిగినపుడు దాయాదులను రక్షించుట ధర్మమగును. కావున సర్వాయుధ సహితుడవయి వెళ్లుము. దుర్యోధనుని చెరవిడిపించి తెమ్ము".
    భీముడు ధర్మరాజు మాటలు విన్నాడు. "అన్నా! నీవు ధర్మమును చూచుచున్నావు. వాస్తవములను అర్థము చెసుకొనకున్నావు. దుర్యోధనుడు పాపాత్ముడు. విషబుద్ధి. నన్ను నీళ్లలో తోసినాడు. నాకు విషము పెట్టినాడు. మనలను లక్క ఇంటపెట్టి తగుల పెట్టించినాడు. మాయా జూదముల రాజ్యమును అపహరించినాడు. నిండు సభలో ద్రౌపది వలువలు ఒలిపించినాడు. నీవు వాడు మనకు చేసిన కీడులను తలచవు. కరుణను మాత్రము వహింతువు. దీని వలన మన కార్యమునకు భంగము కలుగును" అని ధర్మరాజునకు వాస్తవములు ఎరుక పరచినాడు.
    ధర్మరాజు భీముని శాంతింప చేసినాడు. "తమ్ముడా! తాను దుర్బలుడయినను శరణుజొచ్చిన వారిని రక్షించవలెనని శాస్త్రములు చెప్పుచున్నవి. నీవు మహావీరుడవు. దీనులను చూచి ఊరకుండరాదు. శరణాగతులను రక్షించుట కన్న ఉత్తమ ధర్మము లేదు. నేను యజ్ఞదీక్ష వహించి ఉన్నాను. అందువలన నిన్ను నిర్బంధించ వలసి వచ్చినది. మీరు శీఘ్రముగా వెళ్లి ప్రియ పూర్వకముగా గంధర్వులకు మాటలు చెప్పి దుర్యోధనాదులను విడిపించుడు. అట్లుకానిచో పరాక్రమమున గంధర్వులను జయించి వారిని విముక్తులను చేయుడు" అని ఆదేశించినాడు.
    అన్నమాట విన్నాడు భీముడు. సమ్మతించినాడు. అర్జునుడు దుర్యోధనుని విడిపింతునని ప్రతిజ్ఞ చేసినాడు. నకుల సహదేవులు అత్యుత్సాహవంతులు అయినారు. ఆయుధములు ధరించినారు. రథములు ఎక్కినారు. సాగినారు. దుర్యోధనాదులను బంధించి గంధమాదనమునకు తీసుకొని వెళ్ళుచున్న గంధర్వులను అడ్డగించినారు. భీమార్జునులను చూచి గంధర్వులు యుద్ధమునకు సన్నద్దమయినారు. వారిని వారించి అర్జునుడు అన్నాడు:-
    "గంధర్వులారా! మేము మీతో విరోధమునకు రాలేదు. దుర్యోధనుడు మాకు సోదరుడు. ఇతనిని విడిపించమని ధర్మరాజు మమ్ము పంపినాడు. ధర్మరాజు ఆజ్ఞ మీరు అతిక్రమించరాదు. దుర్యోధనుని మాకు అప్పగించవలెను".
    అర్జునుని మాటలు విని గంధర్వులు నవ్వినారు. "అర్జునా! ధర్మరాజు మాకు ప్రభువుకాడు. అతని ఆజ్ఞకు మేము లోబడము" అని అర్జునుని మీద దాడి చేసినారు. ఉభయ పక్షములకు ఘోరమయిన యుద్ధము జరిగినది. అర్జునుని బాణములకు గంధర్వుల తలలు తాటికాయలవలె రాలినవి. గంధర్వులు అర్జునుని ప్రతాపమును చూచినారు. పట్టుకున్న దుర్యోధనుని తీసుకొని ఆకాశమునకు ఎగురుటకు ప్రయత్నించినారు. అర్జునుడు తన బాణములచే ఆకాశము కప్పినాడు. గంధర్వులు నేల కూలినారు. చిత్రసేనుడు మాయా యుద్ధమునకు దిగినాడు. అర్జునుడు శబ్దభేది బాణములు ప్రయోగించి చిత్రసేనుని ఒడలు జల్లెడ చేసినాడు. చిత్రసేనుని గర్వము అణగినది. యుద్ధము మానినాడు. అర్జునుని వద్దకు వచ్చి నిలిచినాడు.
    "అర్జునా! దుర్యోధనుడు దుష్టుడు. మిమ్ములను ఎగతాళి చేయుటకు వచ్చి ఉన్నాడు. ఈ విషయము ఇంద్రునకు తెలిసినది. దుర్యోధనుని సపరివారముగా పట్టితెమ్మని ఆజ్ఞాపించినాడు. నీవు అడ్డు చెప్పవద్దు అన్నాడు".
    "చిత్రసేనా! నీవు నాకు మిత్రుడవు. దుర్యోధనుని విడుచుట యుక్తమగును. అటులకాకున్న నీవు ధర్మరాజు వద్దకు రమ్ము. వృత్తాంతము వివరింపుము. అతను చెప్పిన ప్రకారము చేయుము" అన్నాడు అర్జునుడు.
    చిత్రసేనుడు అందుకు సమ్మతించినాడు. అందరు ధర్మరాజు వద్దకు వెళ్లినారు. ధర్మరాజు చిత్రసేనుని ప్రేమ పూర్వకముగా ఆహ్వానించినాడు. ఆదరించినాడు".
    "చిత్రసేనా!" ధర్మరాజు అన్నాడు. "సోదర, మంత్రి భార్యా సహితముగా దుర్యోధనుడు బతికి ఉండుట మేలయినది. దుర్యోధనుడు మీకు ఎంత అపరాధము చేసినను మా నిమిత్తమయి మీరు దుర్యోధనుని విడువవలెను".




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.