Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 2



    5. అగ్నీ! నీవు త్రిలోక శిరమున, ఆదిత్యునితో నివసింతువు. అట్టి నిన్ను మేము చక్కని స్తుతులచే స్తుతింతుము. నీవు ద్యావా పృథ్వుల పూరకుడవు, యజ్ఞయోగ్యుడవు.

    6. అగ్ని రాత్రులందు సకల ప్రాణుల మస్తకస్వరూపుడగును. ప్రాతఃకాలమున సూర్యరూపమున ఉదయించును. ఈ అగ్నిని యజ్ఞసంపాదక దేవతల ప్రజ్ఞగా భావించబడును. అగ్ని ఆలోచనపరుడై త్వరగా అన్ని చోట్ల సంచరించును.

    7. అగ్ని విశేషముగ ప్రజ్వలితుడైనాడు. సుందరరూపము దాల్చినాడు. ఆకాశమున స్థానము గ్రహించినాడు. అక్కడ దీప్తి చెంది శోభిల్లినాడు. అట్టి అగ్నిని శరీర రక్షకులగు దేవతలు స్తుతించుచు హవిని అర్పించినారు.

    8. తొలుత దేవతలు ద్యావాపృథివ్యాదులను మనసున నిరూపింతురు. తదుపరి అగ్నిని పుట్టింతురు - హవిని వెల్లడింతురు. అగ్ని దేవతలకు యజనీయుడు శరీర రక్షకుడు. ద్యులోక, భూలోక అంతరిక్షములకు అగ్ని తెలిసినవాడు.

    9. దేవతలు అగ్నిని ఉత్పన్నము చేయుదురు. సకల పదార్థములతో సర్వమేధ యజ్ఞమున హవనము చేయుదురు. ఆ అగ్నియే సరళగామి అగును. మహాజ్వాలలచే ద్యావా పృథ్వులను తపింపచేయును.

    10. అగ్ని ద్యావాపృథ్వులను పూరించువాడు. దేవలోకము నందలి దేవతలు తమ శక్తితోను కేవలస్తుతులతోను అగ్నిని కల్పించినారు. సుఖావహమగు ఆ అగ్నిని మూడు భావములుగ ద్యులోక, భూలోక, అంతరిక్ష ఏర్పరచినారు. ఆ అగ్నియే ధాన్యము, ఓషధులు మున్నగు వానిని పండించు చున్నాడు.

    11. యజ్ఞయోగ్యులగు దేవతలు అగ్నిని, అదితిపుత్ర సూర్యుని ఆకాశమున స్థాపించినారు. అప్పుడు వారు జంటగా సంచరించినారు. అప్పుడు సకల ప్రాణులు వారిని చూడ గలిగినవి "ప్రపశ్యన్భువనాని విశ్వా."

    12. అగ్ని మానవహితము కోరువాడు. సకల దేవతలు అగ్నిని పగటి పతాకగా ఏర్పరచినారు. ఆ అగ్ని వింతవెలుగుల ప్రభాతము కలిగించును. కదలి పోవునపుడు తనమంటలతో లోకముల చీకట్లను తుడిచి పెట్టును.

    13. విప్రులు, యజ్ఞయోగ్యులగు దేవతలు అజరవైశ్వాన రాగ్నిని సృష్టించినారు. ఆ అగ్ని పెరిగి విరాట్ రూపము దాల్చును. అప్పుడు అతడు దేవతల సమక్షముననే చిరకాలము ఆకసమున నిలిచిన చుక్కలను కాంతిహీనులను చేయును.

    14. అగ్ని నిత్య దీప్తుడు క్రాంతప్రజ్ఞుడు విశ్వహితైషి అట్టి అగ్నిని మేము మంత్రములచే స్తుతింతుము. వైశ్వానరాగ్ని తన మహిమ వలన ద్యావాపృథ్వులను చిన్నబరుచును. అగ్ని కిందను, మీదను తపించును. "ఇతావస్తాదుత దేవః పరస్తాత్."

    15. పితరులను, దేవతలను, మానవుల దేవయాన పితృయాన మార్గములను నేను విన్నాను. ఈ సకలలోకములు ముందుకు సాగుచు ఆరెండు మార్గములనే అనుసరించును.

    16. సూర్యుని తలయందు పుట్టిన వాడును, స్తుతులచే పరి పుష్టము చేయబడువాడును, సంచరించునపుడు ద్యావాపృథ్వులచే భరింపబడువాడును, తన విధులందు ఎన్నడును సడలింపురానివ్వనట్టి వాడు వెలుగులు వెలుగుచు సర్వజగములందు సుఖముగా ఉండును.

    17. పార్ధివ అగ్నికి మధ్యాగ్ని వాయువునకు 'యజ్ఞము ఎవరికి తెలియును' అను విషయమున వివాదము ఏర్పడును. అప్పుడు బంధువులగు ఋత్విక్కులు యజ్ఞము చేయుదురు. కాని ఆ వివాదమును నిర్ణయించు వాడేడి "నక్షన్తయజ్ఞం క ఇదం విదోచత్."

    18. పితరులారా ! నేను మీతో తర్కని తర్కములు చేయజాలను. వానిని గురించి తెలుసుకొన దలచినాను. జిజ్ఞాసువువై అడుగుచున్నాను :-

    'అగ్నులు ఎందరు? సూర్యులు ఎందరు? ఉషస్సులు ఎన్ని? జలదేవేరులెంతమంది?'

    ('ఏక ఏవ అగ్నిర్బహుధాసమిద్ధ ఏకః సూర్యో వివానుప్రభూతః ఏకైవోషాః సర్వమిదం విభాత్యేకం పదం విబభూవ సర్వమితి, అవివాలజల్య సంహిత యందు చెప్పబడినది. అగ్ని ఒక్కటే సమిధలు వేరు లోకములన్నిటికి సూర్యుడు ఒక్కడే ఉషస్సును ఒక్కటియే ఈ సమస్తము ఒక్కటియే అయినది.')

                                 ఎనుబది తొమ్మిదవ సూక్తము
         ఋషి - వైశ్వామిత్ర రేణువు. దేవత - ఇంద్రుడు. ఛందస్సు - త్రిష్టుప్.

    1. స్తోతలారా ! నేతలలో శ్రేష్ఠుడగు ఇంద్రుని స్తుతించండి. ఇంద్రుని మహిమ అందరి తేజస్సులను ఓడించును. అతడు మానవులను భరించును. అతని తేజము సకలలోకములను పూరించును. అతని మహిమ సముద్రములను సైతము మించును.

    2. ఇంద్రుడు వీరుడు అతడు తన తేజస్సును నలువైపులకు రథ చక్రమునువలె త్రిప్పును. నల్లని అంధకారము అదృశ్యసృష్టి వంటిది. ఇంద్రుడు తన జ్యోతిచే అట్టి అంధకారములను తొలగించును.

    3. స్తోతలారా! నాతో కలసి ఇంద్రుని స్తుతించండి. ఆ స్తోత్రము కొత్తది కావలెను. కొద్ది కారాదు ద్యావాపృథ్వులందు నిరూపమానమైనది కావలెను. ఇంద్రుడు యజ్ఞములందలి స్తోత్రముల కొరకు వలె శత్రువులను చేరుటకు కూడ ఆతురపడును. ఆపదలందు అతడు మిత్రులను కోరడు. "చికాయనసఖాయ మీషే."

    4. నిర్భయముగా ఇంద్రుని స్తుతించినాము. ఆకాశపు తల నుండి జలము తెచ్చినాను. ఆకాశమున చంద్రనువలె ఇంద్రుడు తన కర్మలవలన ద్యావాపృథ్వులను నిలిపి ఉంచినాడు.

    5. దేవిని పానము చేసినంత మనసున వెలుగు నిండునో, ఏది త్వరగా ఉత్తేజము కలిగించునో, ఏది తన శౌర్యమున శత్రువులను గడగడలాడించునో ఏది అస్త్రశస్త్రధారి మరియు గతి శీలమగునో అట్టి సోమము అరణ్యములను పెంపొందించును. అయినను పెరిగిన అడవులు ఇంద్రునకు సాటిరావు. ఇంద్రుని కొంచెపు వానిని చేయజాలవు.

    6. ద్యావాపృథ్వులు, ఎడారులు, ఆకాశము, పర్వతములు ఇంద్రునకు సరిరావు. అట్టి ఇంద్రుని కొరకు సోమము ద్రవించును. ఇంద్రునకు శత్రువు మీద క్రోధము కలిగినపుడు గట్టిగా కొట్టును స్థావరములను సహితము విరుచును "రుజితిస్థిరాణి."

    7. రంపము చెట్టును కోసినట్లు ఇంద్రుడు వృత్రుని వధించినాడు. శత్రునగరములను ధ్వంసము చేసినాడు. వర్షజలములకు నదులకు మార్గము కల్పించినాడు. పచ్చి కుండవంటి మబ్బును చిదిమినాడు. అతడు తన మిత్రులగు మరుత్తులతో కలిసి నీటిని మనముందుకు తెచ్చినాడు.

    8. ఇంద్రా! నీవు ధీరుడవు స్తోతలను ఋణవిముక్తులను చేయుదువు. ఖడ్గము పశువులనువలె నీవు స్తోతల కష్టములను ఖండింతువు. మిత్రావరుణుల కర్మలను నష్టపరచు మూరులనందరను ఇంద్రుడే వధించును.

    9. మిత్ర, ఆర్యమ, వరుణ, మరుత్తులను ద్వేషించు దుష్టులు ఉన్నారు. వారిని వధించుటకు పూనుకొనుము వర్షక, శబ్దకర్త, ప్రదీప్త వజ్రమును తీక్ష్ణముచేయుము.

    10. స్వర్గము, జలము, భూమి పర్వతాదులమీద ఇంద్రుని ఆధిపత్యమున్నది. బలశాలురు, బుద్ధిమంతులకు ఇంద్రుడే అధిపతి. కొత్తవి సంపాదించుటకును, పాతవానిని రక్షించుటకును. ఇంద్రునే ప్రార్ధించవలసి ఉండును.

    11. రాత్రింబవళ్లు, ఆకాశము, జలసాగరము, విశాల వాయువు, పృథ్వియొక్క సీమ, నదులు, గోవులు అన్నింటికన్న ఇంద్రుడే పెద్దవాడు. ఇంద్రుడు అందరిని మించినవాడు.

    12. ఇంద్రా! నీ వజ్రము విరుగుట ఎరగరు. జ్యోతిర్మయ ఉషః కిరణములవంటి నీ ఆయుధము శత్రువులమీద పడవలెను. పిడుగుపడి చెట్టును ధ్వంసము చేసినట్లు అనిష్టకారి శత్రువులను గర్జించుచు, మండుచు ఉరుకులు పెట్టు నీ ఆయుధముచే వధించుము.

    13. ఇంద్రుడు పుట్టగనే అతనిని మాసములు, అరణ్యములు, వనస్పతులు, పర్వతములు అంటుకొని ఉన్న ద్యావాపృథ్వులు అనుసరించినవి.

    14. నీవు పాపులగు రాక్షసులను నరికిన నీ అస్త్రముయేది? గోహత్య స్థానమున గోవులను వధించినట్లు నీ అస్త్రమున తెగిన మిత్రద్వేషి రాక్షసులు నేల మీద పడి చావవలెను.

    15. ఇంద్రా ! మా మీద పగబట్టిన, మమ్ము బాధలపాలు చేసి మమ్ము చుట్టుముట్టిన రాక్షసులు గాఢాంధకారమున పడవలెను. వెన్నెల రాత్రులు సహితము వారికి చీకటిమయములు కావలెను.

    16. యజమానులు మీ కొరకు అనేక యజ్ఞములు అనుష్ఠింతురు. స్తోతలు ఋషులు మంత్రములచే నిన్ను ఆహ్లాదింప చేయుదురు. అందరు కలసి నిన్ను పిలుతురు పలుకుము. అర్చించు వారి యెడలప్రసన్నుడవగుము. వారి వద్దకు వెళ్లుము.

    17. ఇంద్రా ! మీ స్తోత్రములు మమ్ము రక్షించవలెను. మాకు కొత్త కొత్తవి ఉత్తమ స్తుతులు అందవలెను. మేము వైశ్వామిత్రులము మా రక్షణలకు నిన్ను స్తుతింతుము. మాకు వివిధ పదార్థములు లభించవలెను.

    18. ఇంద్రుడు బలిష్టుడు ధనికుడు అతనిని ఆహ్వానించు చున్నాము. యుద్ధకాలమున అన్నము పంచునపుడు అతడే అధ్యక్షత వహించును. యుద్ధమున తన పక్షమును రక్షించుటకు అతడు ఉగ్రమూర్తి అగును, శత్రువులను దునుమాడును. అతడు వృత్రులను వధించును సమస్త ధనములను గెలుచును.

                                  తొంబదవ సూక్తము
  ఋషి - నారాయణుడు. దేవత - అవ్యక్త పురుషుడు. ఛందస్సు - అనుష్టుప్
                                     చివరిది త్రిష్టుప్.

    1. విరాట్ పురుషునకు అనంతశిరములు అనంత చక్షువులు, అనంత పాదములు కలవు. అతడు బ్రహ్మాండము నందంతటను వ్యాపించినాడు ఆయన పాడి అంగుళులంత ఎక్కువైనాడు.

    2. ఇంతవరకు జరిగినది, జరుగనున్నది అంతయు అతడే. ప్రాణులు అనుభవించుటకుగాను తన కారణావస్థను విడిచినాడు. జగన్నాథావస్థను దాల్చినాడు. అతడు దేవత్వమునకు ఈశ్వరుడు.

    3. ఈ బ్రహ్మాండమంతయు అతని మహిమయే. అతడు స్వయముగా తన మహిమను మించినవాడు. ఇతని ఒక పాదము అంశము - బ్రహ్మాండమున ఉన్నది. అవిశ్యములగు మిగిలిన మూడు పాదములు అంశములు దివ్యలోకమున ఉన్నవి.

    4. మూడు అంశములవాడు పైకి లేచినాడు అతని ఒక్క అంశము ఇహమున ఉన్నది. తదుపరి అతడు ఆహార సహిత - ఆహారరహిత - చేతనా చేతన పదార్ధములందు వివిధరూపములచే వ్యాపించినాడు.

    5. ఆ విరాట్ పురుషుని నుండియే బ్రహ్మాండము ఏర్పడినది. బ్రహ్మాండ దేహమును ఆశ్రయింఛి జీవరూపుడు జన్మించినాడు. అతడు దేవ మనుష్య రూపుడు అయినాడు. అతడు భూమిని జీవుల శరీరమును సృష్టించినాడు.

    6. పురుషరూప మానస హవిచే దేవతలు మానసిక యజ్ఞము చేసినారు. ఆ యజ్ఞమునుండి వసంత రూపఘృతము గ్రీష్మరూపకాష్ఠము - శరద్ రూప హవ్యము కల్పించబడినవి.

    7. తొలుత జన్మించినవాడు. యజ్ఞపశురూపమున మానస యజ్ఞమున అర్పించ బడినాడు. అతని ద్వారా దేవతలు సాధ్వులు, ఋషులు యజ్ఞము చేసినారు.

    8. సర్వాత్మక పురుషుని హవనము జరిగిన మానస యజ్ఞమునుండి దధిమిశ్రిత ఘృతాదులు పుట్టినవి అందునుండియే వన్యమృగములు, గ్రామ్యమృగములు ఉత్పన్నములైనవి.

    9. సర్వాత్మక పురుషుని హోమ యుక్తమగు ఆ యజ్ఞమునుండి ఋక్, సామములు ఉత్పన్నములైనవి. అందునుండియే గాయత్రి మున్నగు ఏడు ఛందస్సులు యజువు ఉత్పన్నములైనవి.

    10. ఆ యజ్ఞము నుండియే క్రింద, మీద దంతములుగల అశ్వములు అన్య జంతువులు జన్మించినవి. గోవులు, గొర్రెలు మేకలు పుట్టినవి.

    11. ఆ పురుషుని సంకల్పమున సృజించినపుడు అతడు ఎన్ని ప్రకారములుగ జనించినాడు? అతని ముఖము రెండు చేతులు, రెండు తొడలు, రెండు పాదములు ఎవరైనారు?

    12. ఇతని ముఖమునుండి బ్రాహ్మణులు, బాహువుల నుండి క్షత్రియులు, తొడలనుండి వైశ్యులు, పాదములనుండి శూద్రులు జన్మించినారు.

    13. అతని మనసునుండి చంద్రుడు - కనులనుండి సూర్యుడు- ముఖమునుండి ఇంద్రాగ్నులు - ప్రాణము నుండి వాయువు కలిగినవి.

    14. అతని నాభినుండి అంతరిక్షము - తలనుండి ద్యులోకము - చరణములనుండి భూమి - చెవులనుండి దిశలును భువనములు ఏర్పడినవి.

    15. దేవతలు ప్రజాపతి యొక్క ప్రాణాది రూపులు. వారు మానసిక యజ్ఞము చేసినారు అందు పురుషరూప పశువును కట్టినారు. అప్పుడు ఏడు పరిధులు - ఇరువది యొక్క సమిధలు చేయబడినవి.

    (ఐహిక మరియు ఆహవనీయములు మూడు + ఉత్తర వేదినమూడు + ఆదిత్యవేది ఒకటి ఇట్లు సప్తపరిధులు. ఇవి సప్త ఛందము కూడ అగును. 12 మాసములు + 5 ఋతువు +3 లోకములు + ఆదిత్యుడు 12 సమిధలు)

    16. దేవతలు తమ యజ్ఞమును చేసిన మానస యజ్ఞమందు జగద్రూప వికార ధారకములు, ముఖ్య ధర్ములు ఏర్పడినవి. స్వర్గమందున్న ప్రాచీన సాధ్యులను, దేవతలను మహాత్ములగు ఉపాసకులు పొందగలరు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.