Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam
ధృతరాష్ట్రుడు దుఃఖించిన విధమును దుర్యోధనుడు విన్నాడు. కర్ణుని, శకునిని పిలిపించినాడు. జరిగిన విషయము వివరించినాడు. ఉపాయము చెప్పవలసినదని అడిగినాడు. పాండవుల బాధలు విని వారు మిక్కిలి సంతసించినారు. కర్ణుడు దుర్యోధనునితో అన్నాడు:-
"మహారాజా! నీ బుద్ధి బలము వలన మహా శౌర్యవంతులయిన పాండవుల రాజ్యమును హరించినావు. వారు ఇప్పుడు దుఃఖ స్వభావులయి అడవులందు ఉన్నారు. సంపద గలిగినపుడు మిత్రులను సంతోషింపచేయుచు, శత్రువులను దుఃఖింప చేయవలెను. తాము సుఖముగా ఉండుటకన్న శత్రువులను దుఃఖింప చేయుట అధిక విషయము.
పాండవులు సకల దుఃఖములను అనుభవించుచు ద్వైతవనమున ఉన్నారని విన్నాము. నీవు సకల సామ్రాజ్య వైభముతో అక్కడికి వెళ్లవలెను.అప్పుడు పాండవులు నీ వైభవమును చూచి దుఃఖింతురు. ఆవిధముగా వారికి మనోదుఃఖము కలిగించి నీవు సంతోషించుము".
కర్ణుని మాటలు దుర్యోధనునకు ఆనందము కలిగించినవి. కాని పాండవులున్న ద్వైతవనమునకు తమను పంపుటకు ధృతరాష్ట్రుడు సమ్మతింపడు. అందుకు ఉపాయము ఆలోచించవలసినదని కర్ణ, శకునులను పంపినాడు. దుర్యోధనుడు ఆలోచనమున మునిగినాడు.
తెల్లవారినది. మరల ముగ్గురు సమావేశము అయినారు. ద్వైత వనమునకు వెళ్లుటకు ధృతరాష్ట్రుని అనుమతి సంపాదించుటను గురించి ఆలోచించినారు. ఇంతలో ఆ వనము నుంచి గోపాలురు వచ్చినారు. ద్వైతవనమందున్న కౌరవుల గోవులను గురించి నివేదించినారు. వారికి ఉపాయము తోచినది. తమ ఉపాయమునకు తగినట్లు గోపాలురను బంధించినారు. వారిని తీసుకొని ధృతరాష్ట్రుని వద్దకు వెళ్లినారు.
"మహారాజా! ద్వైతవనమునందు పశువులకు క్షేమమా!" అని అడిగినాడు ధృతరాష్ట్రుడు.
"మహారాజా! గోవులకు ద్వైతవనము వంటి సుఖ నివాసము మరెక్కడను లేదు. కాని ఇప్పుడు పెద్దపులుల వంటి క్రూర మృగములు గోవులను బాధించుచున్నవి. క్రూర మృగముల బాధనుండి గోవులను రక్షించవలసి ఉన్నది" అని విన్నవించినారు గోపాలురు.
"మహారాజా! దుష్ట మృగములను చంపుటకును గోవులను రక్షించుటకును దుర్యోధనుని నియమింపుము" అన్నాడు కర్ణుడు.
"పాండవులు ప్రస్తుతము ద్వైతవనమందే ఉన్నారు. వారు తపస్సంపన్నులయి, దివ్యాస్త్రములు పొంది అజేయులయి ఉన్నారు. వారికి మీరు కష్టములు కలిగించినారు. వారు మీ విషయమున కోపగించి ఉన్నారు. వారిని మీరు కవ్వించినవారు మీకు ఆపద కలిగింతురు. కావున మీరు ద్వైతవనమునకు వెళ్లుటకు సమ్మతింపను. గోరక్షణకు మరెవరినైన నియమింతును" అన్నాడు ధృతరాష్ట్రుడు.
శకుని ధృతరాష్ట్రుని మాటలతో మభ్యపెట్టినాడు. "బావా! పాండవులు మహా పరాక్రమవంతులు. వారికి మేము అపకారము కలిగింపము. మేము అపకారము చేసినను ధర్మరాజు సత్యప్రతిజ్ఞ గలవాడు. తమ్ములు అతని మాటను అతిక్రమించరు. మాకు వేటాడవలెనని కోరిక కలిగినది. మేము వెళ్లి మృగములను వేటాడి గోవులను రక్షింతుము. దీని వలన ఎటువంటి హానియు కలుగదు. కావున అనుమతింపుము" అని వేడుకున్నాడు.
ధృతరాష్ట్రుడు కొంతసేపు మౌనము వహించినాడు. ఆలోచించినాడు. 'మంచిది. మీరు బుద్ధిగలిగి ద్వైతవనమునకు వెళ్లి గోవులకు క్షేమము కలిగించుడు. ఆలస్యము చేయక త్వరగా మరలిరండు" అని అనుమతించినాడు.
తమ పని నెరవేర్చుకొనగలిగినందులకు దుర్యోధనాదులు సంతసించినారు. తమ ఘోషయాత్రను గురించి హస్తినలో చాటింపు వేయించినారు. ఎంతో అట్టహాసముగా బయలుదేరినారు.
దుర్యోధనుని వెంట అతని 99మంది తమ్ములు, వారి భార్యలు, బంధు జనులు, వర్తకులు, సైన్యము సాగినది. ఎనిమిది వేల రథములు, ముప్పది వేల ఏనుగులు, తొంబదివేల గుఱ్ఱములు, లక్షమంది భటులు, వేటగాళ్లు, విటజనులు, విదూషకులు, వందిమాగధ వైతాళికాది జనులు సాగినారు. వారు సాగుచుండగా ఒక నగరము సాగుచున్నట్లనిపించినది. వారు నదులను దాటినారు, పర్వతములను దాటినారు. అడవులు గడచినారు. ద్వైతవనమున ప్రవేశించినారు. అక్కడ ఒక గొల్లపల్లెయందు శిబిరములను ఏర్పాటు చేసినారు.
ద్వైతవనమున అనేక వేల గోవులు ఉండును. అవన్నియు దుర్యోధనునకు చెందినవే. గోగణముల సంకుల ధ్వనులచే ద్వైతవనము ప్రకాశించుచున్నది. గోపాలురు దుర్యోధనునకు గోవులను, వాటి లక్షణములను, దూడలను, ఆబోతులను, ఎద్దులను చూపినారు. వారిని వెంట బెట్టుకొని తన బంధుమిత్రులతో దుర్యోధనుడు ద్వైతవనమున విహరించినాడు. అప్పుడు వంది మాగధులు వచ్చి దుర్యోధనుని చూచినారు. అతడు వారిని ఆదరించి, సత్కరించి పంపినాడు. ఆ తరువాత దుర్యోధనుడు వేటాడుటకు బయలుదేరినాడు. దుర్యోధనుడు లేళ్ల గుంపులను పారద్రోలినాడు. ఏనుగులను కట్టివేయించినాడు. పెద్దపులులు, చిరుతపులులు, ఎలుగుబంట్లు మొదలగు క్రూర మృగములను చంపినాడు. ఆ విధముగా వేటాడుచు ద్వైతవన సరస్సువద్దకు చేరినాడు. ఆ సరస్సు సమీపమున ధర్మరాజు మునిజనుల సాయమున కందమూలములను ఆధారము చేసుకొని "సద్యస్కందము" అను యజ్ఞము చేయుచున్నాడు.
దుర్యోధనుడు, ఆ సరస్సును చూచినాడు. అందముగా ఉన్నది. సమీపమున పాండవులు ఉన్నారు. సరసు వద్ద విడిది చేయదలచినాడు. భృత్యులను పిలిచినాడు. ఆ సరస్సు వద్ద క్రీడా గృహములు నిర్మించవవలసినదని ఆదేశించినాడు. భృత్యులు అచటికి వెళ్లినారు. నిర్మాణము ప్రారంభించినారు. గంధర్వులు వచ్చి వారిని వారిన్చినారు. "ఇది చిత్రసేనుడను గంధర్వ రాజు కొఱకు నిర్మితము అయిన సరస్సు. మీరు ఈ సరస్సు సమీపమునకు రాకూడదు" అని హెచ్చరించినారు. భృత్యులు దుర్యోధనుని వద్దకు వెళ్లినారు. జరిగిన విషయము విన్నవించినారు. దుర్యోధనునకు కోపము వచ్చినది. అతడు సైనికులను పంపినాడు. సైనికులు సరస్సువద్దకు వెళ్లినారు. గంధర్వులు ఆ సైనికులను చూచినారు.
"ఓ సైనికులారా! దుర్యోధనుడు మద గర్వము కలిగియున్నాడు. అతడు తన మాన ప్రాణములను పోగొట్టుకొనదలిచినట్లున్నాడు. మీరు ఇటువంటి అవివేక కార్యములకు దిగరాదు. బుద్ధిమంతులయి మరలివెళ్లుట మంచిది" అని హితవు చెప్పినారు గంధర్వులు.
సైనికులు తిరిగి వచ్చినారు. గంధర్వులు చెప్పిన హితవు దుర్యోధనునకు వినిపించినారు. అది విని దుర్యోధనుడు మండిపడినాడు. "కర్ణ, శకుని, దుశ్శాసనాది వీరులారా! విన్నారా గంధర్వుల ప్రలాపములు. తక్షణమే ససైన్యముగా వెళ్లుడు. గంధర్వుల మదము అణచి సరస్సును ఆక్రమించుడు" అని ఆదేశించినాడు.





