Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 2
7. వృషాకసి మాట:-
అమ్మా! నీవు సులాభిశవు నీ అవయవములు, ఊరువులు తలమున్నగునవి అవసర పరిణామమున ఉండవలెను. ప్రేమాలాపములందు కోకిలవలె నీవు నా తండ్రిని ప్రసన్నుని చేయుము. "విశ్వస్మాదింద్ర ఉత్తరః"
8. ఇంద్రుడు అనుచున్నాడు :-
ఇంద్రాణీ ! నీవు వీరపత్నివి నీభుజములు సుందరములు నీ అంగుళులు సుందరములు. నీవి పొడవైన వెంట్రుకలు, స్థూలములగు ఊరువులు. నీవు వృషాకపిని ఎందుకు కోపించుచున్నావు? "విశ్వస్మాదింద్ర ఉత్తరః"
9. ఇంద్రాణి అనుచున్నది :-
ఈ వృషకాపి హింసకుడు నన్ను పతి, పుత్ర, విహీనను అనుకుంటాడు. కాని నేను పుత్రవంత ఇంద్ర పత్నిని మరుత్తులు నాకు సహాయకులు "విశ్వస్మాదింద్ర ఉత్తరః"
10. ఒకతరి యజ్ఞము జరుగును పతిపుత్రవంత ఇంద్రాణి అచటకేగును. యజ్ఞవిధానమును ఏర్పరచును. ఆమెను అందరు పూజింతురు. "విశ్వస్మాదింద్ర ఉత్తరః"
11. ఇంద్రుడు అనుచున్నాడు:-
స్త్రీలందరిలో ఇంద్రాణియే సౌభాగ్యశాలి అని విన్నాను. ఇతర పురుషులవలె ఇంద్రాణి భర్త ముసలిదనమున పడి చావ వలసిన పనిలేదు "విశ్వస్మాదింద్ర ఉత్తరః"
12. ఇంద్రాణీ! వృషాకపి మనహితము కోరువాడు అతడు లేక నాకు సంతోషములేదు. వృషాకసికి ప్రీతికరములకు హవ్యాదులే దేవతల వద్దకు చేరును. "విశ్వస్మాదింద్ర ఉత్తరః"
13. వృషాకపి భార్య ! నీవు ధనశాలినివి. పుత్రవతివి మంచి కోడలివి. నీ వృషభములను ఇంద్రుడు భక్షించ వలెను. నీకు ప్రియము, సుఖకరమగు హవిని ఇంద్రుడు ఆరగించవలెను. "విశ్వస్మాదింద్ర ఉత్తరః"
14. నా కొరకు ఇంద్రాణి యాజ్ఞికులను ప్రోత్సహించినది వారు పదిహేను ఇరువది ఆబోతులను వండినారు. వానిని తిందును. బలిసిపోవుదును. యాజ్ఞికులు నా రెండు కుక్షులందు సోమము నింపుదురు. "విశ్వస్మాదింద్ర ఉత్తరః"
15. ఇంద్రాణి అనుచున్నది:-
ఇంద్రా ! వాడి కొమ్ములుగల ఆబోతు గర్జించుచు ఆవుల మందలో దూరి రమించినట్లు నీవు నాతో రమించుము. దధి మంథనము శబ్దము చేయుచు నీ హృదయమునకు కళ్యాణకరము కావలెను. భావాభిలాషిణి ఇంద్రాణి అభిషవించిన సోమము శుభావము కావలెను. "విశ్వస్మాదింద్ర ఉత్తరః"
16. ఇంద్రా ! తొడల మధ్య వ్రేలాడు పురుషాంగము కలవాడు మైధునమునాకు సమర్థుడుకాడు. కూర్చున్నపుడు వెంట్రుకలుగల పురషాంగము విజృంభించుచో అట్టివాడు సమర్ధుడగును. "విశ్వస్మాదింద్ర ఉత్తరః"
17. ఇంద్రుని మాట :-
కూర్చున్నపుడు వెంట్రుకలుగల పురషాంగము విజృంభించిన వాడు మైథున సమర్థుడుకాడు. పురుషాంగము తొడలమధ్య వ్రేలాడువాడు మైథున సమర్థుడగును. "విశ్వస్మాదింద్ర ఉత్తరః"
18. ఇతరులధనము దొంగిలించ బడినపుడు వృషాకపి తనదానిదిగా భావించవలెను. అతనికి కరవాలము, వధ్యస్థలము, కొత్త చరువు, కర్రబండి లభించవలెను. "విశ్వస్మాదింద్ర ఉత్తరః"
19. నేను యజమానులను వీక్షించుచు. ఆర్యులను అన్వేషించుచు, శత్రువులను దూరము చేయుచు యజ్ఞమునకు చేరుకొందును. సోమాభిషవము చేయు వాని సోమమును, హవిని వండు వాని సోమమును పానము చేయుదురు. బుద్ధిమంతులను దర్శింతును. "విశ్వస్మాదింద్ర ఉత్తరః"
20. జలశూన్య మరుభూమికి, బాగుగ పెరిగి కోతకు వచ్చిన అడవికి ఎన్ని యోజనముల అంతరము? వృషాకపీ! దగ్గర నున్న ఇంటినే ఆశ్రయింపుము. "విశ్వస్మాదింద్ర ఉత్తరః"
21. వృషాకపీ! నీవు మరల రమ్ము. నేను ఇంద్రాణి నీ కొరకు మంచి పనులు చేయుదుము. కలలను మార్చు సూర్యుడు అస్తమించినట్లు నీవు కూడ ఇంటికి చేరుము. "విశ్వస్మాదింద్ర ఉత్తరః"
22. తిరిగి వచ్చిన వృషాకపితో ఇంద్రుడు :-
వృషాకపీ ! రమ్ము మా ఇంటికి చేరుము. బహుభోక్తయు జనులను ఆనందపరచు ఆమృగము ఎచటికిపోయనది? "విశ్వస్మాదింద్ర ఉత్తరః"
23. ఇంద్రుడు బాణము విడిచినాడు. అది మనుపుత్రి పర్శునకు ఇరువది మంది పుత్రులను కలిగించినది కడుపు పెద్దదగు పర్శునకు శుభములు కలుగ వలెను. "విశ్వస్మాదింద్ర ఉత్తరః"
(ఇది తల్లిదండ్రులు కొడుకు మధ్య కలహమువలె ఉన్నది వృషాకపి ఏదో జంతువును పెంచినట్లున్నాడు. అది తలిదండ్రులకు నచ్చలేదు అతడు ఇల్లు విడిచి వెళ్లినాడు. తిరిగి రమ్మని తలిదండ్రులన్నారు. అతడు జంతువును వదలి వచ్చినాడు. చివరి మంత్రము ఆమృగమునకు శుభము కలుగవలెననునది.)
ఎనుబది ఏడవ సూక్తము
ఋషి - భరద్వాజ పాయుడు. దేవత - రక్షోహాగ్ని. ఛందస్సు - అనుష్టుప్.
1. అగ్ని రాక్షసనాశకుడు బలశాలి యజమానుల మిత్రుడు స్థూలకాయుడు. అతనికి నేను ఘృతముచే హవనము చేయుదును. ఇంటికి వెళ్లుదును. జ్వాలలను పెంచుచు అగ్నిని యజమానులు ప్రజ్వలితుని చేయుదురు.
అగ్నీ ! మమ్ము రాత్రింబవళ్లు హింసక రాక్షసులనుండి రక్షింపుము.
2. జ్ఞాని అగ్నీ ! దంతములను తీక్ష్ణము చేయుము. నీజ్వాలలచే రాక్షసులను కాల్చుము. బాధించు రక్కసులను జ్వాలలతో బాదుము. మాంసభక్షక రాక్షసులను తెగనరికి నోటిలో వేసి కొనుము.
3. రెండు కోరల అగ్నీ ! నీవు రాక్షసుల హింసకుడవగుము. నీ రెండు కోరలను పదును పెట్టుము. వానిని రాక్షసులందు గ్రుచ్చుము శుక్షములనిచ్చు అగ్నీ ! అంతరిక్షమునందలి రాక్షసుల వద్దకు వెళ్లుము వారిని కోరలతో పిండి చేయుము.
4. అగ్నీ ! మా యజ్ఞములు, స్తుతులచే నీ బాణములను నవీకరించుము. వాని అగ్రభాగములందు వజ్రమును కూర్చుము. వానితో రాక్షసుల హృదయములను చీల్చుము. భుజములను తెంచుము.
5. ధనిక అగ్నీ ! రాక్షసుల చర్మములను కోసివేయుము. హింసక వజ్రము వాడియై వారికి తాకవలెను. మాంసభక్షక వృకాదులు వారి మాంసమును తినవలెను.
6. జ్ఞాని అగ్నీ ! రాక్షసులు నిలిచి ఉన్నను తిరుగుచున్నను, ఆకాశమున ఉన్నను దారిలో ఉన్నను- వారు ఎక్కడ కనిపించినను నీ తీక్ష్ణ బాణములచే వారిని నరుకుము.
7. జ్ఞాని అగ్నీ ! అదిగో రాక్షసులు ఆక్రమించుచున్నారు. ఆవ్యక్తిని పట్టినారు. అతనిని ఖడ్గధారల నుండి రక్షించుము. అగ్నీ ! ఉగ్రరూపము దాల్చుము. మొదలు పచ్చిమాంసము తినువారిని హతమార్చుము ఆరక్కసుల మాంసమును పక్షులు తినవలెను.
8. అగ్నీ ! కనిపెట్టుము ఎవడు ఏరాక్షసుడు ఈ యజ్ఞమునకు విఘాతము కలిగించుచున్నాడు? తరుణ అగ్నీ! కట్టెలతో కాల్చి ఆరక్కసిని హతమార్చుము. నీవు మానవుల విషయమున కృపాదృష్టికలవాడవు. ఆ దృష్టితోనే ఈ రాక్షసుని పరిమార్చుము.
9. అగ్నీ! నీ యొక్క తీక్ష్ణ తేజమున మా యజ్ఞమును రక్షింపుము. ఉత్తమ జ్ఞానవంత అగ్నీ! యజ్ఞమునకు ధనము సమకూర్చుము. అనుకూలుడవగుము. మానవులను దర్శించు అగ్నీ! నీవు రాక్షస ఘాతుకుడవు రాక్షసులు నిన్ను కొట్టరాదు.
10. మానవ దర్శక అగ్నీ! మానవ హింసక రాక్షసులను చూడుము. వారితలలను మూడుముక్కలు చేయుము. వారి వెంట రక్కసులున్నారు. వారిని వెంటనే హతమార్చుము. వారి కాళ్లను మూడు ముక్కలుగ నరుకుము.
11. జ్ఞాని అగ్నీ! రాక్షసులు మూడుమారులు నీ మంటలలో పడవలెను. సత్యమును, అసత్యము చేయు రాక్షసులను నీ తేజమున భస్మము చేయుము.
12. అగ్నీ! నీ నఖములు ఖురములంతటివి వానితో సాధువులను హింసించు రాక్షసులను అంతమొందింతువు. అట్టి తేజమునే గర్జించు రక్కసులపై విసరుము సత్యమును అసత్యముచే అణచు రాక్షసులను దధ్యంగ, అథర్పృషులవలె భస్మము చేయుము.
13. అగ్నీ! స్త్రీపురుషులు జగడములాడు చున్నారు. స్తోతలు తమలో తాము కర్కశపదములు వాడుచున్నారు. అప్పుడు నీకు క్రోధము కలుగును. కోపమున బాణము వదులుదువు. అట్టి బాణమున రాక్షసుల గుండెలు చీల్చుము. ఏలననగా కర్కశపదములు వాడు వారు రాక్షసులే అగుదురు !
14. రాక్షసులను నీ తేజస్సున భస్మము చేయుము. నీ బలమున రాక్షసులను పరిమార్చుము. చంపదగిన రాక్షసులను నీ వెలుగుతో చంపుము. మానవుల ప్రాణములు తీయు రాక్షసులను నరుకుము.
15. నేడు అగ్ని మున్నగు దేవతలు పాపి రాక్షసులను పరిమార్చవలెను. మా తిట్లు రాక్షసులకు తగులవలెను. మిధ్యావాదులగు రాక్షసుల మీద బాణములు పడవలెను రాక్షసులు విశ్వవ్యాపి అగ్ని బంధమున పడవలెను.
16. అగ్నీ ! నరమాంసమును అశ్వము మున్నగుమాంసములను సంగ్రహించువారును అవధ్యగోవులను దొంగలించు వారగు రాక్షసుల తలలను నీ బలమున నరికి వేయుము.
17. ఏడాది ఆవుపాలు రాక్షసులు త్రాగరాదు. మానవదర్శక అగ్నీ! అట్టి అమృతమయ దుగ్ధములను త్రాగపూనిన రాక్షసుడు ఎదురు పడినంత నీ జ్వాలలతో వాని మర్మాంగములను ఛిన్నాభిన్నము చేయుము.
18. రాక్షసులు త్రాగు ఆవుపాలు విషము కావలెను. ఆ దుష్టులను నరికి అదితికి బలి ఇవ్వండి. సూర్యుడు వారిని హింసించవలెను. తృణలతాదులందు మిగిలిన పరిగను మాత్రమే రాక్షసులు తీసికొనవలెను.
19. అగ్నీ! వచ్చిన రాక్షసుని వచ్చినట్లు చంపుము. యుద్ధమందు రాక్షసులు నిన్ను జయించరాదు. పచ్చి మాంసము తిను రాక్షసులను సమూలముగ ధ్వంసము చేయుము. వారు నీ దివ్యాస్త్రముల నుండి తప్పించు కొనరాదు.
20. అగ్నీ! నీ జ్వాలలు అత్యంత ఉజ్వలములు అవి నాశ్యములు తాపకరములు మమ్ము నీవు తూర్పు పడమర, ఉత్తర, దక్షిణ నాలుగు దిక్కులు రక్షింపుము. పాపి రాక్షసులను భస్మము చేయుము.
21. దీప్తగ్నీ ! నీవు కార్మోన్ముఖుడువగుము. నీ కార్యకౌశలమున మమ్ము నలుదిశలందు రక్షింపుము. అగ్నీ! నేను నీకు మిత్రుడను. నిన్ను ముసలితనము చేరదు. నాకు దీర్ఘాయువుగలవార్ధక్యమునిమ్ము. నీవు మరణరహితుడవు. మేము మరణ శీలురము. మమ్ము రక్షింపుము.
22. బలపుత్ర అగ్నీ! నీవు రక్కసులను నీ వ్యాపక తేజమున దహించుము. ఎర్రగా కాలిన కత్తులతో వారిని కాల్చుము.
23. స్త్రీపురుష సంగమమును చూడ సంబరపడుచు తిరుగు రక్కసులను కాల్చివేయుము. అగ్నీ! నిన్ను తాక గలవాడులేడు. నేను స్తుతులతో నిన్ను స్తుతింతును జాగ్రత్త.
24. అగ్నీ ! నీ తేజమున రాక్షస తేజమును నలువైపుల నుండి నష్టపరచుము. రాక్షసుల బలవీర్యములను త్రుంచివేయుము.
ఎనుబది ఎనిమిదవ సూక్తము
ఋషి - మూర్ధన్వుడు. దేవత - అగ్ని. ఛందస్సు - త్రిష్టుప్.
1. సోమరసము పానయోగ్యము. నిత్యనూతనము. దేవ సేవితము దానిని స్వర్గము, ఆకాశములందున్నగ్నిముందు హుతము చేయబడును. సోమపు ఉత్పాదన, పరిపూరణ, ధారణ కొరకే దేవతలు సుఖకర అగ్నిని వర్థిల్ల చేయుదురు.
2. చీకట్లు లోకములను మ్రింగును. అందువలన భువనములు అంతర్ధానములగును. అగ్ని వెలువడును సర్వము ప్రసన్నమగును. దేవతలు, ఆకాశము, జలములు, వృక్షములన్నియు సంతుష్టి చెందును.
3. యజ్ఞ భాగములుగ్రహించు దేవతలు నన్ను ఏర్పరచినారు. అందువలన నేను అజరుడు, విశాలుడగు అగ్నిని స్తుతింతును. అగ్ని తన తేజమున భూమ్యాకాశముల మధ్యనున్న స్థానమును ద్యావాపృథ్వులను విస్తరింప చేసినాడు.
4. వైశ్వానరాగ్నిని దేవతలు సేవింతురు. అతడు హోతలందు ముఖ్యుడు. యజమానులు అగ్నిని అభిలషింతురు. అగ్నిని ఘృతయుక్తుని చేయుదురు. ఆ అగ్నియే ఎగురునట్టి పక్షులను పాకునట్టి పాములను, సకల స్థావర జంగమాత్మక జగత్తును సృష్టించినాడు.





