Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam



    2. దేవదానవ యుద్ధమున రాక్షసులు గెలుచుటకు కారణము దేవతలకు సరియైన సేనాని లేకపోవుట అని నిర్ణయించుట జరిగినది. ఇది ఒక గొప్ప నిర్ణయము. నేటికి కూడ నాయకుడు లేని జాతికి జీవనము లేదు. సమర్థుడైన నాయకుడు జాతికి జీవగర్రవంటివాడు. ఇది సర్వకాలములకు వర్తించు శాశ్వత సత్యము. పరస్పర విద్వేషములు, నాయకుడు లేకపోయినందుననే భారతదేశము వెయ్యేళ్లకు పైగా బానిసత్వమున మగ్గినది.
    3. ఒక్కరికి కాక అనేకమందికి పుట్టినవాడు బలవంతుడు, బుద్ధిశాలి అగునని ఏదో సిద్ధాంతము ఉన్నట్లున్నది. అదికాక కృత్రిమ సంతాన విషయమున అనేక ప్రయోగములు అప్పటికే జరిగినట్లున్నవి. కృత్రిమ సంతానమును గురించి ద్రోణుడు, ద్రుపదుని చరిత్ర సందర్భమున కొంత చర్చించినాము. ఇది అంతకు చాల పూర్వపు కథ. అప్పటికే శాస్త్రమున అంత అభివృద్ధి సాధించినారు.
    4. కుమారస్వామి ఆవిర్భావమునకు దేవతలు మునులు, అన్నివర్గములు కలిసి పనిచేసినవి. ఇందుకు నాయకత్వము వహించినవాడు అగ్ని. ఒకరి ఇంద్రియము, ఉజ్వల చరిత్ర గల స్త్రీల రేతస్సు కలయిక వలన ఒక మహామహుడు జన్మించవచ్చును అని ప్రయత్నించినాడు. అతని భార్య స్వాహాదేవి అతనికి ఎంతో సాయము చేసినది.
    సప్తఋషులలో ఆరుగురి భార్యలు జాతిని రక్షించుటకు తమ నియమములను వదులుకున్నారు. ఆ మహా యజ్ఞమునకు వారు సమిధలు అయినారు. సప్తఋషులు తమ స్వార్ధమునే చూసుకున్నారు. భార్యలను వదలి వేసినారు.
    ఋషుల భార్యలు చేసిన త్యాగము చాల గొప్పది. మానవ చరిత్రలో ఇట్టి త్యాగము కనిపించదు. కుమారస్వామి వారిని అందుకు తగినట్లుగనే గౌరవించినాడు.
    5. వైద్యశాస్త్రజ్ఞులు పరిశోధించవలసిన మహత్తరమయిన ప్రయోగమిది. ఒకరి ఆవిర్భావమునకు ఇద్దరు తండ్రులు ఆరుగురు తల్లులు కారణము అయినారు. తల్లి అందరికి ఒక్కతే. తండ్రులు ఎక్కువ మంది ఉండవచ్చును. కాని ఇది విపరీతము. తల్లులు ఆరుగురు తండ్రి ఒక్కడు అగ్ని. ఇంద్రుడు పరోక్షముగా తన ఇంద్రియమును అర్పించినందున శివుడు మరొక తండ్రి అయినాడు.
    మానవ చరిత్రలో ఇటువంటివి అరుదు. ఈ ఒక్క అంశమును గురించియే అనంతమయిన పరిశోధన సాగించవచ్చును.
    6. అగ్నిదేవుని ప్రయోగము ఫలించి కుమారస్వామి ఆవిర్భవించినాడు. అతడు నాయకత్వ లక్షణములతో ఆవిర్భవించినాడు. అతడు దేవతలందరిని అన్ని వర్గములను, జాతులను ఏకము చేసినాడు. అది అతడు చేసిన మహత్తర కార్యము. అందురును కుమారస్వామి నాయకత్వమున ఏకత్రితము అయినారు. ఒక అజేయమయిన జాతిగా దేవతలను సిద్ధము చేసినాడు కుమారస్వామి. అందువలననే మహిషాసురుని ఓడించగలిగినాడు.
    7. మహిషాసురుని కథ దేవీ భాగవతమున మరొక తీరుగా ఉన్నది. తొమ్మిది రోజులు యుద్ధము చేసి ఆదిశక్తి మహిషాసురుని చంపినట్లుగా చెప్పబడినది. అందుకు సంకేతముగా శరన్నవరాత్రులు జరుపుదుము. విజయదశమినాడు ఆదిశక్తి మహిషాసురుని వధించినది అను కథ బహుళ ప్రచారమున ఉన్నది.
    8. మహిషాసురుని ఊరు మైసూరు. అది అసలు మహిషా+ఊరు మహిషూరు. కలక్రమున మైసూరుగా మారినది. చాముండేశ్వరి అక్కడి అధిష్ఠాన దేవత. దసరా ఉత్సవములకు మైసూరు ప్రాధాన్యత వహించినది.
    9. మహిషాసురుని ఎదిరించుటకు ఏకమయిన దేవతలతో విష్ణువు లేడు. ఇది గమనించదగిన విషయము.
    10. కాళిదాసు "కుమార సంభవము" అను అతి మనోహరమయిన కావ్యమును రచించినాడు. అది కూడ కుమారస్వామి జననమునకు సంబంధించిన కథయే. ఆ కథ మరొక తీరుగా ఉన్నది. ఈ రెండింటి పోలికలను అధ్యయనము చేయవచ్చును.

                                                      ఘోషయాత్ర

    మార్కండేయ మహర్షి వినిపించిన కథలను పాండవులతో కూడ శ్రీకృష్ణుడు విన్నాడు. సత్యభామ, ద్రౌపది మనసులు విప్పి మాట్లాడుకున్నారు. శ్రీకృష్ణుడు సత్యభామ సహితుడయి పాండవుల అనుమతి పొందినాడు. మార్కండేయాది బ్రాహ్మణుల అనుజ్ఞ పొందినాడు. ద్వారకకు వెళ్లిపోయినాడు. మార్కండేయ మహర్షి పాండవులను ఊరడించి, వారిని ఆశీర్వదించి తన ఆశ్రమమునకు వెళ్లినాడు. పాండవులు కామ్యక వనమును విడిచినారు అనేక పర్వతములు, నదీనదములు దాటి ద్వైత వనమునకు చేరినారు. అప్పుడు హస్తిన నుండి ఒక బ్రాహ్మణుడు పాండవుల వద్దకు వచ్చినాడు. అక్కడ కొంత కాలము ఉన్నాడు. వారికి సరసములయిన కథలు చెప్పినాడు. పాండవుల అనుమతిపొంది అతడు హస్తినకు చేరినాడు.
    ధృతరాష్ట్రుని వద్దకు వెళ్లినాడు. పాండవుల కుశల వార్తలు చెప్పినాడు:-
    "పాండవులు ఎండకు వానకు చిక్కి శల్యములు అయినారు.. దుఃఖ సముద్రమున మునిగి ఉన్నట్లున్నారు. వీరులగు భర్తలు కలిగి ఉన్నను ద్రౌపది భర్తలేని దానివలె దుఃఖించుచున్నది".
    ధృతరాష్ట్రుడు బ్రాహ్మణుని మాటలు విన్నాడు. కన్నీరు గార్చినాడు. నిట్టూర్పులు విడిచినాడు. గద్గద కంఠధ్వనితో అన్నాడు:-
    "ధర్మరాజు సత్యవంతుడు. ధర్మవంతుడు. రాజ భోగములు అనుభవించవలసిన వాడు. అడవులందు ఇడుములు పడుచున్నాడు. భీముడు పదివేల ఏనుగుల బలము కలవాడు. అడవి ఏనుగువలె ఉన్నాడు. అర్జునుడు మహావీరుడు. వనవాసమున శుష్కించినాడు. అయినను దేవతల వలన దివ్యాస్త్రములను పొందినాడు. మానవ దేహముతోనే స్వర్గమునకు వెళ్లి తిరిగి వచ్చినాడు. అతడు గాండీవము ధరించి యుద్ధమునకు దిగిన సకల రాజ్యలక్ష్మి అతని వశమగును. నకుల, సహదేవుల ఇద్దరు సుకుమారులు, యోగ్యులు, బుద్ధిమంతులు. వారు శుష్కించి ఉన్నారు. వారందరు అధిక రోషము కలిగి ఉందురు. అయినను ధర్మరాజు మాటకు కట్టుబడి విక్రమించకున్నారు. వారు కార్చిచ్చు వంటివారు. నా పుత్రులను అడవిని దహించక మానరు. కర్మ ఫలములు కలుగక మానవు. దైవము కలిగించిన దానిని తప్పించుట ఎవరికీ సాధ్యముకాదు. కౌరవులు నశించెడి కాలము సంప్రాప్తమయినది.
    రాత్రి గడచును. పగలు గతించును. రాత్రివచ్చును. జనులకు సుఖ దుఃఖములును రాత్రింబవళ్లవలె వచ్చిపోవుచుండును. సుఖములందు ఉన్నపుడు ఆపదలు, ఆపదలందున్నపుడు సుఖములు కలుగుచుండును. ఈవిధముగా పూర్వజన్మ కర్మము వలన సుఖదుఃఖములు కలుగుచున్నవి. బుద్ధిమంతుడు ఈ విషయమును గ్రహించి, మహాధైర్యవంతుడయి, సుఖ దుఃఖములు కలిగినపుడు నిర్వికార బుద్ధికలిగి యుండును. అట్టివాడు సర్వదా మహాసుఖి అయిఉండును".




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.