Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 2
16. సమయానుకూలముగ నడుచు మీరథమునకు రెండు చక్రములు సూర్యచంద్రులు కనిపించునవి. మూడవ చక్రము కనిపించని సంవత్సరము ఈ విషయము బ్రాహ్మణులు ఎరుగుదురు. విద్వాంసులు ఎరుగుదురు.
17. సూర్య, దేవగణములు, మిత్రుడు, వరుణుడు, వీరందరు ప్రాణుల క్షేమము కోరువారు వారికి నమస్కరించుచున్నాను.
18. వీరు ఇద్దరు శిశువులు సూర్యచంద్రులు వీరు తమశక్తిచే తూర్పుపడమరలకు తిరుగుదురు. వారు ఆటలాడుచు యజ్ఞములకు వచ్చెదరు. వారిలో చంద్రుడు మాసములు, పక్షములు ఏర్పరచుచు విశ్వము వీక్షించును. రెండవ వాడగు సూర్యుడు ఋతువులను ఏర్పరచును. మరల మరల జన్మించును. "జాయతేపునః"
19. సూర్యుడు దినములు సూచించువాడు నిత్యము నూతనుడై ఉదయమున ప్రత్యక్షమగును. దేవతలకు యజ్ఞభాగపు ఏర్పాట్లు చేయును. చంద్రుడు దీర్ఘాయువు ప్రసాదించును. "చంద్రమాప్తిరతే దీర్ఘమయః"
20. సూర్యా ! నీవు పతి గృహమునకు వెళ్లునపుడు-శోభన పలాశము, శాల్మలుతో నిర్మించిన నానా రూప, సువర్ణ వర్ణ ఉత్తమ, శోభన చక్రవంత రథమును ఎక్కుము. సుఖకర, అమర స్థానమందు సోమము వైపు సాగుము.
21. విశ్వావసూ! ఈ కన్య వివాహమైనది నీకు నమస్కరించు చున్నాను. స్తుతించుచున్నాను, నీవు ఇచటనుండి కదలుము మరొక వివాహయోగ్య కన్య పితృగృహమున ఉన్న అచటికి వెళ్లుము. ఆమె నీ భాగ్యమునకు జన్మించినది. ఆమెను గురించి తెలిసికొనుము.
22. విశ్వావసూ! నీకు నమస్కరింతును నిన్ను పూజింతును. నీవు ఇచటినుండి కదలుము. నిలిచిన కన్య వద్దకు వెళ్లుము. ఆమెను పతితో కలుపుము.
23. దేవతలారా ! మా మిత్రులు కన్య తండ్రిగృహమునకు వెళ్లుచున్నారు. వారి మార్గము సుగమము కంటక రహితము కావలెను ఆర్యమ, భగదేవత మమ్ము క్షేమముగా చేర్చవలెను. భార్యాభర్తలు కలసి ఉండవలెను. "సంజాస్పత్యం సుయమమస్తు దేవాః"
24. కన్యా ! సుందరుడగు సూర్యుడు వరుణునిచే పాశబద్ధను చేయించినాడు. నేను నిన్ను ఆ బంధమునుండి విముక్తను చేయుదును. సత్యమునకు ఆధారము, సత్యనివాసమగు స్థానమున నిర్విఘ్నముగా నిన్ను పతిదగ్గరకు చేర్చెదను. "ఋతస్యయోనౌ సుకృతస్యలోకేరిష్టాం త్వాసహ పత్యాదధామి."
25. నేను కన్యను పితృవంశమునుండి విడిపింతును. భర్త గృహమున స్థాపింతును. వర్షక ఇంద్రా ! ఈమె సౌభాగ్యవతి, సుపుత్రవతి కావలెను.
26. నీ చేతిని అందుకొని పూష నిన్ను ఇచటినుండి తీసికొని వెళ్ళవలెను. అశ్వినులు నిన్ను రథము మీద తీసికొని వెళ్ళవలెను. ఇంటికి చేరి ఇల్లాలివగుము. భర్తను అనుసరించి ఉండుము. భృత్యులు మున్నగు వారిని ఏర్పరచుము.
27. ఈ ఇంట బిడ్డలను కనుము. ఆనందించుము. ఇచట జాగ్రత్తగా మసలు కొనుము. భర్తతో నే దేహమును కూర్చుము ముసలితనము వరకు ఇంట పెత్తనము చేయుము.
28. పాపదేవతయగు కృత్య నీలలోహిత అగుచున్నది. ఈ స్త్రీని విడిచి పోయినది. అప్పుడు ఈమె వంశము వర్థిల్లినది ఈమె భర్త సంసార బంధనములందు ఉన్నాడు.
29. కృత్య వెళ్లిపోయినది మలిన వస్త్రము వదలండి బ్రాహ్మణులకు ధనము ఇవ్వండి. భార్యాభర్తలు కలిసికొను చున్నారు.
30. భర్త భార్య వస్త్రమును చుట్టు కొనరాదు. అట్లు చేసిన కృత్య అతనిపై ఆక్రమణ చేయును. ఎంతటి వాడైనను ధనహీనుడగును.
31. వరుడు వధువునకు ఇచ్చిన ఆహ్లాదకర వస్త్రములను వచ్చిన వారి ప్రయత్నములను యజ్ఞభాగమలందుకొను దేవతలు విఫలము చేయవలెను.
32. పగతో ఈ దంపతుల వద్దకు వచ్చువారు పాడు కావలెను. దంపతులు సుఖములచే కష్టములను కొట్టి వేయవలెను. శత్రువులు దూరములకు పారిపోవలెను "ద్రాన్త్వరాతయః"
33. సుమంగళీరియంవధూరిమాం సమేత పశ్యత |
సౌభాగ్యమస్యై దత్వాయాథాస్తాం విపరేతన ||
ఈమె వధువు సుమంగళి ఆశీర్వదించువారందరు వచ్చి చూడండి ఈమె భర్తకు ప్రేమ పాత్రురాలగునట్లు ఆశీర్వదించండి. అందరు మీ ఇండ్లకు వెళ్లిపొండి.
34. ఈ వస్త్రము దూషితము అగ్రాహ్యము మలినము విషయుక్తము వాడతగినది కాదు. సూర్యను తెలిసిన బ్రాహ్మణుడు మాత్రమే దీనిని పరిగ్రహించగలడు.
35. సూర్య రూపము ఎట్లున్నదో చూడండి ఆమె వస్త్రము మొదట చిరిగినది మధ్యన చిరిగినది నలువైపుల చిరిగినది బ్రాహ్మణుడు మాత్రమే దానిని చక్క పెట్టగలడు.
36. "వివాహే కన్యాహస్తగ్రహణే గృభ్బామీత్యేషా" వివాహమున ప్రాణిగ్రహణమప్పటిది. నీ సౌభాగ్యము కొరకు నేను నీ పాణిగ్రహణము చేయుచున్నాను. నన్ను పతిగా పరిగ్రహింఛి వృద్ధావస్థవరకు నడుపుము. ఇదే నా ప్రార్థన, భగ, ఆర్యమ, పూష దేవతలు గార్హపత్యము కొరకు నిన్ను నాకు ఇచ్చినారు.
37. పూషా! ఏ స్త్రీ గర్భమున పురుషుడు బీజము వేయచున్నాడో ఆమెను కళ్యాణిని చేసి పంపుము. ఆమెకు ఇంద్రియ ప్రహారము చేయుదును. "ఉశన్తః ప్రహారామశోపమ్."
38. అగ్నీ ! ముసుగు సహితముగా సూర్యను ముందు నీ వద్దకు తెచ్చెదరు. ఆమెను నీవు సంతానమునకు గాను భర్త చేతికి ఇస్తావు.
39. అగ్ని మరల సౌందర్యము, పరమాయువుతో వనితను అందించినాడు. ఈమెపతి దీర్ఘాయువు అగును. నూరేళ్లు జీవించును "పతిర్జీవాతి శరదః శతమ్."
40. సోముడు మొదట నిన్ను పత్నిగా గ్రహించినాడు. గంధర్వుడు నీకు రెండవ పతి అయినాడు మూడవవాడు అగ్ని మనుష్య వంశజుడు నీకు నాలుగవ పతి అయినాడు.
41. సోముడు ఆమెను గంధర్వునకు ఇచ్చినాడు. గంధర్వుడు అగ్నికి ఇచ్చినాడు ధనసంతాన సహితముగ అతడు నాకు ఇచ్చినాడు "రాయించపుత్రాంశ్చాదాదగ్నిర్మహ్యమధో ఇమామ్"
42. ఇహైవస్తం మావియౌష్టం విశ్వమాయర్వ్యశ్నుతమ్ |
క్రీళన్తేపుత్రైర్నప్తౄభిథ్మొగమా నౌస్వగృహే ||
వధూవరులారా ! మీరు కలసి ఉండండి విడిగా ఉండవద్దు ఎంతో కాలము జీవించండి. పుత్ర, పౌత్రులతో ఆడుకొనుచు ఆనందించుచు మీగృహమున ఉండండి.
43. గృహప్రవేశ సమయమందు :-
ప్రజాపతి మాకు సంతానము ప్రసాదించవలెను. ఆర్యమ వార్థక్యము వరకు మమ్ము కలిపి ఉంచవలెను. వధువా! నీవు మంగళమయవై పతి ఇంట ఉండుము. మా మనుష్యులకు పశువులకు శుభములు కూర్చుము.
44. నీ చూపు దోషరహితము కావలెను భర్తకు శుభదాయకవగుము. పశువులకు క్షేమము కలిగించుము. నీ మనసు ప్రఫుల్లము, సౌందర్యము శుభ్రము కావలెను. వీరమాత వగుము. దేవతల భక్తురాలవగుము. మా మనుష్యులకు పశువులకు శుభములు కూర్చుము.
45. వర్షక ఇంద్రా ! ఈమెకు ఉత్తమ పుత్రులనిమ్ము. సౌభాగ్యవతిని చేయుము. ఈమె గర్భమున పదిమంది పుత్రులనుంచుము. పతితో కలసి పదకొండుమంది కావలెను "దశాస్యాం పుత్రానాధేహి పతిమేకాదశం కృధి."
46. వధువా ! నీవు అత్తమామలు మరుదులమీద సామ్రాజ్ఞి వగుము. అందరి మీద పెత్తనము చేయుము.
47. సమజ్ఞన్తు విశ్వేదేవాః సమాపోహృదయానినౌ |
సంమాతరిశ్వాసంధాతా సముదేష్ట్రీధాతనే ||
సకల దేవతలు మా ఇద్దరి మనసులను ఏకము చేయవలెను. జల, వాయు, ధాత, సరస్వతులు మా ఇద్దరిని సంయుక్తులను చేయవలెను.
ఆలోచనామృతము
మానవుడు ఏకాకిగా వంటరిగా వేరుగా జీవించ జాలడు. పశుపక్ష్యాదులు సహితము వంటరి జీవితము గడుప జాలవు తోడు లేనిది జీవితము సాగదు వంటరి బ్రతుకు బ్రతుకేకాదు.
జీవితమున ఎక్కువకాలము కలిసి ఉండుటకు మగకు ఆడ - ఆడకు మగతోడు అవసరము. ఈ జంటతోడుకు మాత్రమేకాదు గురుతరమగు కుటుంబ బాధ్యతలు నిర్వహించవలసి ఉన్నది. సమాజపు స్వరూప, స్వభావములు ఎటువంటివి అయినను అది దంపతులు కుటుంబము మీదనే ఆధారపడును మంచి కుటుంబమే మంచి సమాజమగును.
ఏ ఇద్దరి స్వభావములు, అభిరుచులు, అభిప్రాయములు ఒక తీరుగా ఉండవు. ఇది ప్రకృతిరీతి. అట్లయినను ఒక ఆడా - మగ జంటను కూర్చుట అవసరము. కొన్ని పక్షిజాతులలో దాంపత్యము అపూర్వము జత బాసిన క్రౌంచపు విషాదమే రామాయణ మహకావ్య నిర్మాణమునకు ఆధారము కదా ! మనిషి పశుపక్ష్యాదుల నుండి నేర్చినాడో - అవసరమే అట్లు చేసినదో విడిపోని జంటను గురించి ఆలోచించినాడు ఇరువురిని కలుపుటకు వివాహమను పవిత్రబంధమును ఏర్పరచినాడు. 'అనన్యారాఘవేణాహం' అని వాల్మీకి సీతతో అనిపించినను 'వాగర్ధావివ సంప్రక్తా' అని కాళిదాసు ప్రార్థించినను ఈ వివాహ బంధమును నిలుపుటకే సాహిత్యమున ముప్పావు మువ్వీసము ఇందుకే అంకితమగుచున్నది. ఇది నాటిమాట నేటిమాట రేపటిమాట.
ఈ సూక్తమున అందముగ, రమ్యముగ, మనోహరముగ వివాహమును గురించి చెప్పబడినది. ఇది ఏనాటిదో తెలియని కాలమున ఇంత చక్కగా చెప్పబడినది ఇందు వధువుకు ప్రాధాన్యత ఇవ్వబడినది. 'గృహిణీగృహముచ్యతే' అని కదా నానుడి! ఇటుకలు ఇల్లుకాదు !! ఇల్లాలే ఇల్లగును. !!! ఇల్లాలికి ఇంటిమీద, భృత్యులమీద, పశువులమీద, అత్తమామలు మరదుల మీద అధికారము ఇచ్చినాడు "సామ్రాజ్ఞీ" అన్నాడు నీవుతోడుగా నన్ను వృద్ధావస్థవరకు నడుపుము అని వరుడు ప్రార్థించుట ఆమె అధికారమునకు సంకేతము 42వ మంత్రమును మించిన దాంపత్యమును గురించిన ఆశయము ఉండదేమో! పిల్లలు పిల్లల పిల్లలతో ఆడుకుంటూ గడిపే వార్థక్యం! ఇంతకు మించి ఆశించగలమా ! మరీ ఆర్ద్రత గలది 45వ మంత్రము పతిని సహితము పదిమంది పుత్రులలో చేర్చి పదకొండవ వానిని చేసినాడు ! పదిమందిని కన్న తల్లి భర్తకు తల్లివలె ప్రేమించుటయే కోరుకొనునది ! 37వ మంత్రమున కాయకమగు కామ సంబంధమును వివరించి 47వ మంత్రమున మనసుల కలయికను అడిగినాడు.
సమజ్జన్తు విశ్వేదేవాః సమాపోహృదయానినౌ |
సంమాతరి శ్వాసంధాతా సముదేష్ట్రీదధాతునౌ ||
అతినాగరకత, అతిసంపద, అతి స్వేచ్చతో కుటుంబాలను విచ్చిన్నం చేయుచున్న రాక్షస యంత్ర నాగరకతకు ఇది మానవతా సందేశము ! మహావేద సందేశము!! వినెనా కుటుంబము నిలుచును. వినకున్న కుటుంబము కూలును! సమాజము కూలును!! సంస్కారము కూలును !! నరుడు ఎడారిలో ఏకాకయి నిలుచును.
(శ్రీమదాంధ్ర వచన ఋగ్వేద సంహిత పదవ మండలము ఎనిమిదవ అష్టకమున మూడవ అధ్యాయము సమాప్తము)
ఓం నతామినన్తి మాయినో నధీరావ్రతాదేవానాం ప్రథమాధ్రవాణి
నరోదసీ అద్రుహా వేద్యా భిర్న పరవతానినమేత స్థివాంసః
నాలుగవ అధ్యాయము ఎనుబది ఆరవ సూక్తము
ఋషి - ఇంద్రపుత్ర వృషకపి. దేవత - ఇంద్రుడు. ఛందస్సు - పంచపదపంక్తి.
ఓం విహితోసోతో రసృక్షతనేంద్రందేవమమంసత |
యత్రామదహృషా కపిరర్యః పుష్టేషు మత్సఖా విశ్వస్మాదింద్ర ఉత్తరః ||
1. నేను ఇంద్రుడను సోమాభిషవము చేయుమని దేవతలకు చెప్పినాను. కాని వారు ఇంద్రుని కాక 'వృషాపి' ని స్తుతించినారు. సోమప్రవృద్ధయజ్ఞమున వృషాకపి నాకు మిత్రుడై సోమపానము చేసినాడు. హృష్టుడైనాడు అయినను నేనే సర్వశ్రేష్ఠుడను.
2. ఇంద్రా ! నీవు సోమపానమునకు కాదు - హృదయము స్పందించి హరిత వర్ణమృగ వృషాకపికి వద్దకు వెళ్లుదువు. ఇంద్రుడే సర్వశ్రేష్ఠుడగును. "విశ్వస్మాదింద్ర ఉత్తరః"
3. ఇంద్రా ! వృషాకసి నీ కేమి మేలు చేసినాడని ఉదారుడవై హరితవర్ణ మృగ వృషాకపికి పుష్టి కరమగు ధనము నిచ్చినావు? "విశ్వస్మాదింద్ర ఉత్తరః."
4. ఇంద్రా ! నీకు వృషాకపి ప్రియుడు. నీవు అతనిని రక్షింతువు అట్టివాని చెవిని వరాహమును కోరు కుక్క కొరకవలెను. "విశ్వస్మాదింద్ర ఉత్తరః."
5. ఇంద్రాణి అనుచున్నది :-
నా కొరకు యజమానులు ఘృతయుక్త సామగ్రిని ఏర్పరచినారు. దానిని వృషాకపి దుహితము చేసినాడు నాకు వాని తల నరకవలెననిపించుచున్నది. వారు చెడు కార్యము చేసినాడు వానికి నేను సుఖము కలిగించజాలను. "విశ్వస్మాదింద్ర ఉత్తరః."
6. నన్ను మించిన సౌభాగ్యవతి లేదు సుపుత్రవతియులేదు భర్త ముందు శరీరము ప్రఫుల్లము చేయుట యందును రతి సమయమున తొడలు ఎత్తుట యందును నన్నుమించినది లేదు "విశ్వస్మాదింద్ర ఉత్తరః."





