Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam



    బ్రహ్మదేవుడు మునిగణ సమేతుడయి అక్కడికి వచ్చినాడు. అక్కడ శివుని చూచి సంతోషించినాడు. అప్పుడు ఇంద్రుడు ఐరావతము ధరించు రెండు ఘంటాభూషణములను కుమారస్వామికి సమర్పించుకున్నాడు. స్వామి తాను ఒకటి ఉంచుకొని విశాఖునకు మరొకటి ఇచ్చినాడు.
    అది చూచినాడు శివదేవుడు. కుమారునకు కలిగిన గౌరవమునకు ఆనందించినాడు. కుమారస్వామిని కౌగిలించుకున్నాడు. శిరసు మూర్కొన్నాడు. పార్వతీ, పరమేశ్వరులు ఇద్దరు కుమారస్వామిని తీసుకొని వేయి సింహములు కట్టిన రథమును ఎక్కినారు. భద్రవటమునకు పయనమయినారు.
    శివునిముందు యక్షగణములతో కుబేరుడు సాగినాడు. వెనుక ఐరావతమును ఎక్కి ఇంద్రుడు సాగినాడు. కుడిప్రక్కన యమధర్మరాజు, అమోఘుడు అను యక్షుడు, ఎడమ ప్రక్కన రుద్రదేవతలు, ఆదిత్యులు, వరుణుడు నడచినారు. చంద్రుడు శివునకు తెల్లని గొడుగు పట్టినాడు. వాయువు, అగ్ని, శివుని పాదములు పట్టినారు. దేవతా స్త్రీలు విద్య, సావిత్రి, గాంధారి, కౌశిని, పార్వతిని సేవించుచు వెళ్లినారు.
    శివదేవుడు మహావైభవమున భద్రవటమునకు చేరినారు. తన పుత్రుడయిన కుమారస్వామిని చూచి "కుమారా! సప్తమంబయిన మారుత స్కంధమునకు అధిపతివి అగుము. దేవతలకు కష్టము కలిగినప్పుడు సాయము చేయుము. సర్వదా నాపాదములను స్మరింపుచుండుము. శుభములను పొందుము" అని కుమారస్వామిని కౌగిలించుకొని సాగనంపినాడు.
    అప్పుడు అతివేగముగా అనేక ఉత్పాతములు కలిగినవి. దిక్కులు మండినవి. భూమి దిద్దిర తిరిగినది. ఆకాశము అరచినది. కుల పర్వతములు వడకినవి. లోకమున చీకట్లు కమ్ముకున్నవి. దేవతల మనసులు భయ భ్రాంతములు అయినవి.
    ఉత్పాతములతో మహిషాసురుని రాక్షస సైన్యములన్నియు ఒక్క పెట్టున శివునిసేన మీద విరుచుకు పడినవి. వారి శస్త్రాస్త్ర సమూహముల వలన దావానలమువలె మంటలు చెలరేగినవి. రాక్షససేన కదలికకు భూమి వడకినది. వారు చేయు ధ్వనులకు చెవులు చిల్లులు పడినవి. మహిషాసురుని సేనలు ఉరికివచ్చి దేవతల సేనను చుట్టుముట్టినవి. లెక్కలేనన్ని క్రూర బాణములు గుప్పినవి. గదాయుధములు, ఖడ్గములు, ముసలములు, పరిఘలు, శతఘ్నలు దేవతల మీద కురిపించినారు. ఆ దాటికి దేవ సైన్యములు అదరిపోయినవి. ఆ దాడికి అనేక ఏనుగులు చచ్చినవి. గుఱ్ఱములు నశించినవి. మహారథికులు అనేకులు చచ్చినారు. సైన్యము గ్రక్కదల పారిపోసాగినది.
    అప్పుడు ఇంద్రుడు పారిపోవుచున్న దేవతలను పిలిచినాడు. ధైర్యవంతులయి రాక్షసులను గెలువవలెను అని వెనుకకు పిలిచినాడు. దేవతలు తిరిగి వచ్చి తమ తమ ఆయుధములచే రాక్షససేన మీద విరుచుకొని పడినారు. ఆ దెబ్బకు రాక్షససేనలోని ఏనుగులు చచ్చినవి. కాల్బలము కూలినది. రక్తము ప్రవహించి నేల ఎఱ్ఱవారినది. కార్చిచ్చుచేత అడవులు దహించబడినట్లు దేవతల అస్త్రములకు రాక్షస సైన్యములు కాలి కూలినవి. దేవతల ధాటికి రాక్షససేనలు అదరిపోయినవి. సైన్యములు గ్రక్కదల పారిపోయినవి.
    అప్పుడు మహిషాసురుడు ఒక్క పెట్టున సింహనాదము చేసినాడు. పారిపోవుచున్న రాక్షససేనకు ధైర్యము చెప్పినాడు. వెనుకకు పిలిచినాడు. మహిషాసురుడు ఒక మహాపర్వతమును పెరికి దేవసైన్యము మీదకి విసరినాడు. అందుకు భూమి చలించినది. దాని కిందపడి వేలమంది రాక్షసులు చచ్చినారు. ఇంద్రాదులు భయభ్రాంతులయి వెనకకు మరలినారు.
    మహిషాసురునకు ఉత్సాహము హెచ్చినది. అతడు అతిభయంకరుడు అయినాడు. అతడు సింహనాదము చేసినాడు. శివుని రథమునే పట్టినాడు. కదలకుండ చేసినాడు. మహిషాసురునకు శివుడు చిక్కినాడని, చచ్చినాడని రాక్షసులు చెప్పుకున్నారు. రాక్షసులు చేసిన సింహనాదములకు ముల్లోకములు వణకినవి. మునీశ్వరులు గడగడలాడినారు. అప్పుడు శివుడు చిరునవ్వు నవ్వినాడు. కుమారస్వామితో అన్నాడు:-
    "కుమారా! చూచినావా ఈ మహిషాసురుని దుష్టచేష్టలు! ఇతడు నా రథమునే పట్టినాడు. కదలనివ్వకుండ ఆపినాడు. నాకు గొప్ప అపరాధము చేసినాడు. వీనిని వధింపుము".
    శివుని మాటలు విన్నాడు కుమారస్వామి. కోపమున ఉప్పొంగినాడు. అతని కనులు నిప్పులు ఉమిసినవి. ఎఱ్ఱని కన్నులు, ఎఱ్ఱని భూషణములు, ఎఱ్ఱని పుష్పములు, ఎఱ్ఱని వస్త్రములు కలిగిన స్వామి జాజ్వల్యమానమయిన అగ్నిజ్వాలవలె కనిపించినాడు. అతడు శక్తి ఆయుధము ధరించి మహిషాసురుని మీదకి ఉరికినాడు. శక్త్యాయుధమును మహిషాసురుని మీద ప్రయోగించినాడు.
    మహాశక్తి ఆయుధము ప్రళయాగ్నివలె కదలినది. సర్వత్ర వ్యాపించినది. మహిషాసురుని దహించినది. భస్మము చేసినది. మహిషాసురుడు కాలి కూలినాడు.
    కుమారస్వామి మరొకసారి శక్తిని ప్రయోగించినాడు. దాని వలన లక్షలకొలది రాక్షససేనలు కాలికూలినవి. మిగిలిన వారిని ప్రమధగణములు చీల్చి, చెండాడినవి. సూర్యుడు చీకట్లను నశింప చేసినట్లు కుమారస్వామి శత్రువులను నశింపచేసి ప్రకాశించినాడు. ఇంద్రుడు కుమారస్వామిని కౌగలించుకుని "స్వామీ! ఈ మహిషాసురుడు బ్రహ్మ వలన వరములు పొందినాడు. విఱ్ఱవీగినాడు, మమ్ము లక్ష్యపెట్టినాడు కాదు. అట్టివాడు నీ కోపాగ్నిలో విడుతవలె కాలి చచ్చినాడు" అని కీర్తించినాడు.
    శివుడు కుమారస్వామిని మాటి మాటికి కౌగిలించుకున్నాడు. సంతోషము పట్టలేకపోయినాడు. ఇంద్రాదులారా! కుమారుడు అనితర సాధ్యమును సాధించినాడు. మిమ్ము, మమ్ము కాపాడినాడు. కావున నా విషయమున కనబరచిన గౌరవమునే కుమారస్వామి విషయమున కనబరచి అతనిని గౌరవించుడు" అని ఆజ్ఞాపించినాడు. శివుడు, ఇంద్రాదులు పరమానందమున తమ తమ నివాసములకు చేరినారు.
    ఇక్కథ భక్తితోవినిన నెప్పుడు గీర్తనసేసినన్ జనుల్
    నిక్కము సర్వదోషముల నీగి భజింతురు భవ్యభద్రముల్".

                                                        ఆలోచనామృతము

    1. దేవదానవ యుద్ధములు అనాదిగా జరుగుచున్నవి. దేవతలు రాక్షసులు రెండు జాతులు. ఈ రెండు జాతులను గురించి అనేక వాదములు ఉన్నవి. నిర్దిష్టమైన నిర్వచనము ఇంతవరకు లేదు. ఈ రెండు విభిన్న నాగరకతలు గల జాతులని మాత్రము చెప్పవచ్చును. వీరి యుద్ధములు జాతి ద్వేషముతో కూడినవి. దక్షిణాఫ్రికా వంటి కొన్ని దేశములలో నేటికిని జాతి ద్వేషము ఉన్నది. అనాగరకము అమానుషము అయిన జాతిద్వేషమునకు వ్యతిరేకముగా గాంధీజీ పోరాటము సాగించినాడు.
    దేవదానవ యుద్ధములు వేదకాలము నుండి ఉన్నవి. ఈ కథ నాటికి రాక్షసులది పైచేయిగా ఉన్నది. దేవతలు దిక్కుతోచక పారిపోయినారు. అప్పటికి రాక్షసులు బలవంతులు. కాబట్టి దైత్యసేన వారిని వరించి వెళ్లిపోయినది. దేవసేన అట్లుకాదు. ఆమె బలమును సంపదను లక్ష్యము చేయక తన జాతికి అంకితమయినది. అది దేవసేన చేసిన త్యాగము. అందుకే ఆమెకు అంత ప్రాధాన్యత వచ్చినది. బ్రహ్మ, ఇంద్రుడు మున్నగువారు ఆమెను మెచ్చినారు. ఆమెకు అసామాన్యమయిన భర్తను ఇచ్చినారు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.