Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 2



    5. యజ్ఞభాగమును స్వీకరించు విశ్వకర్మా ! యజ్ఞకాలమందు మాకు ఉత్తమ, మధ్యమ, సాధారణ దేహములను చూపుము నీవు అన్నయుక్తుడవు స్వయముగా యజ్ఞము చేయుదువు. నీ శరీరమును బలపరచు కొందువు.

    (1. ఉత్తమ భూతావి దేవశరీరాణి 2. మధ్యమభూతావి మనుష్యాది శరీరాణి 3. నికృష్టభూతాని క్రిమి కీటకాది శరీరాణి ఇతి శయణాచార్యః)

    6. విశ్వకర్మా ! నీవు ద్యావాపృథ్వులందు యజ్ఞము చేసినావు. స్వయముగా పుష్టివంతుడవు అయినావు. మా యజ్ఞవిరోథులు మూర్చిల్లవలెను. ఈ యజ్ఞమున ధనికుడగు విశ్వ కర్మ స్వర్గఫలదాత కావలెను.

    7. నేడు - ఈ యజ్ఞమునాకు మా రక్షణలకు విశ్వకర్మను ఆహ్వానింతుము. అతడు మా సకల హవనములను సేవించవలెను అతడు మా రక్షణకు సుఖోత్పాదకుడు సాధుకర్మవంతుడు కావలెను.

                                  ఎనుబది రెండవ సూక్తము
                                         ఋష్యాద్యాః పూర్వవత్

    1. విశ్వకర్మ శరీరములను సృష్టించువాడు. అనుపమధీరుడు. అతడు తొలుత జలములను కల్పించినాడు తదుపరి జలములందు కదలాడు ద్యావాపృథ్వులను సృష్టించినాడు. ద్యావాపృథ్వుల ప్రాచీనములగు అంచులను విశ్వకర్మ బలపరచినాడు. అప్పుడు ద్యావాపృథ్వులు ప్రసిద్ధములైనవి.

    2. విశ్వకర్మ మనసు బృహత్తరము. అతడు స్వయముగా బృహత్తరుడు. సర్వశ్రేష్ఠుడు సర్వర్షుల స్థానదర్శకుడు. విద్వాంసులు అతడు ఒక్కడే శ్రేష్ఠుడు అందురు "పరఃఏకమ్ ఆహుః."

    3. విశ్వకర్మ మాకు పాలకుడు. స్రష్ట సకల భువనకర్త విశ్వమందలి సకల ధామములను తెలిసినవాడు. దేవతలకు పేర్లు పెట్టువాడు ఒక్కడే "ఏక ఏవ" సకల భువనములు అతనినే చేరుకొనును.

    4. స్థావర జంగమాత్మక విశ్వము ఏర్పడినది. అప్పుడు ఋషులు ప్రాణులకు ధనాదులు సమకూర్చినారు. ఆ ప్రాచీన ఋషులే స్తోతలవలె ధనము వ్యయించి యజ్ఞానుష్ఠానము చేసినారు.

    5. ఇది ద్యులోకము ఇది భూలోకము ఇవి అసురులను దేవతలను అతిక్రమించి నిలిచినవి. ఈ జలము ఎటువంటి గర్భము దాల్చినది! అందు నిలిచి ఇంద్రాది దేవతలు పరస్పరము చూచుకొను చున్నారు!!

    6. ఆ విశ్వకర్మచే జలము గర్భమున దాల్చినది! గర్భమందు సకల దేవతలు కలసి ఉందురు. "అజస్యనాభావధ్యేకమర్పితం తస్మిన్విశ్వానిభువనాని తస్థుః" అతడు అజుడు జన్మరహితుడు అతని నాభియందు బ్రహ్మాండము నిలిచినది. ఆ బ్రహ్మాండమునందు సకల ప్రాణులు ఉన్నవి.

    7. సకల భువనములను సృష్టించిన విశ్వకర్మను మీరు ఎరుగరు. మీ బుద్ధికి అతనిని తెలిసుకొను శక్తిలేదు. అజ్ఞానమను మంచు కప్పిన జనులు నానా కల్పనలు చేయుదురు. వారు ఇహభోగములకే యత్నింతురు - తాక్తవికముగా ఆలోచించరు. "అసుతృప ఉక్ధశాసశ్చరంతి."

    ఆలోచనామృతము :-

    1. అన్వేషణ జీవితము. చివరకు ఆలోచించిన అనుకున్నవి లభించినది అరుదు ! ఇక సృష్టిమూలమును గురించి ఆలోచనకు అంతమెక్కడిది? "విశ్వవిషయ కర్మన్ ఏతన్మామక పరమేశ్వర" అని వేద వ్యాఖ్యాత్ శాయణాచార్యులు.

    విశ్వమును చేయువాడు విశ్వకర్మ. కర్మమును బట్టినామము ఆ పదార్థమెయ్యది? ఆ అన్వేషణముననే పేర్లు. ఇవి మనము పెట్టినవి అసలు ఆపదార్థమెయ్యది? ఇది ప్రశ్నయే!

    2. ఈ సూక్తములందు సృష్టిని గురించి తెలిసికొను జిజ్ఞాస ఉన్నది. ఒక మహత్తరమైన ప్రశ్ననున్నది! "యద్యదధ్యతిష్ఠద్భువనాని ధారయన్, లోకములను సృష్టించినవాడు దేనిమీద నిలిచినాడు?" మనీషిణోమనసాపృచ్ఛ" విద్వాంసులారా! మనసును అడగండి. విశ్వమును సృష్టించినవాడు సృష్టికి ముందు దేనిమీద నిలిచి సృష్టించినాడన్నది మేధావులకు ప్రశ్న! ఇది ఇంతవరకు ప్రశ్నయే! అసలు ఈ భూమి దేనిమీద నిలిచి ఉన్నది? ఇది ఇంతవరకు నాకు తెలియని ప్రశ్న.   

    3. 'ఏక ఏవ' ఒక్కడే అను పదము స్పష్టముగా చెప్పబడినది. ఏకవబ్రహ్మా ద్వితీయం బ్రహ్మము ఒక్కడే రెండవవాడులేడు. ఒక్కడే సకల సృష్టిస్థితిలయములకు కారకుడు ఆ ఒక్కడెవరు? 'అజస్య' అని ఒక పదము వాడినాడు. అతడు జన్మరహితుడు ఇది మరొక విశేషణము ! "అజస్యనాభావధ్యేకమర్పితం తస్మిన్విశ్వాని భువనాని తస్ధుః" అజుని నాభియందు బ్రహ్మాండము అందుసకల భువనములు ఉన్నవి.

    4. అజ్ఞానము మంచు వంటిది. 'నీహారేణ' అన్నాడు. ఒక పదార్థమును చూచుటకు మధ్యనున్న మంచు కరగుట అవసరము. పదార్థము ఉన్నది. దానిని చూచువాడు ఉన్నాడు. మధ్య అజ్ఞానము మాయ నిలిచినది. అజ్ఞానము తొలగిన పదార్థము దర్శనమిచ్చును. చీకటిలో త్రాటిని చూచి పాము అని భ్రమపడు వానికి పోవలసినది చీకటి అప్పుడు వాస్తవము కనిపించును.

    భగవద్దర్శన విషయమున మాత్రమే కాదు జీవితమున అనేక విషయములందు ఈ 'అజ్ఞానము' వాస్తవమును చూడనివ్వదు. అజ్ఞానమును అవతలికి జరుపుట అంత సామాన్యముకాదు.!!!

                                 ఎనుబది మూడవ సూక్తము
        ఋషి - తపసపుత్ర మమ్య. దేవత - మమ్య. ఛందస్సు - 1. జగతి
                                      మిగిలినవి త్రిష్టుప్.

    1. మన్యువు వజ్రసదృశుడు బాణతుల్యుడు క్రోదాభిమాని అతనిని పూజించిన యజమానికి ఓజస్సు, బలము రెండును కలుగును. అతని సాయమున మేము ఆర్య, దస్యు ఉభయ శత్రువులను ఓడించగలము మన్యూ! నీవు బలకర్తవు బలరూపుడవు మహాబలవంతుడవు.

    2. మన్యువే ఇంద్రుడు దేవత హోత వరుణుడు జాతప్రజ్ఞ అగ్ని అగును. సకల మానవ ప్రజ మన్యుని స్తుతించును. మన్యూ ! నీవు మాతండ్రితో కలసి మమ్ము రక్షింపుము.

    3. మన్యూ ! నీవు మహాబలవంతుడవు. విచ్చేయుము నా తండ్రిని సాయముకొని శత్రువును ధ్వంసము చేయుము. నీవు శత్రుసంహారకుడవు. వృత్రఘ్నడవు దస్యుహంతవు మా కొరకు సమస్త ధనములను తెమ్ము.

    4. మన్యూ ! నీవు అన్యులను ఓడించువాడవు. స్వయంభువవు. దీప్తిశాలివి శత్రుంజయుడవు. సర్వ దిగ్దర్శకుడవు. శత్రుసహిష్ణుడవు. బలవంతుడవు మా సేనలను తేజోవంతములను చేయుము.

    5. ఉత్తమ జ్ఞానవంత మన్యూ ! నీకు నేను యజ్ఞభాగము సమకూర్చలేక పోయినాను. అందువలన పూజించలేక పోయినాను. నీవు మహామహుడవు. నిన్ను నేను పూజించలేక పోయినాను. అందుకు నేను సిగ్గుపడుచున్నాను. నీ గుణమును అనుసరించి, నీ ఇష్టప్రకారము, నాకు హలము ప్రసాదించుటకు విచ్చేయుము.

    6. మన్యూ ! నేను నీ దరి చేరినాను. అనుకూలుడవగుము. నాముందు అవతరించుము. నీవు అక్రమాలు సహించగలవాడవు అందరను భరించగలవాడవు.

    వజ్రధరమన్యూ! నన్ను ఆత్మీయుడనుకొనుము. మాకు అభ్యుదయము ప్రసాదించుము. అట్లగుట వలన నేను దస్యులను జయించగలను.

    7. నా వద్దకు రమ్ము నా కుడిపక్కన నిలువుము. అట్లగుట వలన ఉభయులము వృత్రులను నాశము చేయగలము. నీ కొరకు నేను ఉత్తమము మధురమగు సోమరసము హవనము చేయుదురు. మనము మొదలు ఏకాంతప్రదేశమున సోమమును సేవింతము.

                               ఎనుబది నాల్గవ సూక్తము
        పూర్వవత్ ఋషిదేవత. ఛందస్సు - 1-3 త్రిష్టుప్ 4-7 జగతి.

    1. మన్యూ! మరుత్తులు మున్నగు వారు నీతోకూడ ఒకే రథముపై ఆసీనులు కావలెను. వారు హృష్టులై, ధృష్టులై, తీక్ష్ణ బాణవంతులై, ఆయుధములను పదును పెట్టి, మండిపడు అగ్నివంటివారై నీకు సహాయముగా యుద్ధమునకు తరలవలెను.

    2. మన్యూ ! నీవు గనిసమ ప్రజ్వలితుడవగుము. శత్రువులను జయించుము. సహనశీల మన్యూ ! నిన్ను పిలుచుచున్నాము. యుద్ధమున మాకు సేనాపతివగుము. శత్రువులను వధించుము. వారి ధనము మాకిమ్ము. మాకు బలమునిమ్ము.

    3. మన్యూ ! మమ్ము ఎదిరించు శత్రువును జయించుము. కొట్టుచు, చీల్చుచు శత్రువు ముందు దూకుము. నీ దుర్ధర్వ బలమును వశపరచుకొనగలడు.

    4. మన్యూ ! నీ స్తుతి జరుగును. నీవు ఒక్కడవు యుద్ధము కొరకు విశేషప్రజను పురికొల్పుము. నీవు సహాయకుడవై ఉండగా మా దీప్తికి హాని కలుగదు. జయము కలుగుటకు గర్జింతుము. "ఘోషం విజయాయ కృణ్మహే"

    5. మన్యూ ! నీవు ఇంద్ర సమ విజేతవు. నీ మాటలందు నిందలుండవు. ఈ యజ్ఞమందు మాకు విశేషరక్షకుడవగుము. నిన్ను నీకు ప్రియమగు స్తోత్రమున స్తుతింతుము. ఈ స్తోత్రమున ప్రవృద్ధుడవగుము. నిన్ను లోకోత్పాదకునిగా మేము తెలియుదుము.

    6. మన్యువు వజ్రతుల్యుడు శత్రు పరాభవకారి. శత్రునాశకుడు. శత్రునాశము నీ స్వభావమగును. నీ తేజస్సు ఉత్కృష్టము. నీవు కర్మసహితుడవై మా యుద్ధమున వెలుగొందుము నీవు అనేకులచే ఆహ్వానించబడువాడవు.

    7. వరుణ, మన్యులారా! లభించిన గోవులను, తెచ్చిన ధనములను మాకు అందించండి. శత్రువులు భీరువులు కావలెను. పరాజితులు కావలెను. జయించవలెను "లయన్తామ్."

                              ఎనుబది అయిదవ సూక్తము
        ఋషి - సవితృసుత సూర్య. దేవత - వేరు వేరు. ఛందస్సు - వేరు వేరు.

    1. దేవతలందు సత్యరూప బ్రహ్మ పృథ్వివి ఆకసమున నిలిపి ఉంచినాడు. ఋతరూప ఆదిత్యుడు ద్యులోకమున సోమము నిలిచి ఉన్నది "దివిసోమోఅధిశ్రితః"

    2. సోమముననే ఇంద్రాదులు బలిష్ఠులగుదురు. సోమము వలననే భూమి ప్రకాండమైనది. నక్షత్రములందు సోమము నిక్షిప్తమైనది.

    3. వనస్పతిరూప సోమమును నూరినంతనే జనులు సోమపానము చేసినామనుకుందురు. కాని బ్రాహ్మణులు దేనిని సోమమందురో దానిని అయాజ్ఞికులు పానము చేయజాలరు.

    4. సోమమా ! స్తోతలు దాచుట ఎరిగిన వారై నిన్ను రహస్యస్థానమున ఉంచుదురు. నీవు ప్రస్తర శబ్దము విందువు నేలమీది నరుడు నిన్ను పానము చేయలేడు. "నాతే అశ్నాతి పార్ధివః"

    5. సోమదేవా ! నిన్ను పానము చేసినంత నీకు వృద్ధికలుగును. క్షయముకాదు. మాసములు సంవత్సరమునువలె వాయువు సోమమును రక్షించును. రెండింటి స్వరూపము సమానమగును.

    6. సూర్యపుత్రి వివాహ సమయమున 'రౌంభీ' నామక ఋక్కులు ఆమెకు సఖులు ఆయనవి. 'నరాసీ' నామక ఋక్కులు ఆమెకు దాసీలయినవి సూర్యునియొక్క సుందర వస్త్రములు సామగానమున సంస్కరించ బడినవి.

    7. సూర్యపతి గృహమున మెట్టినపుడు చైతన్యమే వలువ అయినది. నేత్రములే ముసుగు అయినవి ద్యావాపృథ్వులు కోశములైనవి.

    8. స్తోత్రమే ఆమె రథచక్రమునకు దండము అయినది. కురీరనామక ఛందస్సు రథపు లోపలి భాగమైనది. సూర్య వరులు అశ్వినీకుమారులయినారు. అగ్ని అగ్రగామి దూత అయినాడు.

    9. సూర్య మనసున పతిని కోరినది. సూర్యుడు తన పుత్రి సూర్యను ప్రదానము చేయునపుడు సోముడు ఆమెను పెళ్లాడదలచినాడు. కాని అశ్వినులనే వరులుగా స్వీకరించుట జరిగినది.

    10. సూర్య తనపతి గృహమునకు వెళ్లినది. ఆమె మనసే ఆమెకు శకటమైనది. ఆకాశము ఆచ్ఛాదనమైనది. సూర్య చంద్రులు శకట వాహకులు అయినారు.

    11. ఋక్, సామములు వర్షించిన రెండు వృషభములు సూర్య చంద్రులు ఆమెకు శకట వాహకులు అయినారు. ఆమె చెవులు రెండు రథచక్రములు అయినవి "శ్రోత్రంతే చక్రే ఆస్తాం" రథము నడచుమార్గము ఆకాశమయినది.

    12. సూర్య తనపతి గృహమునకు వెళ్లునపుడు ఆమె మనసే శకటమైనది ఆమె కనులు రథచక్రములైనవి వాయువు రథమునకు అక్షము ఇరుసు అయినది.

    13. పతి గృహమునాకు వెళ్లునపుడు సూర్యుడు తన కూతురుకు ఒక వలువ ఇచ్చినాడు. అది ఆమె ముందు నడచినది. మఖనక్షత్రపు ఉదయకాలమున వలువ అంగస్వరూపమైనది. వీడ్కోలు సమయమున ఇచ్చిన గోవులను కర్రచే తోలబడును పూర్వఫల్గుణి, ఉత్తర ఫల్గుణి నక్షత్రములందు వలువను రథము పైన తీసికొని వెళ్లుదురు.

    14. అశ్వినులారా! మీరు మూడు చక్రముల రథము ఎక్కినారు. సూర్య పెళ్లి విషయము మాట్లాడినారు ఆమెను పెండ్లాడినారు. అప్పుడు సకల దేవతలు మిమ్ము సమర్థించినారు. మీ పుత్రుడు పూషమిచ్చినాడు.

    15. అశ్వినులారా! మీరు సూర్యుడు వరులైవెళ్లినారు కదా అప్పుడు మీ చక్రము ఎచట ఉండెను? మార్గమును గురించి ఆలోచించునపుడు మీరు ఎచట నిలిచినారు?




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.