Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam



    కుమారస్వామి శౌర్య ప్రతాపములకు వెరచి సకల భూత గణములు స్వామిని ఆశ్రయించినవి. సేవించ సాగినవి. అది తెలుసుకున్న దేవేంద్రునకు కోపము వచ్చినది. సకల దేవగణములతో కూడి కుమారస్వామి మీదకి దాడికి వెడలినాడు. దేవతలందరు అగ్నివంటి ఆయుధములు ధరించి కుమారుని మీద అస్త్రములు విసరినారు. కుమారస్వామి అదిచూచి భయంకరముగా నవ్వినాడు. కుమారస్వామి నవ్వు నుండి అగ్నిజ్వాలలు రేగినవి. అవి దేవగణములను చుట్టముట్టి కాల్చసాగినవి. దేవతలందరు భయపడి స్వామిని శరణుజొచ్చినారు.
    దేవతలు స్వామిని శరణుజొచ్చినారు. ఇంద్రుడు అది చూచినాడు. సహించలేక పోయినాడు. స్వామి మీదకు వజ్రాయుధము విసరినాడు. అది స్వామి కుడిపక్క తాకినది అందునుండి మేక ముఖముగల ఒక పురుషుడు పుట్టినాడు. అతడు విశాఖుడు అయినాడు. కుమారస్వామి దేహమందు అనేక కుమార గణములు, కన్యా గణములు పుట్టినవి. వాటిని చూచి ఇంద్రుడు భయపడినాడు. కుమారస్వామిని ఆశ్రయించినాడు. దేవతలు అటు కుమారస్వామిని, ఇటు ఇంద్రుని ఉభయులను సేవించినారు.
    కుమారస్వామిని సకల భూత, దేవగణములు సేవించుచుండినవి. స్వామి నవరత్న ఖచితమయిన బంగారు కిరీటము ధరించి సంపూర్ణ యవ్వనవంతుడై సర్వ శుభ లక్షణములు కలిగి ఉన్నాడు. అప్పుడు లక్ష్మీదేవికి కుమారస్వామి యందు అనురాగము కలిగినది. లక్ష్మీదేవి పద్మమును ధరించి వచ్చి, అందరు చూచుచుండగా కుమారస్వామిని పొందినది. అప్పుడు కుమారస్వామి అత్యధిక తేజోవంతుడయి చంద్రునివలె ప్రకాశించినాడు.
    కుమారస్వామి వర్తమానము జగత్తు నందంతటను వ్యాపించినది. సకల ముని జనులు స్వామి వద్దకు వచ్చినారు. "నీవు సర్వలోకములను జయించుటకు సమర్థుడవు. దేవేంద్ర పట్టణమునకు అభిషిక్తుడవయి, మమ్ములను పాలింపుము" అని ప్రార్థించినారు.
    మునులు చెప్పిన మాటలను ఇంద్రుడు కూడ సమర్థించినాడు. "కుమారా! నీవు మహా శౌర్యవంతుడవు. సాహసవంతుడవు. నీవు దేవేంద్ర పదవికి అర్హుడవు. నేను ఇంద్ర పదవి యందు ఉండుటకు భయపడుచున్నాను. ఏలనన నాయందు తప్పిదములు కల్పించి నీకు చెప్పువారు ఉందురు. అందువలన నీకు నామీద కోపము కలుగును. అందువలన నీకును, నాకును సర్వలోక భయంకరమగు యుద్ధము జరుగును. అది నివారించుట మంచిది. కావున నీవు సకల దేవ రాజ్యమును గ్రహించుము. ఇంద్రుడవు కమ్ము!" అని ప్రార్థించినాడు.
    మునుల మాటలు, ఇంద్రుని విన్నపము విన్నాడు కుమారస్వామి. మెల్లగా నవ్వినాడు. ఇంద్రునకు అభయము ఇచ్చినాడు. అన్నాడు:-
    "ఇంద్రా! భయము విడువుము. నిశ్చింతగా ఉండుము. నేను ఇంద్ర పదవిని ఆశించను. సదా నీతో స్నేహము కలిగి ఉండును. నా భుజబలము వలన నీశ్రమ పోగొట్టెదను. నీవు చెప్పిన పనులను చేసి విశ్వ శ్రేయస్సుకు తోడ్పడెదను. నన్ను లోక కళ్యాణ కార్యములకు నియమింపుము". కుమారస్వామి మాటలు విన్నాడు ఇంద్రుడు. ఎంతో సంతోషించినాడు. "స్వామీ! నీవు సత్యవంతుడవు. శౌర్యవంతుడవు. తేజోవంతుడవు. నీ ఆజ్ఞ చొప్పున నేను ఇంద్ర పదవిని నిర్వహింతును. నీవు దేవ సైన్యములకు సేనాపతివై లోకమును రక్షింపుము, భయంకరులగు రాక్షసులను వధించుము" అని ప్రార్థించినాడు.
    కుమారస్వామి ఇంద్రుని ప్రార్థన మన్నించినాడు. దేవ సేనాపతి అగుటకు అంగీకరించినాడు. తనకు దేవసేనాధిపత్యపు పట్టము కట్టవలసినదని కోరినాడు.
    కుమారస్వామి అంగీకరించినందుకు ఇంద్రుడు సంతోషమున ఉప్పొంగినాడు. వెంటనే సేనాధిపత్యమును ఇచ్చి పట్టాభిషేకము చేసినాడు. అప్పుడు మునులు జయజయ ద్వానములు చేసినారు. దేవతలు సింహనాదములు చేసినారు. గంధర్వులు పాడినారు. అప్సరసలు ఆడినారు. పుష్పవృష్టి కురిసినది.
    కుమారస్వామి సకల ఆభరణములు ధరించినాడు. శిరసు మీద తెల్లని గొడుగు ప్రకాశించినది. అతడు పున్నమి నాటి చంద్రునివలె తేజరిల్లినాడు.
    శ్రీమంతమయిన ఆ సమయమున పార్వతీ సమేతుడయి శివుడు అచటికి వచ్చినాడు. పుత్రుడగు కుమారస్వామిని శివుడు కౌగిలించుకున్నాడు. విశ్వకర్మ నిర్మించిన పుష్పమాలికను కుమారస్వామికి ఇచ్చినాడు.
    కుమారస్వామి శివుని పుత్రుడు ఎట్లాయెను? పూర్వము శివుడు తన వీర్యమును అగ్నియందు భద్రపరచినాడు. శివుని ప్రభావమున అగ్నిదేవుడు కుమారస్వామిని పుట్టించినాడు. వేదవేత్తలు అగ్నిని రుద్రుడని కూడ అందురు. అందువలన కుమారస్వామిని శివుని పుత్రుడు అందురు.
    పూర్వము బ్రహ్మ దేవసేనాని అగువాడే దేవసేనకు భర్తకాగలడని ఇంద్రునకు చెప్పి ఉన్నాడు. ఇంద్రుడు అది తలచుకున్నాడు. దేవసేనను అలంకరించి కుమారస్వామి ముందుకు తెచ్చినాడు. "కుమారా! ఈమె దేవసేన, నీకు భార్య అగుటకు ఈమెను బ్రహ్మ సృష్టించినాడు. కావున నీవు ఈమెను భార్యగా పరిగ్రహింపుము" అని విన్నవించినాడు.
    కుమారస్వామి చిరునవ్వు నవ్వి ఇంద్రుని విన్నపమును అంగీకరించినాడు. ఆ ముహూర్తముననే కుమారస్వామికి దేవసేనకు శాస్త్ర ప్రకారము వివాహము జరిగినది. బృహస్పతి వివాహ కార్యమును జరిపించినాడు. మంగళ వాద్యములు మ్రోగినవి. లోకము సాంతము పెళ్లి వేడుకలు జరుపుకున్నది.
    అగ్నిదేవుడు, ఆరుగురు మహామునుల భార్యల వలన కుమారస్వామి జన్మించినాడని మునులు తమ భార్యలమీద కోపగించినారు. తమ భార్యల శీలము చెడినదని భావించినారు. భార్యలను విడిచినారు. ఆ విధముగా విడువబడిన మునుల భార్యలు ఆరుగురు కుమారస్వామి వద్దకు వచ్చినారు. "కుమారా! అగ్నిదేవుని వలన నీవు మాకు పుట్టినావని దుర్జనులు మమ్ములను అపనిందలపాలు చేసినారు. మా భర్తలు మమ్ము వదలినారు. ఇప్పుడు నీవే మాకు ప్రియ పుత్రుడవు. మమ్ములను రక్షించుట నీ ధర్మమూ. పుత్ర భావమున మా దుఃఖము తీర్చుము. మాకు పుణ్యగతులు కల్పించుము" అని ప్రార్థించినారు.
    కుమారస్వామి తల్లుల మాటలు విన్నాడు. వారికి వినయముగా నమస్కరించినాడు. "మీరు నాకు కన్నతల్లులు అయినారు. చంద్రుని భార్యలు అశ్విని మున్నగువారు. వారిలో అభిజిత్తు గర్వముగలదయి తపస్సునకు వెళ్లినది. మీరు ఆరుగురు ఆకాశమున "అభిజిత్తు" పదమున నిలువుడు" అని వారిని నక్షత్ర పదమున నిలిపినాడు. నక్షత్ర పదమున మునుల భార్యలు ఆరుగురు "కృత్తికలు" అని పిలువబడుచు నిలిచి ఉన్నారు. కృత్తికల పుత్రుడు అయినందున కుమారస్వామికి కార్తికేయుడు అని పేరు వచ్చినది.
    అప్పుడు అగ్నిదేవుని భార్య స్వాహాదేవి అక్కడికి వచ్చినది. కుమారస్వామి ఆమెను సాదరమున ఆహ్వానించినాడు. భార్యా సహితుడయి ఆమెకు పాదాభివందనము చేసినాడు. స్వాహాదేవి కొడుకును, కోడలిని చూచి మురిసిపోయినది. ఆమె వారి వద్దనే ఉండిపోయినది. కుమారస్వామి తండ్రి అయిన అగ్నిదేవునకు, తల్లి అయిన స్వాహాదేవికి సాన్నిహిత్యము కల్పించి "ఇకముందు అగ్నియందు హోమము చేసెడి హవ్యములకు "స్వాహా" అను శబ్దముతో కూడి ఉండునట్లు మంత్రములను నియమించినాడు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.