Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam
ఆలోచనామృతము
1. ఇది ఒక మహత్వ పూర్నమయిన ఇతిహాసము. అందువలననే దీనిని మార్కండేయునితో చెప్పించినాడు. బృహదశ్వుడు, రోమశుడు ధర్మమును గురించి ఇంతగా చర్చించలేదు. వారు చర్చించిన విషయములు వేరు. మార్కండేయుడు ధర్మ సూక్ష్మమును వివరించినాడు.
2. "ధర్మమూ" అనగానే అది ఈ లోకమునకు సంబంధించినది కాదనియు పరలోకమునకు సంబంధించినదనియు ఒక నమ్మకము మనకు కలిగించినారు. "ధర్మము" మన జీవితములకు సంబంధించినదనియు, ఇది ఈ లోకమునకు సంబంధించినదని గ్రహించుట అవసరము అనునది ఈ ఇతిహాసమునందలి ప్రధాన సందేశము.
3. కులమున కన్న గుణమే ప్రధానమని ధర్మరాజు నహుషునకు వివరించినాడు. దానిని మార్కండేయుడు ఆమోదించి, ధృవీకరించుటకు సంబంధించినది ఈ ఇతిహాసము. "కులము - గుణము" వీటిని గురించి ఈనాటికి రచ్చ కొనసాగుతున్నది. గుణమే ప్రధానమని ప్రగతి శీలుర అభిప్రాయము. దానిని ధర్మరాజు, మార్కండేయుడు ధృవపరచినారు. గుణములకు మిన్న అయిన ధర్మవ్యాధునితో వేదము చదివిన కౌశికునకు ఉపదేశము చేయించినారు!
4. కౌశికుడు అహంకారి, కోపిష్టి. వేదము చదివినానని విఱ్ఱవీగువాడు. తనకే ధర్మములన్నియు తెలియునని గర్వమున్నవాడు. అతని గర్వమును అణచి అతనికి కర్తవ్యము బోధించుటకు చెప్పిన సుందరమయిన కథ ఇది. ఈ కథను చెప్పుటలోనే గొప్పదనమున్నది.
వేదాంతమను వెఱ్ఱిలో చిక్కిన వానికి పతివ్రత ఆచరణలో కర్తవ్యము బోధించినది. వేదవిద్యకన్న కర్తవ్యము ప్రధానమని చెప్పినది. ఆమె వేదాంతము తెలిసినది కాదు. సామాన్య గృహిణిముందు కౌశికుడు ఓడిపోయినాడు.
ఆమె కౌశికుని ధర్మవ్యాధుని వద్దకు పంపినది. ఆవిధముగా పంపుటలో ఆమె ఉద్దేశ్యములు రెండు. వ్యాధుని వద్దకు పంపుట వలన బ్రాహ్మణ గర్వము తరుగును. రెండవది హితము చెప్పువాడు ఆచరించువాడు కావలెను. ధర్మవ్యాధుడు తలిదండ్రులను పూజించుచున్నాడు, ప్రత్యక్షముగా చూచినగాని కౌశికునకు అర్థము కాదు.
5. వేదవేత్త కౌశికుడు, ధర్మవేత్త ధర్మవ్యాధుని మళ్లీ కులమును చూపియే ఎత్తి పొడిచినాడు. మాంసము అమ్ముటను గురించి ప్రస్తావించినాడు. ధర్మవ్యాధుడు, ఉదారముగా, ఉదాత్తముగా అహింస, హింస వీటిని గురించి ఉపన్యసించి కౌశికుని ఒప్పించినాడు.
6. ధర్మవ్యాధుడు కౌశికునకు చెప్పవలసినది చాల చిన్న విషయము తలిదండ్రులను పూజించుట. కాని అతడు వెంటనే చెప్పలేదు. ఏలననిన చెప్పువాని మీద ముందు వినువానికి "గురి" ఏర్పడవలెను. తనమీద కౌశికునకు "గురి" ఏర్పడుటకు అనేక ధర్మములు చెప్పినాడు. "మాంసము అమ్మువాడవు" అని హేళన చేసిన వానితో "మహాత్మా!" అనిపించుకున్నాడు.
7. కౌశికుని కథ వలన వేద వేదాంగములు చదివిన దానికన్న ఒక సామాన్య కర్తవ్యమును నిర్వహించుట మిన్న అని నిరూపించినాడు. శాస్త్రాధ్యయనమున కన్న సామాన్య ధర్మము నిర్వహించుట మిన్న. కౌశికునకు తన ఇంట ఉన్న ముసలి తలిదండ్రులు కనిపించలేదు, కంటికి కనిపించని వేద వేదాంగములు కనిపించినవి. తలిదండ్రులను పోషించుట అతని ప్రథమ కర్తవ్యము. అది నిర్వహించి వేదవేదాంగములు అభ్యసించిన తప్పులేదు. కౌశికుని ప్రథమ కర్తవ్యమును బోధించినాడు ధర్మవ్యాధుడు.
ధర్మవ్యాధుని బోధ కౌశికునకు మాత్రము కాదు మనందరికి.
గృహస్థులకు ప్రథమ కర్తవ్యము కుటుంబ పోషణము. ఆ తరువాత అన్నియు.
8. కని, పెంచి పోషించిన తలిదండ్రులు వృద్ధులు అయినపుడు వారిని ఆదరించుట, పోషించుట పుత్రుల కర్తవ్యమయి ఉన్నది. పూరుడు తన తండ్రికి యౌవనము ఇచ్చినాడు. భీష్ముడు తండ్రి కొఱకు తన జీవిత సౌఖ్యములను త్యాగము చేసినాడు. ఆకాలములు పోయినవి. దుర్యోధనునిలో స్వార్థము పెరిగి తన తండ్రిని గుప్పిట పెట్టి ఆడించినాడు. కౌశికుడు తన తలిదండ్రులను మఱచి వేదాధ్యయనమునకు పూనుకున్నాడు. పుత్రులు కౌశికుని వంటి వారయిన వృద్ధులయిన తలిదండ్రుల గతి ఏమికాను?
వృద్ధులయిన తలిదండ్రుల బాధలను చూచి మనసు కరిగి వ్యాసమహర్షి ఈ మహత్తమమయిన ఇతిహాసమును ప్రవచించినాడు.
9. ఇంతకు తేలినది ఏమనిన 1. కులము కన్న గుణము ప్రధానము, 2. వృత్తి కన్న ప్రవృత్తి ప్రధానము, 3. శాస్త్ర చర్చ కన్న కర్తవ్యము ప్రధానము, 4. ముందు ఇంట గెలిచి ఆ తరువాత రచ్చ గెలువవలెను.
కుమారస్వామి కథ
"మహాత్మా! మార్కండేయ మహర్షీ! కుమారస్వామి యొక్క అద్భుత చరిత్ర వినిపించవలసినది" అని దాహ్ర్మరాజు కోరినాడు.
మార్కండేయ మహర్షి కుమారస్వామి చరిత్రను వివరించినాడు:-
పూర్వము దేవతలకు రాక్షసులకు యుద్ధము జరిగినది. ఆ యుద్ధమున రాక్షసులు దేవతలను ఓడించినారు. ఇంద్రుడు దేవగణములను తీసుకొని యుద్ధభూమి నుండి వెళ్లిపోయినాడు. ఇంద్రాదులు మానస పర్వతమునకు వెళ్లినారు. రాక్షసులను జయించుటను గురించి కార్యాలోచనము చేసినారు. బలవంతుడయిన సేనాపతి ఉండవలెనని వారు నిర్ణయించినారు. అటువంటి వాని కొఱకు ఉపాయము ఆలోచింప సాగినారు.
ఇంద్రుడు మానస పర్వతమున ఉన్నాడు. "అన్నా! నన్ను రాక్షసుడు ఎత్తుకొని పోవుచున్నాడు. రక్షించ వలసినది" అను కేక వినిపించినది. ఆ కేకలు విని ఇంద్రుడు ఉరికినాడు. "కౌశి" అను భయంకర రాక్షసుడు ఒక దేవకన్యను ఎత్తుకొని పోవుచున్నాడు. ఇంద్రుడు కౌశితో యుద్ధము చేసినాడు. దేవకన్యను విడిపించినాడు. కౌశి అను రాక్షసుడు పారిపోయినాడు. ఇంద్రుడు ఆ దేవకన్యను గురించి అడిగినాడు. ఆమె చెప్పినది:-
"మాతండ్రి అరిష్టనేమి. మేము "దేవసేన", "దైత్యసేన" అను అక్క చెల్లెళ్లము. ఆటలాడుకొనుటకు చెలికత్తెలతో కూడి ఈ ప్రాంతములకు వచ్చినాము. ఈ రాక్షసుడు మా దగ్గరికి వచ్చి మన్మధ వికారము కలిగి దుశ్చేష్టలు చేసినాడు. మా సోదరి దైత్యసేనకు అవి నచ్చినవి. ఆమెను అతడు తీసుకొని వెళ్లిపోయినాడు. మరికొంతసేపటికి కౌశి మరల వచ్చినాడు. అతడు నన్ను ఎత్తుకొని పోవుచుండగా నీవు నన్ను రక్షించినావు".
"అమ్మా! దేవసేనా! మన ఇద్దరి తల్లుల దక్ష ప్రజాపతి కూతుళ్లు. కావున నీవు నాకు సోదరివి. సాహసమున నీవు రక్కసుల నుండి బయటపడినావు. నీకు ఒక వరమును ఇత్తును కోరుకొనుము" అన్నాడు.
"అన్నా! పూర్వము ఒకసారి నా తండ్రి నాకు పౌరుష ధనుడయిన భర్త లభించును" అన్నాడు. నాకు అటువంటి భర్త కావలెను. అతడు దేవతలచేతగాని, రాక్షసులచేతగాని జయింపబడరాదు. ఎంతటి శత్రువునయినను చంపుటకు సమర్థుడయి ఉండవలెను. మహా గుణవంతుడు కావలెను. అటువంటి భర్తను నాకు కూర్పుము" అని వరము అడిగినది.
ఇంద్రుడు దేవసేనను తీసుకొని బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్లినాడు. దేవసేనకు తగిన భర్తను ఇవ్వవలసినదని ప్రార్థించినాడు. దేవేంద్రా! దేవసేనకు భర్తకానున్న మహా బలవంతుడే మీకు దేవసేనాని కాగలడు. ఇది నిశ్చయము" అని చెప్పినాడు బ్రహ్మ.
ఇంద్రుడు దేవసేనాని కొఱకు యత్నించుచున్నాడు అతడే దేవసేనకు భర్తకాగలడని తెలుసుకున్న ఇంద్రునకు సంతోషము కలిగినది. తాను ఇద్దరి కొఱకు కాక ఒక్కరి కొఱకే ప్రయత్నించవలసి ఉన్నది.
ఇది ఇట్లుండగా సప్తఋషులు యజ్ఞము తలపెట్టినారు. అక్కడికి సప్తఋషుల భార్యలు అందముగా అలంకరించుకొని వచ్చినారు. అగ్నిదేవుడు వారిని చూచినాడు. అతనికి వారిమీద మనసయినది. యజ్ఞ కుండమున జ్వలించుచు తన నాల్కలతో ముని భార్యలను తాకవలెననుకున్నాడు. వారిని కౌగిలించ దలచినాడు. కాని అగ్నిదేవునకు మనస్సు ఒప్పలేదు.
అగ్నిదేవునకు మన్మథాగ్ని బాధ కలిగినది. అతడు అడవులు పట్టినాడు. చాలా దుఃఖించినాడు. కంటికి కడివెడుగా ఏడ్చినాడు. నదిలోపడి ప్రాణములు విడుచుటకు సిద్ధమయినాడు.
అగ్నిదేవుని భార్య స్వాహాదేవి. ఆమె భర్త బాధ తెలుసుకున్నది. సప్తఋషులలో అంగిరసుడు ఒకడు. అతని భార్య "శివ". స్వాహాదేవి శివ వంటి రూపము దాల్చినది. అగ్నిదేవుని వద్దకు వెళ్లినది. తనతో రమించవలెనని కోరినది. అగ్నిదేవుడు సంతోషించినాడు. 'శివ" రూపమున ఉన్న స్వాహాదేవితో రమించినాడు. స్వాహాదేవి అగ్నిదేవుని బిందువును ధరించినది. చాటునకు పోయినది. గరుడ పక్షి అయినది. శ్వేత పర్వతమునకు ఎగిరిపోయినది. అక్కడ రెల్లు గడ్డితో చుట్టబడిన బంగారు కుండయందు రేతో బిందువును ఉంచినది. ఆవిధముగా సప్తఋషులలో ఆరుగురి భార్యల రూపము దాల్చినది స్వాహాదేవి. అగ్నిదేవునితో రమించినది. అగ్నిదేవుని శుక్ల బిందువులను రెల్లుగడ్డితో చుట్టబడిన బంగారు కుండ యందు భద్రపరచినది. వశిష్ఠుని భార్య అరుంధతి. ఆమె మహాపతివ్రత. స్వాహాదేవి ఆమె రూపము ధరించలేకపోయినది.
శుక్ల పాడ్యమినాడు అగ్నిదేవుని ఆరు వీర్య బిందువులను స్వాహాదేవి బంగారు కుండ యందు కలిపినది. విదియనాడు ఆరు బిందువులు గర్భ రూపము దాల్చినవి. తదియనాడు గర్భమందుగల శిశువునకు శరీరము ఏర్పడినది. చవితినాడు సంపూర్ణమయిన అవయవములు ఏర్పడినవి పంచమినాడు ఆకుండ నుండి ఒక కుమారుడు ఉద్భవించినాడు. ఆ విధముగా ఉద్భవించినవాడు కుమారస్వామి. అతడు సూర్యునివంటి తేజస్సు గలవాడు. అతనికి ఆరు ముఖములు, పన్నెండు చేతులు ఉండినవి. అతడు ఒకచేత శక్తి ఆయుధమును, ఒకచేతి యందు కోడిని, రెండు చేతులందు శంఖమును, రెండు చేతులతో బాణములు ధరించినాడు.
అంతకుముందు శివుడు త్రిపురములను దహించిన ధనువు అక్కడ పడి ఉన్నది. కుమారస్వామి దానిని గ్రహించినాడు. బాణములు విడిచినాడు. అవి మహాధ్వని కలిగించినవి. అది విన్న ఐరావత, సుప్రతీకములు అను దిగ్గజములు స్వామి మీదికి ఉరికినవి. కుమారుడు వాటిని పట్టి రెండు చేతులతో అణచి పెట్టినాడు.
కుమారుడు పదునైన బాణములు కొట్టినాడు. క్రౌంచ పర్వతమును బద్దలు కొట్టినాడు. శక్తి ఆయుధముచేత శ్వేత పర్వత శిఖరమును పడగొట్టినాడు. ఆరునోళ్లతో కుమారుడు సింహనాదము చేసినాడు. అది ప్రళయకాల భైరవధ్వని వలె భయంకరమయినది. ఆధ్వనికి కులగిరులు కదలినవి. దిక్కులు బద్దలయినవి. భూచక్రము దిద్దిర తిరిగినది. సముద్రములు క్షోభించినవి, దేవ గణములు భయపడిపోయినవి. వారు వ్యాకులత చెంది ఇంద్రుని వద్దకు ఉరికినారు. ఇంద్రునితో అన్నారు:-
దేవేంద్రా! అగ్నిదేవుని పుత్రుడు కుమారుడు భయంకరమయిన శౌర్య ప్రతాపములు కలవాడు. అతడు నిన్ను కూడ లక్ష్యపెట్టడు. నీ పదవిని సహితము కాజేయును. కావున నీవు సైన్య సమేతముగా వెళ్లుము. అతనిని వధింపుము. అట్లు కాకున్న నీకు రక్షణ లేదు. మాకును రక్షణ లేదు".
ఇంద్రుడు వారి మాటలు విన్నాడు. వడకి పోయినాడు. సప్తమాతృకలను పిలిచినాడు. కుమారుని చంపుటకు పంపినాడు. సప్తమాతృకలు ఉగ్రముగా స్వామి మీదకు ఉరికినవి. కాని స్వామి తేజస్సుకు వెరచినవి. స్వామిని శరణుజొచ్చినవి. తమ విషయమున మాతృభావము వహించమని ప్రార్థించినవి. స్వామి అంగీకరించినాడు. తల్లులకు నమస్కరించినాడు. అప్పుడు అగ్నిదేవుడు తన పుత్రుని వద్దకు వచ్చినాడు. కుమారస్వామి తండ్రి విషయమున భక్తి చూపినాడు. పూజించినాడు. అగ్నిదేవుడు అచటనే ఉండిపోయినాడు. సప్తమాతృకల క్రోధమున 'లోహితాస్య' అను స్త్రీ జన్మించినది. ఆమె కుమారస్వామికి "దాది" అయినది.





