Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam
2. మానవునకు పూర్వజన్మ వశమున సుఖ దుఃఖములు కలుగుచున్నవి. విజయము కలిగినపుడు తన గొప్పదనము అనుకొనుట, అపజయము కలిగినపుడు దైవమును దూషించుట మూర్ఖజన లక్షణము. అది ఎట్లనగా నీతిమంతులు అయినవారు కొన్ని కార్యములను చేసిన ఫలింపవు. అవినీతిపరులు, అధర్మ పరాయణులు కార్యములందు ఫలితము పొందుదురు. కొందరు బహుశ్రమ పడినను ధన ద్రవ్యాదులు ఆర్జించలేరు. కొందఱికి శ్రమలేకనే అవి లభించుచున్నవి. కొందరు బీదలకు బహు సంతానము కలుగును. కొందఱు సంపన్నులకు దాన, ధర్మవ్రతాదులు చేసినను సంతానము కలుగదు. కావున పురుషుడు కర్మకు కర్త అగును కాని కర్మఫలమునకు కర్తకాదని నిరూపణ అయినది. మానవుడు కర్మాధీనుడయి వర్తించుచున్నాడు. కర్మ పురుషుని వశమున లేదు, పురుషుని వశమున కర్మ ఉన్నచో జరామరణములు లేక అతడు జీవించవచ్చును. కావున కర్మ మానవుని వశమున లేదు. మానవుడు కర్మవశమున ఉన్నాడని ఎరుగవలయును. కర్మవశమున దేహము కలుగుచున్నది, కర్మ వశముననే దేహము జీవించుచున్నది. కర్మవశముననే దేహమునకు మరణము సంభవించుచున్నది. కర్మవశముననే జీవుడు పుణ్యపాపగతులను పొందుచున్నాడు".
కౌశికుడు:- "ధర్మాత్మా! జీవుని లక్షణములు ఏవి? పుణ్య పాపములకు దేహమునకు గల సంబంధమేమి? మోక్షము కలుగు మార్గమేమి?"
ధర్మవ్యాధుడు సెలవిచ్చినాడు.
1. జీవుడు అనాది పురుషుడు, పాపరహితుడు. తన కర్మవశమున అనిత్యమగు దేహమును పొందును. దేహము నశించును. జీవునకు నాశములేదు. జీవుడు ఈ దేహమును విడుచును. మరొక దేహమును పొందును.
2.జీవుడు స్థిరమగు పుణ్యము చేసిన దేవ దేహమును పొందును. పుణ్యపాప కర్మములు మిశ్రమముగా ఉన్న మనుష్య జన్మమును పొందును. పాపమే ఎక్కువగా ఉన్న పశు, పక్షి, మృగాది జన్మములను పొందును. పుణ్య, పాప కర్మవశమున జీవుడు పుట్టుచు, చచ్చుచు, మోహము అను సంసార చక్రమున సర్వదా పరిభ్రమించుచుండును.
3. ఈ సంసార చక్రమును గ్రహించి, మోహమును వదలి, అహంకార, మద, మాత్సర్యాది గుణములు లేనివారయి, బహుకాలము వరకు పుణ్యకర్మములు చేయుచు, శాంత రూపమును పొందిన మహాత్ములు పరిపక్వమయిన చిత్తము కలిగి విషయ సుఖములు వ్యర్ధములని తలచును. అదియే వైరాగ్యము. అట్టివాడు తపస్సత్య మార్గములందు ప్రవర్తిల్లును. అతడు జ్ఞానవంతుడయి పరమపదము పొందును. అదియే మోక్షము".
కౌశికుడు:- "ఇంద్రియములు అనగా ఏమి? వాటికిని పాప పుణ్యములకును సంబంధము ఏమి?".
ధర్మవ్యాధుడు వివరించినాడు:-
"విషయములను తెలుసుకొనుటకు ఇంద్రియములు కారణములు. వానిలో మనస్సు ప్రధానమయినది. మనసు కామక్రోధాది రూపములను పొందును. మానవుని విషయ సుఖములందు ప్రవర్తింప చేయును. అందువలన మానవుడు విషయాసక్తుడు అగును. విషయ సుఖముల వలన రాగము జనించును. రాగము వలన లోభము కలుగును. లోభముచేత క్రూరత్వము అలవడును. క్రూర చిత్తము వలన పాపకార్యములు చేయును".
"క్రూర చిత్తము కలిగి, పాపకార్యములు చేయువాడు మంచి మార్గమును గురించి ఎవరు చెప్పినను వినడు. దుర్మార్గులతో స్నేహము చేయును. అట్టివారు మనస్సున తలచునది ఒకటి, మాట చెప్పునది ఒకటి, పని చేయునది మరొకటిగా ఉండును. కావున ఇంద్రియములను జయించని వారు ఇహమందును పరమందును మహా దుఃఖమును అనుభవింతురు".
"ఇంద్రియములను నిగ్రహించి, ఇంద్రియములను జయించి, సత్సాంగత్యము చేసినవారు ఇహపర సుఖములను అనుభవింతురు. పండితుడగు వాడు పంచేంద్రియములను నిగ్రహించును. తనను ప్రపంచాతీతమయిన పరమాత్మగా పరిగణించును. పరిపూర్ణ జ్ఞానవంతుడు తననే బ్రహ్మముగా తెలుసుకున్న పిమ్మట తపస్సులందు ప్రవర్తింపడు. సకల విషయాసక్తిని విడిచి, నిర్వికల్పముగానుండు బుద్ధి వైభవమే మహాతపస్స్వరూపము. బ్రహ్మవేత్త అట్టి వైభవము పొందిన ఎడల అతనికి తపస్సమాధులతో ప్రయోజనముండదు".
"ఇంద్రియములను జయించుట వలన స్వర్గము కలుగును. ఇంద్రియములను నిగ్రహించలేక, వానికి బానిసలయి ప్రవర్తించిన వారికి నరకము ప్రాప్తించును. కావున ఇంద్రియములే స్వర్గ, నరకములకు కారణములు అగుచున్నవి".
"కౌశికుడా! నీవు అడిగిన ధర్మములను చెప్పినాను" ఇంకను ఏమి వినగోరెదవో చెప్పుము".
"మహాత్మా" కౌశికుడు విన్నవించినాడు. "నీ వలన తెలుసుకొనదలచిన ధర్మములను తెలుసుకున్నాను. నీ ప్రవచనములను బట్టి నీవు సర్వజ్ఞుడవు అని విదితము అయినది. నీ దర్శనము వలన నేను ధన్యుడను అయినాను. నీకు తెలియని ధర్మములేదని తెలుసుకున్నాను".
"విప్రోత్తమా! నేను ఇంత జ్ఞానవంతుడను అగుటకు మూలమయిన ఒక పరమ ధర్మమూ ఉన్నది. దానిని నీకు చూపెదను రమ్ము" అని కౌశికుని తీసుకొని ధర్మవ్యాధుడు తన ఇంటిలోనికి వెళ్లినాడు. ఆలోన సువాసనలు వెదజల్లుచున్నవి. సుఖాసనములు ఉన్నవి. వానిపై ధర్మవ్యాధుని మాతా పితరులు ఆసీనులయి ఉన్నారు. వారు మంచి వస్త్రములు ధరించి ఉన్నారు. భూషణములచేత అలంకృతులయి ఉన్నారు. వారి వదనములందు సంతృప్తి కనిపించుచున్నది. వారి కనులలో ఆనందము తాండవించుచున్నది.
కౌశికుడు తన తలిదండ్రులకు పాదాభివందనము చేసినాడు. వారి కుశలము అడిగినాడు. వారు పుత్రునితో ఇట్లు అన్నారు:-
"నాయనా! నీవంటి పుత్రుడు ఉండగా మాకేమి లోపము? నీవు చేసెడి ధర్మము నీకు సహాయము అగుగాక. నీవు దీర్ఘాయుష్మంతుడవయి సంపదలు పొందుము, నీ సత్ప్రవర్తన వలన మా రెండు వంశములు పవిత్రములు అయినవి. నీవు దేవతవేగాని మానవుడవు కావు. నీవు ఏల మానవ దేహము పొందితివో తెలియకున్నది. నీవు అనేక రూపముల మాకు పరిచర్యలు చేయుచున్నావు. పుత్రులలో నిన్ను మొదట దలచి పిమ్మట పరశురాముని తలచవలెను. లోకమున నీవంటి పుత్రులు కలిగినవారు ధన్యులు".
"కౌశికా! నీవు నా తలిదండ్రులను చూచినావు. వారిద్దరికి శుశ్రూషలు చేసియే నేను బ్రహ్మజ్ఞానము పొందినాను. లోకమున జనులు దేవతలను పూజింతురు. నా తలిదండ్రులు నాకనుల ముందున్న దేవతలు. సకల వేదవ్రతములన్నియు నాకు తలిదండ్రులే. తల్లి, తండ్రి, సద్గురుడు, అగ్నిహోత్రుడు, ఆత్ముడు వీరు అయిదుగురిని గృహస్థుడు పూజింపవలెను. అట్టి వారికి పుణ్యగతులు కలుగును.
"నేను నీకు ధర్మములు తెలిపినాను. కాని నాచిత్తము నీయందు ఇష్టముగా లేదు. నీవు చేసిన చెడు కార్యము ఒకటి కలదు. నీ తలిదండ్రులు ముసలివారయి ఉన్నారు. వారు నీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వారిద్దరికి శుశ్రూష చేసి పోషించుట నీ ధర్మమై ఉన్నది. కాని నీవు వారిద్దరిని విడిచినావు. నిశ్చింతగా వేదాధ్యయనము చేయుచున్నావు. ఇది మిక్కిలి క్రూర కార్యము. నీ తలిదండ్రులు నిన్ను గురించి దుఃఖించి, దుఃఖించి తుదకు అంధులు అయినారు. ఇకనైనను నీవు నీ తలిదండ్రులకు సేవలు చేయకున్న నీ వేదాధ్యయనము నిష్ఫలము అగును. కావున నా మాటలు విని, నీ తలిదండ్రులను భక్తి పూర్వకముగ సేవింపుము. ఆ విధముగా చేసితివేని నీకు మేలు కలుగును" అని ధర్మవ్యాధుడు కౌశికునకు హితబోధ చేసినాడు".
కౌశికుడు ధర్మవ్యాధుని హితబోధ విన్నాడు. అతనికి జ్ఞానోదయము అయినది. ధర్మవ్యాధునితో అన్నాడు:-
"మహాత్మా! నా భాగ్య వశమున నీతో స్నేహము కలిగినది. లోకమున ధర్మమార్గమును అనుసరించువారు అరుదు. పదివేలమందిలో ఒకడు ధర్మబుద్ధి కలిగిఉండును. నీవు సర్వజ్ఞుడవు అయి ఉన్నావు.
"నీవు నాకు చక్కగా ఉపదేశించినావు. నేను పాపమార్గమున పోకుండునట్లు బోధించినావు. నీవు చెప్పినట్లు చేసెదను. నా తలిదండ్రులకు ప్రీతి కలిగించెదను నాకు అనుజ్ఞ ఇమ్ము, వెళ్లివచ్చెదను." అని ధర్మవ్యాధునకు ప్రదక్షిణ, నమస్కారములు చేసి, ధర్మవ్యాధుని అనుమతి పొంది వెళ్లినాడు.
కౌశికుడు గ్రామమునకు వెళ్లినాడు. తలిదండ్రులను సేవించినాడు. వారికి శుశ్రూషలు చేసినాడు, తరించినాడు.
"ఇది ధర్మవ్యాధుని చరిత్రము" అని వివరించిన మార్కండేయుడు "ధర్మరాజా! నీవు అడిగిన పతివ్రతా మహాత్మ్యము, పిత్రు శుశ్రూషా విశేషము, కులమునకు తక్కువ అయినను ధర్మమూ జరిపెడి ఉపాయము తెలియజేసినాను. తలిడంద్రులలో శ్రమ ఎవరికి అధికమయి ఉండును అని అడిగినావు వివరించెదను వినుము".
"ధర్మరాజా! తల్లి శిశువును నవమాసములు మోయును. ప్రాణ భయమునకు లేక్కింపక బిడ్డను కనును. తండ్రి పుత్రుడు కలుగుటకై తపో యజ్ఞాదులను చేయును. కావున సంతానము బాధ్యత తలిదండ్రులు ఇద్దరికి సమానమయి ఉన్నది. తమ సంతానము సమర్థులు, ధర్మపరులు కావలెనని తలిదండ్రులు కోరుకుందురు. వారి ఆశలను కోరికలను ఫలింప చేయువాడు సత్పుత్రుడు. తలిదండ్రులు సంతోషించినచో పుత్రుడు పరమ కీర్తిమంతుడయి అక్షయమయిన పుణ్యములు అనుభవించును" అని చెప్పినాడు మార్కండేయుడు.





