Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam



    "బాపడా! నిన్ను బయట నిలిపి లోనికి వెళ్లగా నాభర్త వచ్చినాడు. అతను ఆకలిగొని ఉన్నాడు. అతనికి సేవ చేయుట నా ప్రథమ ధర్మము. అందువలన ఆలస్యము అయినది.
    నీవు ముక్కోపి అని నాకు తెలియును. నీ కోపమునకు ఒక కొంగ ఆహుతి అయినదని నేను ఎరుగుదును. కోపమును పెంచుత మంచిది కాదు. త్రుంచుటయే మేలు.
    "క్రోధము, మోహము మనసును తపింప చేయును. కావున బ్రాహ్మణుడు వివేకమను ఆయుధమున క్రోధ, మోహములను జయించవలెను. అహింసాపరుడు, సత్యవాది, గురుజన హితకారి, ఇంద్రియ నిగ్రహుడు, అందరిని తనవలె చూచువాడు, కామరహితుడు అయిన వానిని బ్రాహ్మణుడని దేవతలు పొగడుదురు.
    శాంతము, మనోనిగ్రహము, అధ్యయనము అను మూడు గుణములు బ్రాహ్మణునకు పరమ విధులు. ఇవియే వేద విహిత విధులు. ధర్మము అనేక మార్గములుగా కనబడుచు సూక్ష్మమయి ఉండు. నీవు కేవలము వేదాధ్యయన పరుడవయి ఉన్నావు. ధర్మసూక్ష్మ భావములను తెలియకున్నావు. నేను ధర్మ సూక్ష్మమును తెలిసి ప్రవర్తించినాను. నాప్రథమ ధర్మమును నిర్వర్తించి మీకు భిక్ష తెచ్చినాను.
    నీవు ధర్మ సూక్ష్మమును తెలుసుకొనవలసి ఉన్నది. మిథిలానగరమున "ధర్మ వ్యాధుడు" అను కిరాతుడు కలడు. అతడు సత్యవాది. జితేంద్రియుడు, మాతా పితృ భక్తియుతుడు. అతడు నీకు సర్వ ధర్మములను తెలియపరచగలడు. నీకు ధర్మసూక్ష్మము తెలుసుకొనవలెనని ఉన్నచో మిథిలాపురికి వెళ్లుము. ధర్మవ్యాధుని దర్శించుము".
    కౌశికుడు ఆమె మాటలు విన్నాడు. ఆమె చేసిన జ్ఞానబోధకు ఆశ్చర్యపడినాడు. ఆమెకు నమస్కరించినాడు. ఆమెను కొనియాడినాడు. గర్వము విడిచినాడు. మిథిలకు పయనమయినాడు.
    "ధర్మవ్యాధ దర్శనలాలసుండయి కదిలి పతివ్రత యెరుకకు విస్మయంబందుచు దన్నుంగృతాపరాధునింగా దలంచుచు ననేక గ్రామంబు లతిక్రమించి చని యనుపమాన శోభా సనాథంబయిన మిథిలానగరంబు సొచ్చి రాజమార్గంబుదఱిసి యచ్చటి జనంబుల ధర్మవ్యాధుండున్న యెడ నడిగి వారెఱిం
గింప నాటకేగి ముందట నల్ప మృగమాంస ఖండంబు లంగడింబచరించి యమ్ముచున్న వాని ననవరత విక్రయాగత జనసమావృతు నక్కిరాతుంగని యతి జుగుప్సితంబయిన సునాపణంబు సేరనొల్లక తొలంగి యొక్కయెడ నుండె నంత".
    మాంసమును అమ్ముచున్న ధర్మవ్యాధుడు కౌశికుని రాకను తన బుద్ధి వలన తెలుసుకున్నాడు. మాంసపు అంగడి మూసినాడు. కౌశికుని వద్దకు వచ్చినాడు. భక్తి పూర్వకముగ నమస్కరించినాడు. కుశలము అడిగినాడు. "విప్రవర్యా! ఆ పతివ్రత నిన్ను పంపినది. నీవు వచ్చినావు. అది నాకు తెలియును. రమ్ము, నాఇంటికి వెళ్లుదము" అని తన ఇంటికి దారితీసినాడు.
    ధర్మవ్యాధుని మాటలు విని కౌశికునకు విస్మయము కలిగినది. అక్కడి పతివ్రత కొంగ చావును ఎరిగినది. ఇక్కడి ధర్మవ్యాధుడు పతివ్రత పంపిన విషయమును ఎరిగినాడు. వారి ఇరువురి జ్ఞాన సంపదకు కౌశికుడు ఆశ్చర్యపడినాడు.
    కౌశికుడు ధర్మవ్యాధుని ఇంటికి వచ్చినాడు. ధర్మవ్యాధుడు అతనిని ఆదరించినాడు. ఆసనము చూపినాడు. కౌశికుడు ఆసీనుడు అయినాడు. కౌశికుడు అనేక ధర్మసంశయములను గురించి ప్రశ్నించినాడు ధర్మవ్యాధుడు అనేక ధర్మములను వివరించినాడు, అంతస్తులు అంతరించినవి. జ్ఞానార్జన ప్రధానమయినవి. కులాల గోడలు కూలిన సమాగమమది. అది ఒక అపూర్వ సమాగమము.
    కౌశికుడు:- "ధర్మవ్యాధా! నీవు పరమ ధర్మవేత్తవు. అయినను జీవహింస చేసి జీవించుచున్నావు. ఇది మంచి నడవడి కాదు. నీ ఘోర జీవన వృత్తికి నా మనసు మిగుల దుఃఖము పొందినది. నీవు ఈ వృత్తి అవలంబించుటకు గల కారణమేమి?
    ధర్మవ్యాధుడు ప్రవచించినాడు:-
    "కౌశికా! నేను బోయవాడను. మాంస విక్రయము నా వృత్తి ధర్మము. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులకు ధర్మములు చెప్పబడినవి. ఆయా ధర్మములను అనుసరించుట వారి వారి కర్తవ్యము అగును. ఈ దేశమును జనకుడు పాలించుచున్నాడు. వర్ణాశ్రమ ధర్మములు విడనాడినవాడు తన పుత్రుడయినను జనకుడు శిక్షించును. నా కులాచారము మాంసము విక్రయించుట. నేను నా కులాచారమున వర్తించుచున్నాను.
    "నేను మాంసము విక్రయించుచున్నాను. అది నా జీవికకు ఉపకరించుచున్నది. అయినను పరమశాంతమే నా పరమ ధనము. నేను వినయమున గురువులను, వృద్ధులను, అతిథులను, బ్రాహ్మణులను భక్తితో పూజింతును. సత్యమునకు కట్టుబడి ఉందును. భృత్యులను సంతోష పెట్టుదును. బంధుజనులకు తృప్తి కలిగింతును. ఆశను విడిచినాను. శాంతమును గ్రహించినాను. పరుల దోషములు వినను. ఉపవాస వ్రత నియమములను అనుసరింతును. నా భార్యయందే నేను రమింతును. పరులుచేయు స్తుతి, నిందలకు నా మనసు వికారము నొందదు.
    "కౌశికుడా! వృత్తి వేరు. ప్రవృత్తి వేరు. నా వృత్తి మాంస విక్రయము. ప్రవృత్తి నిర్మల మనస్కత. నా మనసును గురించి తెలిసియే ఆ పతివ్రత నన్ను నా దగ్గరకు పంపినది.
    "నీవు హింసను గురించి మాట్లాడినావు. హింస ఇటువంటిదని విభజించి నిరూపించుట ఎవరికిని సాధ్యముకాదు. "సకల భూతములు తమతమ పూర్వజన్మ కర్మముల వలన నశించుచున్నవి. ఆ భూతములను చంపువాడు నిమిత్త మాత్రుడు అగును. ఫలములు, ఓషధులు, కూరగాయలు, పశువులు, మృగములు, ప్రాణులకు ఆహారము అగునట్లు బ్రహ్మదేవుడు ఏర్పరచినాడు. దీనిని కాదనుటకు ఎవరికిని శక్యముకాదు.
    "పూర్వము శిబి చక్రవర్తి తన దేహమును హింసించి తన మాంసమును ఇంద్రాగ్నులకు ఇచ్చినాడు. రంతిదేవుడు తాను చేసిన సత్రయాగమున ప్రతినిత్యము రెండువేల గోవుల చొప్పున హింసించినాడు. రంతిదేవునకు అహింసా పాపము అంటుకొనలేదు. పశువులను హింసించి యజ్ఞము చేసిన మునీంద్రులకు పరమపుణ్య గతులు కలుగుచున్నవి. పితృ దేవతా కార్యములందు మాంసము తప్పక పెట్టవలెనని చెప్పబడినది.
    "మరొక ముఖ్య విషయమును గురించి ఆలోచింపుము. మానవులు భూమిమీద తిరుగుదురు. అప్పుడు వారి పాదముల కింద పడి నలిగి అనేక ప్రాణులు చచ్చుచున్నవి. అది హింస కాదా? భూమి దున్నునపుడు నాగటిచాలున అనేక ప్రాణులు నశించుచున్నవి. అది హింస అగునా? కాదా? మహాత్ములగు మునులు అడవులందు ఉండి చెట్టును నరుకుదురు. కాయగూరలు కోయుదురు. వాటికి ప్రాణములేదా? వారు చేయునది హింస అగునా? కాదా? కావున ఈ జగత్తున హింస చేయనివాడు ఒక్కడు లేడు. అయినను తనకు సాధ్యమయినంతవరకు దూరముగా ప్రవర్తించుట ధర్మము.
    కౌశికుడు:- "ధర్మవ్యాధా! ధర్మము వేరు, ధర్మసూక్ష్మము వేరు అని పతివ్రత వివరించినది. ధర్మసూక్ష్మమును గురించి విశదీకరించుము".
    ధర్మవ్యాధుడు ఉపన్యసించినాడు:-
    "సత్యము చెప్పుట ధర్మమూ అగును. ప్రాణులకు మేలు చేయుటకు చెప్పిన అసత్యము సత్యము అగును. ప్రాణులకు బాధ కలిగించు సత్యమైనను అసత్యమగును. తన ప్రాణమునకు అపాయము కలిగినపుడు, వివాహకాలమందును చెప్పిన అసత్యము సత్యము అగును. ఇది ధర్మసూక్ష్మము.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.