Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam


   
    "మునులారా! ప్రళయమందు నీకు అపాయము కలుగకుండ రక్షించిన నేను ప్రపంచమున ప్రథమ కర్తను విష్ణుదేవుడను. మత్స్యరూపము ధరించి ఇన్ని విధములుగా ప్రవర్తిల్లినాను. నా అనుగ్రహము వలన వైవస్వత మనువునకు పరమజ్ఞానము ఉదయించును. అతడు దేవ, రాక్షస, మనుష్యాత్మకమయిన సకల ప్రపంచమును సృష్టించును" అని చెప్పి అదృశ్యుడయినాడు భగవానుడు.

                                                     ఆలోచనామృతము

    1. ఈ కథకు చాలా ప్రాముఖ్యత ఉన్నట్లు కనిపించుచున్నది. భాగవతమునందు ఈ కథ మత్స్యావతార కథగా చెప్పబడినది. అందు వైవస్వతుడు కాక సత్యవంతుడు ఉన్నాడు. కథ సుమారు ఇట్టిదే. బైబిలునందలి ఓల్డు టెస్ట్ మెంటులోని ఆరవ అధ్యాయమున నోవాకు సంబంధించిన కథ ఉన్నది. అదియు సుమారు ఈ విధముగనే ఉన్నది. బాబిలోనియాలో ఇటువంటి కథ ప్రచారములో ఉన్నట్లు చెప్పబడినది.
    2. భూతదయ మానవత్వ లక్షణము. సకల మతములు భూతదయను గురించి చెప్పినవి. మరొక ప్రాణి బాధను చూచి వ్యధ నొందుట. ఆ ప్రాణి బాధానివారణకు యత్నించుట మానవతా లక్షణము. వైవస్వతుడు అదే పని చేసినాడు. ఆపదలోనున్న చేపను రక్షించుటకు సకల ప్రయత్నములు చేసినాడు. విసుగుకొనలేదు.
    3. వైవస్వతుడు తపస్సు చేసినాడు. చేప కొఱకు తపము విడిచినాడు. స్వార్థమును విడిచి చేపకు సేవ చేసినాడు. తపస్సున కన్న భూతదయ మిన్న అని నిరూపించినాడు.
    4. వైవస్వతుడు తపము వదిలినాడు. ప్రాణిని రక్షించుటకే జీవితము అంకితము చేసినాడు. అంతేగాని అతడు ప్రతిఫలము ఆశించలేదు. సేవచేయు వానికి స్వార్థము, ప్రతిఫలాపేక్ష ఉండరాదని నిరూపించి చూపినాడు.
    5. వైవస్వతుడు ప్రతిఫలమును ఆశించలేదు. అయినను మత్స్య స్వరూపుడయిన భగవానుడు అతనిని ప్రళయము నుండి కాపాడినాడు. నిస్వార్థసేవకు ప్రతిఫలము ఎంతో నిరూపించినాడు.
    6. చేప పెరుగుట విజ్ఞాన అభివృద్ధికి సంకేతము. విజ్ఞానము పెంచుకున్న వానికి బావి చాలదు మడుగు చాలదు. అనంతమయిన సాగరము కావలసి వచ్చును.
    7. ప్రళయమున సర్వము నశించును. విజ్ఞానము నశించదు. కరుణ, దయ నశించవు. సప్తఋషులు, వైవస్వతుడు వానికి చిహ్నములు.
    8. కరుణ, దయగలవాడే సృష్టి చేయగలడు సృష్టిని రక్షించగలడు. పెంచగలడు. పోషించగలడు. రాతి గుండె వాడు ఆపని చేయలేడు. అందుకే భగవానుడు పునః సృష్టి చేయుటకు వైవస్వతుని నియమించినాడు.
    9. తలిదండ్రులు శీలవంతులు అయిన సంతానము శీలవంతమగును. శీలములేని సంతానము సమాజమునకు భారమగును. మంచి సమాజమునకు మంచి సంతానము, మంచి సంతానమునకు మంచి తలిదండ్రులు అవసరము. అందుకే వైవస్వత మనువు సృష్టికి ఆద్యుడు అయినాడు. మనువు సంతానము కాన మానవులు అయినారు. ఒక్కొక్క మన్వంతరపు సృష్టికి ఒక మనువు కారణమగును.
    10. భౌతిక సంపద ఎంత ఆర్జించినను అది ఉండదు. సంపదకు నశించుట లక్షణము. ఎంత ఆర్జించినను మునిగి పోవలసినదే. అది ఆపదలో మనిషికి అక్కరకు రాదు. సంపదను నమ్ముకున్నవాడు సంపదతో నశించవలసినదే. ప్రళయము అందుకు సంకేతము.
    విజ్ఞానము, మానవతను నమ్ముకున్నవాడు సాధారణముగ నశించడు. ఎందుకనగా అతడు నమ్ముకున్నవి నశించునవి కావు. ప్రళయమందును పడవయై అతనిని ఆమెను రక్షించును.
    మంచిని నమ్ముకున్న మానవుడు చెడిపోడు.

                                               ధర్మవ్యాధ చరిత్రము

    "మహాత్మా! మార్కండేయా! పతివ్రతలగు స్త్రీల ప్రభావము వినవలెనని కుతూహలముగా ఉన్నది. పుత్రుని విషయమున తలిదండ్రులలో శ్రమ ఎవరికి అధికమయి ఉండును? తలిదండ్రుల విషయమున పుత్రుడు ఏవిధముగా ప్రవర్తింపవలెను? క్రింది జాతులలో పుట్టినవారు పుణ్యలోకము పొందుటకు ఏవిధముగా ప్రవర్తించవలెను? వివరించవలసినది" అని ధర్మరాజు అడిగినాడు.
    "ధర్మరాజా! నీవు అడిగిన ప్రశ్నలకు సమాధానముగా ఒక ఇతిహాసము చెప్పెదను" అని మార్కండేయుడు కథ చెప్పినాడు.
    పూర్వము కౌశికుడు అను ఒక బ్రాహ్మణుడు కలడు. అతనికి వేదమునందు ఆసక్తి ఎక్కువ. వేదాధ్యయనము చేయుచు ఒక గ్రామమున ఉన్నాడు. ఒకనాడు అతడు ఆ గ్రామమునకు సమీపమున గల ఒక చెట్టు క్రింద కూర్చున్నాడు. వేదములను గుణించ సాగినాడు. ఆ చెట్టు మీద ఉన్న ఒక కొంగ కౌశికుని మీద రెట్ట వేసినది. అది చూచి కౌశికుడు కోపించి తలపైకి ఎత్తి కొంగను చూచినాడు. అతని చూపుకు కొంగ చచ్చి నేలపై రాలినది. కొంగ చచ్చినందులకు కౌశికుడు బాధపడినాడు. తనకు దయాగుణము లేనందులకు చింతించినాడు.
    అంతలో మధ్యాహ్నము అయినది. కౌశికుడు భిక్ష కొఱకు గ్రామమునకు వెళ్లినాడు. అతడు ఒక బ్రాహ్మణుని ఇంటికి వెళ్లి భిక్ష కోరినాడు. బ్రాహ్మణి కౌశికుని చూచినది. ఆదరించినది. భిక్షతెత్తునని లోనికి వెళ్లినది. కౌశికుడు బయట ఎదురు చూడసాగినాడు.
    కౌశికునకు భిక్ష ఇచ్చుటకు బ్రాహ్మణి పాత్రశుద్ధి చేయసాగినది. అప్పటికి ఆమె భర్త ఆకలిగొని ఇంటికి వచ్చినాడు. ఆమె తన భర్తకు కాళ్లు కడిగినది. పీటవేసి భోజనము పెట్టినది. విసనకఱ్ఱతో విసరుచూ కూర్చొని కమ్మని కబుర్లు చెప్పినది. భోజనము అయిన తరువాత భర్తకు పడకవేసి నిద్ర పుచ్చినది. అప్పుడు భిక్ష తీసుకొని కౌశికుని వద్దకు వచ్చినది.
    కౌశికుడు ఆమెను చూచినాడు. మండిపడినాడు. నీవు బుద్ధిలేని దానవు. నీకు గర్వము ఎక్కువ. నన్ను ఇక్కడ నిలిపి నీవు లోన ఇంతసేపున్నావు. కారణమేమి?" అని ఉరిమినాడు.
    బ్రాహ్మణి కౌశికుని ఉరుములు విన్నది. ఆమె కోపగించలేదు. శాంతముగా అన్నది:-




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.