Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam
ఇంద్రద్యుమ్నుడు మార్కండేయుని, ప్రవాళకుని తీసుకొని కొంగ దగ్గరికి వెళ్లినాడు. "నేను ఇంద్రద్యుమ్నుడను. నీవు నన్ను ఎరుగుదువా?" అని అడిగినాడు. అందుకు నాళీక జంఘుడు "నేను నిన్ను ఎరుగను, కాని ఇంద్రద్యుమ్నము అను సరస్సునందు "యుగంధరుడు" అను తాబేలు ఉన్నది. అది వయసున నాకన్న పెద్దది దానిని అడుగుము" అన్నది.
ఇంద్రద్యుమ్నుడు ఆ ముగ్గురిని తీసుకొని ఇంద్రద్యుమ్నము అను సరస్సునకు వెళ్లినాడు. "యుగంధరా! ఒక సందేహము కలిగినది దానిని నీవే తీర్చవలసి ఉన్నది. పెద్దలు నీ కొఱకు ఇక్కడికి వచ్చినారు. నీవు సరస్సు నుండి బయటికి రావలసినది" అని కొంగ ప్రార్థించినది.
యుగంధరుడు కొంగ మాటలు విన్నాడు. మెల్లగా బయటికి వచ్చినాడు. వచ్చిన వారిని చూచినాడు. "సందేహమేమీ?" అన్నట్లు అడిగినాడు. "మహాత్మా! నీవు ఇంద్రద్యుమ్నుడను మహారాజును ఎరుగుదువా? మాకు ఆవిషయము సందేహము కలిగి నీదగ్గరకు వచ్చినాము" అని కొంగ, గుడ్లగూబ, తాబేలును అడిగినవి. "ఇంద్రద్యుమ్నుడా!" అని తాబేలు కొంతసేపు మౌనము దాల్చినది. అతని కంఠము గద్గదమయినది. కన్నీరు రాల్చినాడు. "ఎవరయ్యా మీరు? మహాపురుషుని పేరు విన్నాను" యుగంధరుడు పాతను తవ్వుకున్నాడు.
పరవశుడయి "అయ్యా! ఇంద్రద్యుమ్నుడు మహారాజు. మహాత్ముడు. అతడు మహా గుణవంతుడు. అనేక పర్యాయములు శత్రు భయము లేకుండ నన్ను రక్షించినాడు. నేను అతనిని మరువజాలను". ఇంద్రద్యుమ్న మహారాజు సాగించిన యజ్ఞములకు, చేసిన దానములకు లెక్కలేదు. అతడు అనేకములయిన గోవుల గుంపులను దానము చేసినాడు. ఆ గోవుల కాలి గిట్టలకు నలిగి ఈ సరస్సు ఏర్పడినది. అందువలన ఈ సరస్సునకు "ఇంద్రద్యుమ్నము" అని పేరు. నేను ఈ సరస్సున సుఖముగా ఉన్నాను. అన్నాడు యుగంధరుడు.
తాబేలు మాటలు పూర్తి కాకుండగనే దేవదూతలు విమానము తెచ్చి "మహారాజా! నీ కీర్తి జగత్తంతయు వ్యాపించి ఉన్నది. స్వర్గమున నీకు స్థిర నివాసము ఏర్పడినది. రమ్ము విమానము ఎక్కుము" అన్నారు.
"దేవదూతలారా! నాకార్యము కొఱకు మార్కండేయ మహర్షిని, గుడ్లగూబను, కొంగను ఇచటికి తెచ్చినాను. వారిని వారి వారి స్థానములందు విడిచి వత్తును వేచి ఉండుడు" అన్నాడు.
ఇంద్రద్యుమ్నుని కృతజ్ఞతకు దేవతలు మెచ్చుకున్నారు. ఇంద్రద్యుమ్నుడు మార్కండేయుని, కొంగను, గుడ్లగూబను వారి వారి స్థానములందు విడిచి, స్వర్గమునకు వెళ్లినాడు.
ఇది ఇంద్రద్యుమ్నుని వృత్తాంతము.
ఆలోచనామృతము
1. కథ చెప్పు పద్ధతి విశిష్టముగా ఉన్నది. రచయితలు అభినందించగలరు. ఇంద్రద్యుమ్నుడు ఎవరు? ఏమి చేసినాడు? రచయిత చెప్పడు, తాబేలుతో చెప్పించినాడు, మార్కండేయుని గుడ్లగూబను, కొంగను ఇంద్రద్యుమ్నుడు అడిగినాడు. తాబేలును అతను అడుగలేదు, కొంగ, గుడ్లగూబ అడిగినవి. జంతువుల ద్వారా కథ చెప్పించుట పంచతంత్రమునకు భారతము నందలి ఇటువంటి కథలు మూలము కావచ్చును.
2. సత్కార్యములు చేసినవాడు పుణ్యలోకమును పొందును అని ధర్మరాజునకు మార్కండేయుడు చెప్పినాడు. అట్టివాడు పుణ్యలోకమున ఎంత కాలము ఉండునో ఈ కథ వలన విశదీకరించినాడు.
పరలోకము విశ్వాసమును బట్టి ఉన్నది- లేదు- అని చెప్పినాను. అది మానవజాతి మనుగడకు ఉపయోగపడుచున్నది.
మానవుడు మంచిపనులు చేసి, ఎంత కీర్తి ఆర్జించిన అంతకాలము స్వర్గమున ఉండును అని చూపి అతనితో మంచి పనులు చేయించుటకు ప్రయత్నించుట జరిగినది.
లోకమున శాశ్వతమయినది లేదు. కాని కలకలాము ఉండు వాపీ, కూప, తటాకాదుల నిర్మాణము వలన పోయినవానికి కీర్తి, ఉన్నవారికి ఉపయోగము కలుగును. మనిషితో అటువంటి పనులు చేయించవలెనని ఈ కథ బోధించుచున్నది.
3. పని తీరగనే వదిలి పెట్టిపోవుట కృతఘ్నుని లక్షణము. ఇంద్రద్యుమ్నునకు స్వర్గము నుండి విమానము వచ్చినది. అయినను తనకు ఉపకారము చేసిన వారిని మరువలేదు. వారిని స్వస్థలములందు విడిచిగాని స్వర్గమునకు వెళ్లలేదు.
మానవునకు ఉండవలసిన ప్రధాన లక్షణము కృతజ్ఞత.
వైవస్వత మనువు
వైవస్వతుడు చాక్షుష మన్వంతరము వాడు. అతను బదరికాశ్రమమున ఘోరమయిన తపము చేసినాడు. ఒకనాడు అతడు సరస్సులో స్నానము చేసినాడు. ఒడ్డునకు వచ్చినాడు. విచిత్రముగా ఒక చేప అతని ముందునకు వచ్చినది. "మహానుభావా! నేను చిన్న చేపను. పెద్ద చేపలు నన్ను మింగునని భయపడుచున్నాను. నన్ను మరొక చోటునకు చేర్చుము. నీకు ప్రత్యుపకారము చేతును" అన్నది.
వైవస్వతుడు ఆ చేపను తీసుకొని వెళ్లి ఒక బావిలో వదిలినాడు. కొంతకాలము గడచినది. "మనువా! నేను పెరిగినాను. నాకు ఈ బావి చాలుట లేదు. నన్ను మరొక చోటునకు చేర్చుము" అని కోరినది.
వైవస్వతుడు ఆ చేపను తీసుకొని వెళ్లి గంగలోని ఒక మడుగులో విడిచినాడు. కొంతకాలము గడిచినది. "మనువా! నేను పెరిగినాను. నాకు ఈమడుగు చాలుట లేదు. నన్ను మరొక చోటునకు చేర్చుము" అని కోరినది.
వైవస్వతుడు ఆ చేపను తీసుకొని వెళ్లి సముద్రమున వదిలినాడు. అప్పుడు ఆ చేప అన్నది:-
వైవస్వతా! నీవు దయగలవాడవు. విసుగుకొనక నేను కోరినట్లల్ల చేసినావు. నన్ను సముద్రమున చేర్చినావు. ఇందుకు నేను కృతజ్ఞుడను. నీవు నాకు చేసిన ఉపకారమునకు ప్రత్యుపకారము చేతును. నేను చెప్పినట్లు చేయుము.
"ప్రళయము రానున్నది. సముద్రములు ఉప్పొంగి లోకములను ముంచును. లోకమంతయు జలమయమగును. జలము తప్ప మరేదియు మిగలదు. అది జలప్రళయము. నీవు జలప్రళయమునకు గురికాకుండ ఒక ఓడను ఏర్పరచుకొనుము దానికి ఒక గట్టితాడు అమర్చి సిద్ధముగా ఉంచుము. జల ప్రళయము వచ్చినపుడు నీవును సప్తఋషులును అందులోనికి చేరుడు. అప్పుడు నన్ను ధ్యానించిన నేను పర్వత రూపమున వచ్చి నిన్ను రక్షింతును" అన్నది. చేప వెళ్లిపోయినది.
వైవస్వతుడు ఓడను సిద్ధము చేసుకున్నాడు. సప్తఋషులు ఒకచోట చేరినారు. అనుకున్నట్లు ప్రళయమురానే వచ్చినది. సముద్రములు ఉప్పొంగినవి. చెలియలి కట్టలు మఱచి లోకములను ముంచినవి. మహాసైన్యము విజృంభించి లోకములను ఆక్రమించినట్లు సముద్రము నురగలు కక్కుచు సమస్త విశ్వమును ఆక్రమించినట్లు సముద్రము నురగలు కక్కుచు సమస్త విశ్వమును ఆక్రమించినది. ఎటుచూచినను, జలము ఆకాశము తప్ప మరేదియు కనిపించలేదు.
వైవస్వతుడు, సప్తఋషులతో ఓడలో ఉండి చేపను ధ్యానించినాడు. ఆ చేప పర్వత శిఖర రూపమున దర్శనము ఇచ్చినది. వైవస్వతుడు పడవకు కట్టిన తాటిని పర్వత శిఖరమునకు కట్టినాడు. మహాశిఖర రూపమున ఉన్న చేప అనేక సహస్ర సంవత్సరముల పర్యంతము ఆ ఓడను జలములందు తిప్పినది. అప్పుడు జలప్రళయము అణగసాగినది. అప్పుడు ఆ చేప ఓడను హిమవంతమునకు తెచ్చినది. ఓడ త్రాటిని ఒక శిఖరమునకు కట్టించినది. అందువలన ఆ శిఖరమునకు "నౌంధము" అని పేరు వచ్చినది. అప్పుడు మునులతో కూడిన వైవస్వత మనువుతో అన్నది:-





