Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam
"కొందఱు సత్యము, శాంతివంటి సద్గుణములను ఎరుగక నాస్తికులయి, పాపబుద్ధి కలిగి పాపకర్మములతో జీవితము గడుపుదురు. వారికి ఇహమందును పరమునందును దుఃఖము కలుగును. వారు పశ్వాది హీనజన్మములను పొందుదురు".
"ధర్మరాజా! మీరు దివ్యపురుషులు. దేవతలకు మేలు చేయుటకు అవతరించినారు. మీరు పరాక్రమవంతులు. ముందు సకల శత్రువులను సంహరింతురు. సకల రాజ్యలక్ష్మి మిమ్ము వరించును. అనేక యజ్ఞములు చేయనున్నారు. మీరు దేవ భావములను పొందగలరు".
ఆలోచనామృతము
1. శ్రీకృష్ణుని ఆలోచనలు అండగా ఉన్నంత కాలము పాండవులను విజయములు వరించినవి. రాజసూయము తరువాత శ్రీకృష్ణుని అండలేనందున వారు ఇడుముల పాలయినారు. పాండవులు అడవులకు వచ్చిన తరువాత ఈ వచ్చుట రెండవసారి. ఈసారి రాక మిక్కిలి ప్రభావాత్మకమయినది. అర్జునుడు ఆయుధములు గెలిచినాడు. శ్రీకృష్ణుడు అంధక, వృష్ణి, భోజ, యాదవ వంశీయుల సహాయమును తెచ్చినాడు. ఇది పాండవుల గెలుపునకు ద్వారము వంటిది.
2. శ్రీకృష్ణుడు ద్రౌపదిని పలుకరించిన తీరు బహు సున్నితమయినది. మనసులను చెమర్చచేయునది.
ద్రౌపది అయిదుగురు కొడుకులు ద్వారకలో ఉన్నారు. వారి క్షేమము ఎరుగుటకన్న తల్లికి కావలసినదేమి? శ్రీకృష్ణుడు అది చెప్పినాడు, అంతేకాదు సుభద్ర నిర్వహించుచున్న బాధ్యతను చాలా చక్కగా వివరించినాడు.
ద్రౌపది అడవిలో ఉన్నది. అయినను భర్తలవద్ద ఉన్నది. అందులో ఆమెకు ఆనందమున్నది. సుభద్ర నగరమందున్నది. భర్తకు దూరముగా ఉన్నది. ఆమెకు ద్రౌపదికి ఉన్న ఆనందము లేదు. పైగా కొడుకులను పెంచవలసిన ద్రౌపది బాధ్యతను సుభద్ర వహించుచున్నది. తన కొడుకు అభిమన్యునితో సమానముగా ద్రౌపది బిడ్డలను పెంచుట సామాన్యముకాదు. ఆమె నగరమునందుండి తపము చేసిన ధన్యురాలు. ఆమెను గురించి ఎంత వ్రాసినను తక్కువ. కవులు ఊర్విళను గురించి బాధపడినారు. సుభద్రను కూడ గుర్తించవలసి ఉన్నది.
3. ధర్మరాజు మొట్టమొదట రోమశుని అడిగిన ప్రశ్నయే మార్కండేయుని అడిగినాడు. మంచివారికి కష్టములు, చెడువారికి దుఃఖములు కలుగుటకు కారణమేమని? ఈనాటికి మంచివారందరికి ఎదురవుతున్న ప్రశ్నయే ఇది.
బృహదశ్వుడు నలుని కథ చెప్పి మంచివారికి ముందు ఇక్కట్లు కలిగినను అంతమున సౌఖ్యము కలుగును అని చెప్పినాడు. రోమశుడు దుష్టులకు కలుగు విజయము తాత్కాలికము అని చెప్పినాడు. మార్కండేయుడు తాత్త్వికమయిన విషయము చెప్పినాడు.
పరలోకము విశ్వాసమును బట్టి ఉన్నది- లేదు. అది ఉన్నను లేకున్నను మనిషిని మంచి మార్గమున నడిపించుటకు ఉపకరించినది. "మరొక లోకమున్నది అక్కడ నీవు బాధలు పడుదువు" అను విషయము మనసు కెక్కిన దుర్మార్గుడు దుష్యార్యములు చేయుటకు జంకును. మంచివానికి పదే పదే కష్టములు వచ్చినప్పుడు, అతడు సన్మార్గము వీడకుండ 'మరొక లోకమున్నది అక్కడ నీవు సుఖములు అనుభవింతువు" అను ఆలోచనము ఉపకరించును.
4. దేహము నశించును. కర్మములు నశించవు అన్నాడు. ఒక మనిషి చనిపోయినంత మాత్రమున అతను చేసిన అప్పులు తీరవు, కాబట్టి చేసిన పనులు శరీరముతో అంతరించవు.
5. మార్కండేయుడు మానవులను నాలుగు వర్గములుగా విభజించినాడు. వారిలో గృహస్థులకు అధిక ప్రాధాన్యత ఇచ్చినాడు. వారికి ఇహపర సౌఖ్యములు ఉన్నవని చెప్పినాడు.
కుటుంబము సమాజమునకు పునాది. ఎన్ని వాదములు వచ్చినను, ఎన్ని ప్రభుత్వములు మారినను కుటుంబ కళ్యాణమే వాటి ప్రధాన లక్ష్యము.
ముక్కు మూసుకొని మూలన కూర్చున్న వానికన్న నీతి నిజాయితీలు కలిగి కుటుంబము నిర్వహించువాడు మిన్న అనుచున్నాడు మార్కండేయుడు.
అత్యంత ఆధునిక, అతి ప్రగతిశీల సామాజిక శాస్త్ర ఆలోచనా విధానమందు కూడా ఇంతకుమించిన "సత్యము" ఉండబోదనుట అతిశయోక్తి మాత్రము కాదు.
సమాజాభ్యుదయమును గురించి ప్రాచీన భారతీయ ఋషులు, మునులు, మేధావులు ఎంత పరిశ్రమ చేసినారో గమనించవలసి ఉన్నది, వానిని వెలికితీసి ఉపయోగమునకు తెచ్చుట నేటి శాస్త్రజ్ఞుల కర్తవ్యము.
ఇంద్రద్యుమ్నుడు
"మహాత్మా! మార్కండేయ మహర్షీ! నీవు చిరంజీవివి. నీకన్న వయసునందు పెద్దవారున్నారా? మానవుడు తాను చేసిన సత్కార్యములకు స్వర్గమున ఎంత కాలము ఉండును? నాపై దయ ఉంచి ఈ విషయములు నాకు వివరించవలెను" అని ధర్మరాజు అడిగినాడు.
"ధర్మజా! ఇంద్రద్యుమ్నుడు వయసున నాకన్న పెద్దవాడు. మానవుడు ఆర్జించిన కీర్తి భూలోకమున నిలిచినంత కాలము అతను స్వర్గమున ఉండును. పుణ్యము క్షీణించిన వెనుక మరల మర్త్య లోకమున ప్రవేశించును" అని చెప్పినాడు మార్కండేయుడు.
"ఎవరా ఇంద్రద్యుమ్నుడు? అతని కథ ఏమి? తెలియపరచవలసినది" అని అడిగినాడు ధర్మరాజు.
మార్కండేయుడు కథ చెప్పినాడు:-
పూర్వము ఇంద్రద్యుమ్నుడను మహారాజు ఉండెను. కాలవశమున అతడు దేహము విడిచినాడు, స్వర్గమునకు వెళ్లినాడు, బహుకాలమునకు భూలోకమున అతని కీర్తి నశించినది. దేవతలు ఇంద్రద్యుమ్నుని భూలోకమునకు పడద్రోసినారు.
ఇంద్రద్యుమ్నుడు మార్కండేయుని వద్దకు వచ్చినాడు. "నేను ఇంద్రద్యుమ్నుడను, నీవు నన్ను ఎరుగుదువా?" అని అడిగినాడు. అందుకు మార్కండేయుడు నేను నిన్ను ఎరుగను. కాని హిమవంతమున "ప్రవాళకుడు" అను గుడ్లగూబ ఉన్నది. అది వయసున నాకన్న పెద్దది దానిని అడుగుము అన్నాడు.
ఇంద్రద్యుమ్నుడు మార్కండేయుని తీసుకొని హిమంతమునకు వెళ్లినాడు. "నేను ఇంద్రద్యుమ్నుడను. నీవు నన్ను ఎరుగుదువా?" అని అడిగినాడు. అందుకు ప్రవాళకుడు "నేను నిన్ను ఎరుగను, నాళీక జంఘుడు అను ఒక కొంగ ఉన్నది. అది వయసున నా కన్న పెద్దది. దానిని అడుగుము" అన్నది.





