Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam



    2. సుఖ దుఃఖములకు అతీతమయిన విద్య ఉన్నదా అను నహుషుని ప్రశ్న తాత్వికము అయినది. ధర్మరాజు నిర్దిష్టమయిన ప్రత్యుత్తరము ఇవ్వలేక పోయినాడు. నహుషునితో ఏకీభవించినాడు. లేకుండవచ్చును అన్నాడు.
    ప్రతి పదార్థమునకు ఒక గుణము ఉండును. మంచు చల్లగా ఉండుట, అగ్ని వేడిగా ఉండుట వాటి గుణములు. ఆ గుణములు అంతరించిన అవి ఆ పదార్థములు కావు. చల్లగా లేకున్న మంచుకాదు. వేడిగా లేకున్న అగ్నికాదు.
    సుఖ దుఃఖములు జీవితమునకు స్వభావములు, గుణములు. అవి లేకున్న జీవితము లేదు. జీవితము సుఖ దుఃఖముల మిశ్రమము. దుఃఖము మాత్రము జీవితము కాదు. సుఖము మాత్రమే జీవితము కాదు.
    దుఃఖమును తగ్గించి సుఖమును పెంచుటకు మానవుడు ప్రయత్నించుచున్నాడు. భౌతికమయిన కష్టములను తగ్గించుటలో అతడు చాలావరకు కృతకృత్యుడు అయినాడు. అయినను సుఖదుఃఖములు మానసికములు-వైయక్తికములు. వాటిని స్వప్రయత్నమునను, నిరంతర అభ్యాసము వలనను అధిగమించవలసి ఉన్నది. అట్లు అధిగమించుట సాధ్యము అనుచున్నాడు ధర్మరాజు-అతని ద్వారా వ్యాసుడు.
    శీతోష్ణ, సుఖ దుఃఖములకు అతీతులు ఎక్కడనో ఒకరు ఉండకపోరు. వారు మహాత్ములు, యోగులు, పరమ పురుషులు.

                                                 మహాత్ముల రాక

    పాండవులు యాత్రలు ముగించుకున్నారు. ధౌమ్యాది బ్రాహ్మణులను, ఇంద్రసేనాది భృత్యులను తీసుకొని వారు "కామ్యక" వనమునకు చేరినారు. అక్కడి మునులందరు వారికి స్వాగతము పలికినారు. ఆదరించినారు.
    పాండవులు కామ్యకమున ఉండగా శ్రీకృష్ణుడు, సత్యభామా సహితుడయి వారి దగ్గరికి వచ్చినాడు. శ్రీకృష్ణుడు దివ్యరథము మీద వచ్చినాడు. రథము దిగినాడు, ధర్మరాజునకు నమస్కరించినాడు. భీమార్జున నకుల సహదేవులను కౌగిలించుకున్నాడు. ద్రౌపదిని గౌరవించినాడు. ధర్మరాజు అర్ఘ్య పాద్యములు ఇచ్చి శ్రీకృష్ణుని పూజించినాడు.
    శ్రీకృష్ణుని చుట్టూ పాండవులు కూర్చున్నారు. శ్రీకృష్ణుడు అర్జునుని దగ్గరగా తీసుకొని కూర్చున్నాడు. "ధర్మజా! అర్జునుడు దివ్యాస్త్రములను సాధించినాడు. అందువలన నీవు కృతార్థుడవు అయినావు.నీకు ఇహపరములు కరతలామలకములు సత్యము, ధైర్యము, నిత్య తృప్తి, శాంత రూపమగు మనోనిగ్రహము అను అయిదు గుణములు నీ యందు నిత్యము ప్రవర్తిల్లుచున్నవి. నీ తమ్ముల పరాక్రమమును గూర్చి చెప్పవలసిన పనిలేదు. వారిని జయించువారు ఈలోకమున లేరు. అంధక, వృష్ణి భోజ, యాదవ వంశీకులు నీయందు ప్రీతి కలిగి ఉన్నారు. నీ మనోదుఃఖమును పోగొట్టదలచి ఉన్నారు. దుర్యోధనాదులు యాదవాదులతో యుద్ధము చేయజాలరు".
    ధర్మరాజు శ్రీకృష్ణుని మాటలు విన్నాడు. "శ్రీకృష్ణా! మేము ఈ విధముగనే మిగిలిన వనవాస సంవత్సరములు గడిపెదము. తదుపరి అజ్ఞాతవాసము గడుపవలసి ఉన్నది. ఆపైన లోకవిరుద్ధము కాని రీతిన శత్రువును జయింప దలచినాము. ఈ కార్యములన్నియు కొనసాగించు భారము నీది. మేము నీ శరణుజొచ్చియున్నాము. నీ వలన మాకు సర్వకార్యములు సిద్ధించును. ఇది నిశ్చయము".
    ధర్మరాజు శ్రీకృష్ణుని మాటలు విన్నాడు. అతనికి ద్రౌపది కనిపించినది. ఆమెను చూచినాడు. అన్నాడు:-
    "అమ్మా! ద్రౌపదీ! నీ కుమారులు అయిదుగురు క్షేమముగా ఉన్నారు. వారు యదు కుమారులతో స్నేహముగా ఉన్నారు. వారితో ఏనుగులు, గుఱ్ఱములపై స్వారీ, నానా శస్త్రాస్త్ర విద్యలు అభ్యసించుచున్నారు. ప్రద్యుమ్నుడు నీ కొడుకులకు దివ్యాస్త్రములను ఇచ్చినాడు. సుభద్ర అభిమన్యుని కన్న మిన్నగా నీ కొడుకులను చూచుచున్నది. కాబట్టి నీవు చింతించవలదు. మిమ్ము రాజ్యలక్ష్మి వరించు కాలము దగ్గరలో ఉన్నది".
    శ్రీకృష్ణుని చుట్టూ కూర్చుని పాండవాదులు మాట్లాడుకొనుచున్నారు. అప్పుడు మహాతపస్సంపన్నుడయిన మార్కండేయ మహర్షి అక్కడికి వచ్చినాడు. మార్కండేయుని దూరము నుంచి చూచి అందరు లేచినారు. అతనికి ఎదురేగినారు. తోడ్కొని వచ్చినారు. ఆసీనుని చేసినారు. అర్ఘ్యపాద్యములిచ్చి అర్పించినారు. శ్రీకృష్ణుడు మార్కండేయునితో "మహర్షీ! నీకు లోకములు తెలియును. లోకవర్తనములు తెలియును. వాటిని తెలియ చెప్పదగిన వాక్కు నీకున్నది. నీ మధుర వాక్యములు వినుటకు ఉవ్విళ్ళూరుచున్నాము. కాబట్టి మా ఇష్టము తీర్చవలసినది" అన్నాడు.
    అప్పుడు నారదుడు అచటికి వచ్చినాడు. "మార్కండేయ మునీంద్రా! శ్రీకృష్ణ పాండవులకు హితముగా పుణ్యకథలు వినిపించ వలసినది" అని విన్నవించినాడు. మార్కండేయుని అందుకు అంగీకరింపచేసి నారదుడు వెళ్లిపోయినాడు.
    ధర్మరాజు మార్కండేయునకు నమస్కరించి అడిగినాడు:-
    "మునీంద్రా! మేము ధర్మమందు ప్రవర్తిల్లదలచి ఉన్నాము. బహుదుఃఖములు అనుభవించుచున్నాము. దుర్యోధనాదులు పాపబుద్ధి కలిగి ఉన్నారు. అయినను సుఖములు అనుభవించుచున్నారు. ఇది చాలా విపరీతముగా ఉన్నది.
    మనుష్యుడు ఈ జన్మమందు కర్మము చేయుచున్నాడు. అందుకు సంబంధించిన ఫలము ఈ జన్మమందు పొందునో, పరలోకమున పొందునో లేక రెండింట పొందునో తెలియరాకున్నది. ఈ లోకమందు పురుషుడు చేసిన కర్మము విశ్వకర్తయగు ఈశ్వరుని పొందదు. అతడు చేసిన కర్మము దేహము నశించినపుడు నశించునేమో తెలియదు. వీనిని గురించి తెలియపరచుటకు నీవే సమర్థుడవు. వివరించవలసినది".
    మార్కండేయుడు వివరించినాడు:-
    పుణ్య పాపములు రెండును మనుజునకు పరలోకమందు సుఖ దుఃఖములు కలిగించును. ఆ కర్మములే మరల జన్మమునకు కారణమగుచున్నవి. మానవుడు తాను చేసిన పుణ్యపాపములు అనుభవించక తప్పదు. దేహము నశించుచు కాని దేహి చేసిన కర్మములు నశించవు.
    "సంపద గలవారు ఇంద్రియ సుఖములనే అనుభవింతురు. ధనమదాంధులు కామక్రోధ లోభాదులందు మునిగి ఉందురు. పుణ్యకర్మలు తలచరు. చేయరు. అట్టివారి అనుభవము ఈలోకమందే. పరలోకమందు వారు బాధల పాలగుదురు'.
    "కొందఱు ఉపవాసాది వ్రత నియమములు కలిగి పుణ్యతీర్థములు సేవించుచు జీవితము గడుపుదురు. వారికి ఈ లోకము దుఃఖమయము కావచ్చును. కాని పరలోకమున మహాసుఖములు అనుభవింతురు.
    "కొందఱు సంసారమునందే ఉందురు. ధర్మమార్గమున ధనము ఆర్జింతురు. భార్యాపుత్రులు కలిగి పుణ్యకర్మములు చేయుదురు. అట్టివారు ఇహమునందును, పరమునందును సౌఖ్యము పొందుదురు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.