Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam



                                                  అజగరపు కథ

    పాండవుల హిమాలయమున ఒక్క సంవత్సరము ఉన్నారు. అప్పుడు భీముడు ఒంటరిగా అడవిలోనికి వెళ్లినాడు. అతడు వేటాడి తిరిగి వచ్చుచున్నాడు. అప్పుడు, అక్కడ అతనికి ఒక మహాసర్పము కనిపించినది. అది యముని వలె ఉన్నది. దాని ఉచ్చ్వాస నిశ్శ్వాసములు పొగలు, సెగలు చిమ్ముచున్నవి. దానికి అర్ధచంద్రుని బోలు నాలుగు కోరలున్నవి.    
    ఆ మహాసర్పము ఆహారము కొఱకు భీముని పట్టినది. అది భీముని చుట్టివేసినది. భీముడు పదివేల ఏనుగుల బలము కలవాడు. అయినను ఆ మహాసర్ప బంధమున నలిగినాడు. విడిపించుకొనలేకపోయినాడు. బాధపడినాడు. ఉక్కిరి బిక్కిరి అయినాడు. కాని విడిపించుకొనలేకపోయినాడు. అక్కడ ధర్మరాజు చూచినాడు. భీముడు వెళ్లి చాలాసేపు అయినది. అతని జాడలేదు. పైగా నక్క కూతలు వినిపించినవి. కుడి భుజము అదిరినది. అందువలన ముందు కీడు వెనుక లాభము కలుగునని గ్రహించినాడు. అర్జునాదులను ద్రౌపది రక్షణకు అక్కడనే ఉంచి భీముని వెదకుటకు బయలుదేరినాడు. భీముని అడుగుల గుర్తులను బట్టి సాగినాడు. అతనివెంట ధౌమ్యాదులు సాగినారు.
    ధర్మరాజు భీముని చూచినాడు. భీముడు సర్పబంధమున ఉన్నాడు. మహా బలవంతుడయిన భీముడు ఒక పాము పట్టులో చిక్కుకొని ఉండుట ధర్మరాజునకు ఆశ్చర్యము కలిగించినది. "ఓయీ! సర్పమా! నీవు సామాన్యమయిన సర్పముగా కనిపించుటలేదు. నీవు సర్పరూపధారివగు రాక్షసుడవో, దేవతవో తెలియరాకున్నది. నేను ధర్మరాజును. నీవు పట్టినవాడు నా తమ్ముడు భీముడు. నీ ఆకలి తీరునంత మృగ మాంసము పెట్టెదను. నా తమ్ముని విడువుము. అని ప్రార్థించినాడు.
    అజగరము ధర్మరాజు మాటలు విన్నది. ధర్మరాజుతో అన్నది:-
    "ధర్మరాజా! నేను నహుషుడను. మీతాత తాతలకు పూర్వీకుడను. అందువలన మీవంశస్థుడను. ఒకప్పుడు నేను ఇంద్ర పదవిని అలంకరించినాను. నాకు ఐశ్వర్య గర్వము కలిగినది. వేయిమంది బ్రాహ్మణులు మోయు బ్రహ్మ రథము ఎక్కినాను. వారిని అవమానించినాను. అప్పుడు అగస్త్యుడు కోపించి నాకు భయంకర సర్ప రూపము కలుగునట్లు శపించినాడు. అప్పుడు నేను అగస్త్యుని పాదములంటి "మహాత్మా! నాకు పూర్వజన్మ జ్ఞానము చెడకుండునట్లును, నేను ఎంత బలవంతులను పట్టినను వారు బలహీనులు అగునట్లు వరము ప్రసాదించుము" అని వేడుకున్నాను. అప్పుడు అగస్త్యుడు నన్ను కరుణించినాడు. ఆ వరములు ప్రసాదించినాడు. "నహుషా! నీవు సర్పముగా ఉన్నపుడు నీవు అడిగిన ప్రశ్నలకు ప్రత్యుత్తరములు చెప్పువాడు లభించిన నీకు శాపాంతమగును" అని చెప్పినాడు. కావున ధర్మరాజా! నా ప్రశ్నలకు ప్రత్యుత్తరములు ఇచ్చి నీ తమ్ముని విడిపించుకొనుము.
    "మహాత్మా! నహుషా! నీవు అడుగు ప్రశ్నలకు ప్రత్యుత్తరము చెప్పునంత మేధా సంపద నాకు లేదు. అయినను అడుగుము ప్రయత్నింతును" అన్నాడు ధర్మరాజు ఆ ప్రశ్నోత్తరములు ఇట్లున్నవి:-
    1. ఏ గుణములు కలవాడు బ్రాహ్మణుడగును? అతడు తెలుసుకొనదగిన విద్య ఏది?
    సత్యము, సహనము, ఇంద్రియనిగ్రహము, శౌచము, దయ, దానబుద్ధి, తపస్సు అను ఏడు గుణములు ఉన్నవాడు బ్రాహ్మణుడు అగును.
    సుఖ దుఃఖములు పొందినపుడు మోహమును పొందుకుండుట బ్రాహ్మణుడు తెలుసుకొనదగిన విద్య. సుఖ దుఃఖములకు అతీతమయిన బ్రహ్మమును తెలుసుకొనుట బ్రాహ్మణుని ధర్మము.
    2. సత్యము, సహనము మున్నగు గుణములు ఉన్న శూద్రుడు బ్రాహ్మణుడు అగునా? సుఖ దుఃఖములకు అతీతమయిన పదార్థము ఉన్నదా?
    సత్యము, సహనము మొదలగు గుణములున్న శూద్రుడు శూద్రుడుకాడు. అవిలేని బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు కాదు. సత్య శౌచాది లక్షణములు ఉన్నవాడు బ్రాహ్మణుడగును. ఆ లక్షణములు లేనివాడు శూద్రుడగును.
    సుఖ దుఃఖములకు అతీతమయిన పదార్థము లేదన్న నీ అభిప్రాయము సరి అయినది. అయినాను శీతోష్ణములకు అతీతమయిన పదార్థము ఉన్నట్లు సుఖ, దుఃఖములకు అతీతమయిన పదార్థము ఉన్నదని నా అభిప్రాయము.
    3. గుణముల వలనను, ఆచారము వలనను బ్రాహ్మణుని నిర్ణయించవలసిన జాతి నిర్ణయము వ్యర్థమే కదా!
    మానవులలో జాతిని నిర్ణయించుట కఠిన తరము. ఏలనన నేడు సకల జాతులు పరస్పరము కలిసిపోవుచున్నవి. వాటిని విడిగా చూచుట దుస్తరము. మనుష్యులు అన్ని జాతుల స్త్రీలతో సంపర్కము చేయుచున్నారు. భాష, మైథునము, జనన మరణము మానవులందరకు ఉన్నవి. "యజామహే" అను ఆర్ష ప్రమాణము వలన ఇది విదితము అయినది. అందువలన తాత్వికులు గుణమునే ప్రధానముగా స్వీకరించినారు.
    బాలుడు పుట్టినపుడు శూద్రుడగును. అతనికి సంస్కారముచేసి, వేదాధ్యయనపరుడు అగునంతవరకు అతడు శూద్రుడుగానే ఉండును. బ్రాహ్మణుడు కాజాలడు. పుట్టుకతో ప్రతివాడు శూద్రుడు అగును. సంస్కారమున బ్రాహ్మణుడు కావలసి ఉన్నది. ఇందుకు స్వాయంభువ మనువు నిదర్శనము కూడ ఉన్నది. "సంస్కారాది వేదాధ్యయనము తరువాత సహితము ఒకనికి సత్య శౌచాది లక్షణములు కలుగకున్న అతడు బ్రాహ్మణుడుకాడు అని చెప్పబడినది.
    ధర్మరాజు జవాబులకు సర్పరాజు ప్రసన్నుడయినాడు. భీముని విడిచినాడు. దివ్య పురుషుడయి వెళ్లిపోయినాడు.
    ధర్మరాజు భీముని వెంట పెట్టుకొని తన ఆశ్రమమునకు వచ్చినాడు. కాలము గడచినది. శరత్కాలము వచ్చినది.
        శారదరాత్రు లుజ్జ్వల లసత్తర తారకహార పంక్తులం
        జారుతరంబు లయ్యె వికసన్నవ కైరవ గంధబంధురో
        దార సమీర సౌరభము దాల్చి సుధాంశు వికీర్యమాణక
        ర్పూర పరాగ పాండురుచి పూరములం బరిపూరితంబులై    
    నన్నయ భట్టారకుని రచనలోని చివరి పద్యమిది.

                                                        ఆలోచనామృతము

    1. నహుషుడు నిమిత్తమాత్రుడు. ధర్మరాజుతో వ్యాస భగవానుడు చెప్పించిన ప్రత్యుత్తరములు వ్యాసుని విశాల దృక్పథమునకు, మానవతా వాడమునకు పతాక ప్రాయములు.
    వ్యాసుడు కులములను నిరసించినాడు. గుణములకు ప్రాధాన్యతను ఇచ్చినాడు. పుట్టుకతో కులముని నిర్ణయించరాదని వాదించినాడు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ప్రవచించిన "గుణ కర్మవిభాగశః" అనుదానికి ఇది అనుగుణముగా ఉన్నది. కులములు సంకుచితములు. అవి కుత్సితములకు ఉపయోగపడుచున్నవి. కాబట్టి సంస్కారమును బట్టి కులమును నిర్ణయించవలెను అనుటకన్న ప్రగతివాదము ఉండబోదు. పుట్టకతో ప్రతివాడును శూద్రుడే. సంస్కారము వలన బ్రాహ్మణుడు అగుచున్నాడు. సంస్కారము తరువాత కూడ అతనికి శాంతి, శౌచ్యాది ఉత్తమ గుణములు అలవడకున్నచో అతడు బ్రాహ్మణుడు కాజాలడు. ఈ సద్గుణములు అలవడిన ఏ కులపు వాడయినను బ్రాహ్మణుడగును.
    మేధావి అగుటకు సంస్కారము అవసరము. మేధావిత్వము పుట్టుకతో వచ్చునదికాదు. మనిషి పుట్టుకతో బ్రాహ్మణుడు కాలేడు.
    కుల మతములను గురించి నేడు జరుగుతున్న విస్తృతమైన చర్చకు ఈ ప్రత్యుత్తరములు కరదీపికలు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.