Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam
ఆలోచనామృతము
1. వ్యాసమహర్షి రచనా నైపుణ్యము అద్భుతము. అపూర్వము. అతని పాత్ర నిర్మాణము, పాత్రప్ పోషణము, మానవ స్వభావ పరిశీలన అనన్య సామాన్యము. నాడు అతను చేసిన రచనకు సాటివచ్చు రచన నేటికిని సాధ్యపడలేదు. ముందు సాధ్యపడునను నమ్మకము నాకు లేదు.
2. ఎంతటి ఘనత గల వారినయినను ఇంటివారు గుర్తించుట కష్టము. బయట మహాకార్యములు సాధించిన వారయినను, వారిని ఇంటివారు మన్నించరు. ఇందుకు అనేక ఉదాహరణములున్నవి.
రచ్చ గెలుచుట తేలిక. ఇంట గెలుచుట దుస్తరము. ఇంటినయిన గెలువ వచ్చును. తనను, తన స్వభావమును గెలుచుట సుమారు అసాధ్యము. విశ్వామిత్రుని వంటివారు తప్ప తనను గెలిచినవారు లేరు. లోకములను గెలిచినవారు చాలామంది ఉన్నారు.
అర్జునుడు పాశుపతము ఆర్జించినాడు. ఇంద్రుని మెప్పించి శస్త్రాస్త్రములు సాధించినాడు. నివాతకవచులను నిర్జించినాడు. పౌలోమ, కాలకేయులను జయించినాడు. అప్పుడు ధర్మరాజు దగ్గరికి వచ్చినాడు. అయినను అన్న తన పరాక్రమమును మన్నించునను నమ్మకము అర్జునునకు కలదు. అందువలన తనను గురించి చెప్పవలసినదని ఇంద్రుని కోరినాడు.
ఇంద్రుడు వచ్చినాడు. అర్జునుని ప్రతాప పరాక్రమములను గురించి వివరించినాడు. ధర్మరాజు విన్నాడు అయినను అతనికి నమ్మకము కలిగినట్లు లేదు. తమ్ముడుగదా చిన్నవాడు! ఇంతటి కార్యములు సాధించినాడా?
చిన్నవారి విషయమున పెద్దవారికి అంత తేలికగా నమ్మకము కుదరదు. అర్జునుని నోటన వివరములు విన్నాడు. అయినను అతనికి అర్జునుని విషయమున పూర్తి నమ్మకము కుదిరినట్లు లేదు. ఆయుధములను ప్రయోగించి చూపమన్నాడు. అప్పుడు కొంత నమ్మకము కుదిరినట్లున్నది.
ఇది మానవ స్వభావ పరిశీలన. ఇది ధర్మరాజునకే కాదు. మనందరికి వర్తించునది. దీనికి యుగములతో నిమిత్తము లేదు. అన్ని యుగములకు వర్తించునది.
3. ఆయుధము ఉన్నంత మాత్రమున చాలదు. ఆయుధమును ప్రయోగించు సామర్థ్యము అవసరము. ఈ మధ్య లెబనాన్ దేశము ఆయుధములు సమకూర్చుకున్నది. అయినను ప్రయోగించు సామర్థ్యము లేక ఇజ్రాయిల్ చేత దెబ్బతిన్నది.
అర్జునునకు ఆయుధములు సమకూర్చినది ఇంద్రుడే. కాని ఇంద్రుడు సాధించలేని దానిని అర్జునుడు సాధించినాడు. కావున ఒక్క ఆయుధమున్నను, ఒక్క సామర్థ్యమున్నను చాలదు. రెండు ఉన్నచోటనే గెలుపు. ఇంద్రుని ఆయుధము అర్జునుని సామర్థ్యము కలసి విజయము సాధించినవి.
వ్యాసునకు ఆయుధమున కన్న మానవుని మీద విశ్వాసము మెండు.
4. మరొక విషయము. వ్యాస మహర్షి దేవతలను అతీతులగా చూపలేదు. దేవ, యక్ష, రాక్షస, కిన్నర, కింపురుషులు అందరు మానవునివంటి వారలే అన్నాడు. అంతేకాదు. మానవుని మహత్వమే గొప్పదని నమ్మినాడు. భీముడు కుబేరుని ఓడించినాడు. అర్జునుడు శివునితో యుద్ధము చేసినాడు. ఇంద్రుడు అర్జునుని సాయము కోరినాడు.
5. దేవ రాక్షస యుద్ధములు కలకాలముగా ఉన్నవి. ఇంద్రుడు కొందరిని చంపినాడు. నివాతకవచులు మరింత బలవంతులు అయినారు. ఇంద్రుడు గెలువలేక పోయినాడు. అర్జునుని ప్రయోగించినాడు.
అర్జునుడు ఏకారణమున దండెత్తినాడు? ఇందుడు చెప్పినాడని. అతను నిర్వర్తించినది స్వామి కార్యము. అతనికి కారణములు తెలియవు బాగున్నది. పౌలోమ, కాలకేయులను గెలువమని అర్జునునకు ఇంద్రుడు చెప్పలేదు. అయినను నిష్కారణముగా వారిమీద దండెత్తి ఓడించినాడు. ఇది సేవకునికి స్వామియందు ఉండు విశ్వాసము. స్వామి ఒక పని చెప్పిన అతని రెండు పనులుచేసి మెప్పుపొందుటను మనము చూచుచున్నాము.
6. రాక్షసులకు సముద్రమందు ఉండు విద్య ఏదో తెలిసినట్లున్నది. కాలకేయులను వధించుటకు అగస్త్యుడు సముద్రమును రిక్తపరచినాడు. అర్జునుడు నివాతకవచులను సముద్రమునందు గెలిచినాడు. రావణుడు సహితము సముద్రమందు ఉన్నవాడే. రాముడు వారధి నిర్మించి వానిని వధించినాడు.
మరొక సామ్యమున్నది. నివాత కవచుల పట్టణమును తొలుత ఇంద్రుడు నిర్మించగా తదుపరి రాక్షసులు ఆక్రమించినారు. రామాయణమున లంకను తొలుత కుబేరుడు నిర్మించగా రావణుడు తదనంతరము ఆక్రమించినాడు.
7. మారణాస్త్రముల ప్రయోగములు మానవ జాతికి ముప్పు తెచ్చుచున్నవి. కాబట్టి వానితో ప్రయోగములు చేయరాదని వ్యాసుడు హెచ్చరించినాడు. అర్జునుడు చేయు వృధా ప్రయోగములను మాన్పించినాడు.
నేడు అగ్ర రాజ్యములు చేయుచున్న మారనాయుధ ప్రయోగములు వాతావరణమును కలుషితము చేసి మానవాళికి ఎంతటి ప్రమాదకారులు అగుచున్నవో ఎల్లరు ఎరిగిన విషయమే.
మారణాయుధ నిర్మాణ ప్రయోగములను నిలుపు చేయుటకు ప్రపంచమున గొప్ప ఉద్యమము సాగుచున్నది. ఈమధ్య మార్చి 1983లో ఢిల్లీలో జరిగిన అలీన దేశముల సభ మారణాయుధములు నిషేధించవలెనని తీర్మానించినది.
ఈ నాటి విపత్తును వ్యాసుడు ఆనాడు గ్రహించినాడు.
8. కాలకేయులను అగస్త్యుని సాయమున ఇంద్రుడు గెలిచినాడని చెప్పబడినది. ఈ కాలకేయులు ఎవరు?





