Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam
అర్జునుడు వివరించినాడు:-
"అన్నా! ధర్మజా! నీవు పూర్వము నాకు "ప్రతి స్మృతి" అను విద్యను ఉపదేశించినావు. దాని ప్రభావమున నేను అధిక తపస్సంపన్నుడయి హిమాలయమునకు వెళ్లినాను. అచ్చట వృద్ధ బ్రాహ్మణ వేషమున ఇంద్రుడు దర్శనము ఇచ్చినాడు. అతని ఉపదేశామును అనుసరించి శివుని గురించి ఘోరమయిన తపము చేసినాను. శివుడు ఎరుకలవాడై వచ్చినాడు. నాతో యుద్ధము చేసినాడు. నన్ను అనుగ్రహించినాడు. నిజరూపమున నాకు దర్శనము ఇచ్చినాడు. "పాశుపతము" అను దివ్యాస్త్రమును అనుగ్రహించినాడు. అప్పుడు ఇంద్రాది దేవతలు వచ్చినారు. దివ్యాస్త్రములు, వాని ప్రయోగ ఉపసంహారములు ప్రసాదించినారు. అప్పుడు ఇంద్రుడు నా కొఱకు రథమును పంపినాడు. నేను ఈ శరీరముతోనే స్వర్గమునకు వెళ్లినాను. అచట ఇంద్రుని ఆచార్యునిగా వరించినాను. అతని కృప వలన సకల దివ్యాస్త్ర ప్రయోగ, ఉపసంహార, నివర్తన, ప్రాయశ్చిత్త, ప్రతి ఘాతములను నేర్చినాను.
"నా నేర్పుకు ఇంద్రుడు సంతసించినాడు. "నిన్ను యుద్దమందు ఎవరును గెలువజాలరు. నాకు గురుదక్షిణగా నివాత కవచులను రాక్షసులను వధించ వలసినది" అని కోరినాడు. ఇంద్రుడు నాకు దివ్యాయుధములు, అభేద్యమయిన కవచము ఇచ్చినాడు. ఇంద్రుడు స్వయముగా తన భూషణములతో నన్ను అలంకరించినాడు. సర్పముతో సమానమయిన వింటినారిని ఇంద్రుడు స్వయముగా కూర్చినాడు.
"నేను ఇంద్రుని రథము ఎక్కినాను. మాతలి రథమును నడిపినాడు. సకల దేవతలు నా రథము సాగుమార్గమున నిలిచి "అర్జునా! ఈ రథమును ఎక్కి ఇంద్రుడు వృత్రాసుర, శంబరాసురాది అనేకమంది రాక్షసులను హతమార్చినాడు. ఇది దివ్య రథము. నివాతకవచులు మాయావులు. సముద్రమందుండి దేవతలను హింసించుచున్నారు. వారిని నీవు వధించవలెను" అని నాకు "దేవదత్తము" అను శంఖమును ప్రసాదించినాడు.
"మాతలి రథము సాగించినాడు. మా రథము రాక్షసులు ఉండు సముద్రము చేరినది. సముద్రము భయంకరముగా ఉన్నది. ఆ సముద్రమున నివాత కవచుల నగరమున్నది. ఆ నగర ద్వారముల మీద యుద్ధ గృహములు ఉన్నవి. వాని మీద రథములు సాగు మార్గములున్నవి.
"మా రథము నగర ద్వారము చేరినది. నేను అచట నా దేవదత్తమును పూరించినాను. ఆ ధ్వని నగరము, కొండలు, అడవులు, నదులు, సముద్రమందు కూడ ప్రతిధ్వనించినది. ఆ ధ్వని విన్న రాక్షసులు ఆగ్రహించి, నానావిధములయిన ఆయుధములు ధరించి నన్ను చుట్టుముట్టినారు. వారు నల్లగా, కాటుక కొండలవలె ఉన్నారు. వారి వలన భూమ్యాకాశములు నల్లబడినవి.
"రాక్షసులు నామీద నానావిధ ఆయుధములు ప్రయోగించినారు. నేను వారిలో ఒక్కొక్కరిని పదేసి బాణములతో కొట్టినాను. అప్పుడు రాక్షసులు విజృంభించినారు. బాణములు ప్రయోగించి నా రథము కదలకుండ చేసినారు. అది చూచి మాతలి భయపడి పోయినాడు. రథము నడిపించలేక పోయినాడు. అది చూచి దేవతలు ఋషులు ఆశ్చర్యపడినారు. భయకంపితులు అయినారు.
"మాతలి అసమర్థత చూచినాను. నేనే రథము నడిపించినాను. నా బాణములు కొట్టి రాక్షసుల గుండెలు బ్రద్దలు కొట్టినాను. అప్పుడు జల ప్రవాహమువలె రక్తము ప్రవహించినది. నా బాణముల వలన అనేకమంది రాక్షసులు హతమారినారు.
"మిగిలిన కొద్దిమంది రాక్షసులు మాయా యుద్ధమునకు పూనుకున్నారు. వారు వర్షాస్త్రము ప్రయోగించినారు. దిక్కులన్నియు జలమయములు అయినవి. నేను శోషణాస్త్రము ప్రయోగించినాను. జలములు ఎండిపోయినవి. వారు శిలా వర్షము కురిపించినారు. నేను వజ్రాస్త్రము ప్రయోగించి శిలలను పిండిగా కొట్టినాను. వారు ఆగ్నేయాస్త్రము ప్రయోగించినారు. అప్పుడు అగ్ని జ్వాలలు వ్యాపించినవి. నేను జలాస్త్రము ప్రయోగించి ఆ మంటలను ఆర్పినాను. వారు అంధకారాస్త్రమును ప్రయోగించినారు. దానివలన దిక్కులు చిట్లు చీకట్లుకమ్ముకున్నవి. అది చూచి మాతలి తెలివి తప్పినాడు. రథాశ్వములు నడువలేక పోయినవి. అప్పుడు నేను సూర్యాస్త్రమును ప్రయోగించినాను. చీకట్లు మాయమయి, వెలుగులు పరచుకున్నవి. అది చూచి దేవతలు ఆనందించినారు. ఆనందము పట్టలేక మాతలి సింహనాదము చేసినాడు.
"నేను నా గాండీవము నుండి పిడుగుల వంటి బాణములను ప్రయోగించినాను. ఆ బాణములకు రాక్షసులందరు కూలినారు. ఆ పట్టణమందలి రాక్షసుల భార్యలు ఒక్క పెట్టున ఏడ్చినారు. వారి రోదన ధ్వనులు ఆకాశమును అంటినవి. నివాతకవచులను మూడుకోట్ల రాక్షసులు నశించినారు. నాకు విజయము కలిగినది. నేను ఇంద్రుని రథము మీద తిరిగి స్వర్గమునకు పయనమయినాను. మార్గమున మాతలిని అడిగినాను మాతలీ! నివాతకవచుల పట్టణమున రాత్నమాయములైన గృహములు ఉన్నవి. పట్టణము సుందరముగా నిర్మించబడినది. ఇంద్రుడు ఇచట ఉండక అమరావతిన ఉండుటకు గల కారణమేమి? అందుకు మాతలి దేవతలకు రాక్షసుల వలన భయము కలిగినపుడు వచ్చి ఉండుటకు ఇంద్రుడు ఈ పట్టణమును సముద్ర మధ్యమున నిర్మించినాడు. నివాతకవచులు బ్రహ్మను గూర్చి తపస్సు చేసి, ఈ పట్టణమును ఆక్రమించుకున్నారు. దేవతలు రాక్షసులతో యుద్ధముచేసి గెలువజాలక పోయినారు. ఇప్పుడు నీవు నీ బలపరాక్రమములతో వారిని జయించినావు. దేవతలకు సాధ్యముకాని పనిని సాధించినావు" అన్నాడు.
"అన్నా! ధర్మజా! నేను అట్లు నివాతకవచులను వధించి తిరిగి వెళ్లుచుండగా ఒక తపోవనము కనిపించినది. అది పౌలోమ, కాలకేయులను రాక్షసుల బంగారు పట్టణమని తెలిసినది. వారికి బ్రహ్మ వరము ఉన్నదనియు, దేవతలు సహితము వారిని గెలువజాలరని మాతలి వలన తెలుసుకున్నాను. ఆ నగరము మీద దండెత్తుటకు ఉరికినాను.
"రాక్షసులు నా రథమును చూచినారు. నన్ను ఇంద్రుడు అనుకున్నారు. ఆరువేల రథముల మీద నాపైకి వచ్చినారు. నేను నానావిధ విద్యాస్త్రములను ప్రయోగించినాను. వాని నుండి వచ్చిన కొండలు, చెట్లు వారి రథములను అడ్డగించినవి. అప్పుడు మాయా యుద్ధము చేయదలచినారు. పట్టణము సహితముగా ఆకసమునకు ఎగిరినారు. నేను నా బాణములచే ఆకాశమును కప్పివేసినాను. అప్పుడు రథముల సహితముగా అరువదివేల మంది రాక్షసులు నేలకూలినారు. మరొక విధముగా వారిని గెలువరాదని శివుని పాశుపతము సంధించి విడిచినాను. అందునుండి గజ, శరభ, శార్దూల, మహిషాది అనేక మృగములు, యక్ష, రాక్షస, పిశాచ, సర్ప, గంధర్వులు వేలసంఖ్యలో పుట్టి, అరువదివేల రాక్షసులను హతమార్చినారు.
"ఆ విధముగా పౌలోమ, కాలకేయులను గెలిచి ఇంద్రుని వద్దకు వెళ్లి నమస్కరించినాను. నేను రాక్షసులను గెలిచిన పద్ధతిని ఇంద్రుడు మాతలి వలన విన్నాడు. నన్ను అభినందించినాడు. "అర్జునా! నీవు దేవ కార్యములు నిర్వర్తించినావు, ధన్యుడవు. నిన్ను గెలువగలవారు లోకమునలేరు. భీష్మ ద్రోణాదులను నీవు గెలువగలవు. నీకొఱకు నీ సోదరులు నిరీక్షించుచున్నారు వెళ్లుము" అని తన రథమును ఇచ్చి మీ వద్దకు పంపినాడు. అర్జునుడు చెప్పినది విన్నారు అక్కడి వారందరు. ఆనందమున ఉబ్బి, తబ్బిబ్బు అయినారు. అర్జునుని పరాక్రమమును ధర్మరాజాదులు వేనోళ్ల పొగడినారు. అర్జునా! నీవు సాధించిన దివ్యాస్త్ర ప్రయోగ పద్ధతులను మాకు చూపవా?" అని ధర్మరాజు అడిగినాడు.
అర్జునుడు దివ్యాస్త్ర ప్రయోగములను వారికి చూపసాగినాడు. అప్పుడు భూమి వడకినది. సముద్రములు కల్లోలితములు అయినవి. సూర్యుడు తేజోహీనుడు అయినాడు. అగ్నిజ్వాలలు అణగినవి. వాయువు స్తంభించినది. అప్పుడు బ్రహ్మాది దేవతల పనుపున నారదుడు దిగివచ్చినాడు. "అర్జునా! శత్రువులు లేనపుడు దివ్యాస్త్రములను ప్రయోగించిన ముల్లోకములు దహించును. కావున ఈ ప్రయోగములను మానుము" అని అర్జునునితో వృధా ప్రయోగములను మాన్పించి తిరిగి వెళ్లినాడు నారదుడు.
అర్జునుని సహితముగా పాండవులు గంధమాదన పర్వతమున పదిమాసములు ఉన్నారు.





