Home » Dr Dasaradhi Rangacharya » Krishna Yajurveda
2. నేడు సకల మరుత్తులు, సకల దేవతలు మమ్ము రక్షింతురు గాక. అగ్నులన్నియు చక్కగా ప్రజ్వరిల్లును గాక. విశ్వేదేవతలు మాకు రక్షకులగుచు విచ్చేయుదురు గాక. సమస్త ధనములు, అన్నములు మాకు లభించును గాక.
3. మా యొక్క అన్నముల ప్రేరణచే అగ్ని, ఇంద్ర, బృహస్పతి, మరుద్దేవతలు బంగారు రథముల మీద సోమపానము చేయుటకు విచ్చేయుదురు గాక.
4. దేవతలారా! మీరు అన్న సంపాదకులు. మా అన్నములను, ధనములను రక్షించండి. మీరు విజ్ఞులు. అమరులు. ఋతజ్ఞులు. మధురములగు ఈ భోజనములను ఆరగించండి. సంతుష్టులు కండి. సంతృప్తులై దేవమార్గముల పయనించి మీ తావులకు చేరికొనండి.
5. నాకు తొలి, మధ్యమ వయసులందు అన్నము కలుగును గాక. అన్నము వలన దేవతలు ప్రసన్నులు అగుచున్నారు. అన్నము వలన సమస్త దిశలు స్వాధీనములు అగుచున్నవి. కావున నేను అన్నపతిని అగుచున్నాను.
6. పృథివ్యాన్ = పృథివి మీద = పయః = జలమును, ధామ్ = స్థాపించుచున్నాను. పయ ఓషధీషు పయో దివ్యవర్తిక్షే పయోధామ్ - నాకు సకల దిశలు పయస్వంతలు అగును గాక.
7. హే అగ్నీ! అహం పయసా మా సంసృజామి అగ్నీ! నేను నన్ను పాలతో ఏకము చేసికొనుచున్నాను. ఘృతేన మా సంసృజామి. ఆపః ఓషధీభిః సంసృజామి. నాకు అన్నము లభించును గాక.
8. రాత్రింబవళ్ళు ఏకమనస్కలై, అనుకూలురై ఒక శిశువును కన్నవి. ఆ శిశువు ద్యావాపృథ్వుల మధ్య విరాజమానుడై వెలుగులు చిమ్ముచున్నారు. ప్రాణములు ధనప్రదుడగు అగ్నిని ధరించుచున్నవి.
9. వాయువా! నీవు సముద్రమంతటి గొప్ప వాడవు. ఆకాశమంతటి విస్తీర్ణుడవు. వర్ష ప్రదుడవు. ఇహ, పర సుఖములను ఇచ్చువాడవు. నీవు నా వద్దకు విచ్చేయుము. స్వాహా.
10. మరుత్తులారా! మీరు మరుద్గణ స్వరూపులు. ఇహ, పర సుఖములు కలిగించువారు. రండి. స్వాహా.
11. వాయువా! రక్షణ కోరువాడవు. పరిచర్యలతో కూడినవాడవు. ఇహ, పర సుఖములు కలిగించు వాడవు. విచ్చేయుము స్వాహా.
పదమూడవ అనువాకము
1. అగ్ని దివ్యుడు. మంచి రెక్కలు కలవాడు. బృహత్తమ వయస్కుడు. అతనికి నేతితో బలము కలిగించు చున్నాము. ఆ అగ్ని వలననే ఉత్తమ స్వర్గమును అధిరోహించ గోరు వారలమై తాపరహితమగు ఆదిత్య లోకమును చేరుచున్నాము.
2. అగ్నీ! నీవు పక్షి రూపము కలవాడవు. నీ పక్షములకు జరాజీర్ణములు లేవు. ఆ రెక్కలచే నీవు రాక్షసులను వధించు చున్నావు. ఏ లోకమున అనాది సిద్ధులు ఆది పురుషులగు మహర్షులు వసింతురో, పుణ్య పురుషులు వసింతురో అట్టి లోకమునకు మేము నీ పక్షములను ఆశ్రయించి చేరుకొందుము.
3. అగ్నీ! నీవు జగములకు చైతన్యము కలిగించు వాడవు. సముద్ర స్థానివి. సంపన్నుడవు. దక్షుడవు. డేగ ఆకారపు వాడవు. సత్య వంతుడవు. బంగారు రెక్కల వాడవు. కామరూపివి. సమస్తము భరించగలవాడవు. మహామహుడగు ఆదిత్యుని స్థానమున ఉన్నవాడవు అట్లయ్యు సర్వత్ర నిలుచువాడవు.
4. అగ్నిదేవా! నీకు నమస్కారము. నన్ను బాధించకుము. జగములకు శీర్షము వంటి ప్రదేశమున నిలిచి ఉన్నావు. నీ హృదయము సముద్రమగును. నీ మనసునందు సకల ప్రాణులు చేరి ఉన్నవి. నీవే సమస్త లోకములను ద్యావాపృథ్వులను ఏర్పరచినావు.
5. అగ్నులారా! మీరు మాకు జలములను ప్రసాదించండి. దివినుండి, భువినుండి, అంతరిక్షము నుండి మేఘములను కల్పించండి. వానిని భేదించండి. ఆ మేఘముల నుండి వర్షము కలిగించండి. మమ్ము రక్షించండి.
అగ్నీ! నీవు దివికి మూర్థమవు, భువికి నాభివి, జలములకు ఓషధులకు రసస్వరూపుడవు అగుచున్నావు. నీవు విశ్వములకు జీవనమవు, శరణ్యుడవు, విశాలుడవు, పుణ్యలోక మార్గరూపుడవగు నీకు నమః.
6. ఋషులు స్వర్గమును తెచ్చుటకు ఉద్యమించినారు. అగ్నిని ప్రజ్వలింపచేసినారు. తపసా యజ్ఞమును అనుష్ఠించినారు. ఆ అగ్నినే పూర్వులు విస్తరిల్లిన యజ్ఞము కలదానిగా నిర్వచించినారు. నేను సహితము - నాకు స్వర్గము కలుగుటకని - అట్టి అగ్నినే స్థాపించుచున్నాను.
7. సుకృత లోకము వరుసలో భూమినుండి మూడవది. స్వర్గపు పైన ఉన్నది. దుఃఖ రహితము. ఋత్విజులారా! మనము ఆ లోకమునకు చేరదలచినాము కదా! మనము భార్యలతోను, పుత్రులతోను, ధనములతోను కూడినవారలమై ఆలోకమునకు వెళ్లుదము.
8. అగ్ని జగములను భరించగలవాడు. సత్పురుషులను పోషించువాడు. అభిజ్ఞాని. స్తుతివాక్కుల మధ్యన ఉన్నవాడు. అతడు పృథివి పైన ఉండి ఎంతో ప్రకాశించుచున్నాడు. మాతో కలహించు వారిని మా పాదముల క్రింద నలుగునట్లు చేయుచున్నాడు.
9. అగ్ని వీరతముడు. ఆయుష్ప్రదాత. వేలకర్మలందు ప్రమాద రహితుడు. జలమధ్యమున ప్రకాశించువాడు. ఆ యొక్క అగ్ని ఈ కర్మమున ప్రకాశించును గాక. అతని - ఆ అగ్ని - అనుగ్రహమున దివ్య ధామములకు చేరుదుము గాక.
10. అగ్నీ! నీవు, సమస్త దేవతలు యజమాని చేయు యజ్ఞమునకు కలుగు విఘ్నములను పోగొట్టండి. ఈ యజ్ఞపు కర్మసిద్ధిని పొందండి. మా కొరకు దేవలోకమునకు దారి ఏర్పరచండి. ఈ కర్మమున ఆసీనులు కండి. ఉత్తర లోకము నందు స్థిరాసీనులు కండి.
11. అగ్నీ! నీవు దేవతలకు చేర్చువాడవు. ఉత్తముడవు. నీవు సహస్ర దక్షిణాక యజ్ఞమును, సర్వస్వ దక్షిణాక యజ్ఞమును నిర్వహించిన వాడవు. అట్లే మా యొక్క యజ్ఞమును నిర్వహించుము.
12. అగ్నీ! నీవు మా విషయమున అప్రమత్తుడవు అగుము. ఈ యజమానిని జాగృతుని చేయుము. మీరు ఇరువురు కలసి శ్రౌతస్మార్త కర్మలను నిర్వహించండి. యజమానీ! ఈ అగ్ని నిన్ను పాలకుని, ప్రాయపు వానిని చేయుచు నీ కొరకు గాను ఈ యజ్ఞస్రవంతిని నిర్వహించును గాక.
13. అగ్నీ! ఇది నీకు ఋత్విక్ యోని. ఇచట పుట్టిన వాడవై ప్రజ్వలించుము. ఆ స్థానమును ఎరింగి అధిష్ఠించుము. తదుపరి మా ధనమును వర్థిల్లచేయుము.
పదునాలుగవ అనువాకము
1. అగ్నీ! మాకు యజ్ఞఫలము కలుగును గాక. మేము నిన్ను ప్రజ్వలింప చేయుచున్నాము. నీకు పుష్టి కలిగించుచున్నాము. నాకు తూర్పు మున్నగు నాలుగు దిశలు వశములు అగును గాక. నిన్ను నేతగా చేసికొని మేము విరోధి సేనలను జయింతుము.
2. ఇంద్రునితో కూడిన మరుత్తులు, విష్ణువు, అగ్ని, సమస్త దేవతలు నా యజ్ఞమందు ఉందురు గాక. విశాల అంతరిక్షము నన్ను రక్షించును గాక. వాయువు నేను చేయునట్టి యజ్ఞమునకు అనుకూలముగ సంచరించును గాక.
3. దేవతలు నాకు సర్వత్ర సంపదలు సమకూర్తురు గాక. నాకు కోరిన ఫలము లభించును గాక. నాకు దేవతల ఆహ్వానములు కలుగును గాక. అనాది సిద్దులైన దేవ ఋత్విజులు మా యజ్ఞమును సేవింతురు గాక. మేము హింసా రహితులమై పుత్రయుక్తులము అగుదుము గాక.
4. నా హవిస్సులన్నింటిని దేవ ఋత్విజులు యజింతురు గాక. నా సంకల్పములు సత్యములు అగును గాక. నేను ఎటువంటి పాపమును చేయకుందును గాక. విశ్వేదేవతలారా! నన్ను అధికుని చేయండి.
5. దివి, పృథివి, ఉదకములు ఓషధులు, ఊర్కు, సూనృతము అను ఆరుగురు దేవతలు మాకు సమృద్ధిని ప్రసాదింతురు గాక. విశ్వేదేవతలారా! ఈ కర్మను వీరులై రక్షించండి. మమ్ము పుత్రులు విడువకుందురు గాక. మా దేహపుష్టి మమ్ము విడువకుండును గాక. సోమరాజా! మా విరోధికి కార్యసిద్ధి కలిగించకుము.
6. అగ్నీ! మా శత్రువుల కోపము మాపుచు మా ముందు నడచెదవు గాక. ఎదురు లేని నీవు మమ్ము రక్షింతువు గాక. మాశత్రువులు వెనుదిరిగి మాటికొక చోటికి పారిపోవుదురు గాక. మా శత్రువుల మనసులకు ప్రేరణలేక కూలును గాత.
7. మా యజ్ఞము మహా ఫలప్రదము. పాప వినాశకము. దానిని ప్రజాపతుల సృష్టికర్తయు, జగత్పాలకుడగు వాడును - ఉభయ అశ్వినులును, బృహస్పతియు, సమస్త దేవతలును రక్షింతురు గాక. యజమానికి కలుగు యజ్ఞవిఘ్నములను నివారింతురు గాక.
8. ఇంద్రుడు అత్యంత వ్యాప్తుడు. ఘనుడు. పురుహూతుడు. అతడు ఈ యజ్ఞమునందు మాకు సుఖముల నొసంగును గాక.
హర్యశ్వ ఇంద్రా! మాకు పుత్ర సుఖమును కలిగించుము. మమ్ము బాధించకుము. తిరస్కరించకుము.
9. మాకు గల కొద్దిమంది శత్రువులకు పరాజయము కలుగును గాక. ఇంద్రాగ్ని సహితులమై ఆ శత్రువులను నిరంతరము బాధింతుము గాక. వసువులు, రుద్రులు, ఆదిత్యులు మమ్ము స్వర్గము అందుకొనునట్లును, శత్రువు విషయమున ఉగ్రులముగను, అభిజ్ఞులముగను, అధిపతులనుగను చేయుదురు గాక.
10. ఎవడు పరుల గోవులను జయించువాడో, ఎవడు అశ్వములను జయించువాడో అతనిని ఈ యజ్ఞమునకు ఆహ్వానించుచున్నాము. ఇంద్రా! మా ఆహ్వానములను అందుకుని ఈ యుద్దమును సేవింపుము. నిన్ను ఈ యజమానికి మిత్రునిగా చేయుచున్నాము.





