Home » Dr Dasaradhi Rangacharya » Krishna Yajurveda
పదిహేనవ అనువాకము
1. అగ్ని పంచజనులకు హితుడు. అనేకులగు యజమానులచే ప్రజ్వలింప చేయబడువాడు. సృష్ట్యాదియందు ఆవిర్భవించిన వాడు. ప్రకృష్ట జ్ఞానవంతుడు. అట్టి అగ్నిని మనసుచే ధ్యానించు చున్నాము. సమస్త ప్రాణులందు జఠరాగ్ని రూపమున ఉన్నవానిని మాలోన చేర్చుకొనుచున్నాము. ఆ అగ్ని మమ్ము పాప విముక్తులను చేయును గాక.
2. ఊపిరి పీల్చుట,కనురెప్ప వాల్చుట గల ఈ సమస్త జగములు ఏ అగ్నికి అధీనములు అగునో, పుట్టిన పుట్టనున్న సమస్త జగమునకు ఒకే ఆధారమగు ఏ అగ్ని కలదో అట్టి అగ్నిని స్తుతించుచున్నాము. ఫలములను ఆశించుచు మరల మరల హోమములు చేయుచున్నాము. ఆ అగ్ని మమ్ము పాప విముక్తులను చేయును గాక.
3. ఇంద్రుడు తొలుత పుట్టినవాడు. ప్రచేతసుడు. శత్రుహంత. అతనిని నేను మనసునందు ధ్యానించుచున్నాను. ఇంద్రుడు చేరిన స్తోమములు మాకు లభించినవి. ఏ ఇంద్రుడు హవిస్సు లొసగువాడును, సుకృతుడగు యజమాని యజ్ఞమును అందుకొనునో అతడు మమ్ము పాపవిముక్తులను చేయును గాక.
4. ఏ ఇంద్రుడు యుద్ధములకు తన సేనలతో తరలునో, ఏ ఇంద్రుడు యజమానికి గోవులు, అశ్వములు, నరులను కలుగజేయుచున్నాడో అట్టి వానిని స్తుతించుచున్నాను. ఫలములను ఆశించుచు మరల మరల హోమములు చేయుచున్నాను.
5. మిత్రావరుణులారా! మీరు వాస్తవ బలవంతులు. నిలువరించగలవారు. మిమ్ము మనసుచే ధ్యానించుచున్నాము. మీరు శత్రువులను నిరాకరించుచున్నారు కదా! వారి దుష్టబుద్ధిని తెలిసికొనండి. మీరు దీప్తిమంతుడు, రథయుక్తుడగు ఆదిత్యుని చేరుచున్నారు. అట్టి మీరు మమ్ము పాప విముక్తులను చేయండి.
6. మిత్రావరుణలారా! మీ రథము సూటి పగ్గములది. సత్యధర్మ. అది మిథ్యాచారియైన శత్రువును దూషించుచుసాగుచున్నది. మేము మిమ్ము మనసా ధ్యానించుచున్నాము. ఫలప్రాప్తి కొరకు యజించుచున్నాము. మమ్ము పాప విముక్తులను చేయండి.
7. వాయు, సవితృదేవతల గుణగణములను మననము చేయుచున్నాము. వారు తమ శరీరమును వలె సమస్త భువనములను ధరించి ఉన్నారు. సర్వ భువనములందు వ్యాపించి ఉన్నారు. సర్వ భువనములను రక్షించుచున్నారు. వారు మమ్ము పాప విముక్తులను చేయుదురు గాక.
8. వాయు, సవితృదేవతల కర్మములందు ప్రశస్తములగు మా కోరికలు ఫలించనున్నవి. అట్టి వాయుదేవ, సవితృ దేవతలను ధ్యానించుచున్నాము. ఫలప్రాప్తి కొరకు యజించుచున్నాము. వారు మమ్ము పాప విముక్తులను చేయుదురు గాక.
9. అశ్వినులు రథికులకు రథికులు. అశ్వములు వారి అదుపు నందుండును. వానిపై వారు కోరిన చోటునకు చేరగలరు. మమ్ము రక్షింప వలసినదని వారిని ఆహ్వానించుచున్నాము. ఏ దేవతలును మీ బలములకు సాయపడలేదు. మీ బలములు సమాజముగ తీక్ష్ణములు. అట్టి మీరు మమ్ము పాప విముక్తులను చేయుదురు గాక.
10. అశ్వినులు తల్లి సూర్య పత్ని. ఆమెను సద్భావ స్థానమునకు చేర్చుటకు అశ్వినులు తమ త్రిచక్ర వాహనము తీసికొని వెళ్లినారు. అట్టి అశ్వినులను స్తుతించుచున్నాను. ఫలప్రాప్తి కొరకు యజించుచున్నాను. వారు మమ్ము పాప విముక్తులను చేయుదురు గాక.
11. మరుత్తులను మనసా ధ్యానించుచున్నాము. వారు మమ్ము అధికులను చేయుదురు గాక. ఆ విధముగా మేము చేయు ప్రార్ధనలను రక్షింతురు గాక. శీఘ్రగాములును, నియంతలును అగు మరుత్తులను మమ్ము రక్షింపుమని ఆహ్వానించుచున్నాము. వారు మమ్ము పాప విముక్తులను చేయుదురు గాత.
12. మరుత్తుల ఆయుధము పదునైనది. గట్టిది. ఇతరుల బలమును లెక్క చేయనిది. దివ్యమైనది.పరసేనలను జయించగలది. అట్టి ఆయుధము గల మరుత్తులను స్తుతించుచున్నాము. ఫల ప్రాప్తికని యజించుచున్నాము. వారు మమ్ము పాప విముక్తులను చేయుదురు గాక.
13. దేవనాం మన్వే అధి నో బ్రువన్తు. ప్రేమాం వాచం విశ్వామ వన్తు విశ్వే | ఆశూన్హువే సూయమా నూతయే తేనో ముఞ్చన్త్వే నసః |
(11వ మంత్రము వలెనే. మరుత్తులకు బదులు దేవతలని చెప్పుకొనునది.)
14. మానవ కారణముగ గాని, దేవకారణముగ గాని నాకు కలుగు దుఃఖములు, బాధలను నివారించమని సమస్త దేవతలను స్తుతించుచున్నాను. ఫలముల నాశించి యజించుచున్నాను. వారు మమ్ము పాప విముక్తులను చేయుదురు గాక.
15. "అనునోద్యానుమతిః" "వైశ్వానరోన ఊత్యాప్రయాతు" పురోను వాక్యకు ప్రతీక.
"అన్విదనుమతే త్వమ్" "అన్విదనుమతే త్వం మన్యాసా" యాజ్యకు ప్రతీక.
16. "వైశ్వానరో న ఊత్యా" "వైశ్వానరోనన ఊత్యాప్రయాతు" పురోను వాక్యకు ప్రతీక.
"పుష్టోదివి" పుష్టోదివి పుష్టోఅగ్నిః" యాజ్యకు ప్రతీక.
17. ఏ ద్యావాపృథ్వులు అపరిమిత బలములచే ప్రఖ్యాతములో, ఏవి సకల ధనములకు ఆశ్రయ భూతములో వానిని స్తుతించుచున్నాను. ఫలముల నాశించి మరల మరల యజించుచున్నాను. అవి మమ్ము పాప విముక్తులను చేయును గాత.
18. విశాల రోదసీ! ధనమును, కీర్తిని కలిగించండి. ద్యావాపృథ్వులారా! మమ్ము అధికులను చేయండి. అందుకని మిమ్ము స్తుతించుచున్నాము. ఫలముల నాశించి మరల మరల యజించుచున్నాము. వారు మమ్ము పాప విముక్తులను చేయుదురు గాక.
19. యువతమ అగ్నీ! మేము అజ్ఞానులము. నీవు అఖండుడవు. మేము నీ విషయమున అపరాధము చేసి ఉండవచ్చును. అట్టి వానిని మన్నించుము. మమ్ము నిరపరాధులను చేయుము.
20. దేవతలారా! మీరు యాగములందు యజనార్హులు. కపిల గోవు యొక్క పాద బంధమును విడిపించినవారు. అగ్నీ! అదేవిధముగ మమ్ము వివిధ పాపముల నుండి విముక్తులను చేయుము. మా ఆయువు అత్యంత అధికమగునట్లు చేయుము.
విద్వాంసుడు, బహు భాషావేత్త, కవి, కథకుడు, నవలాకారుడు, నాటకకర్త, బాలసాహిత్యకారుడు, విమర్శకుడు, చలనచిత్ర రచయిత, వ్యాసకర్త, అనువాదకుడు, వక్త, స్వాతంత్ర్య సమరయోధుడు, కార్మికోద్యమ నేత, ప్రగతి పథగామి, ప్రసన్నుడగు దాశరథి రంగాచార్య విరచిత శ్రీ మదాంధ్ర వచన కృష్ణ యజుర్వేదీయ తైత్తిరీయ సంహిత యందలి నాలుగవ కాండము సమాప్తము.
మధు మనిష్యే మధుజనిస్యే మధువక్ష్యామి మధువదిష్యామి మధుమతీం దేవేభ్యో వాచము
ద్యాసగం శుశ్రూషేణ్యాం మనుషేభ్యస్తం మా దేవా అవన్తు శోభాయై పితరోనుమదన్తు.
3 - 1 - 2 - 3.
* సమాప్తం *




