Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam



    4. ఆది పర్వమున అంగార పర్ణుని కథ ఉన్నది. ఈ నది నాది. ఇచటికి ఇతరులు వచ్చుటకు వీలులేదు అన్నాడు. అడవులు నదులు అందరివి అని అర్జునుడు అంగార పర్ణుని ఓడించి అతని వాదమును ఓడించినాడు.
    ఇక్కడను అట్టివాదమే కనిపించుచున్నది. కుబేరుడు కొన్ని వనములను సరస్సులను ఆక్రమించుకున్నాడు. ఇతరులకు అవి అందుబాటులో లేకుండ చేసినాడు. భీముడు అడిగిన ప్రశ్నలో ఎన్నో న్యాయ సూత్రములు ఉన్నవి.
    "అడవులు, కొండలు, నదులు, సరస్సులు సర్వజనులకు చెందినవి. అవి ఏ ఒక్కరి సొత్తుకాదు. కుబేరుడు ఈ వనమును నాటించినాడా? ఈ సరస్సును సృష్టించినాడా?"
    ఒక ఆస్తి స్వంతమగుటకు వారి ప్రయత్నము అవసరము. అట్లు కానిచో అది ఆర్జన కాదు. చౌర్యము అగును.
    కుబేరుడు జనుల ఆస్తిని తన స్వంతము చేసుకున్నాడు. న్యాయము ఈ వ్యవస్థ మీదనే తొలి నుండి దాడి చేయుచున్నది. మానవ ప్రయత్నము సాంతము ఈ వాదమును ఓడించుటయే.
    సౌగంధికము నిమిత్తము. భీముడు కుబేరుని వాదము మీద దండెత్తినాడు. అతడు కావలివారిని ఓడించినాడు. సౌగంధికము తెచ్చినాడు. సౌగంధికము వచ్చినది. కుబేరుడు లొంగలేదు. పాండవులను ఆ పరిసరములందు సహితము ఉండనీయలేదు కుబేరుడు. కాపలా మరింత కట్టుదిట్టము చేసినాడు.
    ద్రౌపదికి అది నచ్చలేదు. కుబేరుని వాదమును కూలదోయవలె. అందుకు పంచవర్ణ పుష్పములు కోరినది. ఈతడవ తన బలమునంతయు కూడదీయించి భీముని మీద దాడి చేయించినాడు కుబేరుడు. మణిమంతుని చావుతో తాను ఓడినానని చెప్పుటకు పాండవులవద్దకు వచ్చినాడు. లొంగినాడు. పాండవులు ఆ పరిసరములందే ఉండరాదన్నవాడు. వారికి తావు ఇచ్చుటేకాక పరిచర్యలకు తన పరిచారకులను నియమించినాడు.
    ఆవిధముగా ద్రౌపది భీముడు కలిసి కుబేరుని ఆధిపత్య వాదమును ఓడించినారు.
    "సౌగంధికము" మానవజాతి కథ. మానవజాతి ఉన్నంత కాలము ఆధిపత్యము మీద పోరాటములు జరుగుచునే ఉండును.

                                                  నివాత కవచులు

    పాండవులు పార్ష్ణిసేనుని ఆశ్రమమున ఒక మాసము ఉన్నారు. అక్కడినుంచి వారు మందర, మేరు పర్వతములను దర్శించినారు.    
    ఒకనాడు ఆశ్రమమునకు ఇంద్రుని దివ్య రథము వచ్చినది. అది వెలుగులు పరచుచున్నది. దానికి మాతలి సారథ్యము వహించినాడు. ఇంద్రుని రథము ఆశ్రమమున ఆగినది. అందరు అది చూచుటకు వచ్చినారు. అందునుండి అర్జునుడు దిగినాడు.
    అర్జునుని చూచి అందరు ఆశ్చర్యచకితులు అయినారు. అర్జునుడు ఇంద్రలోకము నుండి దివివచ్చినాడు! అర్జునుడు విజయుడు అయివచ్చినాడు!! అర్జునుడు సకల శస్త్రాస్త్రములు సాధించి తెచ్చినాడు!!!
    అర్జునుడు రథము దిగి వచ్చినాడు. రోమశ, ధౌమ్యాదులకు పాదాభివందనము చేసినాడు. అర్జునుడు అయిదు సంవత్సరముల తరువాత వచ్చినాడు. ఆనందము పట్టలేక పోయినాడు. ధర్మరాజు అర్జునుని కౌగిలించుకున్నాడు. వెన్ను నిమిరినాడు. శిరసు మూర్కొన్నాడు. ధర్మరాజు కనుల నుండి ఆనంద బాష్పములు రాలినవి. అర్జునుడు భీమునకు వందనము చేసినాడు. భీముడు కౌగిలించుకున్నాడు. నకుల సహదేవులు అర్జునునకు నమస్కరించినారు.
    ద్రౌపది ఒంటరిగా, దూరముగా నిలిచినది. ఆమెలో సాగరములు ఉప్పొంగుచున్నవి. ఆవేశము అణగకున్నది. అర్జునుడు ద్రౌపది వైపునకు నడచినాడు. ద్రౌపదిముందు నిలిచినాడు. ద్రౌపది విచ్చనున్న పచ్చి కుండవలె ఉన్నది. అప్పటికే ఆమె కనులు చెమ్మగిలినవి. గొంతు రుద్ధమయినది.
    ద్రౌపది, అర్జునులు ఎదురు బదురుగా నిలచినారు. ఇరువురకు మాట పెకలుట లేదు. ఇద్దరి గుండెలలో చంద్రోదయములు అగుచున్నవి.
    ఆశ్రమవాసులు ఆ అపూర్వ దృశ్యమును చూచుచున్నారు.
    అది సాగర సంగమము. సుడులు తిరుగుచున్నవి. తరంగములు ఎగసి పడుచున్నవి.
    "ద్రౌపదీ!" గొంతు పెకిలి వచ్చిన అర్జునుని మాట
    "అర్జునా!" చెలియలి కట్ట తెగినది. ద్రౌపది అర్జునుని భుజముపై వాలినది. ఆనకట్టలు తెగినవి. ఆమె కన్నీటితో అతని భుజము తడిసినది.
    అది ఒక అపూర్వ దృశ్యము.
    అందరి కనులు చెమ్మగిలినవి.
    ప్రకృతికి అన్నింటిని మాన్పుశక్తి ఉన్నది. ఆనందముగాని దుఃఖముగాని నిలువవు.
    అందరు మామూలు మనుషులు అయినారు. అర్జునునకు స్వాగతము పలికినారు. ఆదరించినారు. ఆత్మీయత కనబరచినారు.
    కాలము ఏ దాని కొఱకు ఆగదు. సాయంకాలమయినది. రాత్రి అయినది. చీకట్లు పరచినవి. చంద్రుడు ఉదయించినాడు. అర్జునుడు అందరి మధ్యన ఉన్నాడు. ఏవేవో ముచ్చట్లు చెప్పుకున్నారు. అయిదు సంవత్సరముల ముచ్చట్లు వెళ్లబోసుకున్నారు.
    తెల్లవారినది. ఈ ఆనందము చూచుటకు దేవగణముల యుక్తముగా ఇంద్రుడు ఆశ్రమమునకు వచ్చినాడు. ధర్మరాజాదులు ఇంద్రునకు నమస్కరించినారు. పూజించినారు.
    "ధర్మజా! నీ తమ్ముడు అర్జునుడు నా వలన సకల దివ్యాస్త్రములను పొందినాడు. వాటి ప్రయోగ ఉపసంహారములు నేర్చినాడు. అతడు సకల దేవతల వలన దివ్యాస్త్రములను పొందినాడు. నివాత కవచులను రాక్షసులను సంహరించినాడు. అర్జునుడు తన పరాక్రమము చేత నీ శత్రువులందరును సంహరించగలడు. నీకు ఈ సకల భూమండల రాజ్యమును ఇవ్వగలడు. నీ తమ్ముడు అర్జునునకు నన్ను సహితము గెలుచునంత శక్తి ఉన్నది. అర్జునుడు అజేయుడు. అతనిని గెలువగలవారు లేరు" అని చెప్పినాడు ఇంద్రుడు. పాండవులను ఆశీర్వదించినాడు. దేవగణములతో ఇంద్రలోకమునకు వెళ్లిపోయినాడు.
    ఇంద్రుని చూచి, అతడు చెప్పినది విని ధర్మరాజు ఉబ్బి తబ్బిబ్బు అయినాడు. తమ్ములు, ద్రౌపది, ధౌమ్య, రోమశాది పెద్దలు పరివేష్టితులయి ఉండగా అర్జునుడు అడిగినాడు:-
    "అర్జునా! ఇంద్రుడు చెప్పిన విధము అపూర్వము. నీకు దివ్యాస్త్ర లాభము ఎట్లు కలిగెను? నివాత కవచులను ఎట్లు సంహరించితివి? వినవలెనని కోరికగా ఉన్నది. వివరించవలెను".




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.