Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam



    భీముడు యుద్ధమునకు సిద్ధము అయినాడు. శంఖము పూరించినాడు. భయంకరమగు ఆ శంఖధ్వని విన్నారు యక్ష రాక్షసులు, ఉరికి వచ్చినారు. భీముని చుట్టుముట్టినారు. నానా విధములయిన ఆయుధములు ప్రయోగించినారు. భీముడు విజృంభించినాడు. వారి ఆయుధములను వమ్ముచేసినాడు. యక్ష రాక్షసులను ఊచకోత కోసినాడు. రక్తపు నదులు ప్రవహించినవి.
    అప్పుడు మణిమంతుడను రాక్షసుడు రంగమునకు వచ్చినాడు. అతడు కుబేరునకు మిత్రుడు. వీరుడు, భీముడు మణిమంతుని చూచినాడు. బాణములతో కొట్టినాడు. మణిమంతుడు గదాయుధమును ప్రయోగించినాడు. భీముడు దానిని ముక్కలుగా నరికినాడు. మణిమంతుడు శక్తి ఆయుధమును విసరినాడు. అది భీముని భుజమునకు తాకి కూలినది. అది చూచి భీముడు ప్రళయ రుద్రుడయి నిలిచినాడు. మణిమంతుడు త్రిశూలమును ప్రయోగించినాడు. అది నిప్పులు కక్కుచు భీముని మీదకిపోయినది. భీముడు దానిని తునాతునకలు చేసినాడు. అది చూచి మణిమంతుడు బెదిరినాడు. తప్పుకొనుటకు ఆకసమునకు ఎగిరినాడు. అది చూచి భీముడు గర్జించినాడు గదాయుధమును అతని మీదికి విసరినాడు.
    మణిమంతుడు గద దెబ్బకు చచ్చి నేల కూలినాడు.
    మణిమంతుని సైనికులు బెదిరినారు. చెల్లాచెదురయి పారిపోయినారు. మణిమంతుని చావును గురించి కుబేరునకు విన్నవించినారు.
    ధర్మరాజునకు భీముడు కనిపించలేదు. ద్రౌపది చెప్పిన జాడను బట్టి ధౌమ్య, రోమశుల యుక్తముగా ధర్మరాజాదులు భీముడు ఉన్నచోటికి వచ్చినారు. అప్పటికి కుబేరుడు యక్ష, రాక్షస, గరుడ, గంధర్వ సమేతుడయి అక్కడికి చేరుకున్నాడు.
    వారందరూ భీముని చూచినారు. అతని పరాక్రమమును గమనిన్చినారు. చచ్చిపడి ఉన్న యక్ష రాక్షసులను చూచినారు. భీముని బల పరాక్రమములను పొగడినారు.
    ధర్మరాజాదులు కుబేరుని చూచినారు. అతనికి నమస్కరించినారు. ఆదరించినారు.
    కుబేరుడు పాండవుల ఆదరమునకు సంతసించినాడు. "భీమా! నీ పరాక్రమమునకు మెచ్చినాను. నీవు మహావీరుడయిన మణిమంతుని కూల్చినావు. నీ సాహసము వర్ణింపరానిది. మణిమంతుని చంపి నీవు నాకు ఉపకారము చేసినావు" అన్నాడు కుబేరుడు.
    "ధర్మరాజా!" కుబేరుడు అన్నాడు. "క్షత్రియుడగు వాడు ధర్మ విశేషములను ఎరుగక కేవలము సాహసమూర్తిగా ప్రవర్తింపరాదు. భీముడు కేవల సాహసమూర్తిగా ప్రవర్తింపకుండునట్లు నీ నిర్మల జ్ఞాన ధర్మబుద్ధి చేత శిక్షింపవలెను. మీ జన్మకారకులు మిమ్ము రక్షించునట్లు నేను సర్వదా మిమ్ము రక్షించుచుందును. నీవు పార్ష్ణిసేనాశ్రమమున పదిహేను దినములు నివసించుము. నా పరిచారకులు నీకు అన్ని ఏర్పాట్లు చేయగలరు. అర్జునుడు ఇంద్రలోకము నుండి మీవద్దకు రాగలడు".
    కుబేరుడు అట్లు చెప్పి పరివార సమేతముగా వెళ్లిపోయినాడు.
    ధర్మరాజాదులు పార్ష్ణిసేనాశ్రమమున ఉన్నారు.

                                                    ఆలోచనామృతము

    1. నేను ఈ మధ్య హిమాలయములను దర్శించినాను. అది ఒక జీవితానుభావము. ఋషీకేశము వరకు మైదానము. ఆ తరువాత కొండదారి. రోడ్డున్నది. కాని రాకపోకలు తక్కువ. స్వచ్చమై, సుందరమయి, రమ్యమయి, రమణీయమయి, మనోహరమయిన ప్రకృతి దృశ్యములు మనను పరవశింపజేయును. మనము సాగినంత దూరము మన ప్రక్కనే నది సాగివచ్చుచుండును. నదుల సంగమములు, ప్రయాగలు సౌందర్యమునకు మూసలు. మన వాహనము గౌరీకుండ్ వరకు వెళ్లును. తదుపరి కేదార్ నాథ్ కు కాలినడక లేక గుఱ్ఱపు స్వారి. అది వర్ణించలేని దారి. మంచుపరచి ఉన్నది. పక్కనున్న కొండన పచ్చని అడవి. ఎత్తునుంచి పడు జలపాతము. కింది నుంచి పారు సెలయేరు. వేసవికాలమున చలి. అది ఒక అద్భుతము. కేదారేశ్వరమందలి లింగము పాండవ ప్రతిష్ఠ అందురు.
    జోషీ మఠము నుండి బదరీ మార్గమున "పాండు దేశము" ఉన్నది. అది పాండవుల జన్మస్థానమని చెప్పుదురు. వాస్తవముగా అతి రమణీయ ప్రదేశము. అక్కడి నుంచి బదరి దారి ప్రాకృతిక సౌందర్యము ఒడిలో నుండి సాగును.
    బదరి అందములు వర్ణనాతీతములు. మంచు కప్పుకున్న వెండికొండల మధ్య, అలకనంద మంచునది, ఉష్ణకుండములు, పరవశింప చేయు ప్రకృతి నడుమ బదరీ స్వామి ఆలయము. పరమాత్మ సాన్నిధ్యమున ఉన్న నిష్కల్మష, పవిత్ర అనుభూతి మరపురానిది. వర్ణించుటకు మాటలు, చూచుటకు కనులు చాలవు. పరవశించుటకు మనసుండవలె.
    ఏనాటిది భారతము. హిమవంతమున ఈనాటిదిగా కనిపించును. అక్కడి వాతావరణము విచిత్రము. భారతమున వర్ణించినట్లే ఉండును. చూచుచుండగనే కొండచరియలు కూలును. మబ్బులు కమ్మును. పెనుగాలులు వీచును. పాండవులకు అట్లే జరిగినది. ఆ పెనుగాలికి విడిపోవుటలో కూడ ఒక ఉద్దేశ్యమును సాధించినాడు వ్యాస భగవానుడు.
    ఆ చలిగాలిలో పెను వృక్షము క్రింద భీముడు- ద్రౌపది ఏకాంతముగా కలిసినారు. అది వారిలో ప్రణయ స్నేహము కలిగించినది. పెంచినది. ప్రణయమునకు వయసుతో నిమిత్తము లేదు.
    2. పూవులు అతివలను అలరించుట అతి సామాన్యము. సౌగంధికమును చూచి ద్రౌపది మురియుటలో ఆశ్చర్యము లేదు. కాని ద్రౌపది సామాన్య స్త్రీ కాదు. ఆమె అసామాన్య. తన ప్రశ్నలతో కౌరవ సభను నిరుత్తరులను చేసిన బుద్ధికుశలత కలది. ద్రౌపది సౌగంధికము ద్వారా భీమునిలోని సాహసమును మేలుకొలుప దలిచినది. ఇంత కాలముగా భీమునిలోని సాహసము నిద్రాణమయి ఉన్నది. దానిని పురికొల్పుట ఆమె ఉద్దేశ్యము.
    3. భీముడు సాహసి. అంతేకాదు గర్వి. తనను మించినవాడు లేడని గర్వమున్నది. మనిషికి గర్వమును మించిన శత్రువు లేడు. గర్వము అహంకారమునకు దారితీయును. అహంకారము మానవుని వ్యక్తిత్వమును నశింపచేయును.
    భీముని గర్వమును అదుపునందు ఉంచుటకే హనుమంతుడు ఎదురయినాడు. హనుమంతుని తోక సైతము కదిలించలేని భీమునకు తనను మించిన వారున్నారని తెలిసినది. సాహసమునకు ఆలోచనలు అవసరము అని బోధించినాడు హనుమంతుడు. సాహసము సర్వదా పనికిరాదు. ఆలోచనతో కూడిన సాహసమే ఉపయుక్తమగును.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.