Home » Dr Dasaradhi Rangacharya » Krishna Yajurveda
ఎనిమిదవ అనువాకము
1. ఈ అశ్వము అన్నసాధనము. దేవతల కొరకు గాను పుట్టినట్టిది. ఈ యజ్ఞమున దీని శక్తి సామర్థ్యములను విశేషముగ స్తుతించుచున్నాము. మిత్ర, వరుణ, వాయు, ఇంద్ర, ప్రజాపతి, ఆర్యమ, మరుత్తులు తమను స్తుతించలేదని మమ్ము నిందించవలదు.
2. ఈ అశ్వము ఋత్విజులచే ప్రోక్షించబడినది. సువర్ణ, రజత, మణి మయాదులచే అలంకరించ బడినది. ఋత్విజులు దీనిని చేతబట్టి హవిస్సుగా అర్పించినంతనే ఇది ఎంతో వేగముగ దేవతలను చేరుకుని గొప్పగా సకలించును గాక. ఇంద్ర, పూషాది దేవతలు దీనిని తమ అన్నముగా స్వీకరింతురుగాక.
3. అజము సర్వత్ర ప్రీతికరము. పురోడాశము వలె రుచికరము. త్వష్ట అశ్వసహితముగ అజమును సంతోష పరచినాడు. అందువలననే సర్వదేవతలకు హితవగు మేకను అన్నహేతువగు అశ్వమునకు ముందు నడిపించుచున్నారు.
(అశ్వమేధమున అశ్వము ముందు మేకను నడిపించెదరు.)
4. అశ్వము హవిస్సునకు యోగ్యము. ఋతువులన్నింటి యందును దేవతలను చేరునది. ఋత్విజులు దానిని విశేషప్రదేశము చుట్టును మూడు మారులు ప్రదక్షిణము చేయింతురు. ఆ అశ్వమునకు ముందే పూష దేవతకు భాగమగు అజము దేవతలకు ఈ యజ్ఞమును తెలియ పరచుచు సాగుచున్నది.
5. హోతయు, అనుష్ఠించు అధ్వర్యుడును, అగ్నిమింధుడును, గ్రావస్తుత్తును, ప్రశాస్తయు, ప్రస్తోతయను ఋత్విజులు ఈ యజ్ఞమును చక్కగా అలంకరించి, అనుష్ఠింతురు గాక. వారు ఈ యజ్ఞము యొక్క ఫలవాహినుల కొరకు ప్రార్థింతురు గాక.
6. యజ్ఞము కొరకు యూపమును చెక్కువారు ఉందురు. చెడిన యూపములను తొలగించు వారు ఉందురు. యూపము మీది శకటమును సంస్కరించువారు ఉందురు. గుర్రమును వండుటకు వంట చెరకు కూర్చువారుందురు. అందరును సంతసమున తమ కార్యములను నిర్వర్తించి మాకు ముదమును కూర్తురు గాక.
7. ఎంతో ఆనందము నిచ్చు ఫలము మాకు అందు బాటులో ఉన్నది. మేము కోరిన కోరికలను దేవతలు తీర్చనున్నారు. అందమైన వీపు గల ఈ అశ్వము దేవతలకు హవిస్సు అగుచున్నది. అభిజ్ఞులగు ఋత్విజులు స్తోత్రములచే అశ్వమును సంతోష పరచుచున్నారు. దేవతల పుష్టి కొరకు ఈ అశ్వమును వారికి సుబంధువును చేయుచున్నాము.
8. ఈ అశ్వమునకు గళబంధము ఉన్నది. పృష్ఠ బంధము ఉన్నది. శీర్షబంధము ఉన్నది. పుచ్చ బంధము ఉన్నది. దీని నోటియందు గడ్డి ఉంచబడినది. యజమానికి దేవలోకమున ఈ అశ్వము వాటినన్నింటితో కూడి లభించును గాక.
9. ఈ అశ్వమాంసమున ఈగలు వాలి ఉండవచ్చును. వధించునపుడు దీని రక్తము కట్టుగొయ్యకు, కత్తికి అంటి ఉండవచ్చును. నరికిన వాని చేతికి గోళ్లకు చేరి యుండవచ్చును. అవి అన్నియు దేవతలకు చెందును గాక. దేవ లోకమున యజమానికి లభించును గాక.
10. అశ్వపు ఉదరమందు మిగిలిన దుర్గంధమగు అజీర్ణ పదార్థములను, ఉడకని దుర్గంధ భాగములను శమితలు శుభ్రము చేయుదురు గాక. దానిని యజ్ఞయోగ్యమగునట్లు వండుగురు గాక.
11. అశ్వమా! నిప్పు మీద వండినపుడు నీ అవయవములందలి ఏ కొద్ది భాగమో నేల మీద పడి ఉండవచ్చును. వధించునపుడు కత్తికి అంటి నేలపాలై ఉండవచ్చును. అదంతయు నేలకు తాకకుండును గాక. పచ్చగడ్డికి తాకకుండును గాక. అదంతయు దేవతలను చేరును గాక.
తొమ్మిదవ అనువాకము
1. గుర్రపు మాసము ఉడుకునప్పుడు కొందరు అది తమకు అందునని ఆతురతగా చూచు చున్నారు. కొందరు ఉడుకుచున్న వాసనను చూచి మురియుచున్నారు. కొందరు మాంసము తెమ్మనుచున్నారు. కొందరు మాంస భిక్ష యాచించుచున్నారు. వారందరు మాకు శుభములు ఆశింతురు గాక.
2. మాంసము ఉఖయందు ఉడుకునపుడు చవి చూచుట, వండిన దానిని పాత్రములందు ఉంచుట, వాటిపై మూతలు పెట్టుట, గరిటలతో కలిపి చూచుట మున్నగునవన్నియు అశ్వకార్యములు అగుచున్నవి.
3. గుర్రము నిలిచిన చోటు, గుర్రము ఉండిన చోటు, గుర్రము తిరిగిన చోటు, గుర్రమును కట్టినచోటు, గుర్రము నీరు త్రావిన చోటు, గుర్రము గడ్డిమేసిన చోటు ఇవన్నియు దేవతలకు అర్పితము అగును గాక.
4. అశ్వమా! అగ్ని నీకు పొగబారనీయకుండును గాక. చప్పుడు కాక ఉడకనీయును గాక. వంటపాత్రను మాడనీయకుండును గాక. నీవు సువాసనలు చిమ్ముచు చవులూరింతువు గాక.
యజమానులు దేవయోగ్యమగునట్లుగా సంకల్పించి, వషట్కారమున సమర్పించిన ఈ అశ్వమును దేవతలు స్వీకరింతురు గాక.
5. అశ్వమును వధించనపుడు క్రింద పరచిన, పైన వేసిన వస్త్రములు - అలంకరించిన సువర్ణమణిమయాదులు, గుర్రపు వంటికి, కాళ్లకు కట్టిన త్రాళ్ళు - ఇవన్నియు దేవతలకు ప్రియములై, సర్వత్ర వ్యాపించునుగాక.
6. అశ్వమా! నీపై స్వారి చేయునపుడు నీ వేగము పెంచుటకు కాళ్లతో గ్రుద్దియు, కొరడాతో కొట్టియు బాధ కలిగించి ఉందును. వానినన్నింటిని యాగములందు హవిస్సుల వలె మంత్రయుక్త హోమము చేయుచున్నాను.
7. అశ్వము అన్నసాధకము. దేవతలకు ప్రియతమము. దానికి గల ముప్పది నాలుగు ఎముకలను కత్తి బాగుగా తాకును గాక. వధించువారలారా! అశ్వపు అవయవములు విచ్చిన్నము కాకుండునట్లు చేయండి. క్రమానుసారముగ విశస్యము చేయండి.
8. అశ్వము దీప్తి వంతము. దానిని వధించునపుడు పట్టు కొనువారు ఇద్దరు. వధించువాడు ఒకడు.
అశ్వమా! నీ అవయవములను ఋతువులకు తగిన విధముగా మాంస పిండములను చేసి అగ్ని యందు హోమము చేయుచున్నాను.
9. అశ్వమా! నీవు తనువు విడిచి దేవతల వద్దకు వెళ్లునపుడు నీకు ప్రియమగు దేహ విషయమున సంతాపము కలుగ కుండునుగాక. ఆయుధము నీ తనువున నిలువ కుండును గాక. నైపుణ్యము లేని విశసనకర్తలు - కేవలము మాంసతృష్ణచే - విశసన పద్ధతిని అనుసరించక నీ అవయవములను కోయకుందురు గాక.
10. అశ్వమా! లోకము దృష్టికి నీవు చంపబడిన దానవు అగుచున్నావు. వాస్తవముగా నీకు మరణము లేదు. నీవు శమితలచే హింసించ బడుటలేదు. నీవు చక్కని మార్గమున దేవతలకు చేరుచున్నావు. అప్పుడు నీ కొరకు హర్యశ్వములు రథమునకు కూర్చబడును. అశ్వసుందరాంగులు అందు ఉందురు. గాడిద బరువు మోపిన నీకు దివ్యాశ్వప్రాప్తి కలుగును.
11. అశ్వము మాకు మంచి గోవులను, కళ్యాణ కర అశ్వములను, మగటిమిగల పుత్రులను, లోకమును పోషించ గలుగు ధనమును కలుగచేయును గాక. హవి రూపమగు ఈ అశ్వము మాకు క్షాత్రమును కలిగించును గాత.
అదితి మమ్ము నిపరరాధులను చేయును గాత.
శ్రీమదాంధ్ర వచన కృష్ణ యజుర్వేదీయ తైత్తిరీయ సంహిత
నాలుగవ కాండము నందలి ఆరవ ప్రపాఠకము సమాప్తము.





