Home » Dr Dasaradhi Rangacharya » Krishna Yajurveda
2. మేము ధనువులు పట్టి గోవులను జయింతుము. ధనువులు పట్టి యుద్దమును జయింతుము. ధనువులు చేతపట్టి శూరులగు శత్రుసేనను జయింతుము. ఈ ధనుస్సు శత్రువును కోరికలు లేనివానిగా చేయును గాక.
3. ధనువునకు కట్టిన వింటినారి భర్తను కౌగలించిన భార్య అతని చెవిలో చెప్పు రహస్యము వలె చెవి యొద్ద అవ్యక్త ధ్వని చేయుచున్నది.
4. యుద్ధమునందు వింటి కొనలు ముచ్చట పెట్టు యువతి వలెను, కొడుకునకు హితము చెప్పు తల్లి వలెను ప్రవర్తించుచున్నవి. ఇవి కలిసి మెలసి శత్రువును బాధించును గాక.
5. అమ్ములను పాలించు పొది యుద్ధమునకు చేరినది. ఎక్కుపెట్టి విడిచినపుడు బాణము "చిశ్చా" అని ధ్వని చేయుచున్నది.
అమ్ముల పొది బిడ్డలు బహువిధములు. అవి ధనువున చేరి విడువ బడినప్పుడు సమస్త శత్రుసేనలను
జయించుచున్నవి.
6. సుశిక్షితుడైన సారథి రథముపై ఆసీనుడు అయినాడు. రథమును అనుకున్న చోటునకు చేర్చుటకు ఎదుట ఉన్న గుర్రములను తోలుచున్నాడు.
ఋత్విగ్యజమానులారా! గుర్రములను అదుపునందుంచు పగ్గములను కీర్తించండి. అవి సారథి మనసును అనుసరించి సాగుచున్నవి.
7. వడిగలవియు, రథమున చేర్చినవియు, శీఘ్రగమనలు అయిన అశ్వములు శత్రువులను అతిక్రమించుచున్నవి. గుర్రములు గొప్పగా సకిలించుచు శత్రువులను పీడించుచున్నవి.
8. యజమాని ఆయుధములు, కవచము ఉంచబడు శకటమునకు రథవాహనమని పేరు. దీనికి హవ్యము కలుగుచున్నది. నిత్యము సౌమనస్యము కలవారమై, సుఖప్రయాణమునకు గాను రథమును స్థాపించెదము.
9. పితరులు ఆపదలందు సాయము చేయగలవారు. శక్తి సంపన్నులు. గంభీరులు. విచిత్రసేనలవారు. బాణబాలురు. అన్యులకు అశక్యులు. వీరాధివీరులు. విస్తీర్ణులు. పరసేనలను పరిభవించువారు.
పితరులు మేము సమర్పించిన అన్నములకు సంతృప్తులు అగుదురు గాక. మాకు ఆయుష్యము కలిగింతురు గాక.
10. మా పితరులు వేదపరులు. అనుగ్రహపరులు. ద్యావాపృథ్వులు సహితము మా పితరుల వలె మా కొరకు శాంతమూర్తులు అగుదురు గాక. యజ్ఞమును వర్థిల్లచేయు పూషదేవత మమ్ము పాపముల నుండి రక్షించును గాక.
11. మా పితరుల బాణము రెక్కవలె పడిన చోటును కప్పివేయుచున్నది. దాని మొన మృగదంతము వలె పదునైనది. గోవు చర్మముచే కట్టబడినది. పితరుల ప్రేరణకలది. శత్రుసేన మీద పడుచున్నది. దానిని చూచిన వారు మొదలు గంతులు వేసి, పిదప పిరికి వారై పారిపోవుచున్నారు. అట్టి పితరుల బాణము మాకు సుఖములు ప్రసాదించును గాత.
12. బాణమా! మమ్ము ఎచ్చటను తాకకుము. మా దేహములు పాషాణము వలె దృఢమగును గాక. సోమదేవుడు మమ్ము మాన్యులను చేయును గాక. అదితి సుఖముల నొసంగును గాక.
13. అశ్వముల పార్శ్వములు పర్వతసాను సదృశములు. సారథులు వానిని బాదుచున్నారు. వీపులను కొట్టుచున్నారు. అశ్వమును ప్రేరేపించు కొరడా! నీవు దెబ్బకొట్టి అశ్వములను యుద్ధములకు ప్రేరణ కలిగించుము.
14. బాణము వేయువాడు చేతికి తొడిగిన చర్మపు తొడుగు పామును కుబుసము వలె రక్షించును. వింటినారి నుండి విడువబడిన బాణము నుండి రక్షించును. బాహువునకు కట్టబడిన తోలు తొడుగు - విద్వాంసుడు ఇతరుని రక్షించిన రీతి - సమస్త ఉపద్రవమున నుండి మమ్ము సర్వత్ర రక్షించును గాక.
15. రథమా! నీవు చెట్టునుండి పుట్టిన దానవు. మా విషయమున స్నేహము కలదానవు. వేగవతివి. భటులతో కూడిన దానవు. నీవు దృఢమగు అవయవములు కలదానవగుము. నీవు గోవులు మున్నగు వాని చర్మ రజ్జువులచే కట్టబడినావు. నీవు దృఢపడి నిన్ను అధిష్ఠించు వానికి యుద్ధమున జయము కలిగించుము.
16. యజమానీ! ఈ రథము ద్యులోక, భూలోకముల నుండి బలములను తెచ్చి అందించినది. వనస్పతుల నుండి బలములను తెచ్చి అందించినది. జలముల నుండి బలములను తెచ్చి అందించినది. ఇది చర్మములచే కట్టబడినది. ఇంద్రుని వజ్రాయుధము వలె కఠినము. ఈ రథమును పూజింపుము.
17. రథమా! నీవు ఇంద్రుని వజ్రము వంటి గట్టి దానవు. మరుత్తుల సైన్యము వంటి భటులు కలదానవు. మిత్రుని ఉదరము వలె సురక్షితమవు. వరుణుని నాభి వలె తిరస్కరింప నశక్యవు. ఈ హవిర్దానమును సేవించుచు, మా హవిస్సులను విశేషముగ స్వీకరించుము.
18. దుందుభీ! భూమిని నీ ధ్యానమున నింపుము. ద్యులోకమును నీ ద్వానమున నింపుము. భూ, ద్యులోకములన్నియును నిన్ను తెలిసి కొనునుగాక. నీవు ఇంద్రుడు, ఇతర దేవతలను భజించుచు మా శత్రువును దూరము నందే నిలిపి ఉంచుము.
19. దుందుభీ! పరసేనలను భయపెట్టుము. మాకు బలము కలిగించుము. పాపములు నశించునట్లు గర్జించుము. మమ్ము ప్రోత్సహించుము. దుష్టులను తొలగించుము. నీవు ఇంద్రుని పిడికిలి వంటి గట్టి దానవు అగుము.
20. ఇంద్రా! మా శత్రుసేనలను తరిమి కొట్టుము. మా సేనలు క్షతిలేనివై తిరిగి వచ్చునట్లు చేయుము. ఈ దుందుభి మా విజయమును చాటును గాక. మా ఆశ్వికులు స్వేచ్చగా సంచరింతురు గాక. మా రథికులు జయింతురు గాక - "అస్మాకం రథినః జయన్తు".
ఏడవ అనువాకము
1. అశ్వమా! నీవు సముద్రము నుండి పుట్టినావో, మగటిమి గల అశ్వము నుండి పుట్టినావో, నీవు పుట్టినపుడు పెట్టిన కేక గొప్పది. నీవు డేగ రెక్క వంటి, జింక కాళ్ల వంటి వేగము కలదానవు. స్తుతింపదగిన దానవు.
2. అగ్ని అశ్వమును ఇచ్చినాడు. వాయువు దీనిని రథమునకు కట్టినాడు. ఇంద్రుడు తొలుత ఈ రథమును ఎక్కినాడు. గంధర్వులు గుర్రపు పగ్గములు పట్టినారు. వసువులు సూర్యుని వలన రథమును ప్రకాశింపచేసినారు.
3. అశ్వమా! నీవు అగ్నివి. వాయువువు. ఆదిత్యుడవు. నీకు యజ్ఞమునందును, సోమము నందును ప్రాధాన్యత ఉన్నది. నీకు ద్యులోకము నందు బంధత్రయము కలదని పెద్దలు చెప్పుదురు.
4. అశ్వమా! నీకు ద్యులోకమునందు మూడు బంధములు ఉన్నట్లే జలనిధి మధ్యమున బంధత్రయము ఉన్నదని చెప్పుచున్నారు. నీది ఉత్తమ జన్మయని చెప్పుచున్నారు. అట్టి నీవు వరుణ రూపము దాల్చి బంధములను గూర్చి నాకు చెప్పుచున్నట్లు ఉన్నావు.
5. అశ్వమా! నీ వంటిని తోము ఇనుప సాధనములు ఉన్నవి. నీ గిట్టలకు కొట్టు ఇనుప నాడాలున్నవి. అవి రాతిపై నడుచుటకు ఉపకరించును. నీ ఇనుప కళ్లెము రౌతును కాపాడుచున్నది. అవి అన్నియు సిద్ధమైనవి. చూడుము.
6. అశ్వమా! నీవు రక్షించు దానవు. ఆకాశమున పరిగెత్తు దానవు. పక్షి వంటిదానవు. అట్టి నీ స్వరూపమును ఇచటనే మనసునందు తెలసికొన్నాను. ఆ విధముగ ధూళి రహిత మార్గములందు వేగముగ సాగు నీ తలను చూచినాను.
7. అశ్వమా! నీవు అన్నమును సాధించుటను నరుడు చూచినాడు. నీకు ఓషధులను, శనగలు మున్నగు వానిని ఆహారముగ ఏర్పరచినాడు. ఇప్పుడు విజయేచ్చ గల నీ ఉత్తమ రూపమును దర్శించుచున్నాను.
8. అశ్వమా! నిన్ను అనుసరించి రథము, రథమును అనుసరించి నరులు సాగుచున్నారు. నిన్ను అనుసరించియే గోవులు జీవించుచున్నవి. దాసదాసీ జనులు జీవించుచున్నారు. సేనలు నీ సాయముననే విజయము సాధించుచున్నవి. దేవతలు నీ సామర్థ్యమును గుర్తించినారు. నిన్ను హవిస్సుగా స్వీకరించినారు.
9. ఈ అశ్వపు శిరస్సు బంగారము వంటిది. దీని కాళ్లు ఇనుము వలె గట్టివి. మనో వేగము కలవి. ఇది లేని ఇంద్రుడు లేనివాడగును. సర్వదేవతలును అశ్వమును హవిస్సుగా అంగీకరించినారు. తొలిసారి ఈ అశ్వమును అధిష్ఠించిన ప్రజాపతి సహితము దీనిని భక్షణీయముగా గ్రహించినాడు.
10. అశ్వములు ఆటల నిమిత్తము వ్యాప్తములు అయినవి. వాని గళ జఘన భాగములు ఉన్నతములు. పృష్ఠము నిమ్నము. అవి శౌర్యవంతములు. వేగవంతములు. గమనశీలలు. హంసల వలె గుంపులుగా సంచరించునవి.
11. అశ్వమా! నీ తనువు వేగమునకు అనువైనది. నీ మనసు వాయు వేగము గలది. శృఞ్గాణి - శృంగార అలంకారములు విశిష్టములు. నీవు రణరంగమున పరసైన్యములను ఎదిరించి సాగుచున్నావు.
12. ఈ అశ్వము అన్నహేతువు. మనసున దేవతలను ధ్యానించు వారు దానిని వధ్య స్థానమునకు చేర్చినారు. తొలుత ఋత్విక్కులు ప్రజాపతిని ప్రార్థించినారు. తదుపరి దీని నాభిని ప్రజాపతికి సమర్పించినారు. విద్వాంసులు పృష్ఠభాగమును స్తుతించి పొందుచున్నారు.
13. ఈ అశ్వము స్వర్గమందున్న తన తల్లిదండ్రులను చూచుటకు గాను వధ్యస్థానమునకు చేరినది. అశ్వమా! నేడు నీవు దేవతలకు ప్రీతిపాత్రమవగుము. దేవతలను చేరికొనుము. హవిస్సులందించిన యజమాని కొరకు ఋత్విజులు వరణీయ ఫలములను ప్రసాదించుమని ప్రార్థించుచున్నారు.





