Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam
"యక్ష రాక్షసులారా!" భీముడు పలికినాడు. "నేను భీముడను. ధర్మరాజు తమ్ముడను. ద్రౌపది మాకు భార్య అగును. ఆమె ఈ సౌగంధికములు కోరినది. అవి తీసుకొని పోవుటకు వచ్చినాను. దారితప్పి రాలేదు. మరలిపోవుటకు రాలేదు".
"భీమరాజా! నీవు ధర్మరాజునకు తమ్ముడవు. ధర్మము తప్పరాదు. నీరాకను గురించి కుబేరునకు ఎరిగించి, అతని అనుమతి పొంది సౌగంధికములు తీసుకొని వెళ్లుట ధర్మము. అట్లు చేసిన మేము నీకు అడ్డురాము" అన్నారు కావలివారు.
"రాక్షసులారా! మీరు అమాయకులవలె ఉన్నారు. అడవులు, కొండలు, నదులు, సరస్సులు, సర్వజనులకు చెందినవి. అవి ఒక్కని సొత్తుకాదు. కుబేరుడు ఈ వనమును నాటించినాడా? ఈ సరస్సును సృష్టించినాడా? అట్లుకానిచో ఇది అతని సొత్తు ఎట్లు అగును?
"నేను క్షత్రియ వీరుడను. క్షత్రియుడు ఇతరులను ప్రార్థింపడు. పైగా సర్వజనుల సంపద కొఱకు కుబేరుని ప్రార్థించవలెనా? నేను సరస్సున ప్రవేశింతును. పూలు తెంచుకుందును" అని భీముడు సరస్సునందు ప్రవేశించినాడు. స్నానమాడినాడు. బంగారు కమలములు తెంచుకుని బయటికి వచ్చినాడు. ఆ కొలనులోని జలములు శక్తిప్రదములు. వాటిని త్రాగుట వలన భీముడు అనంతశక్తిమంతుడు అయినాడు.
భీముడు సాహసముగా కమలములను తెచ్చుటను చూచినారు యక్ష రాక్షసులు. వారు కోపించినారు. ఆయుధములను ఎత్తి భీముని మీదకి వచ్చినారు. భీముడు అతి భయంకరుడు అయినాడు. గదాయుధముతో వారిని చెల్లాచెదరు చేసినాడు. వారు నానావిధ ఆయుధములు ప్రయోగించినారు. భీముడు తన గదచేత వాటిని పడగొట్టినాడు. యక్షరాక్షసుల మీద విరుచుకు పడినాడు. కొందరిని చంపినాడు. కొందరిని గాయపరిచినాడు. వారు భీముని ధాటికి తాళలేక పోయినారు. కుబేరుని వద్దకు ఉరికినారు. అతనికి విన్నవించినారు. భీముడు ద్రౌపదికి కమలముల నిమిత్తము వచ్చినాడని తెలుసుకున్నాడు. కుబేరుడు మాటాడలేదు. నవ్వి ఊరుకున్నాడు.
ధర్మరాజునకు నరనారాయణ ఆశ్రమమున ఉత్పాతములు గోచరించినవి. భీముడు సాహసమునకు దిగినాడని శంకించినాడు. అక్కడ భీముడు కనిపించలేదు. ద్రౌపదిని అడిగినాడు. "మీకు ఒక బంగారు కమలము ఇచ్చితిని గదా! అట్టివి మరిన్ని తెమ్మని భీముని కోరినాను. నా కోరిక తీర్చుటకు భీముడు సాగినాడు. అతడు ఈశాన్యమునకు వెళ్లుట చూచినాను" అని చెప్పినది ద్రౌపది.
"ద్రౌపదీ! భీముడు ఏదో సాహసము చేసినాడు. మనము అక్కడికి వెళ్లుట అవసరము" అని ఘటోత్కచుని సాయమున వారందరు ఆకాశ మార్గమున సౌగంధిక సరస్సునకు చేరినారు. అక్కడ వారికి విజయుడయిన భీముడు కనిపించినాడు. అతని చుట్టు చచ్చిపడి ఉన్న రాక్షసులు కనిపించినారు.
భీముడు వారందరిని చూచినాడు. ఆనందించినాడు. ధర్మరాజు, ధౌమ్య, రోమశులకు నమస్కరించినాడు. నకుల, సహదేవులను కౌగిలించుకున్నాడు. ద్రౌపదికి సౌగంధికములు ఇచ్చినాడు. కొలను చూపినాడు.
ద్రౌపది కనులలో వెలుగులు వెలిగినవి.
భీముడు ఆనందమున ఉప్పొంగినాడు.
ఆమె అతనిని చూచినది. నేలను చూచినది.
అతడు నేలను చూచినాడు. ఆమెను చూచినాడు. ధర్మరాజు భీముని పరాక్రమమునకు పొంగి పోయినాడు. అయినను అట్టి సాహసములకు దిగరాదని భీముని హెచ్చరించినాడు.
ధర్మరాజాదులు కుబేరుని వనమున విహరించినారు. యక్ష రాక్షసులు అక్కడికి వచ్చినారు. వారికి ధర్మరాజు ఇంద్రుని వలె కనిపించినాడు. రోమశుడు దేవర్షివలె కనిపించినాడు. వారు ధర్మరాజునకు నమస్కరించి "ఇది యక్షరాక్షస ప్రదేశము. ఇందు మీరుండుట మంచిదికాదు" అని విన్నవించినారు.
ధర్మరాజు వారి మాటలు మన్నించినాడు. అచటికి సమీపమున నివాసము ఏర్పరచుకున్నాడు. రాక్షస బలముతో ఘటోత్కచుని వెనుకకు పంపినాడు.
ధర్మరాజాదులు అక్కడ ఉండగా ఒక విప్రుడు వచ్చి వారిని ఆశ్రయించినాడు. ధర్మరాజు అతనికి ఆశ్రయము ఇచ్చినాడు. వచ్చినవాడు విప్రుడు కాడు. జటాసురుడు అను రాక్షసుడు. అతడు సమయమునకై వేచినాడు. ఒకనాడు భీముడు లేడు. వేటకు వెళ్లినాడు. అదను దొరికినది. జటాసురుడు ధర్మరాజ, నకుల, సహదేవులను ఎత్తుకొని ఆకాశ మార్గమున ఎగిరినాడు. సహదేవుడు అది చూచినాడు. భీముని కొఱకు అరచినాడు. అతడు జటాసురుని వెంట ఉరికినాడు. ధర్మరాజు తన బలమునంతయు ఉపయోగించి జటాసురుని అణచినాడు. అతడు కొంత కిందికి వచ్చినాడు. సహదేవుడు జటాసురునిపై దాడి సాగించినాడు.
అడవిలో ఉన్న భీముడు సహదేవుని కేకలు విన్నాడు. ఉరికి వచ్చినాడు. సహదేవుడు జటాసురునికి చాలకున్నాడు. "ఒరే! దుర్మార్గుడా! బాపడవని అన్నము పెట్టి పోషించిన వారికే కీడు తలపెడుదువా? నీకు కాలము మూడినది. వారిని దించి రారా! నీకు బక హిడింబ, కిమ్మీర రాక్షసుల గతి పట్టింతును" అని కవ్వించినాడు భీముడు. జటాసురునకు రోషము పొంగినది. "పొగరుబోతు భీమా! నిన్ను అంతమొందింతును" అని వారిని పడదోసి కయ్యమునకు కాలుదువ్వి భీముని మీదకి ఉరికినాడు.
భీమ, జటాసురులకు ఘోర యుద్ధము జరిగినది. వారి తొడల తాకిడికి మహావృక్షములు కూలినవి. వారిద్దరి అడుగుల తొక్కిడికి భూమి అదరిపడినది. వారు చెట్లు పెరికి యుద్ధము చేసినారు. కొంతసేపటికి చెట్లు అయిపోయినవి. అప్పుడు ఒకరిని ఒకరు పట్టుకొని వాలి సుగ్రీవులవలె యుద్ధము చేసినారు. వారి పిడికిలి దెబ్బల ధ్వనికి మృగములు బెదిరి ఉరికినవి. భీముడు భీకరుడయి జటాసురుని మెడమీద పొడిచినాడు. ఆ దెబ్బకు జటాసురుని మెడ వాలిపోయినది. అతడు పడిపోయినాడు. భీముని వాని కళేబరమును ఎత్తి పెద్దరాతికి కొట్టినాడు.
జటాసురుని కళేబరము ముక్కలై చెదరిపోయినది.
భీముని బల పరాక్రమములను అందరు మెచ్చినారు.
పాండవులు గంధమాదనము నుండి ఉత్తర దిశకు బయలుదేరి వృషపర్వుని ఆశ్రమమునకు చేరినారు. విప్రులను అక్కడ ఉంచి ధౌమ్యుడు, రోమశుని యుక్తముగా మాల్యవంతమునకు చేరినారు. అచటి నుంచి శ్వేతపర్వతము దర్శించినారు. ఆ ప్రదేశములు అందమునకు నెలవులు. పచ్చని అడవులు, పూలు, పండ్లు, వివిధ పక్షులు రమ్యముగ ఉన్నవి.
ద్రౌపది భీముడు ఆ ప్రాంతమున ఏకాంతముగా ఉన్నారు. గాలికి పంచవన్నెల పూవు ఒకటి వచ్చి వారిముందు వాలినది. అది అందముగా ఉన్నది. మనోహరముగా ఉన్నది. ద్రౌపది దానిని అందుకున్నది. మురిసిపోయినది. భీముని కనులలోనికి చూచినది. "ఇదివరకు నా కొఱకు సాహసము కనబరచినావు. సౌగంధికము తెచ్చినావు. ఈ పూలు అంతకన్న మనోహరముగా ఉన్నవి. తెచ్చిపెట్టవా?" అని అడిగినది. భీముడు కరిగినాడు. కాదనలేకపోయినాడు చూచినాడు. శ్వేతకి అను నదిలో పూలు కనిపించినవి. అదియు కుబేరుని వనమువలె కనిపించినది. కుబేరుని సౌధములు, ప్రాకారములు కూడ కనిపించినవి.





