Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 6
స్త్రీ పురుషులు తమతమ అంతస్తులను ప్రయోజనాలను , లక్ష్యాలను గుర్తించినట్లయితే అనేక ఇబ్బందులు దూరం అవుతాయి. కొన్ని రానేరావు. కాని వీటిని గురించి వివరించినప్పుడు తరచుగా ఈ సమాధానం వస్తుంది.
"అయ్యా! తలరాత తప్పదు " అంటే మేం చేయడలచింది చేస్తాం. మమ్ము అడ్డగించవద్దు. అసలు మనిషి ఏం చేయగలడు? అతడు అనుకున్నది ఏమి అవుతుంది? మేము దుష్కార్యాలు చేస్తాము. వాటి పర్వవసానం అదృష్టం ఎలా తీర్చుతే అలా జరుగుతుంది. అంతా భగవంతుడు అనుకున్నట్లు జరుగుతుంది అని అర్ధం. దీన్ని పూర్వకాలానికి వర్తింపచేస్తే కొంత అర్ధం ఉంది. ఎంచాతంటే ఆ కాలంలో ఆకస్మికంగా క్షణంలో బండ్లు ఓడలు, ఓడలు బండ్లు అయిపోయేవి. ఇది తలచుకుంటే రాజులకాలం గుర్తుకు వస్తుంది. ఆ కాలంలో యిట్టె మార్పులు జరిగేవి. మనిషి పరిస్థితి అమాంతంగా మారిపోయేది.
ఒకనాటి వృత్తాంతం ఒక సిపాయి అలసి సొలసి మోతీ మహల్ గేటు పక్కనే ఉన్న అరుగు మీద పడుకొని నిద్రపోయాడు. ఉదయపు నమాకు పూర్తీ చేసుకొని పాదుషా వారు పచారు చేస్తూ అటు విచ్చేశారు. వెంట ఎవరూ లేరు. వారికి ఏమనిపించిందో గాని పడుకున్నవాణ్ణి లేపారు. సిపాయి కళ్ళు నలుచుకుంటూ లేచాడు. పాదుషా వారు కనిపించారు. ముందు భయపడిపోయాడు. తరవాత సర్దుకొని తన దగ్గర ఉన్న కరవాలం సమర్పించాడు. పాదుషా స్వీకరించారు. ఖడ్గం లాగారు. తుప్పు పట్టి ఉంది. ఒరలోంచి కష్టంగా బయటికి వచ్చింది. కత్తిని చూచారు. పొగిడారు. మళ్ళీ ఓరలో పెట్టి నడుముకు తగిలించుకున్నారు. తమ వద్ద ఉన్న రాజ కరవాలం సిపాయికి ఇచ్చేశారు. ఈలోగా అలీసఖీఖా ప్రధాని విచ్చేశారు. జహాపనా (చక్రవర్తి) ఆ యువకునీ, అతడు సమర్పించిన ఖడ్గాన్ని కీర్తించారు.
పాదుషా : చూచావా ఇతడ్ని. యువకుడు వీరుడు. (ఒరలోంచి కత్తిలాగి) చూచావా దీని పదును. దీని అందం?
ప్రధాని : మహాప్రభూ! భళి భళి . గుణాన్ని గ్రహించే తమవంటి ప్రభువులున్ననే కదా ఇట్టి విచిత్రవస్తువులు లభించునది.
పాదుషా : అయితే నా ఖడ్గం బాగా లేదంటావా?
ప్రధాని : ఎంత మాట! ఎంత మాట! ప్రభువుల కరకమలాన్ని అలంకరించే కరవాలం బాగులేకపోవడమా?
పాదుషా ; కాని ఇతని దుస్తులు కరవాలానికి తగినట్టుగా లేవు.
ఈలోగా వందిమాగధులు , రాజసేవకులు, అంగరక్షకులు వచ్చారు. పెద్ద గుంపు కూడింది.
ప్రధాని : ప్రభువులు బాగా శలవిచ్చారు.
పాదుషా : అయితే నా దుస్తులు అతనికి వేయండి.
రాజుగారి అధరం కదిలిందో లేదో జనం పరిగెత్తారు. రాజుగారు తొడుక్కొని ఉన్న విలువైన దుస్తులు, రత్నఖచితములైన ఆభరణాలు సిపాయికి వేశారు. అలంకారం పూర్తీ అయింది.
పాదుషా : ఇప్పుడు చూడండి.
ప్రధాని : అబ్బ! రూపమే మారిపోయింది.
వంది మాగధులు సైతం కీర్తించారు.
పాదుషా గారు కొంతసేపు అక్కడ నిలిచారు. ఈలోగా వాహనం వచ్చింది. వాహనం ఎక్కి వాహ్యాళికి వెళ్ళిపోయారు.
సిపాయి పొంగిపోయాడు. ఇంటికి వచ్చాడు. దళారులు, సాహుకార్లు వెంటనే వచ్చారు. ఖరీదు కడై యాభై, అరవై వేలకు తేలింది.
ఇక సిపాయి కధ వినండి. సైన్యంలో మూడు రూపాయిల కొలువు. రాత్రి పూట ఇంటికి వెళ్తే తిండిని గురించి పెళ్ళాంతో తగాదా జరిగింది. అలిగి ఇంటి నుండి వెళ్ళి పోయాడు. రాత్రి అంతా ఎక్కడెక్కడో తిరిగాడో భగవంతునికే తెలియాలి. తెల్లవారుతుండగా మోతీమహల్ ముందరి అరుగు మీద పడిపోయాడు. నిద్రపోయాడు. ఉదయం పాదుషాగారు తట్టి లేపారు. వింత దృశ్యం కనిపించింది. క్షణంలో దరిద్రుడు మహాధనికుడు అయిపోయాడు.
రాజుల కాలంలో ఇలాంటివి చాల జరిగేవి. ఆ కాలంలోనే ఇలాంటివి సాధ్యం కూడా. ప్రభుత్వం ఒక్కని చేతిలో ఉన్నప్పుడూ, అతనికి నియమాలు, చట్టాలూ ఏమీ లేనపుడు, రాజ్యాన్ని అతని స్వంత బొక్కనంగా భావించినపుడూ ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి.
ఇంగ్లీషు వారి ప్రభుత్వంలో వృధా ఖర్చులకు అవకాశం లేదు. ఒక వ్యక్తికీ అకారణంగా పెద్ద మొత్తాలు ఇవ్వడం అన్యాయంగా భావించబడుతుంది. ఈ ప్రభుత్వంలో పాదుషా నుంచి ఫకీరు వరకు అందరికీ శాసనం ఒకటే. అందరూ ఆ శాసనానికీ బద్దులే. ఈ కాలంలో అదృష్టపు బలం తక్కువ. అన్ని పనులూ ఆలోచనతోనూ, ఉపాయంతో నూ జరుగుతాయి.
నవాబు చబ్బన్ గారి వృత్తాంతం వినండి. ఆత్మకధలో ఉత్తర భాగం చెప్పలేదు. వాస్తవానికి వారు ఏటిలో మునగడానికి వెళ్ళారు. మళ్ళీ తెలకూడదని దుమికారు. ప్రాణం అతి ప్రియమైంది. కొంతసేపు నీటిలో ఉండేవరకు ఊపిరి ఆడలేదు. శ్వాస పీల్చుకుందామని పైకి వచ్చారు. నీళ్ళ మీదికి రాగానే కాళ్ళూ చేతులు ఆడాయి. మళ్ళీ చావాలనిపించింది. మళ్ళీ మునిగారు. మళ్ళీ అలాగే అయింది. అలా మునుగుతూ తేలుతూ చత్తర్ మంజిల్ వరకు చేరారు. అనుకోకుండా యువరాజుగారు తమ పరివారంతో విహారానికి అటు వైపే వచ్చారు. వారికి ఎవరో మునుగుతున్నట్లు కనిపించింది. బయటికి లాగవలసిందని సరంగులకు ఆజ్ఞాపించారు. వారి నుండి విడిపించుకోవడానికి చబ్బన్ గారు చాల ప్రయత్నించారు. బెదిరిపోయాడనుకున్నారు సరంగులు. బలవంతంగా లాక్కొని వచ్చారు. యువరాజు గారు పిలిపించారు. విషయం తెలుసుకోగా అమీరు బిడ్డ అని తెలిసింది. బట్టలు ఇవ్వబడినాయి. వెంట రాజా ప్రసాదానికి తీసికెళ్ళారు.
చబ్బన్ గారు యువకులు. విలస ప్రియులు. రీతులు రివాజులు తెలిసినవారు. వినయవంతులు. విద్యావంతులు, హాస్యప్రియులు. యువరాజుకు నచ్చారు. చెలికాళ్ళలో చేర్చారు. దాసదాసీజనం, వాహనాలు ఏర్పాటు అయినాయి. ఖర్చులకు డబ్బు మంజూరైంది. పూర్వం కంటే అట్టహాసం ఎక్కువ అయింది.





