Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 6
చౌకుకు విచ్చేసినప్పటి పరిస్థితే వేరు. ఏనుగు మీద వచ్చారు. వెంట యాభై మంది మనుషులు పరిగెత్తివస్తున్నారు. బిస్మిల్లా, నేనూ చూచాం. నమ్మకం కలుగలేదు. వెంట మఖ్దూబక్ష్ ను చూచి పిలిచాం. అతడు జరిగినదంతా చెప్పాడు.
తరవాత బాబాయిని కలుసుకున్నాడు. పెళ్ళి అయింది. పెళ్ళికి మమ్మల్ని కూడా పిలిచారు. ఖానమ్ కు ఖరీదైన శాలువలు ఇచ్చారు. కాని ఆనాటి నుంచి మళ్ళీ మా ఇంటి గడప తొక్కలేదు. బిస్మిల్లా తో సంబంధం తెగిపోయింది. ఖానమ్ మరొక ఎత్తు వేసింది. అది పారలేదు. అంతా తలక్రిందులైంది.
సంగ్రహంగా చెప్పాలంటే రాజుల కాలంలో ఇలాంటి వింతలు, విచిత్రాలు ఎన్నో జరిగేవి. ఇంగ్లీషు వారి కాలంలో అవేవి? ఖాలీల్ ఖాను పావురాలు ఎగరేశారని వింటాం. డబ్బు గుడ్డిదనగా విన్నాం. కాని ఇప్పుడు అది కళ్ళు తెరచిందనిపిస్తుంది. అదీ యోగ్యులను కనిపెడుతుంది.
రాజుల కాలంలో అక్షరాలూ రాని అధికారులు ఉండేవారు. పెద్ద పెద్ద పదవుల పైన ఉండే వీరు రాజకార్యాలు ఎలా నిర్వర్తించేవారో తెలియదు. ఇదంగా అపహాస్యంగా కనిపిస్తుంది.
అదృష్ట, దురదృష్టాలు అనే చక్రంలో చాలా కాలం గడిపాను. చివరకు ఈ పదాలకు అర్ధం లేదని, వట్టీ మోసమనీ అర్ధం చేసుకున్నాను. అల్లా మనం చేసేవాటన్నింటిని గ్రహిస్తుటాడానడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ విషయంలో సందేహం గలవాడు కాఫిర్. కాని తమ చర్యల పర్యవసానం దుష్పలితాన్నిచ్చినపుడు దాన్ని కర్మకు అంటగట్టడం భగవంతుని పై నేరం మోపడం లాంటిది. ఇది నాస్తిక వాదం.
ఇప్పుడు తెలిసిన విషయాలు నాకు ముందే తెలిసి ఉంటే ఎంతో బావుండేది. వివరించి చెప్పే వారు లేరు. నాకు స్వయంగా అర్ధం చేసుకునేంత అనుభవం లేదు. మౌల్వీగారు రెండు అక్షరాలూ కుక్షిలో వేశారు. అవి ఎంతో ఉపకరించాయి. వారికి భగవంతుడు ఉత్తమగతులు ప్రసాదించుగాక! ఆ కాలంలో వాటి విలువ తెలియలేదు. సోమరితనం, సౌఖ్యాపెక్ష తప్ప వేరే ప్రపంచం తెలియదు. వచ్చే పోయేవారితో విరామం లేకుండేది. వారు ఒక్కొక్కరే జారుకోగా పుస్తకాల మీద ధ్యాస కలిగింది. చదవడం ఒక వ్యసనం అయిపొయింది.
ఆ వ్యసనమే లేకున్నట్లయితే నేను ఇంతకాలం బ్రతకలేక పోయేదాన్ని. వయసు నశించింది. పూర్వపు విటులు జారుకున్నారు. ఈ దుఖంతో కుమిలి కుమిలి చచ్చి ఉండేదాన్ని. కొంతకాలం కధల పుస్తకాలతో కాలం గడిపాను. ఒకనాడు పుస్తకాలు సర్దుతుండగా పూర్వం మౌల్వీగారు దగ్గర చదివిన "గులిస్తా" కనిపించింది. పుటలు తిప్పాను. పూర్వం అదంటే అసహ్యం వేసేది. అవి చదువు తొలిరోజులు. వినయవిధేయతలు తెలియని రోజులు. రెండవది అనుభవం లేదు. అందువలన అర్ధం చేసుకోలేక పోయాను. ఇప్పుడు చదువుతుంటే ప్రతి పదంలో ఏదో ప్రభావం కనిపిస్తుంది. ప్రతి పదాన్నీ హృదయంలో భద్రపరచుకుంటున్నాను. మొదటి నుంచీ చివరిదాకా అనేక సార్లు చదివాను. ఒకరు "అఖ్లాకే నస్రీ" (నీతి శాస్త్రం) ని గురించి ఏంటో పొగిడారు. చదవాలనిపించింది. వారితోనే పుస్తకం తెప్పించుకొని చదివాను. పుస్తకం కఠినం. అరబ్బీ పదాలు ఎక్కువ ఉన్నాయి. అర్ధం చేసుకోవడం కష్టం అయింది. కొద్దికొద్దిగా చదివి చాలా రోజులకు పూర్తీ చేశాను. "దానిష్ నామా" ఆ రోజుల్లో అచ్చయింది. దాన్ని చదివాను. "సగ్రాదక్బరా" స్వయంగా చదివాను. అర్ధం కానిది అడిగి తెలుసుకున్నాను. ఈ పుస్తకాలు చదివిన తరవాత ప్రపంచ రహస్యాలు ఒక్కొక్కటే వెల్లడి అయినట్లు అనిపించింది. ఆ తరవాత ఉర్దూ , పారసీక గ్రంధాలు ఎన్నో స్వయంగా చదివాను. "ఖసాయాద్ అన్వరీ" , "ఖాబానీ" మెల్ల మెల్లగా పూర్తీ చేశాను. కాని బూటకపు పొగడ్తలంటే నాకు గిట్టదు. అందుకే వాటిని అలమారాలో పెట్టి మూసేశాను. ప్రస్తుతం నాకు ఎన్నో వార్తా పత్రికలూ వస్తాయి. వాటి వలన ప్రపంచంలోని వార్తలన్నీ తెలుస్తాయి. పొదుపుగా వ్యవహరిస్తే జీవితం గడవడానికి సరిపోయే డబ్బుంది. అల్లా ఉన్నాడు. ప్రస్తుతం నాది నిష్కల్మష హృదయం. రోజూ నమాజు చేస్తాను. కావడం వేశ్యను. అల్లా కొట్టినా, చంపినా పరదాలలో ఊపిరి ఆడక చావడం నాకు చేత కాదు. అయినా పరదాలలో ఉండేవారి మాంగల్యం రక్షించవలసిందని అల్లాను ప్రార్ధిస్తుంటాను. లోకం ఉన్నంతకాలం వారి పరదా ఉండు గాక!
ఈ సందర్భంలో సాని వృత్తి వాళ్ళకు ఒక నీతి చెప్తాను. వారి హృదయ ఫలకాల పై చెక్కు కొనవలసిన పదాలవి.
"ఓ బుద్ది లేని వేశ్యల్లారా! ఎవరైనా మిమ్ము మనసారా ప్రేమిస్తున్నాడని గానీ, మీరంటే చస్తున్నాడని గాని మరిచి కూడా అనుకోకండి. ఇది మూన్నాళ్ల ముచ్చట. తరవాత అతని దోవ అతనిది. అతడు నిన్ను కట్టుకోలేదు. నీకు ఆ అర్హత లేదు. వాస్తవ ప్రేమ శీలవతుల సొత్తు. వారు ఒకరిని కట్టుకుంటే మరొకరిని కన్నెత్తి చూడరు. వారు ప్రేమ మూర్తులు. వారికీ ఆ హక్కు ఉంది. మీలాంటి బజారు ముండలకు భగవంతుడు అది ప్రసాదించడు."
నా జీవితం ఎలాగో గడిచిపోయింది. రోజులు లెక్కిస్తూ కాలం గడుపుతున్నాను. భూమ్మీద నూకలున్నన్నాళ్ళూ బ్రతుకుతాను. నా మనసుకు నేనే సమాధానం చెప్పుకున్నాను. నా కోరికలన్నీ పూర్తీ అయినాయి. మిగిలింది ఒకే కోరిక. అది మృత్యువుతో తీరేది. నా ఆత్మకధ ఏదో విధంగా ప్రయోజనకారి అవుతుందని ఆశిస్తున్నాను. నా ఉపన్యాసాన్ని ఈ పద్యంతో పూర్తీ చేస్తూ అందరి ఆశీస్సులు ఆశిస్తున్నాను.
ఓ జీవితమా! మరణ మాసంనమైనదే!
నీవన్న మాకిపుడు విసుగుపుట్టేనే!
*--------*




