Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 6
అలాంటి పనులన్నీ చెడ్డపని తెలుసుకొని వదిలివేసిన తరవాత ఎవరో ఒక పురుషుని దగ్గర ఉండిపోవాలనిపించింది. కాని లోకం "కఫన్" కోసం కట్టుకుంది అని అనుకుంటుందని మానుకున్నాను.
మిర్జాగారూ! బహుశ! ఈ సామెత మీకు అర్ధం కాదు. వయసు మళ్ళిన బోగముది ఎవరి ఇంట్లో నైనా స్థిరపడితే అనుభవం గల విటులు కఫన్ కోసం కట్టుకుంది అంటారు. అంటే ఉత్తర క్రియలకు ఏర్పాటు చేసుకుంది అని అర్ధం. ఈ సామెత అక్షరాలా వాస్తవం. నాకు నిజంగా విరక్తి కలిగింది. ఇప్పుడు ఎంతో నీతిగా ఉంటున్నాను. అయినా భగవంతునికి తప్ప నా నిజాయితీ మీద నమ్మకం ఎవరికీ ఉండదు. ఈ పరిస్థితిలో నేను ఒక వ్యక్తినీ ప్రేమించాననుకొండి. అది ఎంత నిస్వార్ధమైంది అయినా, ఎంత నిష్కళంకం అయింది. అయినా ఆ మనిషీ నమ్మడు. జనమూ నమ్మరు. అలాంటప్పుడు నేను ప్రేమించడం నిష్ప్రయోజనం. నా దగ్గర డబ్బు ఉంది కాబట్టి జనం నేనంటే పడి చస్తున్నారనుకుంటుంది లోకం. జనం నన్ను మోసగించడానికి చూస్తారు. ఒక మహాశయుడు నా సౌదర్యాన్ని కీర్తిస్తాడు. నాకంటే ఎన్నో రెట్లు అందమైన ఆడవాళ్ళతో పరిచయం లేకున్నా నా సంగీతాన్ని శ్లాఘిస్తాడు. జీవితాంతం ఒక్క పద్యం వ్రాయడం గాని, చదవడం గాని తెలియని కవి పుంగవుడు నా కవితాశక్తిని కొనియాడుతాడు. మరొక వ్యక్తీ తాను స్వయంగా పండితుడైనా పాండిత్య ప్రకర్షను గురించి ఉపన్యాసం దంచుతాడు. తనకేమీ తెలియనట్లు నిత్యకృత్యమైన నమాజు వగైరాలను గురించి కూడా నన్నే అడిగి తెలుసుకుంటాడు. మరొక ప్రేమికుడు నా ధనాన్ని గురించి పట్టించుకోనట్లు నా ఆరోగ్యాన్ని గురించి ఎంతో శ్రద్ధ తీసుకుంటాడు. నాకు రొంపపడితే వారికి తలనొప్పి లేస్తుంది. నాకు తలనొప్పి లేస్తే వారికి జ్వరం వస్తుంది. ఒక వేదాంతి వైరాగ్యం బోధిస్తాడు. ఇహపరాలను వివరిస్తాడు. నన్ను వట్టి వెర్రి దానిగా లెక్క కట్టి పది పన్నెండేళ్ళ పిల్లతో మాట్లాడినట్లు మాట్లాడుతారు.
పలుప్రాంతాలు తిరిగి అరితేరినదాన్ని. ఎవరెలా అనుకుంటే అలా అయిపోతాను. వాస్తవానికి వాళ్ళనే పిచ్చి వాళ్ళను చేస్తాను. నిజమై ప్రేమతోనూ, అభిమానంతోనూ కలుసుకునేవాళ్ళూ ఒకరిద్దరూ ఉన్నారు. ఎట్టి స్వార్ధం లేకుండా చచ్చిపోతుంటారు. కవితా గోష్ఠి సంగీతం, సంభాషణలలో వారికి అభిరుచి వారితో నాకు గాని, నాతొ వారికి గాని ఎలాంటి నిమిత్తం లేదు. అలాంటి వారంటే నాకు ఎంతో ఇష్టం. ఆ నిర్నిమిత్తత క్రమంగా నిమిత్తంగా మారింది. వారు లేక నేను గానీ, నేను లేక వారు గాని జీవించడం కష్టం అయిపొయింది. కాని వీరిలో ఎవరూ నన్ను ఇంట్లో ఉంచుకోవాలనుకునేవారు లేరు. అలా ఉంటే ఎంతో బాగుండేది. ఈ కోరిక పడుచుదనం తిరిగి రావాలనే కోరిక లాంటిది. స్త్రీ జీవితం యవ్వనంతం. యవ్వనంలో జీవితం కూడా అంతం అవుతే ఎంతో బాగుండేది. ఎందుకు అవుతుంది? వార్ధక్యం అందరికీ భాధకరమే. ఆడదానికి మరీను. ముఖ్యంగా బోగం దానికి అది నరక ప్రాయం. లక్నో సందు గొందులలో తిరిగే చాలామంది బిచ్చపుకత్తెలు బోగం వాళ్ళే . పడుచుదనంలో అడుగు క్రింద పెట్టని వాళ్ళు. వేల కొద్ది పచ్చని సంసారాలకు చిచ్చు పెట్టినవారు. వందల మంది యువకులను అకారణంగా హత్య చేసినవారు. ఎక్కడికి వెళ్ళినా అడుగులకు మడుగులోత్తేవారు. ఇప్పుడు ఒక్కడూ కనీసం కన్నెత్తి చూడడు. పూర్వం ఎక్కడ కూర్చున్నా జనుల గుండెలలో మల్లెలు కురిపించేవారు. ఇప్పుడు వారిని చూచి అంతా దూరంగా ఉంటున్నారు. పూర్వం అయాచకంగా ముత్యాలు లభించేవి. ఇప్పుడు బిచ్చమెత్తినా గింజలు దొరకడం లేదు.
వీరిలో చాలమంది తమ గోతులు తాము తోడూకున్నవారే. మా ఇంటికి ఒక అవ్వ వచ్చేది. - ఒకనాటి ప్రఖ్యాత వేశ్యలలో ఒకర్తి. వయసులో ఉన్నప్పుడు వేలు సంపాదించింది. ఉదార హృదయం గలది. వయస్సు మళ్ళింది. ముసలది అయింది. డబ్బంతా విటులకు పెట్టింది. ఒక యువకుడు ఆమెను ఇంట్లో పెట్టుకున్నాడు. వయసులో చిన్నవాడు, అందంలో మిన్నవాడు. ఆ ముసలి తోత్తును పట్టుకొని ఉండాల్సిన పని ఏమి? భార్య మూతి విరిచింది. జగడాలు పెట్టింది. అసలు విషయం బోధించాడు. ఆవిడ మౌనం దాల్చింది. డబ్బున్నంత కాలం ముసలిదాన్ని ముంచారు. తరవాత ఎవరికి కావాలి? ఇంట్లోంచి గెంటేశారు. సందు గొందుల్లో తిట్లూ తన్నులూ తింటూ తిరుగుతుంది.
కొందరు నాలాంటి మూర్ఖులైన సానులు ఎవరి కూతురనో తెచ్చుకొని పెంచి పెద్దదాన్ని చేశారు. దాన్ని తన ప్రాణంగా భావించారు. దానికి వయసు వస్తే ఎవనితోనో లేచిపోయింది. అధనా ఉండిపోయినా ఆస్తి పాస్తులు హస్తగతం చేసుకొని, పెంచి పెద్ద చేసిన దానిని దాసీ దాని క్రింద కట్టి వేస్తుంది.
అబాదీ నన్ను మోసగించింది. దాని వేషం మొదలే తేలిపోయింది. కాబట్టి సరిపోయింది. కాకుంటే నన్నే దోచుకొని ఉండేది. ఆడదైతేనేం? మగవాడైతేనేం? బోగం కులమే అంత. అది ఎంత నీచం అయిందంటే ప్రేమ అనేది అక్కడ సాధ్యపడదు. సానిది ఏ ఒక్కరిదీ కాదని తెలుసును కాబట్టి తెలివి కలవాడేవడూ దాన్ని హృదయపూర్వకంగా ప్రేమించదు. ఆడదానికి అలాంటి ప్రేమ ఉండనే ఉండదు.
తొలుత ప్రేమించినవారు అందం క్షీణించగానే అటు రావడం మానేస్తాడు. శుష్క ముఖస్తుతులకు అలవాటు పడిపోతారు. ఇప్పుడు ముఖ స్తుతికి ముఖం వాచిపోతారు.
మగవారికి విశ్వాసం ఉండదనే కధ లెన్నో మొదలు మొదలు సానుల ద్వారా విన్నాను. బుద్ది లేక వారు అన్నదానికల్లా ఊ అనేదాన్ని. గోహర్ మిర్జా నా విషయంలో ఎలా ప్రవర్తించాడో మీకు తెలుసు. పెళ్ళి నేరం మోపిన నవాబు సంగతి మీకు తెలియనిది కాదు. అయినా మగవారిని విశ్వాసఘాతకులు అనలేము. స్త్రీలు - ముఖ్యంగా బజారు ఆడవాళ్ళు -- వాళ్ళకంటే తీసిపోరు. ప్రేమ విషయంలో తరచుగా పురుషులు బుద్దిహీనులూ స్త్రీలూ చతురులూ అయి ఉంటారు. ఎక్కువమంది మగవాళ్ళు హృదయపూర్వకంగా ప్రేమిస్తారు. ఆడవాళ్ళు బూటకపు ప్రేమ కనబరుస్తారు. పురుషుడు ఆడదాని అందానికి, అనురాగానికి, త్వరగా లొంగిపోతాడు. ఆడది అలా కాదు. అంత త్వరగా ఆవిడ ప్రభావితురాలు కారు. ఈ విషయంలో స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉంటారు. పురుషుల ప్రేమ స్త్రీల ప్రేమంత తేలికగా క్షీనించదు. కాని ఉభయుల అన్యోన్యతను బట్టి విశేష అనురాగం ఉద్భవించే అవకాశం ఉంది. అందుకు పరస్పరం అర్ధం చేసుకునే సామర్ధ్యం కలిగి ఉండాలి. కనీసం ఒక్కరిలో ఆ లక్షణం ఉండాలి.
వలపు లోకంలో పురుషుడు ఉదారత కనబరుస్తాడు. స్త్రీకి శంక ఎక్కువ. ఆడదాని మంత్రం మగవాని మీద త్వరగా పారుతుంది. పురుషుని మాయకు స్త్రీ త్వరగా లొంగదు. నా వరకు అది పకృతికి సంబంధించిన విషయం. వార్ధక్యంతో పాటు స్త్రీ బుద్ది క్షీణిస్తుంది. చరురత నశిస్తుంది. ఈలోపానికి అనుగుణంగా కొన్ని యోగ్యతలు ఇచ్చాడు. ఈ లక్షణం జంతువులలో కూడా కనిపిస్తుంది. తరచుగా ముసలి జంతువులకు బుద్ది ఉండదు.
పురుషులు స్త్రీలను సుందరాంగులంటే నేను ఒప్పుకోను. వాస్తవానికి స్త్రీకి గాని, పురుషునికి గాని సౌందర్యం స్వతహాగా లేదు. ఒకరు మరొకరికి అందంగా కనిపిస్తారు. అందంగా ఉన్నవాళ్ళను స్త్రీ పురుషులు పసందు చేస్తారు. కాని వాస్తవంగా స్త్రీ అందాన్ని పురుషుడు , పురుషుని అందాన్ని స్త్రీ ఆనందిస్తారు. ఒక సుందరాంగికి వేరొక సుందరాంగి సౌందర్యం వాసన లేని చక్కని రంగు పూవు లాంటిది. వికారమైన పురుషుడు అందమైన స్త్రీ అభిప్రాయంలో చక్కని పూవులాంటి వాడే. పూవు మనసుకు నచ్చుతుంది. అయితే దాని రంగు , ఆకారం మరీ అసహ్యంగా ఉండరాదు. వలపు లోకంలో తప్పు ఏ ఒక్కరోతోనూ జరుగదు. అయితే ఉభయులూ ఈ సూక్ష్మాన్ని గ్రహించలేరు. వారివురిని ప్రేమభావనలో వ్యత్యాసం ఉంటుంది. పురుషుడు స్త్రీని ప్రేమించే లక్షణం పురుషునిలో కొంతవరకు ఉంటుంది. ఆడదాన్ని ధనాన్ని చూచి ఒక చిన్నవాడు ఆమెను ప్రేమించినప్పుడు వయసు మళ్ళిన స్త్రీ అతనిని ఎందుకు ఎలా ప్రేమిస్తుంది?
వృద్దుల కంటే యువకులనే స్త్రీలు ఎక్కువగా ప్రేమిస్తారు. అది వారి అందచందాలను చూచి కాదు. స్త్రీ ఎల్లప్పుడూ తన వార్ధక్యాన్ని గురించి జగ్రత్తపడుతుంది. ఒక రక్షణ ఆశ్రయం కావాలని ఆమె సంకల్పం, వృద్దుల కంటే యువకుల నుండి అలాంటి ఆశ్రయం లభించే అవకాశం ఎక్కువ ఉంటుంది. స్త్రీ ప్రేమలో చాలావరకు అవి ఉంటాయి. ఆమె వాటిని దాచడానికి ప్రయత్నిస్తుంది.
నేను చెప్పిన విషయాల పరిజ్ఞానం స్త్రేలకు గాని, పురుషులకు గాని తరచుగా ఉండదంటే నేను అంగీకరిస్తాను. వాస్తవం ఏమంటే, స్త్రీ పురుషులలో ప్రకృతి సిద్దంగా ఈ లక్షణాలు ఉంటాయి. వారికి తద్విషయ జ్ఞానం ఉండాల్సిన అవసరం లేదు.
జీవితంతపు అనుభవంతో ఈ విషయాలు నేను గ్రహించాను. నావలనే ఈ విషయాలను ధ్యానంగా పరిశీలించిన వ్యక్తికీ అర్ధం అవుతుంది.
చాలా మంది స్త్రీలు నిరక్షరాస్యులైన పురుషులు వీటిని గురించి ఆలోచించక జీవితంలో అనేక స్పర్ధలకూ, తగాదాలకు ఆలవాలం అవుతుంటారు.





